మెయన్ ఫీచర్

‘మహాకూటమి’ జాడ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏను మట్టికరిపించేందుకు విపక్షాలు ఏర్పాటు చేస్తామంటున్న ‘మహాకూటమి’ ఎక్కడికి పో యింది? ఢిల్లీతోపాటు కోల్‌కతా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కొంత హడావుడి చేసిన మహాకూటమి ఇప్పడు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించటం లేదు. మోదీని ఓడిస్తామంటూ గొప్ప గొప్ప ప్రకటనలు చేసిన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు పరస్పరం ఓడించుకునేందుకు ఎత్తులు వేసుకుంటున్నారు. మహాకూటమిలో క్రియాశీలక నేతలుగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కొన్నిరోజుల పాటు జాతీయ రాజకీయ వేదికపై హల్‌చల్ చేసి అకస్మాత్తుగా మాయమైపోయారు. ఇప్పుడు ఢిల్లీలో మహాకూటమి గురించి మాట్లాడే నాయకులే కనిపించడం లేదు. మహాకూటమి గురించి ఏ నేతను అడిగినా వౌనమే ఎదురవుతోంది.
మోదీని ఇంటికి పంపుతామని ప్రకటనలు చేసిన విపక్ష నాయకులు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో మునగడంతో విపక్ష పార్టీల ఐక్యత గందరగోళంలో పడింది. కూటమిని ఏర్పాటు చేస్తామన్న నాయకులే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నారు. మహాకూటమికి ఆశలు రేపిన శరద్ పవార్ లోక్‌సభ ఎన్నికల బరిలోనే లేరు. ప్రధాని పదవిని ఆశిస్తున్న బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పోటీ చేయటం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన ప్రధాని పదవికి అవకాశం లేనట్టు భావించరాదని ఆమె వాదిస్తున్నారు. గతంలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేయటం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ అధినాయకత్వం వామపక్షాలతో చేతులు కలిపి తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు పావులు కదుపుతోంది. బెంగాల్‌లో మమత ప్రభుత్వపై ప్రజావ్యతిరేకత నుండి లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్ వ్యతిరేక, భాజపా వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో చేతులు కలుపుతోంది. తృణమూల్, భాజపాలను ఓడించేందుకు తాము కలిసి పని చేస్తామని కాంగ్రెస్, వామపక్షాలు బహిరంగంగా చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ గెలిచేందుకు వీలున్న రాయ్‌గంజ్, ముర్షీదాబాద్ ల స్థానాలను వామపక్షాలకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, బిఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. ఈ ఇద్దరు నాయకులు పొత్తు కుదుర్చుకొని కొన్ని సీట్లను ఆర్‌ఎల్‌డీ పార్టీకి కేటాయించి కాంగ్రెస్, వామపక్షాలను దూరంగా నెట్టివేశారు. కాంగ్రెస్ దీనికి విరుగుడుగా భీమ్‌సేన అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలుపుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఆజాద్ యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. ఆజాద్‌ను ప్రియాంక పరామర్శించినందుకు మండిపడుతున్న మాయావతి అమేథీ, రాయబరేలీల్లో రాహుల్, సోనియాలను ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. మాయావతి వ్యూహంతో బెదిరిపోయిన రాహుల్ ఎందుకైనా మంచిదని ప్రస్తుత ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అమేథీతో పాటు కేరళలోని వాయినాడ్ నుండి రాహుల్ పోటీ చేయాలన్నది కేరళ కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదన. ఒకవేళ తాను అమేథీలో ఓడినా వాయినాడ్‌లో గెలిచి కాంగ్రెస్‌ను కాపాడుకోవాలన్నది రాహుల్ గాంధీ వ్యూహంగా కనిపిస్తోంది. రాహుల్, సోనియాలు యూపీలో ఓడిపోతే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌కు ఇక పుట్టగతులు లేకుండాపోతాయి. అందుకే రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లో కలసి పోటీ చేయాలని అంగీకారానికి వచ్చిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు నాలుగు సీట్లపై ఒక అవగాహనకు వచ్చినా, మిగతా రెండు సీట్లలో స్నేహపూర్వకంగా పోటీ పడాలనే నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కలసి ముందుకు సాగుతున్న కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో మాత్రం ముఖాముఖి పోటీకి దిగుతున్నాయి. సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌లు కేరళలోని ఇరవై సీట్లలో నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పని చేసేందుకు ఇష్టపడటం లేదు. తాను బలంగా ఉన్న చోట ఇతర ప్రతిపక్షాలను ఛీకొడుతున్న కాంగ్రెస్ తాను బలహీనంగా ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అడుగులకు మడుగులు వత్తుతోంది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేసేందుకు రాహుల్ ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలసి పోటీ చేయకపోతే దేశ రాజధానిలోని ఏడు సీట్లను మరోసారి భాజపా తన్నుకుపోతుందని సొంత పార్టీ నాయకులతోపాటు ఇతర మిత్రపక్షాలు హెచ్చరించినా రాహుల్ మాత్రం ఏమీ పట్టనట్టు ముం దుకు సాగుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శరద్ పవార్ ఎంతో కష్టపడినా ఫలితం కనిపించలేదు. దీంతో మధ్యవర్తిత్వానికి ఆయన స్వస్తి పలికారు. రాహుల్ అహంకారం వల్లే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావటం లేదని ఆం ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు.
మోదీని వ్యతిరేకించడమనే ఏకైక సిద్ధాంతం ఆధారంగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు కాబట్టే విపక్ష నేతలు కలలు నెరవేరడం లేదు. పేరుకు ప్రజాస్వామ్య పరిరక్షణే అయినా వాస్తవానికి అది మోదీ వ్యతిరేకతే. ఒక నాయకుడి పట్ల తమకు వ్యక్తిగతంగా ఉన్న కోపతాపాల ఆధారంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించటం పెద్ద తప్పిదం. సిద్ధాంతాల ప్రాతిపదికగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి ఉంటే కొంతైనా ఫలితం ఉండేది. పోలింగ్ ప్రక్రియ మరో ఇరవై రోజుల్లో ప్రారంభం అవుతుండగా ప్రతిపక్షాలు ఒక అవగాహనకు రాలేకపోతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఎవరిదారిన వారు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైపోయాయి. కాగా, చెల్లాచెదురైపోతాయనుకున్న ఎన్డీఏలోని ప్రధాన మిత్రపక్షాలు కలిసి కట్టుగా ముందుకు సాగటం గమనార్హం. తెలుగుదేశం మినహా మిగతా ఎన్‌డిఏ మిత్రపక్షాలన్నీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. చివరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భాజపా ప్రభుత్వాన్ని అనుదినం విమర్శిస్తూ వచ్చిన శివసేన సైతం మహారాష్టల్రో సీట్ల సర్దుబాటును చేసుకొంది. మిత్రపక్షాలను ఎలా కలుపుకుపోవాలనేది భాజపాను చూసి నేర్చుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయికి ప్రతిపక్షాల గొడవలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి కావడం తథ్యమన్న ప్రచారం ఊపందుకుంటోంది.
*

-కె.కైలాష్ 98115 73262