మెయన్ ఫీచర్

కాంగ్రెస్ ప్రక్షాళనకు తరుణమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 60 ఏళ్లపాటు పాలించిన ఆ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమా? ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇంకా పట్టువీడడం లేదు. మొన్నటి సార్వత్రిక సమరంలో కేరళ, పంజాబ్, తమిళనాడుల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకి 26 శాతం వోట్లు, 91 సీట్లు, ఎన్డీఏకి 45 శాతం ఓట్లు, 354 సీట్లు , ఇతరులకు 29 శాతం ఓట్లు, 97 సీట్లు వచ్చాయి. విడిగా చూస్తే కాంగ్రెస్‌కు 19.5 శాతం, భాజపాకు 37.4 శాతం ఓట్లువచ్చాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 440 సీట్లకు పోటీ చేసి 206 సీట్లు సాధించింది. 28.55 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ-2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. 464 సీట్లకు పోటీ చేసి 19.5 శాతం ఓట్లతో 44 సీట్లను తెచ్చుకున్నా, లోక్‌సభలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 423 సీట్లకు పోటీ చేసి 19.8 శాతం ఓట్లతో 52 సీట్లను గెలుచుకుని, ప్రతిపక్ష హోదా లభించక మరింతగా నీరసపడింది.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మట్టికరచింది. ఈ రాష్ట్రాల్లో ఇప్పట్లో కోలుకుంటుందనే నమ్మకం లేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్ కుమారుడు ఓటమి చెందారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడు నుంచి గెలిచి ఉండకపోతే ఆయన రాజకీయ చరిత్ర మరింత మసకబారిపోయేది. అమేథీలో రాహుల్ పరాజయం ఆ పార్టీ శ్రేణులను కుంగదీసింది. ఉత్తరప్రదేశ్‌లో సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇంతటి వైఫల్యాలను మూటకట్టుకున్నా కాంగ్రెస్ నేతలు తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు.
రాహుల్ చుట్టూ పాతతరం నేతలు, తప్పుదారి పట్టించే నాయకులు ఉన్నారు. యువతరానికి ప్రాధాన్యం లేనందున కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రజలకు దూరమవుతోంది. రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వస్తే జనం విరగబడి ఓట్లు వేస్తారనుకునే భ్రమలు పటాపంచలయ్యాయి. ప్రజలు వ్యక్తి ఆరాధన సంస్కృతిని ఏవగించుకుంటున్నారు. 18-40 ఏళ్ల వయసు వారు కాంగ్రెస్ పనితీరును ఆమోదించడం లేదని తేలింది. ‘స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్ నేతలు ఎన్నో త్యాగాలు చేశారు.. సెక్యులర్ భావాలున్నందున మా పార్టీకే వోటు వేయండి..’ అని సోనియా, రాహుల్, ప్రియాంక ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారంలో, అంతకుముందు ప్రధాని మోదీని రాహుల్ ఇష్టం వచ్చినట్లు విమర్శించడాన్ని జనం ఆమోదించలేదు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ వల్ల అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పదే పదే చేసిన ఆరోపణలను ప్రజలు విశ్వసించలేదు.
దేశంలో 85 శాతం ఉన్న హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పు. మైనారిటీల కొమ్ముకాసే విధానాల వల్ల ఆ పార్టీ ప్రధాన జనజీవన స్రవంతికి దూరమైంది. సెక్యులర్ ముసుగులో కుహనా లౌకికవాదాన్ని నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. అందుకే ప్రాంతాలకు అతీతంగా జనం ఆ పార్టీకి గుణపాఠం నేర్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం తలుపులు తెరిపించిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని చెప్పవచ్చు. అయినప్పటికీ హిందువుల మనోభావాలను గౌరవించాలన్న ధ్యాస ఇప్పటి తరం కాంగ్రెస్ నేతలకు లేదు. రామమందిరం నిర్మాణంపై భాజపా సర్కారు పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటన చేసి ఉంటే హిందువులు దూరమయ్యేవారు కాదు. ఇపుడు ‘మందిర్-మసీదు’ అంశంపై పోరాటం చేసేందుకు హిందువులు కాని, ముస్లింలు కాని సిద్ధంగా లేరు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి, వికాసానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే బీజేపీ సైతం రామమందిర నిర్మాణంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
భారత ప్రజలు మతతత్వవాదులు కారు. కాని తమ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిస్తే ఊరుకోరు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 2014లో వైకాపా విజయానికి దాదాపు సమీపంలోకి వచ్చి ఓటమి చెందడానికి కారణం ఒకటే. తమకు విశ్వాసం ఉన్న మత సంప్రదాయాలను జగన్ కుటుంబం బాహాటంగా ప్రదర్శించడమే కారణం. అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి జగన్ తన వైఖరిని మార్చుకున్నారు. హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన ఒక పీఠాధిపతి ఆశీస్సులు పొందడం, తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లడం, హైందవ ధార్మిక విధానాలను ఆచరించడం వంటి అంశాలు జగన్ మెజారిటీకి కారణమయ్యాయి.
చంద్రబాబుపై వ్యతిరేకత ఒక్కటే జగన్‌ను జనం గెలిపించలేదు. ఆంధ్రాలో అన్ని వర్గాల ప్రజలు ఈ సారి పాజిటివ్‌గా వైకాపాకు ఓట్లు వేశారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, అగ్రవర్ణాలు, బీసీలు, దళితుల్లో హిందుత్వ భావనలు ఉన్న వారు వైకాపాకు ఓట్లు వేయలేదు. జగన్ తీరులో వచ్చిన మార్పులు ఇపుడు ఈ వర్గాలను ఆకట్టుకున్నాయి. అధికారం వచ్చింది కదా అని హైందవ సంస్కృతి అనే మార్గాన్ని పక్కనపెడితే తప్పనిసరిగా వ్యతిరేక పవనాలను ఏ పార్టీ అయినా చవిచూడాల్సి వస్తుంది. జగన్ తన వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలు ఎలా ఉన్నా, గుళ్లు, గోపురాలు, స్వామిజీలు, ప్రార్థనా మందిరాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు తొమ్మిదేళ్ల పాటు అహర్నిశలు పేదలతో మమేకం కావడం, అన్ని వర్గాలను అక్కున చేర్చుకోవడం, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం, ఇచ్చిన మాటకుకట్టుబడి ఉండడం వంటి లక్షణాలు జగన్‌లో ప్రజలకు కనిపించాయి. ఈ సంగతి చూసైనా కాంగ్రెస్ తన వ్యవహార శైలిని మార్చుకుంటే బాగుంటుంది. తాను చేతులారా దూరం చేసుకున్న జగన్ నేడు రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఏ విధంగా ఎదిగారో కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఇక, కాంగ్రెస్ అధినాయకత్వం మన వైమానిక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌లో చేసిన సర్జికల్ దాడులను శంకిస్తూ ప్రకటనలు చేసింది. ప్రధాని మోదీని, మన సైనికులను, రక్షణశాఖను, సీబీఐ, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ప్రజలు మోదీని నమ్మడంతో భాజపాకు 2014లో కంటే ఇపుడు అఖండ విజయం తెచ్చిపెట్టారు. దళితులు, బీసీలు, అగ్రవర్ణాల్లో మెజారిటీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీ బీసీలు, దళితులు, బడుగు వర్గాలకు దూరమైంది. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవసరమైన అజెండా కాంగ్రెస్ వద్ద లేదు. రాహుల్, ఆయన బృందంలోని నాయకులు ప్రజలను నమ్మించడంలో విఫలమయ్యారు. గత ఏడాది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన ప్రజలే తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని మట్టికరపించారు.
పాకిస్తాన్ పట్ల మోదీ సర్కారు కఠిన వైఖరిని అవలంబించడాన్ని జనం మెచ్చుకున్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భాజపా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. దేశ భద్రత విషయంలో కేంద్రం విధానాలను సైతం కాంగ్రెస్ తూర్పారబట్టింది. గత ఐదేళ్లలో కశ్మీర్ మినహా దేశంలో మరెక్కడా ఉగ్రవాద దాడులు లేవు. కేరళలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయంటే అక్కడ వామపక్ష ఫ్రంట్ పాలనతో ప్రజలు విసుగు చెందారు. బలమైన ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్‌ను గెలిపించారు. తమిళనాడులో బలమైన డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది. అందుకే ఆ కూటమికి సీట్లు ఎక్కువగా వచ్చాయి. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నాయకత్వం వల్ల కాంగ్రెస్‌కు సీట్లు బాగా వచ్చాయి.
కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా మళ్లీ సోనియా గాంధీని ఎన్నుకున్నారు. ఆమె స్థానంలో మరోనేతను ఎన్నుకుని ఉంటే బాగుండేది. గాంధీ కుటుంబం అధికారం లేకుండా ఉండలేదు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తులను నియమిస్తే ఆ పార్టీ నేతలు భరించే స్థితిలో లేరు. కాంగ్రెస్ తన విధానాలను మార్చుకోవాల్సి ఉంది. పార్టీ నూతన అధ్యక్షుడిగా యువనేతను నియమించాలి. ఆ సా హసం సోనియాగాంధీ చేస్తారా? రామజన్మభూమి, 370వ అధికరణ, ఉమ్మడి పౌరస్మృతి వంటి విషయాల్లో పట్టుదలకు పోకుండా తన విధానాలను మార్చుకుని ముందడుగు వేయాలి. కులం, మతం, సంస్కృతి, సంప్రదాయాలను జనం ఎన్నటికీ వదులుకోరు. ఈరోజు జనం సంక్షేమ విధానాల గురించి పట్టించుకోవడం లేదు. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడే పార్టీ బీజేపీ అని నమ్మి గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ కొత్తతరం యువనేతలకు కీలక పదవులను అప్పగించి, కాలదోషం పట్టిన విధానాలకు పాతర వేయాలి. ఆ పార్టీ బతికి బట్టకంటాలంటే సంస్థాపరంగా ప్రక్షాళన చేసి, అన్ని విధాలా పటిష్టం చేసుకోవాలి. ఆ పార్టీ మనుగడకు ఇప్పట్లో వచ్చే ముప్పేమీలేదు. విధానాలు మార్చుకోకుండా ఇలాగే కుటుంబ పార్టీగా కొనసాగితే, ఐదేళ్ల తర్వాత మరో డజను సీట్లు పెరుగుతాయే తప్ప అధికారంలోకి రావడం కల్ల. బీజేపీ ఏకపక్ష విధానాలకు చెక్ పెట్టేందుకు బలమైన ప్రతిపక్షం ఉండాలి. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో విఫలమైంది. మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. బీజేపీ వైభోగాన్ని చూసి విచారించే బదులు, లోపాలను సరిదిద్దుకుని ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ కదలాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097