మెయిన్ ఫీచర్

క్షణికావేశంలో నిర్ణయాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిఒక్కరూ ఆత్మాభిమానంతో బ్రతుకుతారు. సున్నితమైన మనస్సు కలిగి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానికి తగిన ప్రణాళికలను రచించుకొని తదనుగుణంగా కష్టపడుతూ ముందుకు సాగుతారు. మధ్యలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళితే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. మధ్యలో కొన్ని మన ప్రమేయంతో జరిగితే మరికొన్ని మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. దానికి క్షణంలో నిర్ణయం తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి, సమస్య పరిష్కారానికి పలు మార్గాలు లభిస్తాయి.
ఇటీవల ఇంటర్మీడియెట్ బోర్డువిడుదల చేసిన పరీక్షా ఫలితాలు సాంకేతిక లోపాలతో విడుదల చేసిన ఒక్క రోజులోనే 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సగటు మనిషిని కలిచివేసేవిధంగా వుంటే, కని పెంచి పెద్దచేసి, కష్టపడి ఈ స్థాయికి తెచ్చిన వారి తల్లిదండ్రుల శోకాన్ని ఎవరూ ఆపలేరు. వారి మిగతా జీవితంలో ముందుకు సాగనివ్వకుండా, అడుగడుగునా అడ్డుపడుతూ, నిరంతర మానసిక క్షోభను కలిగిస్తుంది. కావున క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా జరిగే పరిణామాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వున్నది.
నేటి సమాజంలో విద్య అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. దీనిని ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాయి. కారణం వాటివల్ల పాలకుల్లో కొంతమందికి లాభం ఉండవచ్చు లేదా భాగస్వామ్యం సైతం ఉండవచ్చు. ఒక పోటీ ప్రపంచాన్ని నెలకొల్పి, ఒక ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటుచేసినపుడు, తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను వేలకు వేలు ఖర్చుపెడుతూ, దానినే పెట్టుబడిగా భావించి పిల్లలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తూ ఆయా కార్పొరేటు విద్యా సంస్థలలో చదివిస్తూ ముందుకెళుతున్నారు.
ఈ స్వార్థపూరిత సమాజంలో కావాలనో, ఒక్కొక్కసారి బాధ్యతారహితంగానో, అనుభవలేమి కారణంగానో లేదా సాంకేతిక లో పాలతో ఇలాంటి తప్పు లు దొర్లవచ్చు. వెంటనే ఇంతమంది విద్యార్థులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. రెండు మూడు రోజులలో తప్పులను సరిదిద్ది, మరలా ఫలితాలను వెల్లడించడానికి నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన విద్యార్థులకు సైతం మంచి ఫలితాలు రావచ్చు. కానీ ఆ క్షణంలో వారు తీసుకున్న నిర్ణయంవలన వారి కుటుంబాలు రోడ్డున

పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇందులో అనుభవంలేని సంస్థలకు బాధ్యతలప్పగించిన ప్రభుత్వానిదా తప్పు? కార్పొరేటు విద్యాసంస్థలదా? విద్యార్థుల ఒత్తిడికి కారణమైన తల్లిదండ్రులదా? లేదా క్షణికావేశంలో తీసుకున్న విద్యార్థులదా? అందుకే ముందుగా తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడిని పెంచుకూడదు. సమస్యలొచ్చినపుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా మనోధైర్యాన్ని కలిగివుండాలి అనే విషయాల గురించి చిన్నప్పటినుంచే నేర్పుతూ రావాలి.
పాఠశాల విద్యనుండే విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండటానికి తోడ్పడే పాఠ్యాంశాలను తరగతులవారీగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు సైకాలజీ విద్యనభ్యసించినవారిని ఒకరిని నియమించి విద్యార్థుల మానసిక స్థితిగతులను తెలుసుకొని వారికి తగిన సూచనలు, సలహాలందించే విధంగా, భవిష్యత్తులో వారు మానసికంగా దృఢంగా ఉండేందుకు కౌన్సిలర్‌ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ఇంటర్‌మీడియేట్, డిగ్రీ స్థాయిలో తక్షణమే సామాజిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల మానసిక అభివృద్ధికి పాటుపడాల్సిన ఆవశ్యకత ఉన్నది.
విద్యార్థుల తల్లిదండ్రులే నియంత్రణ కోల్పోయి ఏడుస్తూ మాట్లాడిన దృశ్యాలను వివిధ చానల్స్‌లలో చూశాము. కానీ మనమే ధైర్యం కోల్పోతే మన పిల్లలు ఇంకా ఆందోళనలకు గురై మానసిక క్షోభకు దారితీసి, ధైర్యం కోల్పోయి ఇంకేమైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఒక్క విద్యార్థులే గాకుండా సమాజంలో ఎలాంటివారైనా, ఏ సందర్భంలోనైనా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. సమస్యను పలువురితో పంచుకుంటే పరిష్కార మార్గం దొరకవచ్చు.
ప్రభుత్వం సైతం ప్రతి పబ్లిక్ హెల్త్ సెంటర్లలో మానసిక నిపుణులను నియమిస్తే సమాజానికి మేలు చేసినవారవుతారు. త్వరలో రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. మరలా ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా, ఒకటికి పలుమార్లు సరిచూసుకుని, రీవాల్యుయేషన్‌తో పనిలేకుండా చర్యలు తీసుకొని ఫలితాలు విడుదల చేయాలి. సమయం సరిపోకపోతే ఒకటి రెండు రోజులు ఫలితాలను ఆలస్యంగా విడుదలచేసినా ఫర్వాలేదు గానీ లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది.

- డా॥ పోలం సైదులు 94419 30361