మెయన్ ఫీచర్

బాలల హక్కులపై ధ్యాస లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల వేళ వివిధ వర్గాలను ఉద్వేగానికి గురిచేసి, వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకొని, వారికి భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించడం, ఎన్నికల్లో లబ్ధి పొందడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. ‘వోట్ బ్యాంకు’ రాజకీయాలు తప్ప- ప్రజల అవసరాలు గుర్తించి, సమగ్ర వికాసం కోసం, సుస్థిర అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలను రూపొందించే ప్రయత్నం దాదాపు ఏ రాజకీయ పక్షం చేయడం లేదు. ఎన్నికల్లో గెలిచిన పక్షాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆదుర్దా మినహా ప్రజల పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదు. ఈ నేపథ్యంలో దేశ జనాభాలో మూడోవంతుకు పైగా ఉన్న బాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మొత్తం జనాభాలో 37 శాతంగా ఉన్న బాలలు ఓటర్లు కాకపోవచ్చు. వారు కూడా దేశ పౌరులే. దేశ భవిష్యత్ వారి వికాసం పైనే ఆధారపడి ఉంది.
బాలల పట్ల పాలకులకు ఎంత నిర్లక్ష్యమో ‘తగ్గిపోతున్న బడ్జెట్ కేటాయింపులే’ నిదర్శనం. 2012-13 బడ్జెట్‌లో బాలలకు 4.76 శాతం నిధులు కేటాయించగా, అవి 2019-20 తాత్కాలిక బడ్జెట్‌లో 3.5 శాతానికి తగ్గిపోయాయి. పార్లమెంట్ ఉభయ సభలలో అడిగిన ప్రశ్నలలో బాలలకు సంబంధించినవి 2014-15లో 3.9 శాతం ఉండగా, అది 2018-19 నాటికి 3.3 శాతానికి తగ్గింది.
‘జువైనల్ జస్టిస్ చట్టం’ పరిధి నుండి 16 నుండి 18 ఏళ్ళ వయస్సు గల బాలలను తొలగించడం, డిటెన్షన్ పాలసీని పునరుద్ధరించడం వంటి తిరోగమన చట్టాలను పాలకులు తీసుకువచ్చారు. బాలలపై లైంగిక వేధింపుల కేసుల్లో 70 శాతం నిందితులు బాధితులకు బాగా తెలిసినవారే, వారి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. చాలా కేసుల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు అడుగంటిపోతున్నాయి. న్యాయమూర్తులు తీర్పు చెప్పే సమయంలో జాగురత వహించడం, బాల సాక్షులు ఎదురు తిరగడం జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితులలో బాలల గురించి ప్రధాన జాతీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళికలలో ఏమి చెబుతున్నాయో అన్నది ఆసక్తి కలిగిస్తుంది.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న బాలల హక్కుల కేంద్రం ‘హాక్’ ఆరు జాతీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలను పరిశీలించి, వాటిల్లో బాలల హక్కుల పట్ల అవి ఏ విధంగా స్పందిస్తున్నాయో విశే్లషణ చేసింది. ‘బాలల హక్కుల అంశం ఎప్పుడూ ప్రాధాన్యతను నోచుకోవడం లేదని ఈ కేంద్రం సహ డైరెక్టర్ ఎనాక్షి గంగూలీ పేర్కొన్నారు. బాల నేరస్థులకు మరణశిక్ష విధించడం, మరింత కఠిన శిక్షలు విధించడం వంటి సందర్భాలలో మాత్రమే రాజకీయ పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆమె విచారం వ్యక్తంచేశారు. ‘2019 ఎన్నికలు భారత భవిష్యత్‌కు, బాలల భవిష్యత్‌కు ముఖ్యమైనవి’ అంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి సదస్సుకు 1992లోనే భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినా సిపిఐ తప్ప మరే రాజకీయ పక్షం కూడా ‘బాలల హక్కులు’ అనే పదాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించక పోడవం గమనార్హం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, బాలలకు విడివిడిగా ప్రణాళికలు రూపొందిస్తున్నా చాలా ఎన్నికల ప్రణాళికలు మహిళలు, బాలలకు కలిపే ప్రస్తావిస్తున్నాయి. 2013లో ఆమోదించిన బాలలకు జాతీయ ప్రణాళికలను గానీ, 2016లో ఆమోదించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను గానీ ఏ పార్టీ ప్రణాళిక కూడా ప్రస్తావించనే లేదు. బాలికల సంక్షేమం గురించి ప్రతి రాజకీయ పక్షం ప్రస్తావిస్తున్నా, తగ్గిపోతున్న బాలబాలిక నిష్పత్తి గురించి పట్టించుకోవడం లేదు. భాజపా ఎన్నికల ప్రణాళికలో బాలల సంరక్షణ కేంద్రాల గురించిన ప్రస్తావన మాత్రమే కనిపించింది. ‘బాలల సంరక్షణ సంస్థలలో ప్రమాణాలు, పటిష్టమైన తనిఖీ పర్యవేక్షణ విధానాలు ఏర్పాటుచేసి సమగ్ర సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేస్తాం’’ అని బీజెపి పేర్కొన్నది. బాలల పట్ల పెరుగుతున్న హింసను ఇతర పార్టీలు కూడా పరిగణనలోకి తీసుకున్నాయి. వేధింపులకు ఎక్కువగా గురయ్యే వర్గాలకు చెందిన బాలలను దృష్టిలో ఉంచుకొని సంరక్షణ సేవలను మెరుగుపరుస్తామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బాధితులకు మెరుగైన సంరక్షణ, పునరావాస సేవలు అందిస్తామని తెలిపింది.
తప్పిపోయిన బాలలను వెతికించడంకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు పోక్స్లో చట్టాన్ని, వీధి బాలలకు సంబంధించిన చట్టాల నిబంధనల అమలుకు కృషిచేస్తామని సిపిఐ హామీ ఇచ్చింది. పాఠశాలలు హింస, వేధింపులకు దూరంగా ఉండే విధంగా తగు సంస్కరణలు తీసుకూస్తామని పేర్కొన్నది.
బాల కార్మిక చట్టాలలో సవరణలు తీసుకురావడం బాలల హక్కుల ఉద్యమకారులకు ఆందోళన కలిగిస్తుండగా, కేవలం సిపిఎం, ఎన్సీపీ మాత్రమే ఈ అంశాన్ని తమ ప్రణాళికలలో ప్రస్తావించాయి. ప్రమాదకరమైన, ప్రమాదకరం కాని పనుల మధ్య గల వ్యత్యాసాన్ని తొలగిస్తామని సిపిఎం పేర్కొనగా, పునరావాస విధానం, పోక్స్లో చట్టాన్ని పటిష్టపరచడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను తుదముట్టిస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. వినోద పరిశ్రమలో బాలల దురవస్థలను కూడ ఈ పార్టీ ప్రస్తావించింది. జువైనల్ చట్టానికి సంబంధించిన వివాదాన్ని సిపిఎం మాత్రమే తన ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించింది. ఏటా కేంద్ర బడ్జెట్‌లో బాలలకు కేటాయింపులు తగ్గిపోతూ ఉండగా ఈ అంశాన్ని ఎన్సీపీ మాత్రమే ప్రస్తావించింది. బాలల సంక్షేమం, ప్రత్యేక అవసరాలు గల బాలలకు తగినన్ని నిధులను కేటాయిస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. పరోక్షంగా బాలలకు సంబంధించి జీడీపీలో 10 శాతం విద్యకు కేటాయిస్తామని సిపిఐ, జీడీపీలో ప్రస్తుతం ఖర్చుపెడుతున్న 3 శాతం (3.24 శాతం)ను జీడీపీలో 6 శాతానికి పెంచుతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ఆరోగ్య బడ్జెట్‌ను జీడీపీలో 4.5 శాతంకు పెంచుతామని కూడా ఆ పార్టీ తెలిపింది.
బాలల రక్షణకు అవసరమైన నిధులు సమకూరడం లేదు. అయినా ఏ పార్టీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ దిశలో కొన్ని చర్యలను మాత్రం పేర్కొన్నాయి. 14 సంవత్సరాలు పైబడిన బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందజేస్తామని 2009లో విద్యాహక్కు చట్టాన్ని తెచ్చారు. క్రమంగా ఈ హక్కు బాలలు అందరికీ విస్తరించగలదని ఆశించాము. ఈ చట్టం ఆమోదించి దశాబ్దం గడిచినా తర్వాత కేవలం మూడు పార్టీలు మాత్రమే- కాంగ్రెస్, సిపిఐ, ఎన్సీపీ- 18 ఏళ్ళవరకు బాలలందరికీ విద్య అందిస్తామని హామీ ఇస్తున్నాయి.
బీజేపీ ఎన్నికల ప్రణాళికలో విద్యాహక్కు చట్టాన్ని అసలు ప్రస్తావించనే లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ, సామర్థ్యం పెంపు ద్వారా బాలల విద్య ప్రమాణాలు పెంచుతామని మాత్రమే పేర్కొన్నది. అందుకోసం ప్రధానమంత్రి పేరుతో మరో కార్యక్రమం చేబడతామని తెలిపింది. ఈ సదుపాయాన్ని కేవలం ‘ప్రతిభ’గల విద్యార్థులందరినీ ఒకచోటుకు చేర్చి ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో సమకూరుస్తారు. అంతగా ప్రతిభలేని విద్యార్థులు నిర్లక్ష్యానికి గురవుతూ ఉండవలసిందే. తరగతి గదులలో సాంకేతికతను జోడిస్తామని, సెకండరీ స్థాయిలో స్మార్ట్ క్లాసెస్ ప్రవేశపెడతామని బీజేపీ హామీ ఇచ్చింది. 2024 నాటికి 200 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలను అదనంగా ప్రారంభిస్తామని బీజేపీ తెలిపింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, ఓబిసి విద్యార్థులకు జరుపుతున్న కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. ఉదాహరణకు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు 60 శాతం తగ్గాయి. ఎస్సీ బాలికల హాస్టళ్లు 40.32 శాతం తగ్గాయి. ఓబిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు 17.35 శాతం తగ్గాయి. ఓబీసీలకు బాలుర, బాలికల హాస్టళ్లు 40 శాతం తగ్గాయి. సిపిఎం మాత్రమే ఎస్సీ, ఎస్టీ బాలలకు అత్యాధునిక సదుపాయాలతో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు నెలకొల్పేలా నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యతోపాటు బాలికల విద్యకు, మైనారిటీ వర్గాల పట్ల ఎన్సీపీ దృష్టి సారించింది.
ఆరోగ్య హక్కు ఇంకా అందని కలగా మిగిలిపోయింది. ఆరోగ్య సంరక్షణ దుర్భరంగా మారుతున్నది. ఇటువంటి పరిస్థితులలో ‘ఆరోగ్య హక్కు’ను గుర్తిస్తామని కాంగ్రెస్, సిపిఎం మాత్రమే తెలిపాయి. ఆయుష్మాన్ భారత్ పథకం విస్తరిస్తామని బీజేపీ హామీ ఇవ్వగా, ‘అందరికి ఆరోగ్యం’ అందుబాటులోకి తెస్తామని టిఎంసి తెలిపింది. 2022 నాటికి బాలలకు రోగ నిరోధక కార్యక్రమాలు అమలుచేస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది. 2016 నాటి బాలల జాతీయ కార్యాచరణ ప్రణాళికలో 2021 నాటికే ఈ లక్ష్యం చేరుకుంటామని ఇచ్చిన హామీని విస్మరించినట్లున్నది. బాలల సంరక్షణ ప్రాధాన్యతను బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం గుర్తించాయి. అసంఘటిత రంగంలో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని క్రెచ్ కార్యక్రమాన్ని బలోపేతం కావిస్తామని బీజేపీ తెలిపింది. 2022 నాటికి బాలల సంరక్షణ సదుపాయాలను మూడు రేట్లు పెంచుతామని ప్రకటించింది.
అంగన్‌వాడీ కేంద్రాలను పెంచుతామని, క్రెచ్ కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కార్యక్రమంలో జత చేస్తామని, ఐసిడిఎస్ కార్యక్రమాన్ని విస్తరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఐడిసిఎస్ కార్యక్రమాన్ని విస్తరిస్తామని సిపిఎం హామీ ఇచ్చింది. మాతృ, బాలల ఆరోగ్యంలో మెరుగైన సేవలు అందిస్తామని ఎన్సీపీ తెలిపింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసు గల బాలల్లో 38 శాతం మంది పెరుగుదల తక్కువగా ఉంటున్నది. 21 శాతం మందిలో పెరుగుదల కనిపించడం లేదు. 36 శాతం మంది తక్కువ బరువుతో ఉంటున్నారు. ఇవన్నీ బాలల్లో నెలకొన్న పౌష్టికాహార లోపం, ఆకలిని ప్రతిబింబిస్తున్నాయి. ఐసిడిఎస్ కార్యక్రమం అమలు లోపభూయిష్టంగా ఉన్నట్టు స్పష్టం అవుతున్నది. ఐసిడిఎస్‌తోపాటు మధ్యాహ్నం భోజన పథకాన్ని విస్తరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఆరేళ్ళ లోపు వయస్సుగల బాలలకు పౌష్టికాహారం అందించే విధంగా ఐసిడిఎస్ కార్యక్రమాన్ని మార్పుచేస్తామని సిపిఎం చెప్పింది. ప్రస్తుతం అమలులో ఉన్న ‘పోషన్ అభియాన్’ ద్వారా పౌష్టికాహార లోపాన్ని నివారిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ‘‘మా భారత్- మా వాణి’’ పేరుతో జరిగిన జాతీయ బాలల పార్లమెంట్ రూపొందించిన ‘బాలల ప్రణాళిక’లో పలు అంశాలతోపాటు వివక్ష చూపక పోవడం, ఆటలు ఆడుకొనే హక్కు- క్రీడా ప్రాంగణాలు, సమ్మిళిత కార్యక్రమాలు వంటి పలు అంశాలను దేశం ముందుంచాయి. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు బాలలకు సంబంధించి కీలకమైన అంశాల పట్ల తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారి ఎన్నికల ప్రణాళికలు స్పష్టం చేస్తున్నాయి.

-చలసాని నరేంద్ర 98495 69050