మెయిన్ ఫీచర్

శివారెడ్డి కవిత్వం ‘ఓ సందర్భం! ఓ సమూహం!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దశలు దశలుగా సాగుతున్న జీవితంలో
చరమాంకం ఎట్టుండా స్వీకరించాల్సిందే
దుఃఖాన్నయినా ఆనందంగా అనుభవించాల్సిందే
అయితే..
ఒక పనిలో మునిగినవాడికి
ఏదీ గుర్తుకురాదు - పని తప్ప’’ అనే చింతనా వైచిత్రిగల కవి, దించలేని జరాభారాన్ని మోసుకు తిరుగుతూ, బాధ్యతాయుతంగా, నిష్ఠ, నిబద్ధతతో నిద్రారహిత స్థితిలో, సమస్య నలుదిశలకు విస్తరిస్తూ, నిరాకారాలతో దాగి సాకారతను కప్పుకుంటున్న కలలు మాగిన కవితా మధుఫలపు పరిమళం కె.శివారెడ్డి. రేపవళ్ళ ఆలోచనా అంతరంగానికి రేపటిని వేలాడదీస్తూ, కలల సాకార మర్మమెరిగిన కవితాశక్తి ఈయనిది. అత్యంత స్థిరమైన వ్యక్తిత్వంతో, ప్రగతి కాముకునిగా, ఉద్యమ నిర్మాణవాదిగా, సామాజిక చీకటి కోణాల ఆంతర్యమెరిగిన అభ్యుదయవాదీయన. ప్రజా ఉద్యమాల నేపథ్యంతో, చారిత్రక పరిణామాలను అవగాహనించుకొంటూ, నేటి సామాజిక రాజకీయ ఆర్థిక దృష్టికోణంతో విశే్లషించుకుంటూ, క్రమబద్ధమైన వివరణాత్మకమైన, అనుశీలనంతో వచన కవిత్వానికి వనె్న చినె్నలద్దిన ప్రజాకవి శివారెడ్డి. వీరి కవిత్వంలో విప్లవజ్యోతులు కనిపిస్తాయి. ప్రాపంచిక దృక్పథం వెలుగులు కనిపిస్తాయ్, కుల, మత, వివక్షను అధిగమించే విముక్తి పోరాటాల నీడలు కనిపిస్తాయి. అనేక సూక్ష్మదోపిడీ రూపాల మూల స్వరూపాల జాడలు కనిపిస్తాయి. అందుచేతనే శివారెడ్డి కవిత్వం అణగారిన జీవితాల్ని విప్లవీకరించడంలో, అణచివేతతో అల్లాడిపోతున్న తాడిత పీడిత హృదయాల్లో స్వేచ్ఛ్భావాల్ని అంకురింపజేయడంలో, శ్రామిక వర్గాలు దోపిడీ వర్గాల కబంధ హస్తాలనుండి విడివడే ప్రతిఘటనాశక్తిని పెంపొందించడంలో, త్యాగాన్ని, ధైర్యాన్ని రగిలించడంలో విజయాల్ని సాధించడానికి ఎంతగానో తోడ్పాటునిచ్చిందనే చెప్పొచ్చు. ప్రజాస్వామిక స్వభావాన్ని, విలువల్ని గుర్తుజేస్తూనే సైద్ధాంతిక పరమైన విలువలతో కూడిన ఉద్యమ స్ఫూర్తి కోకొల్లలుగా వీరి కవిత్వంలో కనిపిస్తూంటుంది. పనికిమాలిన పాతతనాన్ని శిథిలపరచుకుంటూ ప్రగతిశీలమైన నూతనత్వాన్ని ఆహ్వానించే సృజనశీలి శివారెడ్డి.
ప్రతి సామాజిక సందర్భానికీ, ప్రజల్లో రగులుతున్న అల్లకల్లోలానికీ, జన జీవన ఘర్షణలకీ, పోరాటాలకీ, ఉద్యమాలకీ, పాలక వర్గపు దగుల్బాజీతనానికి స్పందించే చైతన్యవంతుడు. జీవన తాత్త్విక గరిమతో సమస్యను వ్యూహాత్మకంగా ఉద్యమ యుక్తితో ఎత్తిచూపే చేవ గల కవి శివారెడ్డి. సాంస్కృతిక రంగంలో కవిత్వాన్ని ఆయుధంగా చేసి సామాజిక విధ్వంసాలమీద ఎక్కుపెట్టిన మహాకవుల్లో శివారెడ్డి ఒకరుగా చెప్పుకోవచ్చు. కవిగా తపన, తపస్సు, ఆవేదన ముప్పిరిగొన్న లోచూపుతో వస్తువును దర్శించి, సామాజిక స్పృహతో అక్షరానికి ఆయుష్షు పోసే తత్త్వం వీరిది. వీరి కవిత్వం వర్గ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అనిర్వచనీయతకు అద్దంపట్టేదిగా, విలక్షణమైన వ్యక్తీకరణతో సరళమైన భాషతో సాగిపోతుంటుందీ కవిత్వం.
శివారెడ్డి ఏనాడూ తన మూలాలు మరచిపోయిన కవి కాదు. తన కవిత్వంలో బాల్యం అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఐదేళ్ళప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న లోటు, ఎంతో వెలితిగా చుట్టూ ఎంతమంది వున్నా బిక్కుబిక్కుమనే భయం, గుండెల్లో గుసగుసలు పోతుంటుందనేవాడు శివారెడ్డి. నాలుగు అక్షరం ముక్కల్ని సంచిలో వేసుకుని భిక్షార్థియై హైదరాబాదు చేరినప్పుడు, కవిత్వంపట్ల ప్రేమో, పిచ్చి మమకారమో, ఏదో వ్యామోహమో తనను వెంటాడుతుండేది అంటాడు శివారెడ్డి. ఆనాటి సామాజిక సంక్షోభాలయితేనేమి, సాహిత్యరంగంలో అల్లకల్లోలయితేనేమి ఏదీ తెలిసీ తెలియని తన పరిస్థితికి, దిక్కుతోచని స్థితికి, సాహిత్య అధ్యయనమే కొంతవరకు ఊరట కలిగించిందంటారు. ఏభైఏళ్ళ సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ ఉద్యమాలతో శివారెడ్డి జీవితం ముడివడి వుంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, కొత్త ఊపిరితో సరికొత్త ఊపుతో కవిత్వాన్ని శ్వాసించినా, నేడు ఆధునిక కవిత్వాన్ని శాసిస్తున్న మహాకవి శివారెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వీరి నైజం. ప్రతి చిన్న కవిలోనుండి వెలువడిన కొత్త భావాన్ని చూస్తే అభినందించడం వీరి సంస్కారం.
మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, బాల్యాన్ని బడికే కాకుండా, సేద్యం పనులకు సగం వినియోగిస్తూ, ఇంటి పని, వంటపనిలో తండ్రికి సహకారిగా ఉంటూ గడిపిన పల్లె జీవితపు కష్టాలు కన్నీళ్ళు తన కవిత్వానికి సైదోడై నిలిచినవి అంటాడు శివారెడ్డి. కష్టాల సానమీద అరిగి పదునెక్కిన కవీయన. అందుకే ఆయన కవిత్వంలో అమ్మతనం లాంటి ఆత్మీయత పలకరిస్తుంటుంది. కనుకనే పాఠకుణ్ణి ఓన్ చేసుకునే తత్త్వం మిక్కుటంగా కనిపిస్తుంటుంది. ఒక అనుభవంలోంచి అవగాహనలోంచి పుట్టిన కవిత్వం కనుకనే తనను నిత్యం వెంటాడి వేటాడిన దుఃఖాన్ని గూర్చి చెప్తూ- ‘‘దుఃఖాన్ని మాత్రం పిలవకు / అది దరిద్రంకన్నా / దరిద్రాతి దరిద్రమైంది! నిస్తేజమైన / నిర్వీర్యపుటాలోచనల్ని పోగుచేస్తుంది!.. మహోజ్జ్వల భవిష్యత్తును / ఖూనీచేసే ఖూనీకోరు / దుర్వినియోగం చేయబడ్డ / కాలానికది ప్రతిబింబం’’ అంటారు రక్తం సూర్యుడు కవితా సంపుటిలోని కవితలో (1973).
దిగులు, దుఃఖాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమించి ‘చర్య’ (1975) కవితా సంపుటిలో ‘‘ఆశ చిరంజీవి’’ అనే కవితలో ‘‘ఒక ఓటమిలో/ కొన్ని వందల విజయాల్ని ఆవిష్కరించుకుంటాను/ ఒక ఎదురుదెబ్బతో/ ఎన్నో జాగ్రత్తలు జాగృతమైనట్లు/... ఊహ ఊపిరి మీద/ భవిష్యత్ గీతం రాసుకుంటాను’’ అంటూ బతుకుమీద ఓ నమ్మకాన్ని సమకూర్చుకుంటాను. ‘‘నేత్ర ధనస్సు’’ కవితా సంపుటిలో (1978) ‘‘్ధ్వంసం’’అనే కవితలో కవి శివారెడ్డి తన కవిత్వానికి దారితెన్ను వెతుక్కున్నాడు. మార్క్సిస్టు భావజాలాన్ని ఒడిసిపట్టుకున్నాడు కనుకనే ‘‘్ధ్వంసం చేయాల్సిన దానే్న ధ్వంసంచేసి/ మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడదాం.../... దేన్నీ ధ్వంసంచేయకుండా/ దేన్ని నిర్మిస్తావు?/ ధ్వంసం చేయతగిందేది లేకపోతే నీకీలోకంలో/ నువ్వు తప్పకుండా ధ్వంసం చేయదగిన వ్యక్తివి’’ అనే నిర్ధారణకు వస్తాడు.
కవిత్వానికి కాలం చెల్లిందనే వారికి సమాధానంగా 1983 ‘్భరమితి’ కవితా సంపుటిలోని ‘‘్భరమితి’’ కవితలో సమాధానం చెప్పాడీ నిత్యకవి. ‘‘కవిత్వానికి కాలం చెల్లిందంటున్నారు.../ రక్తమాగి పోయినవాడు స్పందనని కొలవలేడు/ కళ్ళల్లో సూర్యుడు కదలాడనివాడు/ ప్రపంచాన్ని స్పృశించలేడు / నాకంతటా కవిత్వం కదలాడుతుందేమిటి? - అంటూ కవిత్వం రాయలేనివారి విషయాన్ని, కవిత్వం యెడల తనలో ప్రతిది కవిత్వంగా పరివర్తన చెందే విధానాన్ని ఎత్తిచూపాడు కవి.
మరణం గురించి కవిత ‘మెహనా.. ఓ మోహనా..’ కవితా సంపుటిలోనిది (1988). మరణం గురించి మాట్లాడుతూ ‘‘చావు అందరికీ ఒకటే అయినా/ అందరి చావూ మనకొక్కటి కాదు/ నియంతల అధికార దాహానికి సోపానాలయ్యేవాళ్ళు / దుష్టవ్యవస్థని బతికించ చూచేవాళ్ళు.../ చావటమే మంచిది / ముమ్మాటికి ఆ చావుని మనం హర్షించటం కూడా సక్రమమైందే’’ అంటారు.
‘‘అజేయం’’ కవితా సంపుటి (1994)లో ‘‘కవులేంజేస్తారు’’ కవితలో ‘‘కవులేం జేస్తారు / గోడలకు నోరిస్తారు / చెట్లకు కళ్లిస్తారు / గాలికి గొంతిస్తారు / ఆ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు / ప్రజలకు చేతులిస్తారు /... ప్రజల చేతుల్లో అనంతశక్తి సంపన్నమైన పద్యాన్ని పెడతారు’’ అంటూ కవియొక్క విధుల్ని, బాధ్యతల్ని చెప్తాడు శివారెడ్డి.
1997లో రాసిన ‘‘నా కలల నది అంచున’’ కవితాసంపుటిలోని అదే కవితలో ‘‘మనిషి’’ బువ్వ తినటానికి ఎన్ని యుగాలు పట్టింది/ తన బువ్వ తను తినటానికి ఇంకెన్ని యుగాలు పడుతుంది - అంటూ దోపిడీనుండి మనిషి ఎంత కాలానికి విముక్తి చెందుతాడోననే భావన వ్యక్తీకరిస్తాడు కవి. 1999లో రాసిన వర్షం కవితా సంపుటిలోని ‘‘వాళ్ళు మాట్లాడుకుంటున్నారు’’ కవితలో ‘‘ఎన్‌కౌంటర్లన్నీ బూటకపు హత్యలే/ పదవ పౌర హక్కుల మహాసభల్ని జయప్రదం చేయండి’’ అనే వాక్యాలతో ఆనాడు జరుగుతున్న నీతి నిజాయితీని ఎత్తిచూపాడు కవి.
2003లో ‘‘వృత్తలేఖని’’ కవితా సంపుటిలో ‘ఆగస్టు 28’ కవితలో పాలకుల దౌర్జన్యాలను ఖండిస్తూ ‘‘పేడిమూతి పరిపాలకుల వికృత చేష్టకు, పిరికితనానికి/ ముళ్ళ తడికెలూ బాష్పవాయువులు/ ఆశ్విక దాడులూ/ తుపాకీ కాల్పులూ/ ఒక కొండ గుర్తు/ ఎందుకంత భయం/ దమ్ముంటే జనం మధ్యకురా/ రక్షణ కవచాలు/ పోలీసు వలయాలు లేకుండా’’ అంటూ పాలకులకు సవాలు విసురుతాడు కవి.
ప్రజల రహస్య భాష తెలిసిన కవి శివారెడ్డి. అందుకే అంటారు ‘‘ఇప్పుడు భాష పగుల్తుంది/ సమస్త పేలుడు పదార్థాలన్నిటినీ గర్భీకరించుకుని/ భాష పగులుతుంది/ శబ్దం మిగుల్తుంది/ నీ క్రోధానికి సరికొత్త భాష దొరుకుతుంది’’ అంటారు. ఈనాటి సామాజిక రుగ్మతలు, విధ్వంసక చర్యలు ఎత్తిచూపాలంటే సరికొత్త పదబంధాలుగల భాష అవసరమనేది శివారెడ్డి ఉద్దేశం. శివారెడ్డి అంతర్జనం, పొసగనివన్నీ, గగనమంత తలతో అతను చరిత్ర, మొదలగు కవితా సంపుటాల్లోని కవితల క్రమాన్ని పరిశీలించినట్లయితే ఈ కవి కాలంతో కలసి నడిచినట్లుగా, దినదిన ప్రవర్ధమానంగా కవితాశక్తి ఇనుమడించినట్లుగా, ఈయన దృష్టికి, చూపుకు, స్వచ్ఛత ఉన్నట్లుగా తోస్తుంది. ఈయనకు అనుభవాన్ని పునరనుసంధానం చేసుకొనే శక్తి ఉంది; ఆ భాషా సామాగ్రి వీరికుంది.
2018నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా కె.శివారెడ్డిగారు ఉభయ తెలుగు రాష్ట్రాల తరఫున పనిచేస్తున్నారు. అకాడమీ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా అండదండలందిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు. ఎందరో నవ కవులను యువ కవులను ప్రోత్సహిస్తున్నారు. వీరికి గత సంవత్సరం 2017కు గాను కబీరు సమ్మాన్ అవార్డువచ్చింది. ఈ సంవత్సరం 2018కి బిర్లా ఫౌండేషన్‌వారి ‘సరస్వతి సమ్మాన్’ అవార్డు వరించింది. ఈయన కవిత్వాన్ని ఓ సందర్భంగా ఓ సమూహంగా పరిగణించవచ్చు. ప్రజాస్వామ్యానికి ప్రాణగండమొచ్చిందనే సందర్భాల్ని ఎత్తిచూపుతూ ఒక సంఘటిత శక్తిగా ఒంటరితనాన్ని వీడి సమూహంగా నిలబడి పోరాడినప్పుడే ప్రజాస్వామ్యం నాలుగు పాదాలమీద నడుస్తుందనే భరోసా యిచ్చే కె.శివారెడ్డిగారికి అభినందనలు తెలియజేద్దాం.

- కొండ్రెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, 9948774243