మెయన్ ఫీచర్

ప్యాకేజీకి జై కొట్టాల్సిందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండున్నరేళ్లు తెలుగు టివి సీరియల్ జీడిపాకంలా సాగదీసి ఎట్టకేలకు హోదాను హుళక్కి చేసి, ప్యాకేజీకి తెరలేపిన కేంద్ర నిర్ణయంపై జనం ఏమి చేయాలి? ఇచ్చిన ప్యాకేజీని ఆహ్వానించాలా? లేక అసలు అవకాశమే లేని హోదా కావాలని చచ్చు పుచ్చు వాదాలు చేసి ఉద్యమించాలా? అన్నది నవ్యాంధ్ర ప్రజలముందున్న ప్రశ్న. రాజధాని కూడా లేకుండా చేసి ఏపిని కొత్త రాష్ట్రంగా పుట్టించిన కాంగ్రెస్, అప్పుడే హోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే అసలు ఈ పంచాయతీ వచ్చేదే కాదు.
రాష్ట్రాన్ని విడగొట్టేందుకు తొందరపడిన పెద్దమ్మ-చిన్నమ్మలకూ ఆ ఆలోచన రాలేదు. వెంకయ్యనాయుడు ప్లీజ్ అంటూ ప్రధానిని బ్రతిమిలాడేవరకూ అసలు హోదా ముచ్చట ఎవరికీ తెలియదు. రెండుసార్లు లేఖ ఇచ్చిన తెదేపాగానీ, ఎలా విభజించవచ్చో అరటిపండు ఒలిచినట్లు చెప్పిన వైకాపా గానీ హోదా గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ మాట్లాడుతున్నారు. బాబు మాత్రం కొత్త రాష్ట్రానికి 5లక్షల కోట్లు కావాలని అడిగారు. ప్రధాని అప్పుడే హోదాకు అంగీకారం తెలిపినందున, ఇక దాన్ని అమలుచేయాల్సిన బాధ్యత బిజెపిదేనని కాంగ్రెస్ తెలివైన నాటకానికి తెరలేపింది. తాంబూలాలి చ్చాం, తన్నుకు చావడమంటే ఇదే!
సరే ఇప్పుడు రెండున్నరేళ్లయిపోయింది. మరో ఏడాది దాటితే ఇక ఎన్నికల సంవత్సరమే. అందువల్ల పనికిమాలిన వాదనలతో కాలహననం చేసుకుని హోదా కోసమే పోరాడాలనుకోవడం తెలివైన పనా? లేక వచ్చిన ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించుకుని, అవి సబ్‌కాంట్రాక్టర్లకు పలహారం కాకుండా కొత్త రాజధాని కోసం వినియోగించడమే తెలివైన వారి పని. ఏపికి హోదా రావాలి. నిజమే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపికి హోదా కావాలని చెప్పి, తన విశాలహృదయం చాటుకున్నారు.
ఈ మధ్య కొందరు స్వయంప్రకటిత మేధావుల సంఘ నేతలు, పనిలేని సినిమా తారలు, హోదా సాధన సంఘాలు హోదాపై పోరాటం చేద్దామంటున్నారు. పొలిటీషియన్ అనుకుంటున్న పవన్ అనే నటుడు కూడా హోదాపై చాలా ఆవేశపడ్డారు. ఆ ఊగిపోయిన వైనం చూసి అస లు కాకినాడ వేదిక దిగిన మరుక్షణం నుంచే హోదాపై ఉద్యమం చేస్తారేమోన్న భ్రమ కలిగింది. కానీ పవన్ దానికి బదులు పుస్తకం రాస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఉత్తరకుమారులను నమ్మితే హోదా ఎన్నాళ్లకు తెములుతుంది? జనసేనను పట్టుకుని గోదారి ఈదుతారా?
కాంగ్రెస్-వైకాపా- వామపక్షాలు కూడా బాబు భుజంపై తుపాకి పెట్టి భాజపాకు గురిపెడుతున్నాయి. హోదా ఇవ్వని బిజెపికి పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నారు. ఇదో పెద్ద జోక్. అసలు ఏపిలో భాజపాకు ఏమి బలం ఉందని దానికి పుట్టగతులుండకపోవడానికి? ఏ పార్టీ దగ్గరయినా అది డజనో రెండు డజన్ల సీట్లో తీసుకోవడమే తప్ప బిజెపి ఎప్పుడూ స్వయంభువు కాదు.
కాసేపు వారి డిమాండ్ ప్రకారం బాబు బిజెపి కాడిని కింద పడేశారే అనుకుందాం. బిజెపికి వచ్చే నష్టమేమిటి? ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ పార్టీకి 50 స్ధానాలు ఉండి, హోదా ఇవ్వకపోవడం వల్ల 5 సీట్లు కూడా రావనుకుంటే అది ఓ పద్ధతి. పైగా, తన ప్రాతినిధ్యం లేని రాష్ట్రానికి సాయం చేయాల్సిన అవసరం దానికి ఉండదు. అప్పుడు నష్టపోయేది బాబు, జగన్, రఘువీరారెడ్డి కాదు. ప్రజలు మాత్రమే. ఈ ముగ్గురితోపాటు హోదాపై యాగీ చేస్తున్న మేధావులు, సినీనటులకు హైదరాబాద్‌లో ఇళ్లు, ఫాంహౌసులూ ఉన్నాయి. కాబట్టి అలాంటి పోరాటయోధులకు హోదా రాకున్నా పోయేదేమీ లేదు.
పోరాటాలు, ఉద్యమాల విషయంలో తెలంగాణ-ఆంధ్ర ప్రజలకూ చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ ప్రజలు మొదటి నుంచీ పోరాటాల మధ్యనే బతికారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం చరిత్ర సృష్టించింది. దేశాన్ని కుదిపివేసింది. అదే సమయంలో ఏపిలో జరిగిన ఉద్యమం ఏవిధంగా సాగిందో చూశాం. అంతా బలవంతపు బ్రాహ్మణార్ధమే కదా?! నిజంగా ప్రజల్లో అంత తెగువ, రోడ్డుమీదకొచ్చి ఉద్యమం చేసే సహనం ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు కదా?!
ఏపి జనాలు తన కోపాన్ని కేవలం పోలింగు రోజునే ప్రదర్శిస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరి పని వారిది. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఎవరి అజెండాలు వారివి. ఎవరి కుల పోరాటాలు వారివి. ఒకవేళ హోదా ఇవ్వలేదన్న కోపం ఉంటే పోలింగురోజే శిక్షిస్తారు. ఆ శిక్ష బిజెపికి మాత్రమే ఉంటుందా? లేక ఆ పార్టీతో కలసిన తెదేపాకూ ఉంటుందా అన్నది వేరే విషయం. నందో రాజా భవిష్యతి!
ఇక అసలు హోదా వస్తే లాభనష్టాలేమిటో చూద్దాం. ఇప్పుడు హోదా సాధించుకున్నా 2017 తర్వాత అది ఉండదు. జీఎస్టీని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత, ఇక 2017 నుంచి ఆ వెసులుబాటూ ఉండదు. అసలు హోదాకు, పన్ను రాయితీకి సంబంధమే లేదు. 2002లో మొదలయిన పన్ను రాయితీలు చాలావరకూ 2014లో తొలగించారు. కేపిటల్ ఇనె్వస్టిమెంట్‌లో.. ఎవరైనా 200 కోట్లతో కంపెనీ పెడితే, స్థూల లాభం నుంచి 30 కోట్ల పన్ను లెక్కింపు నుంచి తీసేయవచ్చు. ఇది 6-10 శాతం లాభాలు పెంచుతుంది.
ఏపిలో అపార వనరులున్నాయి. పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాబట్టి పరిశ్రమల స్థాపనకు భయం లేదు. అయితే, ఇవన్నీ వచ్చే రెండున్నరేళ్లలో అయ్యేవి కాదు. ఇప్పుడు ప్రారంభిస్తే మరో ఐదేళ్లకు వచ్చే లాభాలు. పరిశ్రమలొస్తే ఉపాధి లభిస్తుంది. అప్పుడు దానికోసం ఏ ప్రభుత్వం మీదా ఆధారపడనవసరం ఉండదు. సీఏఎస్‌పి కింద రాష్ట్రం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అందులో కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. అదే హోదా ఉంటే కేంద్రం 90, రాష్ట్రం 10 శాతం భరించాలి. దానివల్ల మన రాష్ట్రానికి వచ్చే నష్టం 3వేల కోట్లు. సీఏఎస్‌పిలో నష్టపోతున్న ఈ నిధులను కేంద్రం ఈఏపి రూపంలో అప్పు తీసుకుని, దాన్ని రాష్ట్రానికి ఇస్తుంది. అంటే ఏపికి ఇక్కడ 3 వేల కోట్ల లాభమే కదా?!
నిజానికి రాష్ట్రానికి పడే భారం వెయ్యి కోట్లు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత భారం పడుతుందో ఏపీకి అంతే భారమన్నమాట. ఆ రకంగా హోదా మనకూ దక్కినట్లే లెక్క. ఈఏపి కింద 3 వేల కోట్లు కేంద్రం తీసుకోవడం వల్ల ఎఫ్‌ఆర్‌బిఎంపై పడే భారం కూడా తగ్గిపోతుంది. దానిప్రకారం పరిధి దాటకుండా రాష్ట్రం ఇంకో 3 వేల కోట్లు ప్రతి ఏటా పొందవచ్చన్నమాట. దీనివల్ల ఏపి రానున్న ఐదేళ్లలో 22,500 కోట్ల నిధులు తీసుకోవడమే కాకుండా, మరో ఏడేళ్లలో 22,500 కోట్లు లభిస్తాయి.
ఇవన్నీ కలిపితే 45 వేల కోట్లవుతాయి. 42 వేల కోట్ల ఈఏపిల కోసం రాష్ట్రం డిపిఆర్ సిద్ధం కూడా చేసింది. మరి ఏపికి ప్యాకేజీ వల్ల లాభమా? నష్టమా?! హోదా అన్న పేరు లేకున్నా ఆ రూపంలో వచ్చే మేలయితే జరుగుతుందా? లేదా? ఇవన్నీ చూడకుండా, రాని హోదానే కావాలని యాగీ చేసి, ఉన్న ప్యాకేజీని వదులుకోవడం తెలివిగల పనా? లేక మూర్ఖపువాదనా అన్నది జనమే తేల్చుకోవాలి.
కాసేపు ప్యాకేజీ వల్ల నష్టమే తప్ప లాభం లేదనుకుందాం. గుండెలు బాదుకుంటే జరిగేదేంటి? కేంద్రం అనుకుంటే హోదా ఇవ్వవచ్చు. ఏం? మెజారిటీ పార్టీలు వ్యతిరేకించినా రాష్ట్ర విభజన చేయలేదా? అదీ నిజమే. ఉన్న హోదానే తీసేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రత్యామ్నాయం ఉంటుంది కదా?! ఇన్ని తెలివితేటలున్న ఈ మేధావులు, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఏం కావాలో చెప్పకుండా గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? మా రాష్ట్రాన్ని విభజించినా జనం ఏమీ పట్టించుకోరని ఇటలీమాతకు భరోసా ఇచ్చి, బయటకొచ్చి రాష్ట్రం విడిపోదని చివరి వరకూ నంగనాచి కబుర్లు చెప్పారే తప్ప, రాష్ట్రం విడిపోతే ఏం కావాలో చెప్పకుండా ఉన్న ఈ బెల్లంకొట్టినరాళ్లు పిడికిలి బిగించడం సిగ్గుచేటు కదా?
అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదంటే జరుగుబాటు ఎలా? ఇక్కడ హోదా రాకపోయినా ప్యాకేజీని సమర్థిస్తున్నామనుకుంటే తప్పులో కాలేసినట్లే. కానీ ఆ పరిస్థితి లేనందున తెలివైనవాళ్లు ఏం చేయాలన్నది ప్రశ్న. ఒక రోగి వైద్యుడి వద్దకు వెళ్లాడు. కాలు తీయకపోతే అది శరీరం మొత్తం విస్తరించి చివరకు ప్రాణాపాయం ఉందని హెచ్చరిస్తాడు. రోగి సహా కుటుంబసభ్యులందరికీ ప్రాణాలతోపాటు, కాలూ కావాలి. నడిచేందుకు కాలు కావాలి కదా! కానీ వైద్యుడి ముందు ఉన్నది ఒకటే ఆప్షన్. కాలు తీయకపోతే ప్రాణమే పో తుంది. కాబట్టి తెలివైన రోగి కాలు లేకపోయినా ప్రాణం ఉంటే చాలనుకుంటాడు.
హోదా-ప్యాకేజీ విషయంలో కూడా ఇదే పద్ధతి. అందుకే చాణక్యుడయిన బాబు కూడా ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి ప్రాణం లాంటి ప్యాకేజీనే కోరుకున్నారు తప్ప, కాలు లాంటి హోదాను కాదు. నిద్రలో ఉన్నానో, ధ్యానంలో ఉన్నానో తనకే తెలియని పవన్ వంటి జనసేనాని మాత్రం ప్రాణం పోయినా కాలు కావాలంటున్నారు. కాంగ్రెస్ ఎలాగూ మరో పదేళ్లు ఐసియు నుంచి బయటకొచ్చే చాన్సు లేదు. కాబట్టి ఆ పార్టీ ఎంత గావుకేకలు పెట్టినా, అది కంఠశోషే తప్ప అద్దాల గది దాటదు.
ఆ పార్టీ చేసే ఉద్యమం జగన్‌కే లాభం. మరి జగన్ హోదా సెంటిమెంటును ఓటుగా ఎలా మలచుకుంటారో చూడాలి. వైసీపీ హోదా కోసం పోరాడుతోంది నిజమే. కానీ హోదా ఇవ్వాల్సిన కేంద్రంపై కాలుదువ్వకుండా, ఆ వైఫల్యంలో భాగస్వామి అయిన బాబుపై పోరాడితే అది రాజకీయ విన్యాసం అవుతుందే తప్ప, రాజకీయ అస్త్రం కాలేదు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144