మెయన్ ఫీచర్

ఇదేం అ‘న్యాయం’ నాయకా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని వ్యవస్థలు భ్రష్ఠుపట్టిన నేపథ్యంలో మిగిలిన న్యాయవ్యవస్థకూ మకిలి అంటిం చే ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కేసులో ఒక న్యాయమూర్తి ప్రలోభానికి గురయి జైలుపాలయ్యారు. అలాగని మొత్తం న్యాయవ్యవస్థను కించపరచలేం. ఎక్కడి లోపాలు అక్కడ ఉన్నాయి. కాకపోతే న్యా య వ్యవస్థ కదా? లోతుల గురించి మాట్లాడటం ఆరోగ్యానికి అంత మంచిదికాదు! తాజాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో ఏపి సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఏసీబీ కోర్టు నోటీసు జారీ చేసింది. దానిపై ఆయన హైకోర్టులో అపీలుకు వెళ్లారు. అక్కడ ఆయనకు స్టే లభించింది. దానిపై ఇరుపక్షాల వాదనలూ విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి బాబు లాయర్ వాదనలో పస ఉందని నమ్మి స్టే ఇచ్చారు.
అయితే జగన్, పురంధ్రీశ్వరి సహా దానికి ఇచ్చి న భాష్యం చూస్తే న్యాయస్థానాలపై ఆవిధంగా కూడా బురద చల్లవచ్చా? అన్న సందేహం కలగక మానదు. మేనేజ్ చేయడంలో బాబు మొనగాడని, పీహెచ్‌డి తీసుకున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించగా, బాబు కేసును ఎదుర్కొంటారని భావించామే తప్ప స్టే తెచ్చుకుంటారనుకోలేదని, బాబు వదినగారయిన బిజెపి నాయకురాలు పురంధ్రీశ్వరి మరో అర్ధం వచ్చే స్వరం వినిపించారు. ఇక రాష్ట్రంలో విపక్ష నేతలు కూడా మేనేజ్‌మెంట్‌లో బాబు పీహెచ్‌డి చేశారనే వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
ఇదంతా పరిశీలిస్తే ఓటుకు నోటు కేసులో స్టే వ్యవహారంపై నేరుగా న్యాయమూర్తిని విమర్శించకుండా, తెలివిగా బాబు భుజం మీద తుపాకి పెట్టి న్యాయస్థానాలపై గురిపెట్టినట్లే కనిపిస్తోంది. అంటే కింది కోర్టులో శిక్ష పడిన ముద్దాయిలకు పైకోర్టులో అపీలుకు వెళ్లే హక్కు లేదన్నమాట. అది న్యాయమయినా, అన్యాయమయినా కింది స్థాయి కోర్టు తీర్పునే గౌరవించి శిక్ష అనుభవించాల్సిందే. వారి మాటే నిజమైతే ఇక జిల్లా కోర్టు, హైకోర్టు, సింగిల్‌బెంచ్, డబుల్ బెంచ్, సుప్రీంకోర్టు ఇవన్నీ ఎందుకు? మూసేయవచ్చు కదా?! జీతాలు కూడా మిగులుతాయి. మన నేతాశ్రీల వాదన వింటే ఇలాంటి ఆశ్చర్యం కలుగుతోంది. ఏదైనా ఒక నేరానికో, కుంభకోణంలోనో ఒక నేతకు సంబంధం ఉందని భావిస్తే రాజీనామా చేయాలని అడిగే హక్కు అందరికీ ఉంటుంది. బిజెపి కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీపై హవా లా మరక పడిన వెంటనే ఆయన రాజీనామా చేసి, తిరిగి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెరపైకొచ్చారు. అయితే అందరు రాజకీయ నాయకులు అద్వానీల మాదిరిగా ఉంటారనుకోవడం, ఉండాలనుకోవడం అత్యాశ.
ఇప్పుడు ఓటుకునోటు కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన బాబుకు, హైకోర్టులో ఊరట లభించింది. అలాగని హైకోర్టు ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు కాదు కదా? ఆయనకు కింది కోర్టు నుంచి ఊరట ఇచ్చిందే తప్ప నిర్దోషి అని తీర్పు ఇవ్వలేదు! కేసు విచారణ యధాతథంగా జరుగుతుంది. కానీ, చంద్రబాబునాయుడు అసలు అప్పీలుకు వెళ్లడమే నేరమన్న వాదన, ప్రచారమే అసంబద్ధం. అంటే వారి ఉద్దే శం ప్రకారం ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నమాట. పై కోర్టుకు అప్పీలుకు వెళ్లడం మహాపాపం, అన్యాయం! ఇదెక్కడి వాదనో అర్ధం కాదు. ఈ వ్యాఖ్యలు చేసే నేతాశ్రీలు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు లీగల్ సెల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ వ్యాఖ్యలు చేసేముందు అలాంటి విమర్శలు చేయవచ్చా? లేదా? అన్నది ఆ సెల్ సలహా తీసుకున్నా బాగుండేది.
న్యాయస్థానాల్లో ఏ స్ధాయిలో అన్యాయం జరిగినా, బాధితుడి వాదన విని అందులో నిజం ఉందని నమ్మితే, దానికి బలమైన ఆధారాలు ఉంటే సరిదిద్దేందుకే, పైకోర్టులకు వెళ్లే అవకాశం పౌరులకు రాజ్యాంగం దఖలు పరిచింది. రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటును వినియోగించుకోవడం పౌరులకు ఉన్న హక్కు. దానిని కాదనే హక్కు ఎవరికీ లేదు. అసలు అప్పీలుకు వెళ్లడం ఓటుకు నోటు కేసు నుంచే మొదలయినట్లు, స్టేలు చంద్రబాబుతోనే ప్రారంభమయినట్లు చేస్తున్న విమర్శలు ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ దేశంలో ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, అద్వానీ, జగన్నాధమిశ్రా, సుఖరాం, అంతూలే, లాలూ, జయలలిత, మాయావతి, రోశయ్య, జగన్ వంటి ప్రముఖులెందరో పైకోర్టుకు అపీలుకు వెళ్లినవారే. ఇంకా స్టేలు తెచ్చుకున్న వారి జాబితా చెబితే పేజీలు సరిపోవు.
ఎక్కడిదాకో ఎందుకు? అమీర్‌పేట భూముల కేసులో రోశయ్యకు వ్యతిరేకంగా కింది కోర్టులో తీర్పు వస్తే, పైకోర్టుకు వెళితే స్టే లభించింది. పైన ఉదహరించిన వారంతా కింది కోర్టుల్లో భంగపడి, పైకోర్టులో ఊరట పొందిన వారే. జగన్ మాటల్లో చెప్పాలంటే మరి ఆ ప్రకారంగా వారంతా మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డి చేసిన వాళ్లేననుకోవాలా? అందాకా ఎందుకు? ఇప్పుడు మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్న జగన్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న నాయకుడే కదా? మరి తాను చేసిన ఆరోపణ జగన్‌కూ వర్తిస్తుంది కదా?
వైసీపీ నేతల మాటల్లోనే చెప్పాలంటే, నిజంగా జగన్ నిజాయితీపరుడయితే జైల్లోనే ఉండి న్యాయపోరాటం చేయవచ్చు కదా? మరి అలా కాకుండా సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ ఎక్కే గడప దిగే గడప ఎందుకు? కానీ న్యాయం అలా ఉండదు కదా?! జగన్ న్యాయవాది వాదనలో పస ఉందని నమ్మిన తర్వాతే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఆ సమయంలో బాబు కూడా తొందరపడి చేసిన వ్యాఖ్యలు ఇంకా గుర్తుంది. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, సోనియాకు సరెండరయినందుకే జగన్ బయటకొచ్చారని వ్యాఖ్యానించారు. అంటే సుప్రీంకోర్టు కాంగ్రెస్ ఆదేశాల మేరకు పనిచేసిందని బాబు తెలివిగా చెప్పారన్నమాట. ఈ విధంగా కోర్టు తీర్పులకు పెడార్ధాలు, రంధ్రానే్వషణ చేసుకుంటూపోతే అసలు న్యాయవ్యవస్థ మనుగడకే ప్రమాదం కదా?! లాజిక్కులు బాగా మాట్లాడే తెదేపా నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఓటుకునోటు కేసులో తనదైన భాష్యం ఇచ్చారు. ఏసీబీ కోర్టు ఏ పక్షం వాదనలు వినకుండా తీర్పు ఇస్తే, హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే తీర్పు ఇచ్చిందన్నారు. భారత రాజ్యాంగం పైకోర్టులకు అపీలుకు వెళ్లే అవకాశం ఇచ్చింది అందుకే మరి!
* * *
ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వరని తేలిపోయింది. కేంద్రం అధికారికంగా ప్రకటించకపోయినా హోదాకు ప్యాకేజీ పూత పూసేందుకు రంగం సిద్ధమయి, నేడో రేపో ఆ ముచ్చట కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఒకవైపు హోదా కోసం రాజీపడేది లేదంటున్నారు. అక్కడ ఢిల్లీలో సుజనాచౌదరి ప్యాకేజీ చర్చలతో బిజీగా ఉన్నట్లు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. బిజెపి నేతలేమో హోదా బదులు దాని వల్ల వచ్చే అన్ని లాభాలు సమకూరుస్తున్నామని చెబుతున్నారు. మొన్నామధ్య పవన్ కల్యాణ్ కూడా ఇచ్చేట్టయితే చెప్పండి, లేకపోతే కాదని చెప్పండి. అంతే కాదని మోసం చేయవద్దని బిజెపిని బంతిపూలతో కొట్టారు.
ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న డ్రామా రిహార్సల్, ఏపి వీధుల్లో రక్తికట్టించేందుకు మిత్రపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ‘హోదా కంటే ప్యాకేజీ మంచిది. విభజనకు ముందు ఏమి కావాలో కోరుకోకుండా నష్టపోయాం. ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంటే దాన్ని అడ్డుకుంటే వచ్చేది కూడా రాదు. అసలు ఏమీ లేనిదానికంటే ప్యాకేజీ మంచిదికదా? ఏదో ఒకటి ఇస్తామంటే వద్దనడం ఎందుకు? పేరు మార్చి అన్ని లాభాలు వస్తుంటే కాదనుకోవడం మూర్ఖత్వమవుతుంది’ ఇలాంటి మానసిక భావన ప్రజల్లో కలిగించేందుకు మీడియా భక్తబృందం సిద్ధమవుతోంది. చర్చలు, సమ్మేళనాలు, అభిప్రాయసేకరణ ముసుగులో ఈ భావన బలవంతంగా రుద్దేందుకు రంగం సిద్ధమయింది. కొందరు జర్నలిస్టు సంఘాలు, కొమ్ము లు తిరిగిన జర్నలిస్టులు కూడా ఉడతాభక్తి సాయం చేసేందుకు రంగంలో దిగబోతున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో ఏపికి హోదా రాకపోయినా, సుజనాచౌదరి మీడియా మేనేజ్‌మెంటయితే బాగా వర్కవుటయింది. ఆయనొక్కరే ఏపి కోసం కష్టపడుతున్నారన్న భావన కల్పిస్తున్నారు. ఒక పత్రికయితే అసలు సుజనానే ముసాయిదా రూపొందించి జైట్లీకి ఇచ్చారని రాసింది. కేంద్రంలో సుజనాచౌదరిది స్వతంత్ర శాఖ కూడా కాదు. క్యాబినెట్ మంత్రి అధీనంలో పనిచేసే సహాయమంత్రి హోదా ఆయనది. అలాంటిది ఆయన ముసాయిదా రూపొందించడమేమిటన్న ఆలోచన ఎవరికీ తట్టకపోవడమే విచిత్రం. ఢిల్లీలో మీడియాను, సొంత వర్గం యాజమాన్యాలను మేనేజ్ చేయడం సులభం కావచ్చేమోగానీ, వీధుల్లో జనాలను మేనేజ్ చేయటం చాలా కష్టం.
* * *
మరిప్పుడు.. తిరుపతిలో సభ పెట్టి ఊగిపోయి మాట్లాడిన పవన్ ఏం చేస్తారు? హోదా ఇవ్వని కమలాన్ని కడిగేస్తారా? దాన్ని సాధించలేని బాబుపై ధ్వజమెత్తుతారా? హోదా కోసం రోడ్డునపడే వారితో కలసి పోరాడతారా? లేక తానే ఢిల్లీ వెళ్లి, నేర్చుకున్న కొద్దిపాటి హిందీలో మాకు హోదా కావాల్సిందేనని మోదీ ముందు గర్జిస్తారా? చూడాలి! ప్యాకేజీ ఇచ్చేందుకు తప్ప, హోదా ప్రకటించేందుకు సిద్ధంగా లేని విషయం తెలుసుకున్న తెదేపా లౌక్యంగా వెళితే, పవన్‌బాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారా? లేక బాబు బాటలోనే నడుస్తారా? అన్నది మరో ప్రశ్న.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144