మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహా! భగవల్లీలలెంత దురవగాహములు!’అని తలచునప్పుడు పొరలివచ్చు కన్నీటి నాపుకొనజాలకున్నాను.’’
భగవదనుభవము
668. ఒక చీకటిగది కలదు. అందొకడు కలడు. దానిలోనికి ఒక చిన్న రంధ్రముగుండా బైటనుండి సూర్యకిరణములు వచ్చుచున్నవి. ఎన్ని కిరణములు వచ్చునో లోపలనున్న వానికి అంత కాంతి గోచరించునుగదా? ద్వారములయందును కిటికీలయందును సందులు హెచ్చుగానున్న కొలదియు వెలుతురును హెచ్చుగా గోచరించుచుండును.
తలుపులను కిటికీలను తెఱచివైచిన యెడల మఱింత వెలుతురు గాంచును. కాని బహిరంగమైనచోట నిలిచినవానికి అంతయు వెలుతురే! ఇదే విధమున భక్తుడు తనయంతః కరణముయొక్క శక్తిసామర్థ్యములను స్వభావము ననుసరించి భగవదనుభవము నొందుచుండును.
669. జీవుడు పరమాత్ముని సమీపించినకొలదియు అపూర్వములగు నాతని విభూతులను అనంత కల్యాణగుణములను గాంచుచుండును; తుదకు జ్ఞాన పరిపాకమున పరమాత్మయందైక్యమునొందును.
భగవంతుడు సిరిసంపదలను లక్షించునా?
670. తనకు అర్పింపబడు సిరిసంపదలను భగవంతుడు లక్షించునా? లక్షింపడు, లక్షింపడు! తనకెవ్వడు ప్రేమను భక్తిని సమర్పించునో వానియందే భగవానునకు కృపగల్గును. ప్రేమ, భక్తి, వివేకము, వైరాగ్యము- ఇవియే భగవంతుడు లక్షించునవి.
671. శంభుమల్లికుడు ఒకసారి నాతోనిట్లుపల్కెను: ‘‘అయ్యా, నా సంపదనంతయు జగజ్జనని పాదపద్మముల చెంత సమర్పించి మరణించునటులనన్నాశీర్వదింపుడు.’’ అందులకు నేనిట్లంటిని: ‘‘ఏమేమి? ఇది యంతయు నీవు గొప్పసంపదగా నెంచుకొనవచ్చును, కాని నీ సంపద నీవు పాదములతో త్రొక్కు ధూళికంటె అతిశయముగా ఆ జగజ్జననికిగాన్పింపదుసుమీ!’’
672. దక్షిణేశ్వరమున రాణిరాసమణి (కట్టించిన) దేవాలయమున నొకసారి దొంగతనము జరిగినది. విష్ణ్వాలయమందలి విగ్రహములకు అలంకరింపబడిన ఆభరణములన్నియు పోయినవి.(దేవాలయ నిర్వాహకుడును రాణియల్లుడునగు) మథురనాథుడును శ్రీగురుదేవుడును సంగతి సందర్భములను కనుగొనుటకై అచటికి వెడలిరి. మథురుడిట్లు అఱచెను:
‘‘ఓ దేవుడా! నీవు అసమర్థుడవు! నీయాభరణములన్నిటిని దొంగ లెత్తుకొనిపోవ నీవు నివారింపజాలవైతివి!’’అది విని శ్రీగురుదేవుడు మథురనాథునిట్లు గట్టిగా మందలించెను: ‘‘నీవిట్లు పలుకుట ఎంత బుద్ధిహీనత! విగ్రహమున నీవు అర్చించు జగదీశ్వరునకు ఈ నగలన్నియు ఒక మట్టిపెల్లపాటి చేయవు సుమీ! సాక్షాద్భాగ్యదేవతయగు శ్రీ మహాలక్ష్మి తన వైభవమునంతయు ఆ జగదీశ్వరునివలననే పొందుచున్నదని జ్ఞప్తినుంచుకొనుము!’’
పురుష ప్రయత్నము: భగవదనుగ్రహము
673. మనకు ఆహారము సమకూర్చుచున్నాడు కావున భగవంతుడు దయామయుడని చెప్పజాలము. ‘ఆకలి కూడు పెట్టుకొనుట ఊరికి ఉపకారమా?’యనునట్లు బిడ్డలకు అన్నమిడుట తండ్రి విధికాదా? కాని మనలను దుష్ప్రరణలనుండి కాపాడుచు, పెడత్రోవ త్రొక్కకుండ రక్షించుపట్ల భగవంతుడు నిజముగా దయామయుడని చెప్పవలయును.
674. ప్రశ్న: ఎట్టి కర్మములనొనర్చుటచే భగవంతుని బొందనగును?
ఉ.కర్మములలో నేమియులేదు. ‘ఈ కర్మ మొనర్చిన భగవంతుని బొందగలము, ఆ కర్మమొనర్చిన బొందజాలము’అని భావింపరాదు.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి