మెయిన్ ఫీచర్

స్ర్తివాదం.. ‘నవీన’వేదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం..’ అంటూ మహిళల సంక్షేమానికి తెగ పాటుపడుతున్నట్టు ఎందరో నేతలు ఘనమైన ప్రకటనలు చేస్తుంటారు.. అయితే, ఆచరణ విషయానికొస్తే అంతా బూటకం అని చెప్పక తప్పదు. దాదాపు పుష్కర కాలంగా అటకెక్కిన ‘మహిళా బిల్లు’ ఇందుకు ప్రబల తార్కాణం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదన నీరుకారినప్పటికీ, మిగతా నేతలందరికీ భిన్నంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందడుగు వేశారు.
ఒడిశాకు సంబంధించి లోక్‌సభ సీట్లలో మహిళలకు 33 శాతం సీట్లను తమ పార్టీ కేటాయిస్తుందని ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా, తాను అనుకున్నది ఆయన ఆచరణలో చూపడంతో మహిళలు వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆస్కా లోక్‌సభ స్థానాన్ని స్వయం సహాయక సంఘానికి చెందిన 68 ఏళ్ల ప్రమీలా బిషోయికి కేటాయిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఉన్నత విద్యావంతులైన ఎంతోమంది పట్టణ మహిళలు పోటీ పడినప్పటికీ, ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయని గ్రామీణ మహిళకు ఆస్కా సీటును ఆయన కేటాయించారు. ఆస్కా నుంచి నవీన్ పట్నాయక్ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించగా, అంతకుముందు ఆయన తండ్రి బిజూ పట్నాయక్ పలుసార్లు అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆస్కా నియోజకవర్గం నుంచి గ్రామీణ మహిళను బీజేడీ బరిలోకి నింపడం పట్ల మిగతా పార్టీల నేతలు విస్మయం చెందారు.
మహిళా పక్షపాతి..
గత 19 సంవత్సరాలుగా ఒడిశా ముఖ్యమంత్రిగా, అధికార బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ పట్నాయక్ ఆది నుంచీ మహిళా పక్షపాతిగా పేరుపొందారు. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తన తండ్రి బిజూ పట్నాయక్ వారసుడిగా 1977లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. తండ్రి మరణానంతరం ఆయన ఆస్కా నియోజకవర్గం నుంచి జనతాదళ్ అభ్యర్థిగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. జనతాదళ్‌లో చీలికల నేపథ్యంలో ‘బిజూ జనతాదళ్’ పార్టీని ఏర్పాటు చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2000 శాసనసభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఘన విజయం సాధించాక నవీన్ పట్నాయక్ తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత అప్రతిహతంగా బిజేడీని గెలిపిస్తూ గత 19 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అవినీతి రహిత పాలన, పేదప్రజల అనుకూల విధానాలతో ఆయన తనదైన ముద్రను వేసుకున్నారు. తన తండ్రి వలే అధికార యంత్రాంగాన్ని పాలనలో భాగస్వామ్యం చేస్తూ సంక్షేమ పథకాలకు, అభివృద్థి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అవివాహితుడైన నవీన్ మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు చేపట్టారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని 2015లో మహిళలకు హామీ ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నారు. అతివల పట్ల ఆయన చూపే గౌరవ మర్యాదలను మెచ్చుకుంటూ ప్రముఖ అంతర్జాతీయ పత్రికలతో పాటు ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసాపత్రాలు పంపింది.
మహిళా బిల్లు లేకున్నా..
లోక్‌సభలో, శాసనసభల్లో స్ర్తిలకు 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన ‘మహిళా బిల్లు’ ఇప్పటికీ పార్లమెంటులో మోక్షం లేకుండా ఉంది. ఈ బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించి, అందుకు తగ్గట్టుగా సీట్లను కేటాయించాలని నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం మిగతా రాజకీయ పార్టీలకు స్ఫూర్తిదాయకం. రాజ్యాంగానికి 108వ సవరణ ద్వారా మహిళా బిల్లును 2008లో పార్లమెంటులో ప్రతిపాదించినా అది నెరవేరని హామీగానే మిగిలిపోయింది. మహిళా బిల్లును 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించింది. ఆ బిల్లుపై లోక్‌సభలో ఎలాంటి వోటింగ్ జరగకపోవడంతో ముసాయిదా ప్రతిపాదనకు కాలదోషం పట్టింది. 2014లో మురిగిపోయిన ‘మహిళా బిల్లు’ గురించి ఎన్నికల సమయంలో మాత్రం కొందరు నేతలు ప్రస్తావించడం ఆనవాయితీగా మారింది. ఆ బిల్లును ఆమోదిస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలూ చెబుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లోపించడంతో మహిళా బిల్లు ఇక అసాధ్యం అన్న భావన ఏర్పడింది. కాగా, 1993లో చేసిన రాజ్యాంగ సవరణ ఫలితంగా గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో మాత్రం మహిళలకు కొన్ని పదవులను కేటాయిస్తున్నారు. విద్యాసంస్థలు, ఉద్యోగ నియామకాలు, స్థానిక సంస్థల మాదిరి చట్టసభల్లోనూ మహిళలకు సముచిత వాటా దక్కినపుడే ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి భాగస్వామ్యం మెరుగవుతుంది.
ఆశావహుల పోటాపోటీ
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున 33 శాతం టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించడంతో ఒడిశాలో రాజకీయ కోలాహలం మొదలైంది. గంజాం జిల్లా చెర్మారియా గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలైన ప్రమీలా బిషోయికి ఆస్కా ఎంపీ టిక్కెట్‌ను కేటాయించడంతో ఎంతోమంది మహిళలు బిజూ జనతాదళ్ కార్యాలయానికి ‘క్యూ’ కడుతున్నారు. ఒడిశాలో లోక్‌సభ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ఈ కోలాహలం మరింత ఎక్కువైంది. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి 68 ఏళ్ల గ్రామీణ మహిళను నవీన్ ఎంపిక చేయడంతో ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎంతోమంది మహిళలు ఇపుడు ముందుకు వస్తున్నారు. ఇంతవరకూ ప్రముఖ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులే ఆస్కా నుంచి గెలుస్తూ వస్తున్నారు. మహిళాశక్తిని గౌరవించే ఉద్దేశంతో ఆస్కా ఎంపీ సీటుకు ప్రమీలా బిషోయిని తమ పార్టీ తరఫున ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గంజాం జిల్లాకు చెందిన ప్రమీల తన గ్రామాన్ని ‘బహిరంగ మలమూత్ర విసర్జన’ నుంచి దూరం చేయడంలో విజయం సాధించారు. నలబంట గ్రామంలో స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ఆమె ఎంతో కృషి చేశారు. పారిశుద్ధ్యం, పైపుల ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా, వ్యాధి నిరోధక టీకాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, మొక్కల పెంపకం, పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించడం, అటవీ ప్రాంతంలో నెమళ్ల సంరక్షణ వంటి విషయాల్లో ప్రమీల చేసిన కృషిని గుర్తించి ఎంపీ సీటును కేటాయించారు. గతంలో ఆమెను ‘ప్రకృతి బంధు’, ‘ప్రకృతి మిత్ర’ పురస్కారాలతో ఒడిశా ప్రభుత్వం సత్కరించింది. ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు టీ దుకాణం నడుపుతుండగా, మరో కుమారుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన అనంతరం, భర్త బంచానిధితో కలసి ప్రమీల కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కనీసం ఏడుగురు..
నవీన్ పట్నాయక్ చేసిన ప్రకటన మేరకు ఒడిశాలో ఉన్న మొత్తం 21 లోక్‌సభ సీట్లలో కనీసం ఏడు స్థానాల్లో బీజేడీ అభ్యర్థులుగా మహిళలు పోటీలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇప్పుడే జరుగుతున్నందున ఎమ్మెల్యే టిక్కెట్లకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసే పరిస్థితి లేదని బీజేడీ నాయకులు ప్రకటించారు. బీజేడీ తరహాలో తమకూ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీకి చెందిన మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేడీ తరఫున తమ కుటుంబాల్లో మహిళలకు టిక్కెట్లు దక్కించుకునేందుకు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా, ప్రస్తుతం ఒడిశా నుంచి ముగ్గురు మహిళా లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. 147 మంది సభ్యులున్న ఒడిశా అసెంబ్లీలో మహిళల సంఖ్య 12 మాత్రమే.

చిత్రాలు.. ఒడిశా క్రీడాకారిణి ద్యుతిచాంద్‌తో..
*ప్రమీలా బిషోయి

-పీఎస్‌ఆర్