మెయన్ ఫీచర్

‘హంగ్’ వస్తే.. ‘కింగ్ మేకర్’ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తకుండా మన రా జ్యాంగ నిర్మాతలు ముందుచూపుతో శాసన, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు అధికారాలు కట్టబెడుతూనే ‘లక్ష్మణరేఖ’లను నిర్దేశించారు. ప్రతి వ్యవస్థ తన పరిధిలో ఉండాలి. అధికారాలున్నాయి కదా అని హద్దు మీరరాదు. రాజ్యాంగం ఎంత కఠినంగా ఉన్నా, లొసుగుల ద్వారా అధికారాన్ని చెలాయించేవారుంటారని ఫ్రాన్స్‌కు చెందిన రాజ్యాంగ నిపుణుడు మాంటిస్‌క్యూ ‘స్పిరిట్ ఆఫ్ లాస్’లో 275 ఏళ్లక్రితమే మూడు వ్యవస్థలకూ పరిమితులు సూచించారు. ఈ ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ భారత రాజ్యాంగానికి స్ఫూర్తి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు, ఎన్నికల ఫలితాలు రాకుండానే అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం, ఎన్నికల కమిషన్‌ను ఇష్టానుసారం దూషించడం, పాలనా వ్యవస్థపై దాడి చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘శాసనాధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో ఉంటే స్వేచ్ఛ ఉండదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. శాసన వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకుని ఏకపక్ష నిర్ణయాలతో కఠిన చట్టాలు తెస్తారు. న్యాయ వ్యవస్థతో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కలిసిపోయిన పక్షంలో నియంతృత్వానికి, రాజ్యాంగ పతనానికి దారితీస్తుంది. బ్యూరోక్రసీ ఒకరి చేతిలో ఉంటే హింసాత్మక నిర్ణయాలు, అణచివేత విధానాలు రాజ్యమేలుతాయి’ అని మాంటిస్‌క్యూ చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ‘ఉత్కళ ప్రాంతం’ ఎంతో ప్రశాంతంగా ఉంది. మే 23వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అసెంబ్లీలలో, లోక్‌సభలో కొత్త నాయకత్వం వచ్చే వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. ఒక విపక్ష పార్టీ నేత- ‘మే 23తో మీ పని అయిపోతుంద’ని అధికార పార్టీని సవాలు చేస్తుంటారు. జూన్ 8వరకూ తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అధికార పార్టీ నేతలు బదులిస్తారు. ఇదంతా చూస్తుంటే- ఆంధ్రాలో అధికార మార్పిడి సజావుగా, పారదర్శకంగా జరుగుతుందా? అనుమానాలు రాకతప్పదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కచ్చితంగా ఎన్నికల కోడ్ అమలు ఉన్నాసరే- అన్ని శాఖల పనితీరును సమీక్షించే అధికారం కలిగి ఉంటారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకునే బదిలీలు చేస్తారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ముఖ్యమంత్రి సమీక్షలు చేయడం నేరమేమీ కాదు. కానీ, పరిమితులకు లోబడి సమీక్షలు జరపాలి. కరవుకాటకాలు, మంచినీటి ఎద్దడి, ప్రజాప్రాముఖ్యత కలిగిన అంశాలపై సీఎం సమీక్షించవచ్చు. విధానపరమైన, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు సంబంధించిన పనులను సమీక్షించరాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా తూలనాడుతూ ముఖ్యమంత్రి విమర్శలు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఇది మంచి సంప్రదాయం కాదు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు, ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లవచ్చు. బహిరంగంగా రాజ్యాంగ వ్యవస్థలను తూలనాడుతూ ప్రకటనలు చేయడం మర్యాద కాదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే టెక్నాలజీ రష్యన్లకు ఉందని అధికార పార్టీ అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు నగల రవాణాపై సీఎం ఎందుకు సమీక్షించలేదని విపక్షం ప్రశ్నిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తుంటే రాజకీయ వాతావరణం గబ్బు పట్టిందనే చెప్పాలి.
ఇపుడు ఏపీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మే 23న ఫలితాలు వచ్చాక అధికారంలో ఉన్న ప్రభుత్వం వెంటనే వైదొలుగుతుందా? లేక జూన్ 8వరకూ కొనసాగుతుందా? ఈ అనుమానాలను అధికార పార్టీ ప్రతినిధులే లేవనెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడితే తప్ప ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి భంగపాటు ఎదురైతే ఈ ప్రశ్న తలెత్తదు. అధికార పార్టీ ఓటమి చెందితే ఏం జరుగుతుంది? ఓటమి ఎదురైన పక్షంలో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించడం లేదా తన ప్రతినిధుల ద్వారా ఆ మేరకు గవర్నర్‌కు లేఖను అందజేయడం ఆనవాయితీ. కొత్త ప్రభుత్వం కొలువు తీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరడం సంప్రదాయం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు ఉండవు. నిజానికి మన రాజ్యాంగంలో ‘ఆపద్ధర్మం’ అనే పదం లేదు. గెలిచిన పార్టీ నేతలు ఏదో ఒక ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజకీయ శూన్యత ఉండదు. అదే ఏ పార్టీకి మెజార్టీరాని పక్షంలో ఏమవుతుంది?
ఉదాహరణకు ఆంధ్రాలో ప్రధాన రాజకీయ పక్షాలైన తెదేపా,వైకాపాల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఆమధ్య కర్నాటకలో ఇదే జరిగింది. ఇదే ఆంధ్రాలో జరిగితే పరిష్కారం ఏమిటి? ‘జనసేన’ 10-12 సీట్లు గెలుచుకొంటే- ఆ పార్టీ ‘కింగ్ మేకర్’ అవుతుందా? తెదేపా, వైకాపాలకు నాలుగైదు సీట్లు తక్కువైతే ‘జనసేన’ ఎటు మొగ్గుతుంది? వైకాపాకు అధికారం దక్కకుండా చంద్రబాబు ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్‌తో జత కడతారా? కర్నాటకలో జేడీఎస్‌లా జనసేన నేతృత్వంలో ప్రభుత్వం ఆవిర్భవిస్తుందా? ఈ పరిణామాలు కచ్చితంగా జరుగుతాయని చెప్పలేం. ప్రజలు ఏదో పార్టీకి గంపగుత్తగా మెజార్టీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. పోలింగ్ తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన ఆంధ్రాలో తెలియని అలజడి కొనసాగుతోంది. తుపాను ముందు ప్రశాంతతలా వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాకపోతే- జూన్ 8వరకు అధికారంలో కొనసాగుతానని ముఖ్యమంత్రి భీష్మించినా ఏమీ కాదు. 2014 జూన్ 2న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అవతరించాయి. జూన్ 8న చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ప్రమాణ స్వీకారం చేశారంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరినట్లే. ఈసారి ఎన్నికల కోడ్ మే నెల 23 తర్వాత ఒకటి రెండు రోజులకు ముగిసినా జూన్ 8వరకు చంద్రబాబు అధికారంలో కొనసాగవచ్చు. అలా కొనసాగడం చట్టపరంగా సమ్మతమే అయినా నైతికంగా తప్పు. రాజీనామా సమర్పించని సీఎంపై జూన్ 8వరకు చర్యలు తీసుకునే హక్కు గవర్నర్‌కు ఉండదు. కాగా, ఏపీలో పోలింగ్ ముగిశాక ప్రధాన పార్టీలు వౌనంగా ఉండడానికి బదులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు నిందించడాన్ని రిటైర్డు ఐఎఎస్ అధికారుల సంఘం గర్హించింది. ‘హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడడమేంట’ని టీడీపీ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని అమరావతిలో ఐఏఎస్ అధికారుల సమావేశం జరిగింది. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న చాలామంది అధికారులు దేనికైనా మంచిదని ఆ సమావేశానికి వెళ్లలేదు. కొంతమంది హాజరై ‘కోరం’ లేదని వాయిదా వేసుకున్నారు. మరో నెలరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎవరు అధికారంలోకి వ స్తారో, పరిణామాలు ఎలా ఆవిష్కృతమవుతాయో ఊహించలేం. అందుకే చాలామంది ఐఎఎస్‌లు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా అన్ని శాఖల పనితీరును సమీక్షించే అధికారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంది. ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న కుయుక్తులను అధికార యంత్రాంగం తిప్పిగొట్టాలి.
ఆంధ్రాలో కులం, రాజకీయాలు, పదవీ కాంక్ష, నేతల పట్ల వ్యక్తిగత ఆరాధాన, సంపాదన, కాంట్రాక్టులు, సినీ గ్లామర్ వంటివి పెనవేసుకుని ఉన్నాయి. ప్రస్తుతం అమరావతిలోని సచివాలయం చుట్టూ ఈ వర్గాలు రాబందుల్లాగా తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిపాలన సజావుగా జరగాలంటే ఉన్నతాధికారులు, ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించి కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాలి. వ్యక్తిగత బేషజాలతో సామాజిక వర్గాల ఉచ్చులో అధికారులు చిక్కుకుంటే బ్యూరోక్రసీ కూలిపోతుంది. దీని పరిణామాలు రానున్న కాలంలో తీవ్రంగానే ఉంటాయి. అధికార పార్టీకే ప్రజలు పట్టం కడితే పరిస్థితులు వేరు. విపక్ష పార్టీలకు అధికారం అప్పగిస్తే న్యాయపరమైన అంశాలను అడ్డుపెట్టుకుని- ‘మాజీలు’ కాబోయేవారు రెండు వారాల పాటు అధికారంలో అదనంగా కొనసాగితే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి? ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడితే కర్నాటకకు మించిన రాజకీయం చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ పాత్ర కీలకం కానుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097