మెయన్ ఫీచర్

ప్రజాస్వామ్యానికి అవినీతి రుగ్మత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విజయానికి గల ప్రాధాన్యం నైతికతకు ఉండదు. నాయకులు గెలుపు గుర్రాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. విజయంకోసం ప్రజలను ఉద్రేకపరిచే ప్రసంగాలు చేస్తారు. ఇది మనం అన్ని రాష్ట్రాల్లోను చూశాము. అవినీని అంతం చేస్తానని ప్రతిజ్ఞపూని అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పటికి ఐదారుగురు ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోయారు. ముగ్గురు మంత్రులు బర్తరఫ్ అయ్యారు. ఒకరు దొంగ సర్ట్ఫికెట్ మీద, మరొకరు అవినీతి కేసులో, ఇంకొకాయన (సందీప్‌కుమార్) సెక్స్ స్కాండల్‌పైన పదవులనుంచి తొలగింపబడ్డారు. ఔటర్ ఢిల్లీలో సందీప్‌కుమార్‌కు టిక్కెట్టు ఇచ్చారు. ‘ఇతడు అవినీతి పరుడు. ఇలాంటివారిని ప్రోత్సహిస్తే పార్టీకి అప్రతిష్ట వస్తుంది’ అని ప్రశాంత భూషణ్, యోగేంద్రయాదవ్‌లు అరవింద కేజ్రీవాల్‌కు సలహా చెప్పారు. ఔటర్ ఢిల్లీ ఓటర్లకు ఇలాంటి అభ్యర్థే కావాలి. మనకు గెలుపు గుర్రం కావాలి అని కేజ్రీవాల్ చెప్పి సందీప్‌కుమార్‌కు టిక్కెట్టు ఇచ్చి గెలిపించుకున్నాడు. అతడు మొన్న ఒక సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్నాడు. ఆ టేపు కేజ్రీవాల్‌కు పదిహేను రోజుల క్రితమే చేరింది. కాని ఏమీ మాట్లాడలేదు. కానీ వీడియో ప్రదర్శించే సరికి సందీప్ కుమార్‌ను అరగంట సేపట్లో మంత్రివర్గం నుండి తొలగించి తాను నిజాయతీపరుణ్ణి అని నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడానికే సందీప్‌కుమార్ ఈ వీడియో తీశాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆప్ పార్టీలో ఒక అమ్మాయి, తన ను శరత్ చౌహాన్ వంటి కార్యకర్తలు వేధిస్తున్నారని కేజ్రీవాల్‌కు ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఫలితంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఉదంతాలు దేన్ని తెలియజేస్తున్నాయి? జితేంద్రకుమార్ అనే మంత్రి ఫోర్జరీ చేసిన నకిలీ సర్ట్ఫికెట్టు తెచ్చుకున్న వర్తమాన పార్లమెంటరీ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ సంస్థలో సందీప్‌కుమార్ ఉద్యోగి.
అశుతోష్ అనే మంత్రి కేజ్రీవాల్‌కు కుడిభుజం వంటివాడు. ఆయన మాట్లాడుతూ ‘వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మధ్య మనగొడవ ఏమిటి?’ అని ప్రశ్నించాడు. ఐతే ఆ అమ్మాయి తనకు డ్రింక్‌లో మత్తుమందు కలిపి సందీప్‌ను లొంగదీసుకున్నాడని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ సందీప్‌ను ఆప్ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాడు. ఆప్ పార్టీ మూడు ‘సి’కారాల మీద ప్రాధాన్యత ప్రకటించింది. వీటిల్లో మొదటిది క్యారక్టర్, రెండవది క్రైం, మూడవది కరప్షన్. ఐతే కుమార్ విశ్వాస్, సోమనాథ భారతి, సందీప్ కుమార్ ఈ మూడు ‘సి’కారాల నేరాలు చేసినవారే. ఇట్టి నేరస్థులను అశుతోష్ సమర్థించడం నేరం.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్ట్రన్ అధినేత్రి లలితాకుమార మంగళం అశుతోష్‌కు సమన్లు పంపింది. కాగా పోలీసులు సందీప్‌కుమార్‌ను మూడు రోజులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
కావేరీ నది కర్ణాటకలో తలకావేరీ ప్రాంతంలో జన్మించి తమిళనాడు గుండా ప్రవహిస్తున్నది. అంటే ఉభయ రాష్ట్రాలు సాగునీరు, తాగునీరు కోసం ఈ నదీజలాలమీద ఆధారపడవలసిందే. ఐతే కర్ణాటక ఎగువన ఉంది కాబట్టి వారు డ్యాములు నిర్మించి నదీ జలాల్ని ఆపివేశారు. తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించి 15 టిఎంసిల నీటిని వెంటనే తమిళనాడు తాగునీటి అవసరాలకోసం విడుదల చేయవలసిందిగా ఆదేశించింది. దానితో కర్ణాటకలో ఆందోళనలు మొదలైనాయి. రాజకీయంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటీవలికాలంలో ఈ ప్రభుత్వం కొన్ని చిక్కుల్లో ఇరుక్కుంది. ఇప్పుడు జలవివాదాన్ని వీధుల్లోకి తీసుకొని పోవడం ద్వారా సిద్దరామయ్య రాజకీయ లబ్ది పొందగలుగుతున్నాడు. అంటే రాజకీయాలకోసం కావేరీ- కృష్ణ-గోదావరి వంటి నదుల జలాలను ఆయా రాష్ట్రాలు ఇటీవలి కాలంలో ఉపయోగించుకోవడం గమనార్హం. ఆల్మట్టి ఎత్తు కృష్ణానదిపై పెంచారు. బాబ్లీ ఎత్తును మహారాష్టల్రో పెంచారు. దీనివల్ల దిగువ రాష్ట్రాలు ఇబ్బందులలో పడటం సహజం. అంటే ఫెడరలిజం ముదిరితే జాతీయ సమైక్యత దెబ్బతింటుందనడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. కావేరీ జలాలు కృష్ణరాజ సాగర డ్యాం నుండి ఫీడర్ కాల్వల నుండి ఇవతలికి రాకుండా రైతులు అడ్డుకోవడం అరాజకానికి సంకేతం. ఒక చోట తాగునీరు ముఖ్యమా? మరొకచోట రెండవ పంటనీరు ముఖ్యమా? ఆలోచించండి.
ప్రజాస్వామ్యంలో పాలకులు మంచివారైతే ప్రజలు సుఖపడతారు. అయితే ఇందులో ఒక వెసులుబాటు ఉంది. ఐదేళ్లకొకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి తమకు నచ్చినవారిని తిరిగి ఎన్నుకోవచ్చు. కేరళలో కొద్ది రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. జి. సుధాకరన్ అనే పబ్లిక్ వర్క్స్ మంత్రి మాట్లాడుతూ, స్కూళ్లలో ప్రార్థనలు చేయరాదు, కార్యమ్రాలకు ముందు జ్యోతి ప్రజ్వలన చేయరాదు అన్నాడు. ఇతడు సిపిఎం పార్టీకి చెందిన కార్యకర్త. పాఠశాలలో సరస్వతీ దేవి ప్రార్థన చేస్తే దాన్ని నిషేధించే అధికారం కేరళ ప్రభుత్వానికి లేదు. ఇక దీపకాంతి వెలుగుకు జ్ఞానానికి చిహ్నం. అరాజక శక్తులకు ఇలాంటి సాంస్కృతికాంశాలు రుచించవు. ప్రజల సాంస్కృతిక భావనను కాలరాసే ప్రక్రియ ప్రస్తుతం కేరళలో కొనసాగుతున్నది.
ఇక ఉత్తరప్రదేశ్‌లో 2016, ఆగస్టు 30న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ ‘‘అయోధ్య ఉద్యమం నడుస్తున్నప్పుడు, పదహారు మంది హిందూ కరసేవకులను కాల్చి చంపారు. పదహారు కాదు ముప్పయిమందినైనా చంపుతాము’’ అన్నారు. కొద్దిరోజుల్లోరానున్న ఎన్నికల్లో ముస్లింల ఓట్లు కొల్లగొట్టడానికి చేసిన ప్రకటన మాత్రమే ఇది. పరిపాలనాపరంగా బిహార్ తర్వాత జంగిల్ రాజ్ ఉత్తర ప్రదేశ్‌లోనే కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఆయుధాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. బిహార్‌లో ప్రైవేటు సైన్యాలను రాష్ట్ర మంత్రులు ప్రోత్సహిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్ మతకల్లోలాల్లో ముస్లింలు చనిపోయారు. కైరానా అల్లర్లలోవందలాది హిందూ కుటుంబాలు కాందిశీకులయ్యాయి. ఇదంతా ములాయం సింగ్ యాదవ్‌గారి సుపుత్రుడి పాలనాఫలం. ఇక్కడ పరిపాలన ఉందని భావించగలమా? ఈ పాలకులకు భారత రాజ్యాం గం మీద గౌరవం ఉన్నదా?
స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి సంవత్సరాలు గడిచినా దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిణితి చెందిందని చెప్పగలమా? మనుషులకోసం ఎన్నికలు కాని ఎన్నికలకోసం మనుషులు కారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపైన పార్లమెంటు ఎన్నికలు ఇలా నిరంతర ఎన్నికల ప్రకియ కొనసాగడం ఆర్థికంగా దేశానికి చాలా నష్టదాయకం. దీనిపై ఇటీవల ఒక చర్చ మొదలైంది. అన్ని ఎన్నికలు ఒకేసారి ఒకే సంవత్సరంలో జరిగిపోవాలి. మళ్లీ ఐదు సంవత్సరాల వరకు వీటి జోలికి పోకుండా ప్రజలు, పాలకులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. అలాంటి పరిస్థితి దేశంలో లేదు. ఒకరాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో ఎన్నికలు జరగడమే కాకుండా, భావోద్రేకాలు రెచ్చగొట్టబడుతున్నాయి. దేశ క్షేమానికి భద్రతగురించి ఆలోచించేవారికి విలువ ఇవ్వడంలేదు.
తమిళనాడు ముఖ్యమంత్రిణి కుమారి జయలలిత తనకు పరువునష్టం కలిగిందని దాదాపు రెండువందలకు పైగా కేసులు వేసింది. మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ, ‘వ్యక్తిగతంగా నిందిస్తే అది పరువునష్టం కిందికి వస్తుంది కాని, పాలకుల పాలసీలను విమర్శిస్తే అది పరువు నష్టం ఎలా అవుతుంది? రాజకీయవేత్తలు భూషణలకు, విమర్శలకు కూడా సిద్ధంగా ఉండాలి’ అని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. తమపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినప్పుడల్లా కేసులు పెడతానని బెదిరించడం రాజ్యాంగ విరుద్ధం. కలర్‌టివిలు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చి ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చేవారు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే పాలకులు కారు.
నరేంద్ర మోదీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తే దాన్ని కపిల్ సిబల్ సహించలేకపోయాడు. ఇది ఫాసిస్టు ప్రభుత్వం అన్నాడు. మరి మొన్న ఇండియాటుడే అనే సంస్థ సర్వే జరిపింది. ఇందులో పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీకి 304 సీట్లు, కాంగ్రెస్ కూటమి యుపిఎకు 92 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక రాజకీయ పక్షం ప్రధానంగా ఒక సిద్ధాంతం ప్రాతిపదికను చేసుకొని శ్రమిస్తారు. వర్గకలహం శ్రామిక పక్షపాతం, కమ్యూనిస్టుల మూల సిద్ధాంతం. రైతుల అభిప్రాయానికి భిన్నంగా టాటా మోటార్ ప్రాజెక్టును కట్టబెట్టడం ఆ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధం. అదే ఆ పార్టీకి ఆశనిపాతమైంది. అలాగే వ్యక్తి పూజ పెరగడం కూడా పార్టీ అంతరిస్తుందనేది మరో సిద్ధాంతం. అందుకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ. ఏక కుటుంబ పాలనలో ఆ పార్టీ తన మూల సూత్రాలను వదలుకొంది. వ్యక్తులకంటే పార్టీ ముఖ్యం. దేశం కోసం పార్టీలు కాని, పార్టీలకోసం దేశం కాదు.
సారాంశమేమంటే అధికారంలోకి వచ్చాక నిజాయతీని నిరూపించుకోవడం కష్టసాధ్యమైన విషయం. అల్లోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనూ ఈ బాధలు తప్పవు. యోగేంద్రయాదవ్, ప్రశాంత భూషణ్ వంటివారిని కేజ్రీవాల్ పార్టీనుంచి బహిష్కరించాడు. కారణం వారు పార్టీలోని అవినీతిని ఎత్తి చూపడమే. ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఏం సమాధానం చెబుతాడు? ‘‘నేను దళితుణ్ణి కాబట్టి సెక్సు వీడియోలో ఇరికించారు’’ అంటూ మాజీ మంత్రి సందీప్ కుమార్ సమర్ధించుకున్నాడు. దీనికి కేజ్రీవాల్ చెప్పిన సమాధానం ‘‘నాది విలక్షణమైన పార్టీ-ఎవరైనా సరే నేరం చేస్తే క్షమించేది లేదు’’ అంటూ భాజపా, అకాలీదళ్‌లపై ఎదురుదాడికి దిగాడు. ఈ మొత్తం ఉదంతం వల్లనే కేజ్రీవాల్ సచ్ఛీలుడిగా గుర్తించబడతాడా? లేక పార్టీ అపఖ్యాతి పాలవుతుందా? వేచి చూడవలసిందే.

- ముదిగొండ శివప్రసాద్