మెయిన్ ఫీచర్

మళ్లీవస్తే బావుండు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు దశాబ్దాల క్రితంవచ్చిన ఏదోక సినిమాను గుర్తుచేసి కథ చెప్పమంటే -సన్నివేశం మిస్సవ్వకుండా సినిమా చూపించేసే ప్రేక్షకులున్నారు. కాని -మూడు రోజుల క్రితం చూసిన చిత్ర కథ చెప్పమంటే మాత్రం మూడు ముక్కలు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఆనాడు ఏ సినిమాకూ -మిలియన్ వ్యూస్‌లు లేవు. కోట్ల క్లబ్‌ల ఆర్బాటాలు లేవు. టీజర్లూ, ట్రైలర్లూ, గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్లూ ఇవేమీ లేవు. సినిమా మొదలు పెట్టినపుడు కొట్టే కొబ్బరికాయ నుంచి షూటింగ్ పూర్తి చేసినపుడు కొట్టే గుమ్మడికాయ వరకూ -అంతా సింప్లిసిటీ. మహా అయితే గోడమీద ఓ చిన్న పోస్టర్. మరీ ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తే హీరోకి ఓ కటౌట్. కాని చిత్రబృందం ఏకాగ్రత మాత్రం సినిమాకు ఆడియన్స్ ఆశీస్సులు దక్కేలా ఎలా చేయాలన్నదే. వినోదాన్ని వెతుక్కుంటూ థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకుడిని ఎలా సంతృప్తిపర్చాలన్నదే.
ఇప్పుడు-
సినిమా అలాగే ఉంది. కాని -దానిచుట్టూ వాతావరణం మారింది. కథలు మారాయి. కథనాలు మారిపోయాయి. ప్రచారాస్త్రాలు మారిపోయాయి. వ్యూహాలు పదునుదేరాయి. సాంకేతికత చొచ్చుకొచ్చింది. ఎమోషన్స్ ఎక్కువయ్యాయి. తెరనిండా ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. తెరవెనుక పనిచేస్తున్న వాళ్లూ ఎక్కువైపోతున్నారు. బడ్జెట్ పెరిగిపోతోంది. ఇప్పటి సినిమాకూ అన్నీ ఎక్కువే. ఏదీ తక్కువ కాదు. ఒక్క సక్సెస్ తప్ప.

సినిమాను మొదలుపెట్టిన తరం ఇప్పుడు లేదు. దర్శకుడు, నిర్మాత, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. ఇలా ఎవరివంతు వారు చేతులు అడ్డుపెట్టి సినిమా దేదీప్యమానంగా వెలిగేలా చేసిన తరువాతి తరమూ చాలావరకూ కనుమరుగయ్యారు. కానీ, సినిమాను ఓ రేంజ్‌కి తీసుకొచ్చిన దర్శక తరం మాత్రం ఇప్పటికీ మన కళ్లముందే ఉన్నారు. ఎందుకనో -వాళ్లు మాత్రం సినిమాను పట్టించుకోవడం లేదు.
పాతిక ముప్పయ్ ఏళ్లక్రితం ఖైదీ, పసివాడి ప్రాణం, రౌడీ ఇన్‌స్పెక్టర్, లారీడ్రైవర్, బొబ్బిలిరాజా, విక్కీదాదా, అల్లరి అల్లుడు, ఎర్రమందారం, యమలీల, ఎగిరేపావురమా, అన్న, యమపాశం, అంకుశం ఈ చిత్రాలన్నీ మంచి కథాంశంతో వచ్చి బ్లాక్‌బ్లాస్టర్స్ అనిపించుకున్నవే. ఇప్పుడూ లెక్కకుమించి సినిమాలొస్తున్నాయి. టైటిల్స్ మారిపోయినా, కథలు కథనాలు పదునుదేరినా -ఆనాటి సినిమా స్థాయికి, అప్పటి విజయాల స్థాయికి చేరడం లేదు. ఈ పరిస్థితి కారణాలు అనేక ఉండొచ్చు. కానీ -మూడు దశాబ్దాల క్రితం కొత్తగా మెగాఫోన్ చేతబట్టి శెహ్‌బాష్ అనిపించుకునే కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు మాత్రం -ఇప్పటి సినిమాను పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. శారీరకంగా, మానసికంగా సినిమాను ఇంకా ముందుకు నడిపించే సత్తావున్నా -ఎందుకో వౌనంగా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్లలో ప్రతి ప్రేక్షకుడికీ బాగా దగ్గరైన కొంతమంది దర్శకులను గుర్తు చేసుకుందాం.
సంయుక్తా మూవీస్ నిర్మించిన ‘ఖైదీ’ సినిమా -తెలుగు చలనచిత్రం పరిస్థితుల్ని, రూపురేఖల్ని, వ్యాపారరంగంలో సినిమా స్థాయిని మార్చేసిందంటే కాదనేవాళ్లు ఎవరుంటారు? ఈ సినిమాతో ఒక్కసారిగా చిరంజీవికి స్టార్‌డమ్ వచ్చింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డికి వంద సినిమాలు తీస్తే వచ్చే పేరు తెచ్చింది. అటు చిరుకి, ఇటు రెడ్డికి ఈ సినిమాతోనే ‘స్టార్’ తగులుకుంది. అగ్ర హీరోలతో చిత్రాలు చేయతగ్గ దర్శకుల లిస్టులో చేరాడు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం యండమూరి నవలల్ని ఎక్కువ శాతం సినిమాలుగా మలచిన ఘనత ఆయనిదే. తమిళ రీమేక్‌ను ‘పసివాడి ప్రాణం’ చేసి మాతృకను మరిపించిన దర్శకుడు. ఖైదీ రుద్రయ్య, కిరాయికోటిగాడు, పోకిరిరాజా, అనసూయమ్మగారి అల్లుడు, రక్త్భాషేకం, కిరాయిదాదా, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, విజేత.. ఎలా ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి చాలాకాలంగా పరిశ్రమకు దూరంగానే ఉంటున్నారు.
ఇక బి గోపాల్ విషయానికొస్తే సురేష్ ప్రొడక్షన్స్‌లో ప్రతిధ్వని, బొబ్బిలిరాజా; మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్‌పై ‘స్టేట్ రౌడీ’, వైజయంతి మూవీస్‌లో ఇంద్ర, రీమేక్ సినిమా అయినా తమిళ మాతృకను మరిపించేలా తెరకెక్కించిన ‘అసెంబ్లీ రౌడీ’లాంటి సినిమాలన్నీ ఆయన దర్శకత్వ ప్రతిభకు పట్టంగట్టేవే. పైన చెప్పినవి ప్రస్తావనకే. ఇవిగాక ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘లారీడ్రైవర్’లాంటి ఎన్నో బంపర్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాంటి ప్రతిభ కలిగిన బి గోపాల్ సైతం తెలుగు సినిమాను పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. ఇక రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన జ్వాల, చక్రవర్తి, యముడికి మొగుడు, చంటి, బంగారు బుల్లోడు, యమపాశం, పుణ్యస్ర్తి, ముత్యమంత ముద్దు, పెదరాయుడులాంటి చిత్రాలు సూపర్ హిట్స్. దర్శకత్వంలో ఆయనదొక విశిష్ఠ శైలి అనేవారు. మల్లాది యమపాశం, యండమూరి ముత్యమంత ముద్దు నవలల్ని ఎంతో ఓపికగా సినిమాలుగా అందించి నవలా దర్శకుడిగా ఘనాపాటి అనిపించుకున్నారు. కానీ రవిరాజా పినిశెట్టి సైతం చాలాకాలంగా సినిమాకు దూరంగానే ఉంటున్నారు.
పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించిన విజయ బాపినీడు నుంచి చాలాకాలంగా సినిమాలు రాలేదు. గత ఫిబ్రవరిలో ఆయన కాలం చేయడంతో, ఆయన శైలిలో ఇక సినిమాలు వచ్చే అవకాశమే లేదు. మహానగరంలో మాయగాడు, నాకూ పెళ్లాంకావాలి, జూలకటక, భార్యామణి, కొంగుముడిలాంటి చిన్న సినిమాలను సూపర్ హిట్స్ చేసిన ఘతన విజయబాపినీడుది. మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగమహారాజు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్‌లీడర్ చిత్రాలు అనూహ్యంగా భారీ విజయాలు కైవసం చేసుకున్నాయి. మహారాజు, గ్యాంగ్‌లీడర్, నాకూ పెళ్ళాంకావాలి చిత్రాలు ఆయన్ని స్టార్ డైరెక్టర్‌ని చేశాయి. ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులో రాజేంద్రప్రసాద్, నిరోషాలతో ‘మహాజనానికి మరదలు పిల్ల’గా తీశారు. విఫలమైంది. తరువాత చిరంజీవితో తీసిన బిగ్‌బాస్ సైతం విఫలమవ్వడంతో బాపినీడు సినిమాకు దూరమైపోయారు. ఆ తరువాత సినిమా చేయాలన్న ఆలోచన ఆయనకు ఉన్పప్పటికీ సాగలేదు. ఇప్పుడు పరిశ్రమ ఆయన్ని కోల్పోవడంతో -ఆయన శైలి సినిమాలు వచ్చే అవకాశమే లేకుండాపోయింది. కొబ్బరిబొండంతో సంగీత దర్శకుడిగా, రాజేంద్రుడు- గజేంద్రుడుతో దర్శకుడిగా అవతారమెత్తిన ఎస్‌వి కృష్ణారెడ్డి దర్శకత్వంలోనూ ఒకప్పుడు బంపర్‌హిట్సే వచ్చాయి. మనీషా సంస్థలో కె అచ్చిరెడ్డితో కలిసి చాలా చిత్రాలే చేశారు. ‘మాయలోడు’, యమలీల, గన్‌షాట్, ఘటోత్కచుడు చిత్రాల్లో మాయలోడు, యమలీల చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. సూపర్‌స్టార్ కృష్ణతో చేసిన నెంబర్ వన్ సినిమా సూపర్ హిట్టు. రీమేక్‌లాంటి సినిమాలే అయినా మావిచిగురు, శుభలగ్నం చిత్రాలైతే.. సక్సెస్‌కు కొత్త రూట్ వేశాయి. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా కృష్ణారెడ్డికి పేరుతెచ్చిపెట్టాయి. రెండు సినిమాలు (టాప్‌హీరో, వజ్రం) విఫలమైన తరువాత ఎగిరే పావురమా తీసి తన మార్క్ చూపించాడు కృష్ణారెడ్డి. దర్శకత్వ బాధ్యతలు మోస్తూనే, సంగీత శాఖనూ నిర్వహిస్తూ వచ్చారు. యమలీలలో ‘చిరులొలికించే చిన్నినవ్వులే మణిమాణిక్యాలూ’, ఎగిరే పావురమాలో ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో’, శుభలగ్నంలో ‘చిలుకా ఏ దారిలేక ఎటేపమ్మ ఒంటరినడక’ పాటలు ఎస్‌వి కృష్ణారెడ్డి పనితనానికి మెచ్చుతునకలు. గత కొంతకాలంగా ఆయన పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం యమలీలకు సీక్వెల్ చేసి భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న కృష్ణారెడ్డి అప్పటినుంచీ చప్పుడు చేసింది లేదు. అయితే, కృష్ణారెడ్డి మార్క్ సంగీతంలేని పాటల కొరత నేడు ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తోందన్నది నిజం.
ఇక సగటు మనిషి, ఎర్రమందారం, అరుణకిరణం, మమతల కోవెల ఇవన్నీ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్స్. రాజశేఖర్‌తో ముత్యాల సుబ్బయ్య తీసిన ‘అన్న’ సినిమా బంపర్ హిట్టు. రాజకీయ నేపథ్యంలో సెటిల్‌మెంట్స్ చేసే హీరో ఒక సన్నివేశంలో ‘దెబ్బపడగానే నా కొడుకుని కొట్టమాకయ్య అందిరా నీ తల్లి.. అదిరా అమ్మంటే’ అంటూ రాజశేఖర్ ఆవేశంగా చెప్పే డైలాగ్ అప్పట్లో ఓ సంచలనం. మెగాస్టార్ చిరంజీవికి ఫెయిల్యూర్స్ నడుస్తున్న టైంలో ‘హిట్లర్’ని చేసి బ్లాక్‌బ్లాస్టర్ ఇచ్చాడు సుబ్బయ్య. ఎందుకో సుబ్బయ్య కూడా చాలాకాలంగా చిత్ర రంగానికి దూరమయ్యారు. ‘యుగానికొక్కడు’, ‘బావ బావమరిది’ లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన శరత్ కూడా పరిశ్రమకు దూరంగానే ఉంటున్నారు. అమ్మదొంగ వంటి భారీ హిట్ అందించిన సాగర్ సైతం నేడు చిత్రాలు చేయడం లేదు. తెలుగు సినిమాకు హిట్టు మార్క్ నిచ్చిన కోడి రామకృష్ణ సైతం కాలం చేయడంతో ఆ మార్క్ సినిమాలు చేయగల దర్శకుడిని మిస్సైనట్టే అయ్యింది. ఓక సామాన్య కథను ఫాంటసీ స్టయిల్లో చెప్పొచ్చనే ధైర్యాన్ని దర్శకులకిస్తూ ‘అమ్మోరు’ చేసిన చూపించిన ఘనుడు కోడి. తెలుగు సినిమాకు సీజీని ఎలా ఉపయోగించాలో రుచి చూపించడానికి అరుంధతిని తీసి చూపించాడు. సాంఘీకమైనా, ఫాంటసీ కథకైనా తనదైన మార్క్ జోడించాడు కోడి రామకృష్ణ. ఇక సురేష్ ప్రొడక్షన్స్‌నుంచి దర్శకుడిగా పరిచయమై ‘తాజ్‌మహల్’, ‘రాజా’ వంటి బంపర్‌హిట్స్ పరిశ్రమకిచ్చిన ముప్పలనేని శివ సైతం ఈమధ్య సినిమాలు చేయడం లేదు. చివరి చిత్రంలో కృష్ణ, విజయనిర్మలతో శ్రీశ్రీ తీసి -శివ పనైపోయిందని అనిపించుకోవడంతో ఆయన దర్శకత్వానికి దూరంగానే ఉంటున్నారు.
ఇప్పుడు అలాంటి చిత్రాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించుకుంటే -మిగిలివున్న ఆనాటి దర్శకులు చాలామంది పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. కొత్తతరాన్ని జీర్ణించుకోలేక, మనసు చంపుకుని శృతిమించిన అప్‌డేట్ కథల్ని ఎంచుకోలేక -వౌనంగా ఉంటున్నారన్న సమాధానమే దొరుకుతుంది. పైన ప్రస్తావించుకున్న వాళ్లు కొంతమందే కావొచ్చు. ప్రస్తావించని వాళ్లు, గొప్ప హిట్లు ఇచ్చిన దర్శకులు ఇంకా చాలామందే ఉండొచ్చు. వాళ్లలో కొందరైనా మళ్లీ మెగాఫోన్ పట్టుకుని మంచి కథాంశాలతో ముందుకొస్తే -మళ్లీ ఓ గొప్ప ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌కి అందుతుంది.
అనారోగ్యం, అవకాశాలు లేకపోవడం, నేటివిటీతో పోటీపడకపోవడం.. భారీ బడ్జెట్‌ను పెట్టించే ఆలోచనలు లేకపోవడం.. మారిన పరిస్థితులు.. అనువుగాని వాతావరణం.. ఇలాంటి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. వీటిని పక్కనపెట్టి, పట్టించుకోకుండా అధిగమించి అలాంటి ఆనాటి దర్శకుల్లో ఒక్కరు ముందుకొచ్చినా -తెలుగు సినిమా మళ్లీ పట్టుబట్ట కడుతుంది. ఇప్పడు సినిమాలు తీస్తున్న దర్శకులు తక్కువని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు, దర్శకుడికంటూ ఓ మార్క్ వేసుకుని అలాంటి వినోదాన్ని అందించే ఆనాటి దర్శకులు మళ్లీ వస్తే బావుండనే చిన్న ఆశే -ఈ వ్యాసం పరమార్థం.

-బంటు గిరివాసు