మెయన్ ఫీచర్

వ్యక్తిపూజతో ప్రజాస్వామ్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యానికి నేడే పండగ రోజు. 17వ లోక్‌సభలో నాయకత్వం వహించేందుకు ఏ పార్టీని గెలిపించాలన్న విషయమై జనం ఇచ్చే తీర్పు బహిర్గతమయ్యే రోజు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసేలా ఎన్నికల ప్రక్రియను ‘ఎలక్షన్ కమిషన్’ నిర్వహిస్తోంది. కానీ, నేడు రాజకీయ పార్టీలు వ్యక్తిస్వామ్య వ్యవస్థకు చిరునామాగా మారాయి. దేశ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధాన పెరిగింది. ఈ సంస్కృతి అన్ని పార్టీలకూ పాకింది. వ్యక్తి స్వామ్య విధానాల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు పొంచి ఉంది. ప్రాంతీయ, జాతీయ పార్టీలు అనే తేడా లేకుండా రాజకీయ నాయకులంతా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేశారు. దీనికి వామపక్ష పార్టీలు అతీతమేమీ కాదు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి, విపక్ష పార్టీలకు మధ్య అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగాయి. 2014 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చిన భాజపాలో వ్యక్తిస్వామ్య విధానాలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్య వాదులకు ఆందోళన కలిగిస్తోంది. మోదీ లేకుంటే భాజపా లేదనే విధంగా ఆ పార్టీని తయారు చేశారు. ‘్భజపా జిందాబాద్’ అనే నినాదానికి బదులు ‘మోదీ జిందాబాద్’ నినాదం మార్మోగింది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ హయాంలో బీజేపీ క్రమేపీ పుంజుకుంది. కానీ వ్యక్తి ఆరాధాన ఉండేది కాదు. సిద్ధాంత నిబద్ధత ఉండేది. జాతీయ పార్టీగా దేశంలో అన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి భాజపా విజయ బావుటా ఎగురవేయడం, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీగా అవతరించడం ప్రజాస్వామ్య పరిపుష్టికి నిదర్శనం. అయితే, ఇటీవలి కాలంలో ఆ పార్టీలో నియంతృత్వ పోకడలు పెరగడం అవాంఛనీయ పరిణామం. చరిత్రలోకి వెళితే, వ్యక్తిస్వామ్య వ్యవస్థ వల్ల కొంతకాలం పాటు బలంగా ఉంటున్నామన్న భావన, దాని ఫలితాలు అనుభవిస్తున్నామన్న అనుభూతి ఉన్నా, పార్టీపరంగా విపత్కర పరిస్థితులు దాపురిస్తే- తట్టుకుని నిలబడే శక్తి ఉండదు. అధికారం ఎల్లకాలం ఉండదు.
ఈరోజు బీజేపీలో వ్యక్తి ఆరాధాన సంస్కృతి ప్రబలింది. బీజేపీకి పునాది హిందూత్వ. 370వ అధికరణం రద్దు, రామజన్మభూమి, కామన్ సివిల్ కోడ్ వంటి అంశాల నుంచి భాజపా పట్టాలు తప్పింది. తనకు లభించిన విజయాలు, అపజయాల నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకుని ఈ రోజు ‘నెంబర్ వన్ పార్టీ’గా ప్రజల హృదయాలను దోచుకుంది. ఇదే సమయంలో పార్టీలో కొంత మంది నేతల ఆధిపత్యం శ్రుతి మించింది. సమష్టి నాయకత్వం, సమష్టి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు స్వస్తి చెబితే ఆ పార్టీకి మంచిది కాదు. బీజేపీ తన మూలాలను మార్చుకుని అధికారం నిలబెట్టుకునేందుకు హిందూత్వ విధానాల నుంచి బయటపడి జనబాహుళ్యం లోకి వెళ్లే క్రమంలో సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏదో ఒక రోజు తలెత్తక తప్పవు.
దేశంలో వ్యక్తిస్వామ్య వ్యవస్థ కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. ఇది ఇందిరాగాంధీ హయాంలో పరాకాష్టకు చేరుకుంది. ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అని ఒకప్పుడు కాంగ్రెస్ నేత డీకే బారువా, పశ్చిమ బెంగాల్ సీఎం సిద్థార్థ శంకర్ రే ప్రకటించారు. 1971 నుంచి 1977 వరకు ఇందిరా గాంధీ హవా కొనసాగింది. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేసేందుకు, న్యాయ వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకునేందుకు 1975లో ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించి ప్రజలకు ‘చీకటి రోజులు’ చూపెట్టారు. దీని ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ. దక్షిణాది రాష్ట్రాలకు ఎమర్జన్సీ విషఫలాలు ఏమిటో తెలియదు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని ప్రజలు బ్యాలెట్ ద్వారా చిత్తుగా ఓడించారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఎన్నికల్లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పెద్ద మెజార్టీతో నెగ్గి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లు తిరగకముందే 1989 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించారు. ఈ రోజు కాంగ్రెస్‌తో జట్టుకట్టి తిరుగుతున్న టీడీపీ 1989లో అదే కాంగ్రెస్‌కు చుక్కలు చూపించింది. రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ తుక్కుగా ఓడిపోయేందుకు కారణం ఆయన చుట్టూ ఉన్న భజన బృందాలే. 1989లో దెబ్బతిన్న కాంగ్రెస్ ఇంతవరకూ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత తలెత్తిన రాజకీయ శూన్యతతో ఆ స్థానాన్ని తెలుగు తేజం పీవీ నరసింహారావు భర్తీ చేశారు. 1999లో ఎఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో ఆమె సారథ్యంలో యూపీఏ అధికారంలోకి వచ్చి 2014 వరకు కొనసాగింది. సోనియా చుట్టూ బలమైన ‘కోటరీ’ ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేసింది. కాని కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో లేవలేని స్థితికి చేరుకుంది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అదే వ్యక్తి ఆరాధన సంస్కృతి ఆ పార్టీలో కొనసాగుతోంది. ఏపీ విభజనలో అనుసరించిన దుందుడుకు వైఖరి వల్ల ఈ రోజు కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి దిగజారింది. వరుస అపజయాలు చూస్తున్నా, గాంధీ కుటుంబం మినహా మిగతా నేతలను పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ సాహసించదు. ఈ రోజు ప్రియాంకా గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కేంద్రంగా కాంగ్రెస్ నడుస్తోంది.
రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తితో నడవాలి. లేని పక్షంలో సవాళ్లు ఎదురైనప్పుడు తట్టుకుని నిలబడలేవు. ఏ పార్టీకైనా బలమైన నాయకత్వం అవసరం. పార్టీ అధినేతకు జనాకర్షణ కావాలి. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే తప్ప తన విధానాలను అమలు చేయలేదు. అధికారంలోకి తెచ్చిన నేత నిరంకుశుడిగా మారితే ‘చెక్’ పెట్టే విధంగా పార్టీ ఉండాలి. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వ్యక్తిపూజ సంస్కృతిని పెంచుకునేందుకు ఉపయోగించరాదు.
తమిళనాడులో ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు చివరకు వ్యక్తిస్వామ్య వ్యవస్థ, వ్యక్తిపూజకు దారితీసిన చరిత్ర నేడు కళ్లకు కనపడుతోంది. ఏంజీఆర్ మరణాన్ని భర్తీ చేసేందుకు జరిగిన పోరాటంలో జయలలిత పైచేయి సాధించి రెండున్నర దశాబ్దాలు పార్టీని నడిపించారు. తమిళనాడు సీఎంగా తిరుగులేని అధికారాన్ని అనుభవించారు. ఆమె తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే వారికి పార్టీలో స్థానం లేదు. చివరకు ఏమైంది? జయలలిత మరణం తర్వాత ఆ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి కథ సైతం ఇంతే. పూర్తిగా కుటుంబ పార్టీ అయిన డీఎంకేలో కరుణానిధి తర్వాత స్టాలిన్ పగ్గాలు చేపట్టారు. వ్యక్తి ఆరాధాన సంస్కృతి కేంద్రంగా ఆ పార్టీ పని చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు కాంగ్రెస్‌ను ఓడించేందుకు అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించారు. అధికారం ఉన్నంతకాలం ఎన్టీఆర్ చుట్టూ రాజకీయాలు తిరిగాయి. 1995 ఆగస్టులో చంద్రబాబు తిరుగుబాటు చేయడంతో తెదేపా ఆయన అధీనంలోకి వెళ్లింది. 24 ఏళ్ల తర్వాత తెదేపా భవిష్యత్తును నేటి ఎన్నికల ఫలితాలు శాసించనున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదిపై ఆవిర్భవించిన టీడీపీ ఈ రోజు వ్యక్తిగత నిర్ణయాల వల్ల సాగినంత కాలం బాగానే ఉన్నా, ఏదో ఒక రోజు ఆత్మవిమర్శ చేసుకోకతప్పదు. పంజాబ్‌లో అకాలీదళ్ అధినేత ప్రకాష్‌సింగ్ బాదల్, హర్యానాలో దేవీలాల్, బిహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ కుటుంబాలు వ్యక్తిస్వామ్య వ్యవస్థకు, వ్యక్తిపూజకు అలవాటుపడి దెబ్బతిన్నాయి. వ్యక్తిపూజకు అలవాటుపడితే వైకాపా, టీఆర్‌ఎస్‌లు సైతం భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభాన్ని అంతర్గతంగా ఎదుర్కొంటున్నారు. దూకుడు ఎలా ఉన్నా ఆమె నిరాడంబరమైన నేత. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం వేళ్లూనేందుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి పార్టీలకు భవిష్యత్తు ఉండదు.
ఈరోజు అన్ని పార్టీల్లో కొత్త జబ్బు చోటు చేసుకుంటోంది. ఇది పై నుంచి కింది స్థాయి వరకూ పాకింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు బదులు పార్టీ అధినేతల పుట్టిన రోజులను ఆడంబరంగా జరుపుకుంటున్నారు. స్వాతం త్య్రం వచ్చిన కొత్తల్లో ఈ సంస్కృతి ఉండేది కాదు. నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్ర్తీ ప్రధానులుగా ఉన్న సమయంలో వ్యక్తి పూజకు తావులేదు. ఇందిరాగాంధీ పాలనా పగ్గాలు చేపట్టి నప్పటి నుంచి కుటుంబ పార్టీ సంస్కృతి అన్ని పార్టీలకు పాకింది. ప్రస్తుతం జాతీయ పార్టీల అధినేతల నుంచి పట్టణ, గ్రామ స్థాయి పట్టణ అధ్యక్షుల వరకు పుట్టిన రోజు పండగలను ఘనంగా నిర్వహించుకునే సంస్కృతి జడలు విప్పింది. ‘తాను ఒకటైతే, గుడ్డ మరొకటి అవుతుందా?’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రుల పుట్టిన రోజులకు పెద్దగా ఇతర నేతలు ప్రాధాన్యత ఇచ్చేవారు కారు. ఆ పార్టీలో ఒక నేత మరొక నేతను అంగీకరించే పరిస్థితి లేనందున సీఎంలుగా పనిచేసే వారి పుట్టిన రోజులు ఇళ్లకే పరిమితమయ్యేవి. ఒక నాయకుడి పుట్టిన రోజున బ్యానర్లు కట్టి ఆడంబరంగా చేసేందుకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి ? తమ నేతలంటే అభిమానం ఉండాలి. అంతేకాని దురభిమానం పెచ్చుమీరి వ్యక్తి ఆరాధనకు అలవాటుపడడం వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. ప్రజలకు నచ్చినంత కాలం అధికారంలో పార్టీలు ఉంటాయి. ఎన్నికల రాజకీయాల్లో గెలుపుఓటములతో నిమిత్తం లేకుండా రాజకీయ పార్టీలు వ్యక్తిస్వామ్య వ్యవస్థకు పాతరేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097