మెయన్ ఫీచర్

‘ఫలితం’ తేలేదాకా రాద్ధాంతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రాలో పోలింగ్ ముగిసినా రాజకీయ పార్టీల మధ్య రాద్ధాంతం కొనసాగుతోంది. ఈసారి పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కానీ, ఈ ఆనందం మంటగలిపేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. పోలింగ్ ముగిసి వారం రోజులు గడచినా ఉద్రిక్తతలు తగ్గలేదు. ఏపీలో రాజకీయ పార్టీల తీరు ఇలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, పట్టుదలతో ఓటర్లు అర్ధరాత్రి వరకూ ‘క్యూ’లో బారులు తీరి ఓట్లు వేశారు. ఇందుకు రాజకీయ పార్టీలన్నీ ఓటర్లకు రుణపడి ఉండాలి.
పోలింగ్ రోజున చాలాచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నా, రెండు సంఘటనలు మాత్రం ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చాయి. గుంటూరు జిల్లా వేమూరు నుంచి వైకాపా తరఫున పోటీ చేసిన మేరుగ నాగార్జున ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును ప్రత్యర్థి వర్గం వారు ధ్వంసం చేశారు. కారును ధ్వంసం చేసిన తీరు చూస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తుంది. మరో సంఘటనలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుచొక్కా చినిగిపోయి నిస్సహాయంగా ఉన్న స్థితిలో కనపడ్డారు. ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం, తన చొక్కాను తానే చించుకోవడం.. అన్నది వాస్తవమా? కాదా? పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా పనిచేసి ఉంటే అన్ని విషయాలూ బహిర్గతమవుతాయి. స్పీకర్‌పై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేసే స్థితి ఎందుకు దాపురించింది? స్పీకర్ హోదాలో ఉన్న సీనియర్ నేతకు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? ఈ ఘటనపై టీడీపీ, వైకాపా చేసే వాదనలు ఎలా ఉన్నా, స్పీకర్‌ను ఆ స్థితిలో చూసేవారికి ఏమర్థమవుతుంది? పల్నాడు ప్రాంతంలో సామాజిక వర్గాల మధ్య కక్షలు,కార్పణ్యాలు దారుణంగా ఉంటాయని అందరికీ తెలుసు. రాజధాని అమరావతికి సమీపంలోనే ఈ తరహా సంఘటనలు జరగడంతో జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్ట మసకబారుతుంది. ఇటువంటి సంఘటనలను నిరోధించలేమా?
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకులు ప్రకటనలు చేయడం మానుకోవాలి. ఏపీ విషయంలో ఎన్నికల కమిషన్ అంచనాలు తప్పని రుజువైంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య వారం కంటే మించి వ్యవధి ఉండకుండా చూస్తే బాగుండేది. 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరపడం కూడా సరైన నిర్ణయం కాదని తేలిపోయింది. మూడు విడతలుగా ఎన్నికలు జరిపించి ఉంటే బాగుండేది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, రాయలసీమ ప్రాంతానికి మూడు దశల్లో పోలింగ్ జరిగి ఉంటే శాంతి భద్రతల పరిస్థితి తలెత్తి ఉండేది కాదు.
గత ఐదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో రాణించాలంటే బలమైన సామాజిక వర్గం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టే ధోరణి, సొంత గన్‌మెన్‌లను నియమించుకునే సంస్కృతి, ప్రజాప్రతినిధులు ‘రిచ్’గా కనపడాలన్న తాపత్రయం, ఓటర్లలో కొంత మంది డబ్బు ఆశించడం, నేతలతో పాటు ప్రజలూ అవినీతికి అలవాటు పడడం తదితర కారణాల వల్ల మొత్తం వ్యవస్థ భ్రష్టుపట్టింది. దీనికి ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా దోహదపడుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఏపీలో 74.64 శాతం ఓట్లు పోలైతే, ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 79.74 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3,93,45,717 మంది ఓటర్లలో 3,13,33,163 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం ఆషామాషీ కాదు. బాపట్లలో అత్యధికంగా 85.16 శాతం ఓటర్లు ఓట్లు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విశే్లషిస్తే అరకులో 73.67, శ్రీకాకుళంలో 74.08, విజయనగరంలో 80.57, విశాఖపట్నంలో 67.26, అనకాపల్లిలో 81, కాకినాడలో 78.38, అమలాపురంలో 83.27, రాజమండ్రిలో 80.95, నర్సాపురంలో 81.02, ఏలూరులో 82.94 శాతం, మచిలీపట్నంలో 83.70, విజయవాడలో 77.14, గుంటూరులో 78.55, నర్సరావుపేటలో 85.53, బాపట్లలో 85.49, ఓంగోలులో 85.23, నంద్యాలలో 80.15, కర్నూలులో 75.13, అనంతపురంలో 80.24, హిందూపూర్‌లో 83.89, కడపలో 77.81, నెల్లూరులో 76.14, తిరుపతిలో 78.99, రాజంపేటలో 78.38, చిత్తూరులో 83.68 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలయిన ఆనందం మిగలకుండా రాజకీయ పార్టీలు ఢిల్లీ, హైదరాబాద్‌ల చుట్టూ తిరగడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఏపీ ప్రతిష్ట దిగజారింది. మనం నిర్మించుకున్న వ్యవస్థలను మనమే తక్కువ చేసి మాట్లాడుతున్న రాజకీయ పార్టీల వల్ల దేశానికి ఎటువంటి సందేశం ఇచ్చిన వారమవుతాం. ఏపి సీఎం చంద్రబాబు నాయుడు పోలింగ్ రోజు మొదలుకుని క్షణం విరామం లేకుండా ఎన్నికల సంఘంపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల పాటు వీవీప్యాట్ రశీదులను నియోజకవర్గానికి ఐదు చొప్పున లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును శిరోధార్యంగా భావించాలి. అభ్యంతరం ఉంటే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు రాజకీయ పార్టీలకు, సంస్థలకు,వ్యక్తులకు ఉంటుంది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే కోర్టులకు వెళ్లవచ్చు. అంతేకాని ఒక వైపుఎన్నికలు జరుగుతుంటే- మరోవైపు ఎన్నికల సంఘం అధికారులను, పోలింగ్ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా రాజకీయ పార్టీలు మాట్లాడడం సరికాదు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ, పలు ప్రాంతాల్లో ఇతర పార్టీలు తమకు అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు ఎన్నికల తీరుపై విమర్శలు గుప్పించడం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీల ధోరణి ఇంతే. ఇందులో చంద్రబాబును తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటే ఈవీఎంల గురించి ఎవరూ మాట్లాడరు. సాంకేతిక లోపాల గురించి ఐదేళ్ల దాకా ప్రస్తావించరు. అధికారం రాకుంటే ఈవీఎంల తీరును ప్రశ్నించడం పరిపాటిగా మారింది.
ఢిల్లీకి మంత్రులు, ఎంపీలను తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి చంద్రబాబు ఎన్నికల వ్యవస్థలో లోపాలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ ప్రయత్నం ఆరు నెలల ముందు చేసి ఉంటే బాగుండేది. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని తిట్టడం మంచి పద్ధతి కాదు. తాము సైతం తక్కువ కాదన్నట్లు వైకాపా ప్రతినిధి బృందం పోటాపోటీగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఢిల్లీ వీధుల్లో ఒకరినొకరు దూషించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా ఆరు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఏపీ ప్రజలు పగలూ రాత్రీ ‘క్యూ’లో నిలబడి వోట్లు వేశారు. ఇంతా చేస్తే ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాయనే నమ్మకం లేదు. రెండు ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ గెలిచినా, ఓడినా అసెంబ్లీని వేదికగా చేసుకుని రాద్ధాంతం చేయడం అనివార్యంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం దక్కుతుందన్న విషయమై రకరకాల అంచనాలు ఊపందుకుంటున్నాయి.
కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల్లో భాజపా ఓటమి చెందాక- 24 గంటల్లోగా బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు విశాలమైన తోటలో ఒక్క పువ్వును కూడా ఎప్పుడూ కోయలేదు. శివరాజ్ సింగ్ భార్యను స్కూటర్‌పై ఎక్కించుకుని హాయిగా అధికారిక నివాసం నుంచి నిష్క్రమించారు. ఆర్భాటానికి దూరంగా ఉండే వామపక్ష పార్టీల నుంచి కనీసం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎన్నిక కాలేక పోతున్నారు. ఆదర్శవంతంగా పనిచేసిన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇంకా ఎంతోమంది సీఎంలు సీదాసాదాగా ఉంటారు. ఆ తరహా హుందాతనం ఉట్టిపడే రాజకీయ నాయకుల అవసరం ఏపీకి లేదా?

-కె.విజయ శైలేంద్ర 98499 98097