మెయన్ ఫీచర్

తెలుగు భాషను బతికిస్తున్నదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరంతరం పారే నీరే స్వచ్ఛంగా వుం టుంది. నాల్కలపై నానే భాషనే చిరకాలం కొనసాగుతుంది. ఇంటి భాష, తల్లి భాషనే చిన్నారులను నిజాయితిగా ఎదిగిస్తుంది. అధ్యయనాన్ని, అవగాహనను కలిగిస్తుంది. తలెత్తుకొని జీవించేలా చేస్తుంది. ప్రపంచంలో తలెత్తుకుంటున్న దేశాలన్నీ ఈ భాషా నీతితోనే లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి.
ఈ మధ్యన తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించిన రెండు సంఘటనలు నిజామాబాద్ జిల్లాలో జరిగాయి. గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని నూతనంగా జిల్లా ఏర్పాటు కాబోతున్న కామారెడ్డిలో ఉపవిద్యాశాఖాధికారి కార్యాలయం సమావేశం గదిలో ఆగస్టు 29న ఒకటి జరగ్గా, మరొకటి నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశం హాలు లో సెప్టెంబరు 7న జరిగింది. మొదటి సమావేశాన్ని పదవీ విరమణ చేసిన ఓ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇ.గంగాప్రసాద్ తాను తడుపుతున్న ‘సాహితీ సమాలోచనం’ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించగా, రెండవది తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. మొదటి దాంట్లో తెలుగు మాధ్యమంలోనే చదువుతున్న 16 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, పాఠశాలకు ముగ్గురి చొప్పున పాల్గొనగా, రెండో దాంట్లో స్థానిక పార్లమెంటు సభ్యురాలితో సహా మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, తెలుగు అకాడమి పూర్వ సంచాలకులు కె. యాదగిరి, స్థానిక తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి, మాజీ రిజిస్ట్రార్, తెలుగు భాషా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ వెల్చాల కొండల్ రావు, తదితరులతో పాటు స్థానిక సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
రెండో సమావేశంలో ఎవరేమి మాట్లాడారో, మాట్లాడుతారో దాదాపుగా అందరికీ అనుభవంలో ఉన్నదే. సంవత్సరానికి ఒకసారి స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం కాబట్టి, వచ్చే ఏడాది దాకా తిరిగి ఈ ఊసు ఉండదు కాబట్టి, తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని, బోధనా భాషగా, తెలుగు మాధ్యమ ప్రాముఖ్యాన్ని గట్టిగానే నొక్కి చెప్పారు. ఇంకా చెప్పాలంటే ప్రాథమిక విద్యనన్నా తెలుగు మాధ్యమంలో ఉండాలని అధికార ఎంపి కవితకు విన్నవించారు. తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ తెలుగును ఉద్యమానికి ఉప్పుగా వాడుకున్న సదరు ఎంపిగారు స్పందిస్తూ, ఆంగ్లవిద్యవైపు అందరూ మొగ్గుచూపుతున్నందున, ఉన్నపళంగా ఆంగ్లాన్ని తొలగించలేమని సెలవిస్తూ, ప్రభుత్వ ప్రతిపాదిత కెజి టు పిజి లోనన్నా సమాంతరంగా తెలుగు మాధ్యమం కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తానని చెప్పి తప్పించుకున్నారు. దీనికి సభికులు చప్ప ట్లు మోగాల్సిన స్థాయిలోనే మోగాయి. వేదికపైన ఉన్న పెద్దలెవ్వరికీ ఆ మాటలు రుచించకున్నా, కనీసం ఓ డిమాండుగా అయనా గొంతెత్తని స్థితి. ఇలాంటివారు, పాలకపక్షం చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తారో కూడా జనానికి తెలుసు. అయితే, తెలుగుభాషను రక్షించుకోవాలంటే, పాలకపక్షం సమక్షంలోనే మాట్లాడితేనేగదా ప్రభుత్వ దృష్టికి వచ్చేదని వాదించేవారున్నారు. ఇలాంటి వేదికల చుట్టూ తిరుగుతూ తెలుగుభాషను తామే రక్షిస్తున్నట్టు భ్రమింపజేసే వారూ ఉన్నారు.
సూచనలకు, సలహాలకే పరిమితమయ్యే ఈ వర్గాలు ప్రభుత్వానికి దాగుడుమూతలాడుతూ, ప్రజల దృష్టిలో నానుతూ వుం టారు. వ్యక్తిగతంగా మాతృభాషలో సాహిత్యాన్ని సృష్టిస్తూ వుంటారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తమ రచనకు పుస్తక రూపాన్నిచ్చి, గ్రంథాలయాలకు పంపిణీ అయ్యేలా చూసుకుంటారు. మాతృభాష పరిరక్షణకు తామే కర్తలమని భావిస్తూవుంటే, పత్రికలు వీటినే ప్రచారంచేస్తూ ఉంటాయి. ప్రభుత్వంపై ఏనాడు వీరు ఒత్తిడి తెచ్చిన దాఖలాలుండవు. కనీసం ప్రభుత్వ స్థాయిలో వెలువడే ఉత్తర్వులు, వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలన్న డిమాండ్ చేయరు. ప్రభుత్వం వింటుందా, వినదా అనే విషయాన్ని పక్కనబెట్టి, వీరి మాటల్ని పెడచెవిన పెడుతున్నందుకు నిరసన కార్యక్రమాల్ని చేయాలన్న ఊహే రాదు. ఇలాంటివారు తాము అనుభవిస్తున్న పదవులను వదులుకుంటారని అనుకోవడం ఓ భ్రమనే.
కన్నడ, తమిళ భాషలకు ప్రాచీన హోదా సమస్య వచ్చినప్పుడు తెలుగు కూడా విధిలేక వీటిపక్కన నిలవాల్సి వచ్చింది. అంతేగాని, పాలకుల ఒత్తిడితో మాత్రం రాదనేది తెలిసిందే. సరే, ఏదోవిధంగా ప్రాచీన హోదా సంతరించుకున్న తెలుగు పీఠాన్ని తెలుగు రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం కర్నాటకలో ఏర్పాటు చేస్తే కిమ్మనని మన నాయకులు తెలుగును రక్షిస్తారనుకోవడం అత్యాశనే. పోతే ఈ మధ్యన ఓ తమిళ తంబి తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వవద్దని మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం వేయగా, న్యాయాధికారి అడ్డంగా కొట్టేశారు. కథ ఇక్కడితో ఆగిందా-అంటే అదీ లేదు. ఇప్పుడు సమస్య అంతా ప్రాచీన హోదా కార్యాలయం ఎక్కడ వుండాలనేదానిపై కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశా, తెలంగాణనా అనే మీమాంస. ఈ ఉమ్మడిపోరులో కర్నాటకలోనో, తమిళనాడులులోనో ఉండాలని, కోతుల పోరును పిల్లి తీర్చినట్టు కేంద్రం తీర్చినా తీర్చవచ్చు. ఇద్దరు చంద్రులకు ఇది నచ్చినా నచ్చవచ్చు. ఇలా తెలుగు భాష అధికార కబంధహస్తాల్లో ఇరికి చిక్కి శల్యమైతే తెలుగు భాషను రక్షించాలని విధ్వంసకులనే అభ్యర్థించడం ఆత్మహత్యా సదృశ్యం కాదా?
వీటన్నింటికి అతీతంగా నిజంగా తెలుగును బతికిస్తున్నది మాత్రం సాధారణ ప్రజలే. ప్రజలే భాషకు తల్లిలాంటివారు. భాషను పుట్టించేది, పెంచేది, తరతరాలకు అందించేది ఈ ప్రజలే. ఇంకా చెప్పాలంటే, తెలుగు మాతృభాషగా లేని 33 గిరిజన తెగలు, అరబ్బీ మాతృభాషగా కలిగిన ముస్లింలు, తెలుగు అక్కున చేర్చుకొని కాపాడుకుంటున్నారు. ఈవిధంగా కాపాడబడుతున్న తెలుగును, ముక్కలు చెక్కలుగా చేస్తూ, కళావిహీనంగా మారుస్తూ, వినడానికి అసహ్యం కలిగేలా మాట్లాడుతూ, టీవీలు, సినిమాలు, చివరికి మిర్చిమసాలా రేడియో కార్యక్రమాలు దారుణాలకు పాల్పడుతున్నాయి. తెలుగు మాట్లాడేవారే కరువైనట్టు, వంకరటింకరగా మాట్లాడేవారినే, ఆంగ్లాన్ని కూడా అడ్డదిడ్డంగా మాట్లాడేవారిచే తెలుగుకు వ్యాఖ్యానాల్ని చేయిస్తూ దాదాపు అన్ని దూరదర్శన్ కార్యక్రమాలు రూపొందడం, ప్రసారం కావడం, మనం ‘ఆహా, ఓహో అనడం జరిగిపోతూనే ఉంది.
చివరికి పత్రికా రంగాలతీరు అంతే. తెలుగుపదాలున్నా, ఆంగ్లపదాల్ని అరగదీసి తెలుగు పదాలుగా చెలామణిలోకి తెస్తున్నాయి. దీన్ని నిలువరించే ప్రయత్నం ఏ స్థాయిలో జరక్కపోగా, అత్యధిక కథారచయితలు, వాడుక భాష ముసుగులో, స్థానిక నుడికారాల పేరున, పరభాషనే వాడుకభాషగా, నుడికారాలుగా వాడుతూ వారి వారి రచనలకు ఆంగ్ల మెరుగుల్ని దిద్దుకుంటున్నారు. ఇలాంటి కథలకు పత్రికలు ప్రోత్సాహకాల్నిచ్చి, సాహితీ సంస్థలు బహుమతులనిచ్చి వెన్ను తట్టుతున్నాయి. ఇక సెల్‌ఫోన్ భాష మరో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఇటు తెలుగును, అటు ఆంగ్లాన్ని కూడా నిత్య సంహారం చేస్తూనే ఉన్నది.
వ్యాపార వర్గాలదీ ఇదే ధోరణి. రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఆంగ్లీకరణ చెం దాయి. ఏ దుకాణం వివరాలు తెలుగులో కనబడవు. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఇదే. పక్క రాష్ట్రాలు వారి మాతృభాషల్ని ఎలా రక్షించుకుంటున్నాయో, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులనుంచి, సచివాలయ ప్రధాన కార్యదర్శి దాకా ఆంగ్లంలోనే సంవాదం చేస్తే పరపతి ఉంటుందని భ్రమిస్తే, సదస్సులు, సెమినార్లు, ధర్నాలు కూడా తెలుగేతర ప్రచారాన్ని సంతరించచుకుంటే, తెలుగులో చెప్పాల్సిన, మాట్లాడాల్సిన అంశాన్ని కూడా ఆంగ్లభాషలో ఘోషిస్తుంటే, వక్తలు ఆంగ్లా న్ని మిళితం చేసి సంభాషిస్తే, తెలుగు ఎలా బతికి బట్టకడుతుందో ఆలోచించాలి.
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలోనే పైన పేర్కొన్న ఓ ప్రధానోపాధ్యాయుడు తెలుగును బతికించాలనే ఓ చిరు ప్రయత్నం చేశారు. అయిష్టంగా వచ్చిన అధికారులు, స్థానిక రచయితలు, కవులు, పాఠశాలల విద్యార్థులకు తోడుగా వచ్చిన ఉపాధ్యాయుల సమక్షంలో ఏకధాటిగా మూడు గంటలకు పైగా సాగిన ‘తెలుగు మాధ్యమంగా విద్యాబోధన’ అనే అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో అనూహ్యంగా 48 మంది విద్యార్థులు మాట్లాడడం గమనార్హం. ఒకే మండలానికి పరిమితంగా, తెలుగు మాధ్యమం చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే నిర్దేశించిన కార్యక్రమం అసలు జరుగుతుందా? ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటుందా? విద్యార్థులు ముందుకు వస్తారా అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ విద్యార్థులు మాట్లాడడం అందర్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రతి విద్యార్థికి ఇచ్చింది మూడు నిముషాలే అయినా, మరికొంత సమయాన్ని ఇచ్చినా మాట్లాడాలనే ఉత్సాహాన్ని విద్యార్థులు ప్రదర్శించడం గమనార్హం. పైగా విద్యార్థినులే అధిక సంఖ్యలో పాల్గొనడం మరో విశేషం.
తెలుగు భాషా దినోత్సవం రోజున ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నం బహుశా జరిగి ఉండకపోవచ్చు. స్థానిక మీడియాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ కార్యక్రమం ఆహుతులకు అనేక సవాళ్లను విసిరింది. ఈ సవాళ్లను స్వీకరిస్తే అనుగుణంగా కార్యక్రమాలు రూపుదిద్దుకుంటే, ఇరు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రచారాలు జరిగితే, యునెస్కో భావిస్తున్నట్టు 2020, 2030 నాటికి కాదుగదా, యుగాంతానికి కూడా తెలుగు చిరంజీవిగా మనగలుగుతుంది. ఈ దిశగా తెలుగుభాషాభిమానులు దృష్టిని సారించి, తమకు తోచిన విధంగా చేయూతనిస్తే, నిజంగా తెలుగుకు దోహదం చేసినవారే అవుతారు. రచయితలు తమ రచనలకే పరిమితం కాకుండా, కవులు తమ రచనలకే మురిసిపోకుండా, నలుగురితో మాట్లాడుతూ, మాట్లాడింపజేస్తే జనాల నాలుకలపై అజరామరంగా తెలుగు వెలుగొందుతుంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162