మెయిన్ ఫీచర్

సందేశం.. సంపూర్ణ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషం
సగం బలం -ఇది పెద్దల మాట.
సందేశం
సంపూర్ణ బలం -ఇదిప్పుడు టాలీవుడ్ పాట.
**
నిజానికి సినిమాకి -సందేశం కొత్తకాదు. ఆ మాటకొస్తే సందేశ ఉద్దేశంతోనే సినిమా మొదలైందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్క్రీన్‌మీద బొమ్మపడటం మొదలైనప్పుడే.. అంటే పౌరాణిక సినిమాల నుంచే సందేశం మొదలైంది.
ఏది మంచి ఏది చెడు అన్న విషయాన్ని ప్రేక్షకుడికి చెప్పడానికి ప్రయత్నిస్తూనే వస్తోంది. అందుకు దేవతలు- రాక్షసుల పాత్రలను ఎన్నుకుంది. పురాణాలు, ఇతిహాసాలు, భక్తి కథలు.. మహాపురుషుల గ్రంథాలు.. ఇలా అన్నింటినీ సినిమా తన వశం చేసుకుంది. ప్రేక్షకుడికి ఓ మంచి విషయం చెప్పాలనో, ఆచరించకూడని చెడ్డ విషయంపై హెచ్చరించాలనో తాపత్రయపడుతూనే వచ్చింది. అందుకే -మహా పతివ్రత సీతను ఎత్తుకెళ్లిన రావణుడు ఎలా అంతమైపోయాడో సినిమా చూశాం. చెప్పుడు మాటలు విని -వరపుత్రులైన పాండవులపై కక్షగట్టిన ధుర్యోధనుడి కథనూ స్క్రీన్‌పై కన్నాం.
*
రాముడు -కృష్ణుడు, ఇంద్రుడు -చంద్రుడు.. ఇలా స్క్రీన్‌కు ఎక్కని పాత్రంటూ లేదు. ఈ పాత్రలన్నీ -సామాన్యుడికి సందేశ జ్ఞానం పంచడానికే. అంటే -సినిమా మొదలైనపుడే సందేశం మొదలైంది. సినిమా బలపడుతూ వచ్చిన క్రమంలో -కాలమాన పరిస్థితులకు అనువైన సందేశాలూ మొదలయ్యాయి. దేశభక్తి, స్వాతంత్రోద్యమ కాలంనాటి పరిస్థితులు, కుటుంబ బాంధవ్యాలు.. వ్యక్తిగత సంబంధాలు.. ఉత్తముడు పాటించాల్సిన నియమాలు.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఎంతోకొంత సందేశం వినోదాత్మకంగానో, విషాదాంతంగానో కనిపిస్తూనే ఉంటుంది. సో, ఏతావాతా చెప్పేదేమంటే సినిమాల్లో సందేశం -పుట్టినప్పటి నుంచే ఉందన్నమాట.
జీవన విధానంలోని మంచి చెడును విశే్లషించి చెప్పడానికి ఒక్కోతరంలోని దర్శకులు ఒక్కోవిధంగా ప్రయత్నిస్తున్నారు. తొలితరం దర్శకులు, నిర్మాతలు అప్పటి కాలమాన అంశాలకు ప్రాధాన్యతనిస్తే -స్వర్ణయుగం కాలంలో అప్పటి దర్శకులు, నిర్మాతలు, నటులు, నటీమణులు అప్పటి కాలానికి అనువైన అంశాలపై దృష్టిపెట్టారు. ముందుతరం, ఇప్పటితరం హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇప్పటి అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే కాలానుగుణంగా సందేశం మారుతుందే తప్ప, సినిమాలో సందేశం మాత్రం కామన్. (ఒక దశలో దక్షిణాది భాషల్లో కొన్ని తరహా చిత్రాలొచ్చాయి. చూపించాల్సిన బూతునంతా చూపించేసి -అలా చేస్తే జీవితాలు నాశనమైపోతాయంటూ ముక్తాయింపు ఉండేది. ఈ సినిమాలూ సందేశాలిచ్చిన సినిమాలే అనాలి. కాకపోతే -వాటిలో ఆడియన్స్‌ని రెచ్చగొట్టే కమర్షియాలిటీయే తప్ప, ఉదాత్తత ఉందని గట్టిగా అనలేం. అది వేరే విషయం).
***
ఇదంతా గతం.
వర్తమానంలో ఈ సందేశం ఓ ట్రెండైంది. ట్రెండ్‌సెట్టరవుతోంది. సినిమా ఇలానే ఉండాలన్న నియమం పక్కన పెట్టేసిన తరువాత -నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోలు, ఇమేజున్న హీరోయిన్లు క్రియేటివ్‌గా ఆలోచించడం మొదలెట్టిన తరువాత.. సందేశానికే సందేశమిచ్చే సినిమాలు వస్తున్నాయి. అంటే -కానె్సప్ట్ ఓరియంటెడ్ సందేశాలన్న మాట. అంతేకాదు, అలాంటివే ఎక్కువ శాతం వ్యాపారాత్మకంగా విజయాలూ అందుకుంటున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఈ పరిస్థితి కాస్త స్పష్టంగా కనిపిస్తోంది. సందేశానికే సందేశమిచ్చే కథలు ఇప్పుడే వస్తున్నాయని చెప్పలేంకానీ, ఇటీవలి కాలంలో ట్రెండ్ బలపడుతోందని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ బడ్జెట్‌తో చిత్రాలు నిర్మించే శంకర్‌లాంటి దర్శకులు, కాస్త క్రియేటివ్‌నెస్‌ని ఇష్టపడే స్టార్ ఆర్టిస్టులు ఈ తరహా కథల్ని ఎప్పుడో మొదలెట్టారు. అంటే -సామాజిక నేపథ్యమున్న కథల్ని ఎంచుకుని, సమస్యల్ని ఎత్తిచూపించి ఉత్తమమైన పరిష్కార మార్గాల్ని సూచించడమన్న మాట. సినిమా అనే ఫార్మాట్ ఫ్యాక్టరీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి అధివాస్తవికతను వాస్తవాధీన రేఖపై నిలిపి చూపించటం అలా మొదలైంది.
కొద్దిరోజుల క్రితం విడుదలై ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ‘మహర్షి’లాంటి చిత్రాలు వచ్చిన ప్రతిసారీ -ఈ తరహా చర్చ వస్తూనే ఉంది. అంటే -ట్రెండ్ బలపడుతోందన్న మాట. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. ఆమధ్య మహేష్‌బాబు చేసిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’ చిత్రాలనూ ఇదే కోణంలో చూడాలి. గ్రామాలను దత్తత తీసుకోవడం, పుట్టిన తరువాత ఊరునుంచి ఎంత తీసుకున్నామో అంతా ఇచ్చేద్దాం’లాంటి మెసేజ్ ఓరియంటెడ్ కానె్సప్ట్ ఆడియన్స్‌కి బాగా ఎక్కేసింది. రాజకీయాలపై జనానికి పూర్తిగా ఏవగింపు పెరిగుతోన్న టైంలో ‘బెస్ట్ యంగ్ సీఎం’ పాత్రతో మహేష్ మరో సినిమా చేశాడు. కమర్షియల్‌గా ఇదీ వర్కౌట్ అవ్వడంతోనే ‘వీకెండ్ వ్యవసాయం’ కానె్సప్ట్‌తో ‘మహర్షి’ చేసి హిట్టందుకున్నాడు. ఇటీవలే వచ్చిన నాని సినిమా ‘జెర్సీ’ కూడా అలాంటిదే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రంలో ‘పడిలేచిన క్రికెటర్’ కథ ఆడియన్స్‌కి బాగా కనెక్టైంది. కొడుక్కి 500 పెట్టి జెర్సీ కొనివ్వలేకపోతున్నానన్న ఆవేదన నుంచి పుట్టిన కసి -రంజీ టీంకి ఓ అద్భుతమైన క్రికెటర్‌ని అందించింది. ‘సులువున్నా సుడిలేని కుర్రాడు -లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు’ అన్న కథతో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ‘చిత్రలహరి’ కూడా ప్రభోదాత్మక సందేశ సినిమా అనాలి. విజయ్‌కృష్ణ (సాయితేజ్) ఫెయిల్యూర్ స్టోరీని నేరేట్ చేసే విధానం ఆడియన్స్‌కి గట్టిగా కనెక్ట్ కాలేదేమోకానీ మంచి సినిమా కాదని మాత్రం ఎవ్వరూ అనలేదు. ‘అనుకోకుండా సీఎం సీట్లో కూర్చోవాల్సి వస్తే -ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి’ అన్న కథతో ఆడియన్స్ ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ చిత్రం నోటా సైతం సందేశాత్మకమే. నిజానికి సీఎం సీటు, రాజకీయం అనే విషయాన్ని పక్కనపెడితే -యుక్తవయసులో అనుభవం, అవగాహన లేని సమస్య కళ్లముందుకొస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న మెసేజ్ ఇందులో అంతర్లీనంగా కనిపిస్తుంది. అయితే చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పి ఒప్పించకుండా -అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్లే ఒక్కోసారి ఇలాంటి చిత్రాలు ఆడియన్స్ మనసుల్లోకి పోకుండా దూరంగా ఉండిపోతున్నాయి. అది వేరే విషయం.
ఇక -ఆమధ్య వచ్చిన జూ.ఎన్టీఆర్ చిత్రం ‘జనతా గ్యారేజ్’, ఆ తరువాత వచ్చిన ‘అరవిందసమేత.. వీర రాఘవ’ చిత్రాలనూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెసెజ్ చిత్రాలుగానే చూడాలి. ఎక్కడో ముంబైలో ఉంటూ ప్రకృతిని హాని చేయొద్దంటూ తిరిగే కుర్రాడు -హైదరాబాద్‌కు చేరి సమాజానికి చెడు చేస్తున్న వాళ్ల భరతం పట్టే జనతా గ్యారేజ్‌ను ఎందుకు లీడరయ్యాడన్నది కథ. పాత్రలమధ్య బంధాలను కథకోసం కలిపినా -కాన్సెప్ట్ మాత్రం ‘సమాజ హితవు’నే సూచిస్తుంది. ‘ఫ్యాక్షన్ కక్షలతో రగిలిపోతున్న సీమను ప్రశాంతంగా చూడాలనుకున్న వీర రాఘవ (జూ. ఎన్టీఆర్) లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది అరవింద సమేత.. కథ. గొడవల తరువాత బతుకులు ఎంత భయానకంగా ఉంటాయోనన్న కానె్సప్ట్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా తెరకెక్కించి, దానికో పరిష్కారమార్గాన్ని ఎన్టీఆర్ రూపంలో చూపించి హిట్టుకొట్టాడు. కుటుంబాలు కలిసుంటేనే ఆనందం -అన్న కానె్సప్ట్‌తో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘శతమానంభవతి’, ఎప్పటికైనా బోర్డర్‌కు వెళ్లి దేశం కోసం యుద్ధం చేస్తూ చనిపోవాలన్న బలమైన ఆశయం కలిగిన సోల్జర్ (అల్లు అర్జున్) కథను చూపించే ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’, క్యాన్సర్ బారిన పడిన మిత్రుడిని బంతికించుకోడానికి స్నేహితులు ఎలాంటి మార్గాలు అనే్వషించారు, ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నారు అన్న సీడ్‌తో వచ్చిన ‘హుషారు’.. ఈ సినిమాలన్నీ కానె్సప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు కాదని అలేనం. ఒక బలమైన సందేశాన్ని ఆడియన్స్ ఇచ్చే ఉద్దేశంతో వచ్చినవే. అందులోంచే కమర్షియల్ విజయాలూ అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను సైతం ‘మెసేజ్’ బేస్డ్‌గానే తీసుకొచ్చారు. సామాజిక హితవుకోరే వ్యక్తి (శంకర్-చిరంజీవి) జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించిన ఓ ఖైదీ (కత్తిశీను- చిరంజీవి)
-అతని బాధ్యతల్ని భుజాన వేసుకుని రైతులకు ఎలాంటి మేలు చేశాడన్న ఇతివృత్తంతో వచ్చిన ‘ఖైదీ నెం 150’ మంచి విజయాన్ని అందుకుంది. ‘కులవృత్తుల్లోని నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటే అద్భుతాలే సాధించొచ్చ’న్న కాన్సెప్ట్ తో బాలీవుడ్‌లో వచ్చిన ‘సూరుూ ధాగా ’ చిత్రాన్ని ఈకోవలోనే చూడాలి. ఇలా ఒకటేమిటి జయాపజయాలతో సంబంధం లేకుండా ‘కానె్సప్ట్ బేస్డ్ మెసేజ్’ను బలంగా ఆడియన్స్‌కి అందించే చిత్రాలే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండ్ సృష్టిస్తున్నాయని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.