ఎడిట్ పేజీ

ప్రధాని పీఠం దక్కేదెవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సార్వత్రిక సమరం ముగిశాక- 130 కోట్ల మంది ప్రజలను పాలించేదెవరు? ఈ ఏడాది ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వనె్నల జెండా ఎగరేసే నేత ఎవరు? లోక్‌సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకోవడంతో ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ దఫా ఎన్నికలకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో పేరుమోసిన నేతలు చాలామంది తమ వారసులను ముందుపెట్టి బరినుండి తప్పుకోవడం ఒకటైతే, 20 ఏళ్ళ తరువాత బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు కలగడం మరొకటి.
నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల తరువాత ఇప్పుడు అటువంటి కొత్త కూటమి మీదే అంచనాలు పెరుగుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల నుండి కొత్త సంకీర్ణ ప్రభుత్వాల ఆలోచన మొదలవడం దేశంలో కొత్త శకమే. దేశం స్వతంత్రం సాధించిన తొలి నాళ్లలో కేవలం జాతీయవాదం అనే అంశమే ఎన్నికల ప్రచార అంశమయ్యి అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే మనగలిగే అవకాశం ఉండేది. ఆ తరువాత రోజుల్లో ప్రత్యామ్నాయ వేదికలు, సోషలిస్టు రాజకీయ వేదికలు, బహుజన రాజకీయ వేదికలు, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. దానితో జాతీయ పార్టీల ప్రభ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అప్పుడే సంకీర్ణ ప్రభుత్వాలు దేశ రాజకీయాల్లో మొదలయ్యాయి. అలా ఏర్పడ్డ జనతా ప్రభుత్వం, (1977-79) నేషనల్ ఫ్రంట్ (1989-91), యునైటెడ్ ఫ్రంట్ (1996-98) వంటి సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి కాలం పాలన సాగించలేకపోయాయి. గత సంకీర్ణాల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని 1999 నుండి ఎన్డీయే, యూపీఏ పేర్లతో వివిధ పార్టీలు కూటములుగా ఏర్పడి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
దేశ రాజకీయాలలో వస్తున్న మార్పులు గమనిస్తే పాఠశాల స్థాయిలో భారతదేశం గురించి బోధిస్తున్న ‘‘్భన్నత్వంలో ఏకత్వం’’ అనే అంశం పూర్తిగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, వారి విధానాలకు స్పష్టంగా సరిపోతుంది. ఈ సందర్భంగా భిన్నత్వం అంటే వివిధ పార్టీలు, ఏకత్వం అంటే ప్రధాని పదవి అని భావించాలి. భారతదేశాన్ని ఇప్పటివరకు పాలించిన వారిని మూడే మూడు రకాలుగా విభజించొచ్చు. ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ, మూడు ప్రాంతీయ పార్టీల సంకీర్ణం. తదనంతరం జరుగుతున్న పాలనలో ప్రాంతీయ పార్టీలు తమతమ అనుకూల విధానాలు అవలంబించే జాతీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయాయి. ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టిన రాష్ట్రాల్లో జరిగిన పాలనాపరమైన అవకతవకలపై చర్యలనుండి బయటపడటానికి జాతీయ పార్టీలకు బేషరతు మద్దతు కూడా ఇస్తున్నాయి.
గతంలో ఏకంగా ప్రభుత్వాలే ఏర్పరచిన ప్రాంతీయ పార్టీలు, క్రమేపీ నిర్ణయాత్మక శక్తులుగా అవతరించక పోవడానికి ఇది కూడా ఒక కారణం. భారతదేశ ప్రధాని పదవిని, దేశంలోని రాష్ట్రాల అధికారాన్ని గాంధీ- నెహ్రూ కుటుంబ సొంత ఆస్తిగా భావించే రోజుల నుండి ప్రత్యామ్నాయ వేదికల పేరున ద్విపార్టీ విధానం వైపు మొగ్గిన ప్రజలు, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కూడా శక్తినిచ్చారు, ఇప్పటికీ ఇస్తున్నారు. దానిని అధికారంగా మలుచుకోవలసిన బాధ్యత దేశంలో ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారిదే.
ఇందిరాగాంధీ తరువాత అంత బలమైన ప్రధానిగా చెప్పబడుతున్న నరేంద్ర మోదీ ప్రభ నానాటికీ తగ్గిపోతుందనేది విశ్వసించదగిన వాస్తవం. 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారేమో అన్నంత ప్రభంజనంగా సాగిన బీజేపీ విజయదుందుభి మొగిస్తుందనే సంకేతాలేవీ ఇపుడు ఎక్కడా కనబడటం లేదు. ఉత్తరాదిన అత్యధిక సీట్లను సాధించిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్‌లలో మోదీ ఆకర్షణకు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇక దక్షిణాదిలో సంగతి సరేసరి. మోదీ ప్రభంజనం అత్యధిక రాష్ట్రాలలో కూడా సాగుతున్న తరుణంలో అత్యంత బలహీనుడిగా కనిపించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత రెండేళ్లుగా ఊహించని విధంగా తిరుగులేని నాయకుడిగా మారారు.
2004 నుండి 2017 దాకా రాహుల్ వేరు. 2017 నుండి రాహుల్ వేరు. రాహుల్ మోదీకి దీటైన ప్రత్యర్థిగా తయారైనప్పటికీ అధికారానికి కావాల్సిన సంఖ్యను కాంగ్రెస్ సాధిస్తుందా? అనేది ప్రశ్న. బీజేపీని గద్దె దించడానికి ఇటీవల ప్రధాని పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధం అంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమితో కలిసి కొత్త అభ్యర్థికి మద్దతు పలికే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గనుక- ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్నికల అంకం చివరికి రావడంతో ఇప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరు? అని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేంద్రంలో ఒకప్పుడు భాగస్వాములు అయిన వాళ్ళు, దేశానికి ప్రధాని కావాలని ఆశపడుతున్న నేతల జాబితా పెద్దదే. దక్షిణాదిలో మాజీ ప్రధాని దేవెగౌడ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఈ జాబితాలో ఉంటే, ఉత్తరాదిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ములాయంసింగ్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ జాబితాలో దేవెగౌడ పూర్తిగా రాజకీయాల నుండి దూరం అవుతుండగా చంద్రబాబు ప్రధాని పదవిపై ఆసక్తిలేదని చెబుతూ వస్తున్నారు. ములాయం కూడా అంత చురుకుగా లేరు. కేజ్రీవాల్ మీద అంచనాలు చెల్లాచెదురయ్యాయి. నితీష్ ఎన్డీయే భాగస్వామి కావడంతో ఆయన మోదీకే ఓటు వెయ్యాలి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూడ కూటమిలో ఎవరో ఒకరి పేరు చెబుతున్నారు, కానీ తన పేరు మాత్రం చెప్పడం లేదు.
ఇక మిగిలింది మాయావతి, మమతా బెనర్జీ. దేశంలో ప్రధాని అయ్యే అవకాశం ఉన్న మహిళా నేతలుగా గత కొంతకాలం వరకు ముగ్గురి పేర్లు వినిపించేవి. వారు మాయావతి, మమతాబెనర్జీ, జయలలిత. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవిపై ఆశ పెంచుకొన్న జయలలిత, మమతా భారీ స్థాయిలో సీట్లు సాధించారు. కానీ మోదీ సునామీలో అవేమీ నిలవలేదు. కాలక్రమంలో జయలలిత చనిపోయారు. ఇక పోటీ మాయావతి, మమతాల మధ్యే.
2014 ఎన్నికల్లో ఒక్క సీటు గెల్చుకోని మాయావతి ఇప్పుడు ఏకంగా ప్రధాని పదవికి తొలి పోటీదారు అయ్యారంటే రాజకీయ వ్యూహాల్లో ఆమె రాటుదేలిన వనితే అని చెప్పాలి. 2014 లోక్‌సభ, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత అసలైన లోపం గమనించిన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని విజయం సాధించాయి. అదే ప్రణాళిక ఇప్పుడు అమలుచేస్తూ మినీ ఇండియాగా భావించే ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మోదీతో ఢీ అంటే ఢీ అంటున్న మమత కూడా ప్రధాని అభ్యర్థిగా తెరమీదకొస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించే కమ్యూనిస్టులు బెంగాల్‌లో ఉన్న వైరం మేర ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచకపోవచ్చు. కానీ అదే వామపక్షాలు మాయావతి అభ్యర్థిత్వాన్ని సమర్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. బీహార్‌లో కూడా లాలూ పార్టీ నుండి బెహెన్‌జీకి మద్దతు లభిస్తుంది. ఉత్తరాదిలో ఒక్క ఉత్తర్‌ప్రదేశ్ నుడే కాక బీఎస్పీ ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుంది.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా మాయావతి కోసం ఒక అడుగు వెనక్కి వేయడానికి సిద్ధం అని, తమ ప్రధాని అభ్యర్థి ఆమేనని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇన్ని సానుకూల అంశాల మధ్య మాయావతికి విజయమే లభించవచ్చు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి రావాలి అని వక్కాణిస్తున్న కేసీఆర్ వైఖరి, మంచి ఫలితాలు సాధిస్తారనే అంచనాలు వెలువడుతున్న జగన్ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.
సోనియా గాంధీ ఇటీవల కేసీఆర్, జగన్‌లకు మద్దతు సం లేఖలు రాసారు అనేది నడుస్తున్న చరిత్ర. ఇదే నిజమైతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరనే నానుడి మరలా ప్రచారంలోకి వస్తుంది. ఒకనాటి కాంగ్రెస్ సభ్యులైన పవార్, మమత అధికారం తమకే దక్కాలి అనుకుంటారు కానీ మరలా కాంగ్రెస్‌కే ఇస్తారా? అనేది అనుమానమే.
ఇన్ని అంచనాల మధ్య కొద్దిరోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఒక కూటమిగా ఇంకా ఏర్పడని ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు భావసారూప్యం ఉన్న జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురాగలిగితే బహుశా ప్రధాని అభ్యర్థి నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మోదీ, రాహుల్, మాయావతి వీరు ముగ్గురే ప్రధాని అభ్యర్థులుగా చర్చించబడుతున్నారు. ప్రాంతీయ పార్టీల మీద ఆధిపత్యం చెలాయించి దేశం మొత్తం పాగా వేయాలనుకున్న బీజేపీ, ఏ ప్రత్యామ్నాయమూ లేనప్పుడు నిరాటంకంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ను మినహాయించి ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చూపే అవకాశం నేడు రానే వచ్చింది.
అయితే గత పాతికేళ్ళనుండి సంకీర్ణ సంద్రం అయిపోయిన భారతదేశ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలు వేరు వేరు కూటములుగా ఏర్పాటుచేసి ప్రధాని పదవి మరొకరి చేతికి అందకుండా చేస్తున్న నేపథ్యంలో ఆ పదవికోసం పట్టుబట్టాల్సిన అవసరం ప్రాంతీయ పార్టీలకు ఎంతైనా ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఏకైక నేత ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అని ఎవరికైనా అనిపించక మానదు. దళిత వర్గాల నుండి మాయావతి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పీవీ నరసింహారావు ‘ప్రజాస్వామ్య అద్భుతం’గా అభివర్ణించారు. ఇప్పుడు ఆమె ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామ్య అద్భుతమే కాదు, పెచ్చుమీరుతున్న మూకస్వామ్యాల అణచివేతకు ప్రజాస్వామ్య అవసరం కూడా. ఈ దేశం సమాఖ్య వ్యవస్థ, ఇందులో అందరి భాగస్వామ్యం ఉంది. అందుకే ఏకపక్షంగా ఒకటి, రెండు పార్టీలకు, కులాలకు అధికారం అందించే రోజుల నుండి అధికారంలో అన్ని కులాలు భాగస్వాములయ్యే సంకీర్ణ ప్రభుత్వాల శకం వైపు నడిచింది ఈ ప్రజాస్వామ్యం. అందుకే భారతదేశ కేంద్రం సంకీర్ణాల సంద్రం. ఈ విషయం బాగా అర్థం చేసుకున్నారు కనుకే బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఈ దేశాన్ని పాలించడమే మా అంతిమ లక్ష్యం, రాజకీయాలే మా వృత్తి అన్నారు. అన్ని అంశాలు అనుకూలించి మాయావతి ప్రధాని కాగలిగితే ఈ దేశంలో దళితులు అగ్ర వర్ణాలే కాదు, దళితులు దళితుల మధ్య ఉన్న అసమానతల రూపు మాపడానికి జనాభా దామాషా ప్రకారం దళితులు కోరుతున్న వర్గీకరణ అంశంమీద కూడా ఆమె దృష్టి పెట్టాలి. లేకుంటే మహాత్ములు వచ్చారు పోయారు దళితులు అలాగే ఉన్నారు అనే మాటలే మిగిలిపోతాయి.
ఏది ఏమైనా ఈనెల 23 ఫలితాల తరువాత ఈ దేశానికి కొత్త ప్రధాని అదీ బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలనుండి రానున్నారా? అనేది తేలనుంది. మత తత్వాన్ని, వారసత్వాన్ని కాదు. భిన్నత్వంలో ఏకత్వానే్న కోరుదాం. ఏకపక్ష అధికార వేదికలు అంతరించాలని జనం ఆశిస్తే మార్పు తథ్యం.

- పచ్చల రాజేష్ 83318 23086