మెయన్ ఫీచర్

హస్తినలో చక్రం తిప్పే నేతలెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రజలకు తమ నేతల గురించి తక్కువగా మాట్లాడడం మొదటి నుంచి అలవాటు. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు, బెంగాలీల కంటే ఘనమైన చరిత్ర, సంస్కృతి మనకు ఉన్నా- తెలుగు రాష్ట్రాల ప్రజలు పొరుగింటి పుల్లకూరకే ఎక్కువగా ఆశపడుతుంటారు. ఏడు విడతల పోలింగ్ ముగిశాక, ఈ నెల 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి దేశ రాజకీయాల్లో తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ఏ నాయకుడికైనా ఒక లక్ష్యం, ఉన్నతస్థాయికి చేరుకోవాలనుకునే పట్టుదల ఉండాలి. రాజకీయాల్లో ఎదిగి, జాతీయస్థాయి పదవులు రావాలంటే ఆకాంక్ష ఉండాలి.
కేసీఆర్ కేరళ వెళ్లి సీపీఎం సీనియర్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి, రాజకీయాలు ముచ్చటించారు. తిరువనంతపురంలో అనంతపద్మనాభ స్వామిని సందర్శించుకున్నారు. తమిళనాడు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ ముగిశాక, మధుర మీనాక్షిని, రామేశ్వరం దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇద్దరు రాజకీయనేతలు కలుసుకుంటే రాజకీయాలే మాట్లాడతారు. కేసీఆర్ గతంలో ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. ‘ఫెడరల్ ఫ్రంట్’ గురించి చర్చలు జరిపారు.
తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇందులో కనీసం 10 నుంచి 14 సీట్లు తెచ్చుకుంటే కేసీఆర్‌కు దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. భాజపా సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మెజార్టీకి అవసరమైన 272 సీట్లు కంటే 30 నుంచి 40 సీట్లు తక్కువ వస్తే- కేసీఆర్ ఊరికే ఉంటారా? ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి తప్పనిసరిగా ఎత్తుగడలు వే స్తారు. ఇప్పటికే ఆంధ్రాలో వైకాపా అధ్యక్షుడు జగన్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వైకాపాకు 20కి మించి సీట్లు వస్తాయని కొందరి అంచనా. ఇదే నిజమైతే టీఆర్‌ఎస్, వైకాపాలకు కలిపి 32 నుంచి 35 సీట్లు వస్తాయి. బీజేపీకి ఆ మాత్రం సీట్లు అవసరమైతే, తప్పనిసరిగా రాజకీయ సమీకరణలు మారుతాయి. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. నిరంతరం గంగానదిలా ప్రవహిస్తుంటాయి.
28 ఏళ్ల క్రితం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును సైతం తెలుగు ప్రజలే తక్కువగా అంచనా వేశారు. 1971లో ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు పనిచేసినప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో బలమైన సామాజికవర్గం నేతలందరూ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి ఆయనను గద్దె దించేదాకా నిద్రపోలేదు. ఆ తర్వాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పిలుపుమేరకు జాతీయ రాజకీయాల్లో చేరి, కేంద్రమంత్రివర్గంలో పలు పదవులను అధిరోహించి పీవీ తెలుగు జాతి ప్రతిభను చాటారు. 1991లో రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణంతో ప్రధాని పదవి పీవీని వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికే హైదరాబాద్‌కు వచ్చేసి ఆయన రచనా వ్యాసాంగం చేపట్టాలని, సాహిత్య సేవను ప్రారంభించాలనుకున్నారు. విధి విచిత్రమైంది. అనుకోని పరిణామాల మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశం దిశదశలను మార్చివేశారు. పీవీ తీసుకున్న కఠోర ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక పునాదులపైనే భారత్ ఈరోజు నడుస్తోంది. ప్రధానిగా ఐదేళ్ల పాటు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన గొప్ప రాజకీయ దురంధరుడు పీవీ నరసింహారావును తెలుగు రాష్ట్రాలు సముచితంగా గౌరవించలేదు. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికీ ఆర్థిక నిపుణులు పీవీని పొగుడుతుంటారు. ఆయన ప్రధాని అవుతారని ఎవరైనా ఊహించారా?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరిని తక్కువగా అంచనా వేసినా ఆ తర్వాత నాలుక కరచుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ సొంతంగా నిలదొక్కుకుంటుందా? అనే అపోహలను పటాపంచలు చేసి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కేసీఆర్‌ను పరిణతి చెందిన నేత అని మెచ్చుకున్నారు. కాలం కలిసి వస్తే కేసీఆర్ కేంద్రంలో కీలక పదవులను చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్న నేత. బీజేపీ రహిత, కాంగ్రెసేతర కూటమితో కేంద్రంలో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు జాతీయ పార్టీల మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరనేది వాస్తవం. మే 23న మూడు పరిణామాలు ఏర్పడవచ్చు. ఒకటి- బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సొంతంగా మెజార్టీ రావచ్చు. రెండు- ఎన్డీఏ కూటమికి 40 సీట్లు తక్కువగా 240 వరకు వచ్చి ఆగిపోవచ్చు. మూడు- ఎన్డీఏ కూటమి చిత్తుగా ఓడిపోయి 200 కంటే తక్కువ సీట్లతో సరిపెట్టుకోవచ్చు. అప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసేందుకు ముందుకు రాదు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భాజపా ముందుకు రాని పక్షంలో మిగతా పార్టీలు కూటమిగా ఏర్పడవచ్చు. ఎన్డీఏకి 180 సీట్లు వచ్చాయంటే, కాంగ్రెస్‌కు వందసీట్లు దాటినట్లే. అదే జరిగితే బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందా? కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తానంటే బీఎస్పీ, ఎస్పీ, టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వైకాపా, ఆర్జేడీ, ఎన్సీపీ, బీజేడీ, జేడీఎస్, జేడీయూ, వామపక్ష పార్టీలు ఒక వేదికపైకి వచ్చేందుకు చొరవ తీసుకునే నాయకుడు కావాలి. టీడీపీకి కూడా ఎక్కువ సీట్లు వస్తే చంద్రబాబు కచ్చితంగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ, చంద్రబాబు కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండడాన్ని మాయావతి, అఖిలేశ్, మమతా బెనర్జీ, వామపక్ష పార్టీలు సహించడం లేదు. అపుడు కాంగ్రెస్ రహిత , బీజేపీయేత ర పార్టీలతో కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు డిమాండ్ పెరుగుతుంది.
కేసీఆర్‌కు రాజకీయంగా అనుకూల అంశాలు చాలా ఉన్నాయి. ఆయన మరో నాలుగున్నరేళ్ల పాటు అధికారంలో ఉంటారు. జాతీయస్థాయి నేతలను హైదరాబాద్‌కు రప్పించి ఒక కూటమిని ఏర్పాటు చేసే సత్తా, ఆర్థిక వనరులు ఉన్నాయి. అన్నింటికంటే మించి హిందీ భా షలో అనర్గళంగా మాట్లాడే చాతుర్యం కేసీఆర్‌కు ఉండడం ప్లస్ పాయింట్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గట్టెక్కితే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. ఒక వేళ ఓటమి ఎదురైన పక్షంలో ఆయన తన రాష్ట్రానికే పరితమం కాకతప్పదు. కేసీఆర్‌కు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మే 23వ తేదీ తర్వాత తలెత్తే పరిణామాల్లో కేసీఆర్‌కు ఉండే అనుకూల పరిస్థితులు చంద్రబాబుకు లేవు. చంద్రబాబుకు మే 23వ తేదీ చాలా ప్రధానమైన రోజు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఒక తీరు, అందుకు భిన్నమైన ఫలితాలు వస్తే మరొక రకంగా ఆయన రాజకీయం చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు చివరి దాకా పోరాడే అరుదైన రాజకీయ నేత. కేంద్రంలో హంగ్ వస్తే, తగినన్ని సీట్లు తన చేతిలో ఉంటే తనకు అనుకూలంగా పరిస్థితులను తిప్పుకోవడంలో ఆయన దిట్ట.
ఎన్డీఏకు 40 సీట్లు తక్కువ పడితే, స్పష్టమైన డిమాండ్లతో వైకాపాతో కలిసి బీజేపీ కూటమిలో టీఆర్‌ఎస్ చేరదనే గ్యారంటీ లేదు. ఆ అవకాశాన్ని తెరాస వదులుకుంటే, బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు డీఎంకే, బీఎస్పీ, బీజేడీ మొ గ్గు చూపే పరిస్థితి రావచ్చు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాను ఇస్తామని ప్రకటిస్తే వైకాపా కచ్చితంగా బీజేపీ కూటమికి మద్దతు ఇస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడూ అంటరాని వారుండరు. అధికారాన్ని పంచుకోవడంలో అన్ని రాజకీయ పార్టీల తీరు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం పార్టీల పేర్లు మాత్రమే వేరు. అన్ని రాజకీయ పార్టీల సిలబస్ ఒకటే. సిద్ధాంతాలపై రాద్థాంతం చేసే వామపక్ష పార్టీలకు ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే. రామజన్మభూమి అంశాన్ని ప్రధాని మోదీ చాకచక్యంగా పక్కన పెట్టిన సంగతి ఎవరికి తెలియదు. బీజేపీతో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఈ రెండిటితో బీజేపీ కలవదు. మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌తో కలవకుండా ఉండే పరిస్థితులు ఏమీ లేవు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా అధినేత జగ న్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలుగు ప్రజలు తక్కువగా అంచనా వేయడం, వీరికి దేశ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందా? అని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. కాలం కలిసి వస్తే కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో కేసీఆర్, జగన్, చంద్రబాబు సూత్రధారులు కావచ్చు. రాజకీయాలను కేవలం రాష్ట్రప్రయోజనాలు, దేశహితం గురించి మాత్రమే చేయరు. సొంత అజెండాలు లేకుండా, స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఏ రాజకీయ నాయకుడు నిర్ణయాలు తీసుకోడు. దేశ ప్రయోజనాలు, సుస్థిర ప్రభుత్వం, రాష్టహ్రితం పేరుతో ఒక ప్రకటన చేసి, ఎన్డీఏకో- యూపీఏకో షరతుల వారీగా లేదా బేషరతుగా సహకరించక తప్పదు. తమిళ పార్టీలు తమలో తాము ఎంత గొడవ పడినా రాష్ట్ర ప్రయోజనాలు వచ్చే సరికి అంతా ఒకటే. ఇదే తరహా సమష్టి భావన బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటకల్లో చూడవచ్చు. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, తెలుగు రాష్ట్రాల నేతలు ఢిల్లీలో చక్రం తిప్పాలని జనం ఆశించడంలో తప్పులేదు. కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు పాతరేసి, పదవుల కోసం తమ ఆశలను తాకట్టుపెట్టే పరిస్థితి వస్తే ప్రజలు గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో ఎటూ వాత పెడతారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మన నేతలు తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో చాటాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097