మెయిన్ ఫీచర్

తెలుగు సాహిత్యం.. స్ర్తి పాత్రల స్వభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యం పుట్టి వెయ్యేళ్ళయింది. వివిధ సాహిత్య ప్రక్రియలయిన కావ్యం, నాటకం, కథ, కవిత మొదలైన వాటితో సాహితీ సృజన కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ ప్రక్రియలోనైనా వౌలికంగా పరిశీలించాల్సింది వస్తువు, రూపం, సంవిధానం, పాత్రలు. ఈ వర్గీకరణలో పాత్రలు ప్రధాన అంగాలు. పాత్రలు అంటే కథను లేదా ప్రక్రియను నడిపించేవారు, కథావస్తువును భరించేవారు, కథాంశాన్ని సూచించేవారు. ప్రస్తుతం మనం అధ్యయనం చేసే విషయం- స్ర్తి పాత్రల స్వభావ పరిణామం.
మనిషి ప్రాథమికంగా ఏకాంతవాసి. అతడు కుటుంబంగా అవతరించి సమూహంగా ప్రయాణించే పరిణామక్రమంలో తననుతాను పరిశీలించుకునేందుకు, చక్కదిద్దుకునేందుకు వివిధ కళారూపాలే అతనికి దగ్గరయినాయి. ఈ కళారూపాలలో అతడికి సన్నిహితంగా మెలిగిన సాహిత్య ప్రక్రియ కథ. ఉదాహరణకు రామాయణ, భారత కథలు. ఈ కథలు పండితులకేకాక అక్షర జ్ఞానం లేనివారికీ చేరువవడానికి కారణం ఆ కథలలోని సార్వజనీనత. అలా మనిషి ఊహకి ప్రతిరూపంగా నిలిచిన కథకు మూలం ఎక్కడ పడింది? తొలుత ఋగ్వేదంలో ఈ కథకు బీజాలను మనం గుర్తించవచ్చు. ఈ కథలో ముఖ్యపాత్ర స్ర్తికావడం విశేషం. ఉదాహరణకు యమయమీ సంవాదం. మాతృస్వామ్య వ్యవస్థనుంచి ఆనాటి సమాజం పితృస్వామ్యం వైపు ప్రయాణించే క్రమంలో యమియొక్క ఆవేదన మాతృస్వామ్య అవశేషాలను సూచిస్తుంది.
ఇక ఇంకో కథ ఊర్వశీ పురూరవుల సంవాదం. ఈ కథ నూటికి నూరుపాళ్ళు పితృస్వామ్య లక్షణాలను వివరించే కథ. ఊర్వశిమీద ప్రేమతో పురూరవుడు తన సైనిక ధర్మాలను మరిచిపోయి ఇంటిదగ్గర ఉండిపోతే అతడిని ఊర్వశి వెళ్ళిపొమ్మంటుంది. భర్తగా తన ధర్మాన్ని నిర్వర్తించమంటుంది. ఈ రెండు కథలలోని స్ర్తిపాత్రల ద్వారా ఆయా కాలాలలోని ధర్మాలను విప్పిచెప్పాయని అర్థం చేసుకోవచ్చును.
ఇక పురాణ యుగంనించి పరమాణుయుగానికి వస్తే తెలుగు సాహిత్యంలో స్ర్తిపాత్రలు ఆనాటి ఉద్యమాల ద్వారా సంభవించిన సామాజిక చారిత్రక సంఘటనల ద్వారా తమ పరిణామగతిని మార్చుకున్నాయని ఆనాటి చరిత్రను పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రచయితలు తమ సాహితీ సృజనకు జీవంపోసారు.
1774వ సంవత్సరంనుంచి 1833దాకా జీవించిన రాజా రామమోహనరాయ్ ఆనాటి సమాజంలో అపశృతులైన సతీసహగమనం. స్ర్తి అవిద్య, బాల్య వివాహాలు వంటి దారుణ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడారు. భారతీయుల జీవితం భాగస్వామ్య వ్యవస్థలోకి మారుతున్న సంధికాలం అది. 1828లో ఆయన బ్రహ్మసమాజం స్థాపించారు. 1870-80లో బ్రహ్మసమాజ సంస్థకు అనుబంధంగా అనేక శాఖలు వెలిశాయి. 1970లో బరంపురం, 1875లో మచిలీపట్నం, 1878లో బాపట్లలో బ్రహ్మసమాజం తన వేళ్ళు మోపింది. 1856లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా హిందూ విధవా వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. 1873లో కేశవ చంద్రసేన్ తీవ్ర ప్రయత్నాల ఫలితంగా సివిల్ మేరేజి చట్టం అమలులోకి వచ్చింది. దీని ద్వారా కులాంతర వివాహాలు, విధవా వివాహాలు జరుపుకునేందుకు పరిస్థితులు అనుకూలించాయి. 1874లో వివాహితుల ఆస్తిహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 1878లో వీరేశలింగం బ్రహ్మసమాజం స్ఫూర్తితో సంఘ సంస్కరణ సమాజం స్థాపించారు. విధవా పునర్వివాహాలు, స్ర్తివిద్య వంటి సంస్కరణలను ఆయన శ్రీకారం చుట్టారు.
వీరేశలింగం రచనా వ్యాసంగం మొదలుపెట్టిన సమయంలో ఆనాటి స్ర్తి పరిస్థితి కడు దుర్భరంగా ఉండేది. స్ర్తి కేవలం ఇంటి చాకిరీకి, పిల్లల్ని కనే యంత్రంగా పరిగణించే అమానుష పరిస్థితులుండేవి. బాల్య వివాహాలు, స్ర్తి చదువును నేరంగా చూసే సంస్కృతి ఆనాడు ఉండేది. వితంతు స్ర్తిలను బానిసలకంటే హీనంగా చూసేవారు. కొన్ని వర్గాల మహిళలను కులం పేరుతో వేశ్యావృత్తిలోకి దిగజార్చారు. ఈ నేపథ్యంలో 1880లో వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’అనే తొలి తెలుగు నవలను రాసారు. వీరేశలింగంలోని సంస్కరణవాది ఆయనలోని రచయితను మించిపోవడంతో ఆయన సృష్టించిన స్ర్తిపాత్రలు ఆయన కోరుకున్న సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చే సాధనంగా మాత్రమే నిలిచిపోయాయి. అయితే ఆనాటి సమాజ భయానక స్థితిని విప్పి చెపుతాయి. సంఘాన్ని సంస్కరించేందుకు సాహిత్య ప్రక్రియల్ని వినియోగించడం ఎలాగో ఆయన తదనంతరం వచ్చిన సాహితీవేత్తలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
వీరేశలింగం పుట్టిన పధ్నాలుగేళ్ళకు తెలుగు కథా పితామహుడు గురజాడ అప్పారావు 1862లో జన్మించారు. 1892కల్లా కన్యాశుల్కం మొదటిసారిగా నాటకంగా ప్రదర్శించబడి 1897లో ప్రచురణలోకి వచ్చింది. మన కాలంకంటే గురజాడ తన కాలంకంటే, ఒక ప్రవక్తలా, దార్శనికుడిలా ముందుండడానికి కారణం ఆయనకున్న విశిష్ట వినూత్న దృక్పథం.
ఆయన కాలానికే పారిశ్రామిక నాగరికత వికసించింది. అది అనుకూల పరిస్థితుల్ని కల్పించకపోవడంతో మన యువతలో నిరుద్యోగ సమస్యకు తద్వారా అశాంతి, నిరాశ నిస్పృహలకు దారితీసింది.
స్వాతంత్య్ర ఉద్యమం గురించి అనేకమంది స్వచ్ఛందంగా పోరాడుతున్న రోజులవి. తంతి తపాల వ్యవస్థ, విద్యుద్దీపాలు, రైళ్ళు, ట్రాములు, చలనచిత్రాలు ఇలా భారతదేశంలో ఆధునికతవైపు అడుగులు పడుతున్న సమయం. సాంప్రదాయ విద్యలో భుక్తిదొరకదని యువత సాంకేతిక వృత్తి విద్యల వైపు ఇంగ్లీషు చదువులవైపు మొగ్గుచూపుతున్న రోజులు. ఈ నేపథ్యంలో గురజాడ విద్యయొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు. మరీ ముఖ్యంగా స్ర్తిలయొక్క విద్యావశ్యకత గురించి ఆయన తపనపడ్డారు. సాహిత్య విమర్శకుల ప్రకారం ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా అత్యధికంగా 108 స్ర్తిపాత్రలను సృష్టించారు. అవన్నీ మామూలు పాత్రలుకాదు ఆనాటి సమాజపు వికృతరూపాన్ని విప్పిచెప్పేవి, కొన్ని పాత్రలు క్రోధాగ్నితో రగిలేవి. కొన్ని పాత్రలు శక్తియుక్తులతో మెలిగేవి. గురజాడ సృష్టించిన స్ర్తి పాత్రలు సంప్రదాయబద్ధంగా నాయిక లక్షణాలు కలిగిఉండవు. ఆయన వేశ్యల్ని, విధవలను, సమాజ నిర్వేతుక దృష్టికి నిరపేక్షకు గురయిన పాత్రలను సృష్టించాడు. అవి నేటికీ అజరామరంగా నిలిచి ఉండే పాత్రలు. గురజాడ పుట్టిన పనె్నండు సంవత్సరాల తర్వాత అంటే 1874లో బండారు అచ్చమాంబగారు పుట్టారు. ఈమె తొలి తెలుగు కథకురాలు. స్ర్తిల కోసం నూరేళ్ళక్రితమే స్ర్తివాద కథలు రాసిన స్ర్తిమూర్తి. ఈమె 1901లో అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథం రాసారు. దానిలో ఖన అనే జ్యోతిష్యురాలి కథ ద్వారా చదువు, తదితర విషయాలలో బాలబాలికల మధ్య వివక్ష ఉండకూడదనే విషయాన్ని బలంగా చెప్పారు. బండారు అచ్చమాంబ వ్రాసిన మరో కథ ధన త్రయోదశిలోని ఇల్లాలి పాత్ర. ఉన్నంతలో సంతోషంగా బ్రతికే పాత్ర. మనిషికి డబ్బుకాదు కావలసింది నీతి అంటూ భర్తను సక్రమమార్గంలో పెట్టే ఇల్లాలి పాత్ర. స్ర్తి వ్యక్తిత్వంలేని ప్రాణిగా, పనిచేసే యంత్రంగా పిల్లల్ని కనే సాధనంగా భావించబడుతున్న అమానుష పరిస్థితుల్లో మగవాడి బారినుంచి, సమాజం నించి స్ర్తివిముక్తికోసం చలం కలాన్ని ఖడ్గంగా ఝుళిపించారు. స్ర్తికి స్వాతంత్య్రం, ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చలం నొక్కివక్కాణించాడు. చలానికి ముందు గురజాడ, శ్రీపాద సుబ్రమణ్యశాస్ర్తీ స్ర్తిల గురించి సంస్కరణవాదం దిశగా తమ రచనలను కొనసాగించారు. వారిద్దరూ స్ర్తి, పురుష సంబంధాల మూలాలలోనికి వెళ్ళలేదు. చలం మాత్రం నీతి పేరుతో, పాతివ్రత్యం పేరుతో వివాహధర్మం పేరుతో కలిగే పీడనను, ఆత్మవంచనను తన రచనల ద్వారా వ్యతిరేకించాడు. తెలుగు కథ పుట్టిన 1910లో పుట్టిన గోపిచంద్ చలం అభిమానిగా తన సాహితీ రచనను ప్రారంభించి హిందూ పాతివ్రత్యం, పతివ్రత అంతరంగికం వంటి రచనల తర్వాత ఆయన చలం ప్రభావంనుంచి బైటపడి స్వేచ్ఛా వర్తనులైన స్ర్తిపాత్రలతో రచనలు చేసారు. ఆయన సృష్టించిన స్ర్తిపాత్రలు ఉషారాణి, కోటేశ్వరమ్మ జీవితంమీద అధికారం సంపాదించిన మహిళామణులు. ఈ విధంగా సాహిత్యంలో స్ర్తి చలం రోమంటిసిజం నుంచి గోపిచంద్ ఎగ్జిస్టెన్సలిజమ్‌కు పరిణామక్రమంలో ఎదిగింది.
***
గురజాడ అప్పారావునుంచి కొడవటిగంటి కుటుంబరావు వరకూ, హిందూ సమాజంలో స్ర్తికి కలుగుతున్న దుర అన్యాయాల గురించి చైతన్యవంతమైన రచనలు చేసారు. చలం దగ్గరకు వచ్చేసరికి స్ర్తి తిరుగుబాటు చేయాల్సిందే. తప్పదు అన్నాడు. అయితే స్ర్తి సమస్యలను చారిత్రక, సామాజిక నేపథ్యంలో కథాసాహిత్యంలోకి తీసుకురావడం రంగనాయికమ్మతో మొదలయింది. ఒక సహేతుకమైన ఆర్థిక సామాజిక పరిష్కారంతో స్ర్తి సమస్యలను అనుసంధించాల్సిన ప్రాముఖ్యతను ఆమె గుర్తించారు.
***
మహా రచయితలు రాసిన కథల్లోని పాత్రలు మళ్ళీ కాలగతిలో వేరే రూపంలోకి వ్యక్తిత్వంతోటి పరిణామం చెందడం తెలుగు సాహిత్యంలో వచ్చిన విశేషం. ఒక బాల వితంతువు దిక్కులేని స్ర్తి గలగలమని ప్రవహిస్తున్న గంగ ఒడ్డున నిలబడి ఆక్రోశిస్తుంది, స్వంత మరిది దగా చేస్తాడు. తోబుట్టువు అసహ్యించుకుంటుంది. సమాజం విషం చిమ్ముతుంది. అర్థం చేసుకునే నాధుడు లేడు. ‘‘నువ్వయినా నన్ను అక్కున చేర్చుకోమ్మా’’ అంటూ కృష్ణలో కలిసిపోతుంది. ఆమె మల్లాది రామకృష్ణశాస్ర్తీగారి సర్వమంగళ. ఆయన అరవై నాలుగేళ్లక్రితం ఈ కథ రాసారు. అయినా ఈమధ్యనే మనం న్యూస్‌పేపర్లో చదివినట్టుగా, టివి వార్తల్లో చూసినట్టుగా అనిపిస్తుంది. శతాబ్దాలు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే వేసినచోటే వేసినట్టుగా, స్ర్తిల తలరాతలు మారలేదు దేవుడా! అనాలనిపిస్తుంది. తిరిగి 1986లో సర్వమంగళ మళ్ళీ పుట్టింది. సృష్టికర్త వాడ్రేవు చిన వీరభద్రుడు ఈయన రాసిన అరణ్యం నవలలో నాయిక సర్వమంగళ. మల్లాదివారి సర్వమంగళకు, చిన వీరభద్రుడిగారి సర్వమంగళకు ఏ పోలికలూ లేవు. కాని ఈ సర్వమంగళ చలం సాహిత్యంలోని చాలామంది నాయికలు వ్యక్తిత్వాలను తనలో కలుపుకుని పుట్టినట్టుగా అనిపిస్తుంది.
***
గడిచిన రెండు దశాబ్దాల కాలంలో స్ర్తిలు సాంకేతికంగా విద్యాపరంగా పురుషులకు ధీటుగా అన్ని రంగాలలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. అనేక ఉద్యమాలు నడుపుతున్నా, హక్కులు, అవకాశాలు వస్తున్నా స్ర్తిలపై జరుగుతున్న దాడులు, వరకట్న మరణాలు అత్యాచారాలు వంటి దమనకాండనుంచి స్ర్తికి విముక్తి దొరకడం లేదు. భూస్వామ్య సంస్కృతి స్ర్తిని వంటింటి కుందేలుగా మారిస్తే, వ్యాపార సంస్కృతి వారిని విఫణి వీధిలో ముడిసరుకును చేసాయి. ప్రచార, ప్రసార సాధనాలకు స్ర్తి శరీరం ఒక అంగడి వస్తువు అయిపోయింది. విద్యాధికురాలైనా, ఉన్నత ఉద్యోగాల్లోఉన్నా తమ ఇంటి పని మొత్తం ఆమె భుజాలమీద మోయక తప్పడంలేదు. వీటన్నిటికీ పితృస్వామ్య భావజాలమే మూలకారణం అనే విషయాన్ని కొందరు స్ర్తివాద రచయితలు గుర్తించారు. స్ర్తిని కేంద్రంగా చేసుకుని విస్తరిస్తున్న మిధ్యాభావాలను పటాపంచలుచేస్తూ స్ర్తివాద సాహిత్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో స్ర్తి పాత్రలను బలమైన వ్యక్తిత్వం ఉన్న సబలలుగా ఉన్నతీకరిస్తూ రచనలు చేస్తున్నవారు వోల్గా, సత్యవతి, కుప్పిలి పద్మ, అబ్బూరి ఛాయాదేవి, కరుణ, సామాన్య, మల్లేశ్వరి మొదలైనవారు.
గురజాడ తొలి కథ 1910లో రాసారు. దిద్దుబాటులో కమలిని సౌమ్యంగా తన భర్తను సహనంతో చక్కదిద్దుతుంది- వంద సంవత్సరాల తర్వాత అలాంటి స్ర్తిపాత్ర తాయమ్మగా పరిణామం చెందింది, ఔను అలాగే జరగాలి- స్ర్తిపాత్రలు పౌరుషంతో మెలగాలి, అమృతం చూపించిన వారే అగ్నిశిఖలుగా మారాలి అదే నిజం.
నేరస్తుల్ని ఉరితీయడంకాదు. నేర వృత్తినే పాతిపెట్టాలనే దశగా ఆందోళన సాగాలి. ఆ దిశగా మన రచనలు సాగాలి. మహిళలపై అరాచకం చేసే ప్రతీ మృగాడు ఒక తల్లికి బిడ్డే- ఉగ్గుపాలతో పిల్లలకు నైతికత బోధించేలా రచనలు సాగాలి, పాత్రలను మలచాలి.

- డా. ఎమ్. సుగుణరావు, 9393129945