మెయిన్ ఫీచర్

పైడిమర్రి పలుకులు.. మధుర దేశభక్తి గుళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ ప్రతిజ్ఞ
భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ
నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను
కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని
పెద్దలందర్ని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా
నడుచుకుంటాను. జంతువులపట్ల దయతో ఉంటాను. నా దేశంపట్ల, నా ప్రజలపట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ
చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
*
ఉదయం తొమ్మిది గంటలు కాగానే బడిపిల్లలంతా బడి ఆవరణలో జరిగే ప్రార్థనా సమావేశానికి ఎంతో ఉత్సాహంగా గుమిగూడుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాలలలో నిత్యమూ ప్రార్థనాసమయాల్లో రవీంద్రుని జాతీయగీతం, బంకించంద్ర జాతీయ గేయం, శంకరంబాడి రాష్ట్ర గీతం సరసన ‘‘భారతదేశం నా మాతృభూమి / భారతీయులందరూ నా సహోదరులు / నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను..’’ అనే తెలుగు వాక్యాలు పిల్లల నోటివెంబడి మార్మోగుతుంటాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఈ తెలుగు పలుకులు అనేక భాషలలో తర్జుమా కాబడి జాతీయ గీతాలయిన వందేమాతరం, జనగణమన సరసన విద్యార్థులు యావన్మందీ ఆలపిస్తుంటారు. ఆ పలుకులు పలికేటప్పుడు ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో తనలో దేశభక్తి భావాలను గుండెలనిండా నింపుకొని దేశమాత సేవలో నేను సైతం అంటూ ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అచ్చటి వాతావరణం గోచరిస్తుంది. ఈ తెలుగు పలుకులు రవీంద్రుని జనగణమన, బంకించంద్ర వందేమాతరంతో పోటీపడి నిలుస్తున్నాయంటే ఆ మహత్తర దేశభక్తిని పెంపొందించే పలుకులు ఒక మహనీయుని కలమునుండి జాలువారినవిగా గుర్తించగలం. అంటే రవీంద్రుని, బంకించంద్ర, శంకరంబాడిలకు ఏ మాత్రమూ తీసిపోని రచయితగా ఈ వాక్యాలు రాసిన కవిని మనం గుర్తించగలం. దేశమంటే మట్టికాదోయి.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ దేశభక్తి గేయం సార్వజనీనమైనది. ఏ దేశంవారైనా, ఏ ప్రాంతంవారైనా, ఏ భాషవారైనా తమయొక్క దేశభక్తిని ఈ దేశభక్తిగీతం ద్వారా అన్వయించుకోవచ్చు మరియు ఆస్వాదించవచ్చును కూడా. అలాంటి గురజాడ దేశభక్తి గేయానికి సరిజోడుగా నిలిచే సార్వజనీనమైన లక్షణాలు కలిగిన తెలుగు పలుకులు ఉన్నాయంటే అది కేవలం పైడిమర్రివారి ‘ప్రతిజ్ఞా పలుకులే’ అని చెప్పడంలో ఏమాత్రం సందేహపడనక్కర్లేదు. అందుకే దేశవ్యాప్తంగా వున్న అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడిన ఈ తెలుగు పలుకులను పిల్లలు తమ నోటివెంట పలుకుతున్నారు. ఇంతటి గొప్ప దేశ సేవ చేసిన వ్యక్తిగా పైడిమర్రి వారిని గుర్తించడంలో మాత్రం మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చు. గురజాడ, కందుకూరిలోని సంస్కరణభావాలు, శ్రీశ్రీలోని సామ్యవాద భావాలు కలగలిసిన రూపంగా ఈ ‘ప్రతిజ్ఞా పలుకులు’ రచించిన పైడిమర్రి వారిని అభివర్ణించవచ్చు. ఇది కేవలం ఒక భాషకు చెందిన పలుకులే కాదు యావత్ భారత జాతీయ సమైక్యతా పలుకులు. జాతీయతావాద పరిమళ కుసుమాలు. దేశభక్తిని పెంపొందించే దివ్య సందేశాలు. మధుర దేశభక్తి గుళికలు కూడా. ముఖ్యంగా జాతీయ పండుగలు మరియు స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్న సందర్భాలలో ఈ వాక్యాల ప్రాముఖ్యతను మనం పదేపదే తెలుసుకోవడం జరుగుతున్నది. ‘ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జనియించినాడనీ స్వర్గఖండమున’ అనే రాయప్రోలువారి ప్రబోధ గీతంలోని భావాన్ని పరిశీలించినట్లయితే, అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు, ఉద్దండ సాహితీమూర్తులు ఈ నేలపై మన పూర్వజన్మ సుకృతంగా జన్మించినారు. పైడిమర్రివారు లాంటి జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను పెంపొందించేవారు మాత్రం అరుదుగా పుడుతుంటారు. పైడిమర్రి వారి ప్రతిజ్ఞాపదాలు వసుధైక కుటుంబ భావనను మరోసారి గుర్తుకు తెస్తాయి. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశేషమైన లక్షణముగల భారతదేశంలో జాతి, మత, కుల భేదాలను మరచి అందరూ సోదర సోదరీమణులుగా మెలగాలనే రాజ్యాంగ విలువలను పెంపొందించే దిశగా ప్రతిజ్ఞ ఉండడం గర్వకారణం. చికాగో సభలో నరేంద్రుడు ‘సోదర సోదరీమణులారా..’ అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం, తద్వారా భారతీయ హిందూ ధర్మాన్ని మరియు వైదిక సారాన్ని తెలియజేయడంలో ముందున్నారు. అదే సోదర, సోదరీ భావనను తన ప్రతిజ్ఞలో పైడిమర్రివారు నిబిడీకృతం చేయడం ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతిజ్ఞ సూచిస్తున్నది. అయితే భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక, సామాజిక విలువలను కాపాడడంలో భావి భారత పౌరులు ముందుండాలనే భావనను తన ప్రతిజ్ఞ ద్వారా పిల్లల్లో కలుగజేయుట పైడిమర్రివారి ముందుచూపునకు నిదర్శనంగా చెప్పవచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే వేదసారాన్ని తన అలతి అలతి పదాలతో, సాధారణ వాడుక మాటలతో తన ప్రతిజ్ఞలో ఇమడ్చడం, అనాదిగా వస్తున్న భారతీయ సంప్రదాయాలను నిలబెట్టడంగా చెప్పుకోవచ్చు. ‘పరోపకారార్థం ఇదం శరీరమ్’ అన్న ఆర్యోక్తి భావనను తెలియజేస్తూ దేశంలోగల పౌరులందరూ సేవానిరతిని కలిగియుండాలని తన ప్రతిజ్ఞ ద్వారా పైడిమర్రివారు గుర్తుచేయడం ఒక సామాజిక దృక్కోణంగా భావించవచ్చు. ఎల్లప్పుడూ ఇతరుల శ్రేయస్సును కోరుతూ వారి శ్రేయస్సులోనే తన ఆనందాన్ని వెతకమని తన ప్రతిజ్ఞలో చెప్పడంపట్ల పైడిమర్రివారి భారతదేశ సేవాభావానికి కొలమానంగా చెప్పవచ్చు. అలాంటి మహోన్నత మాటలను మనకందించిన పైడిమర్రివారు భారతదేశ సాహితీ జగత్తులో మకుటాయమానంగా వెలిగిపోతారని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్లగొండ జిల్లా అనే్నపర్తి అనే గ్రామంలో 1916 జూన్ 10న వెంకట్రామయ్య, రాంబాయమ్మ దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం అనే్నపర్తి, నల్గొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. పైడిమర్రి వారి భార్య పేరు వెంకటరత్నమ్మ. జమీందారు, భూస్వామి విధానాలను నిరసిస్తూ ఆనాటి వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా అనేక కథలు రాశారు. తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ అనే చిన్న నవల రాశారు కూడా. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు. గోల్కొండ, సుజాత, ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్, ఆనందవాణి మొదలగు వివిధ పత్రికలలో వీరి రచనలు ప్రచురింపబడ్డాయి. పైడిమర్రివారి రచనలు భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఆయన గ్రంథాలయాన్ని తన కుమారులు ‘గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలకు’ అప్పగించారు. కానీ ప్రస్తుతం అది మూతబడింది. ఈయన హైదరాబాద్ రాష్ట్రంలోని ట్రెజరీ విభాగంలో పనిచేశారు.
పైడిమర్రి 1962లో విశాఖలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నపుడు ఈ ‘ప్రతిజ్ఞ’ పలుకులను తయారుచేశారు. భారతదేశానికి, చైనాకు యుద్ధం జరుగుతున్న రోజులవి. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రజల్లో ప్రాథమిక దశ నుండి దేశభక్తి భావాన్ని నూరిపోయాలని ఆమేరకు కొన్ని దేశభక్తి గేయాలు కవులతో రాయించి పాఠశాల విద్యార్థులతో సాధన చేయించడం మొదలుపెట్టింది. అప్పటికే పైడిమర్రి పలు భాషలలో నిష్ణాతులు కావడంవల్ల అంతర్జాతీయ విషయాలను నిత్యమూ తెలుసుకొని ఔపోసన పట్టడంవల్ల మన దేశంలోగల విద్యార్థులలో అనగా ప్రాథమిక స్థాయి నుండే దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేశారు. అప్పటికే పలు రచనలు చేసిన అనుభవంతో పైడిమర్రి ప్రతిజ్ఞకు పదాలు రాసి ఒక రూపం తీసుకొచ్చారు. అయితే ఈ సార్వజనీనమైన ప్రతిజ్ఞను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఎలా? అని ఆలోచించేటప్పుడు, అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డిగారి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా వున్న విజయనగరం రాజావారైన పి.వి.జి.రాజాగారి దృష్టికి తెనే్నటివారి సాయంతో తీసుకువెళ్ళారు. ఈ దేశానికి ప్రతిజ్ఞ విలువను మరియు అవసరాన్ని రాజుగారికి తెనే్నటివారు వివరించారు. 1964లో బెంగుళూరులో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యాలయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పైడిమర్రివారి ప్రతిజ్ఞను జాతీయ ప్రతిజ్ఞగా ప్రభుత్వం స్వీకరించింది. తరువాత ఆ ప్రతిజ్ఞను అన్ని భాషలలోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుండి దేశమంతటా పాఠశాలల్లో విద్యార్థులు చదివేటట్లు ఏర్పాటుచేసింది. అయితే పైడిమర్రి వారి రాసిన ప్రతిజ్ఞ కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులకు గురైంది. పైడిమర్రివారి ప్రతిజ్ఞ రచించి నేటికి 54 సంవత్సరాలు పూర్తయింది. భారత ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆమోదించి 51సంవత్సరాలు నిండినది. 2011లో ప్రముఖ పత్రికా సంపాదకుడు ఎలికట్టె శంకర్రావు ‘నల్గొండ కవుల కథలు’ రాస్తున్న సమయంలో పైడిమర్రి వారి గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన పైడిమర్రి వారి కుమారుడు పి.వి.సుబ్రహ్మణ్యంని కలవగా ప్రతిజ్ఞను తన తండ్రే రాశారని శంకరరావుకి తెలియజేశారు. భారతదేశానికి ఒక జాతీయ ప్రతిజ్ఞ అందించిన మహనీయుని మూలాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో ఎలికట్టెవారు మరికొంతమంది తెలంగాణ సాహితీ మిత్రులతో కలిసి ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి పేరుతో ఒక ప్రత్యేక సంచికను విడుదల చేశారు. పైడిమర్రి వారి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రించేందుకుగాను ‘ఉత్తరాంధ్ర రక్షణ వేదిక’ మరియు ‘తెనే్నటి ఫౌండేషన్’ వారు తీవ్రంగా ప్రయత్నించారు. అలాగే జన విజ్ఞాన వేదిక కృష్ణా జిల్లా శాఖవారు ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకువెళ్ళగలిగారు. మందడపు రాంప్రదీప్ మరియు పోతురాజు కృష్ణయ్య ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గ పరిధిలో చదువుతున్న 25 వేలమంది విద్యార్థుల సంతకాలు సేకరించి సీడీ రూపంలో పొందుపరిచి అప్పటి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేనిగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేయడమైనది. పైడిమర్రివారి జీవిత చరిత్ర రాసిన కరపత్రాలు ముద్రించి వివిధ పాఠశాలలకు పంపిణీ చేయడమైనది. ఎట్టకేలకు జనవిజ్ఞానవేదిక, ఇతర వేదికలు మరియు పలువురు అభ్యుదయవాదుల కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ముద్రించబడిన పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ పక్కన పైడిమర్రి వారి పేరు చేర్చడమయినది. అలాంటి ప్రతిజ్ఞను రాసిన పైడిమర్రి వారిజీవిత చరిత్రను ఎం.రాంప్రదీప్ తెలుగులో ‘భారతదేశం నా మాతృభూమి’ పేరుతో రాయగా, అది 2011 జనవరిలో విజయవాడ పుస్తక మహోత్సవంలో ప్రముఖ విద్యావేత్త కె.ఎస్.లక్ష్మణరావు ఆవిష్కరించారు.
ప్రస్తుతం ఆంగ్లంలో ‘ది ఫర్గాటెన్ పేట్రియాట్’ అనే పేరుతో ఎం.రాంప్రదీప్ అనువదించగా, హిందీలో ‘భారత్ మేరా మాతృభూమి హై’ పేరిట రేపాక రఘునందన్ తర్జుమా చేశారు. ఇంకా ప్రతిజ్ఞ వివరాలు తెలుపవలసిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా రాంప్రదీప్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ప్రతిజ్ఞ పైడిమర్రివారిదేనని జవాబిచ్చారు. భారతీయులంతా ఒక్కటేనన్న భావం చాటిచెప్పే ప్రతిజ్ఞకు ప్రాముఖ్యత కల్పించాల్సిన బాధ్యత మన తెలుగు ప్రజలపై తప్పకుండా ఉంది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దేశభక్తి భావాలను భావి భారత పౌరుల మస్తిష్కాలలో నింపేందుకు తాను కూర్చిన జాతీయ ప్రతిజ్ఞ పక్కన అన్ని భాషలలో ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో పైడిమర్రివారి పేరును ముద్రించేటట్లు చేయడానికి మనమందరం కంకణం కట్టుకోవాలి. పైడిమర్రివారి ఉనికిని కాపాడేందుకు మేధావులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేసిన అనేక ప్రాతినిధ్యాల తర్వాత కూడా 2013 మరియు 2016 సంవత్సరాలలో ప్రచురించబడిన 7, 9, 10 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ పక్కన రచయితగా పైడిమర్రి వారి పేరును ఉంచకపోవడం దురదృష్టకరంగా భావించాలి.
తెలుగు తేజాలు ఇద్దరే- జాతీయ స్థాయిలో అనగా దేశమాత సేవలో తరించారు అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఒకరు జెండా వెంకయ్యగా పేరుగాంచిన త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యగారు, రెండవవారు భారతావనిపై నిత్యమూ పౌరుల నోటవెంబడి మారుమ్రోగేట్లు జాతీయ ప్రతిజ్ఞ పలుకులు రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు. ఈ ప్రతిజ్ఞ పదాలు భువిపై నినదించినంతకాలం పైడిమర్రివారు దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచిపోతారు. అలాంటి పైడిమర్రి ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు అమరపురికి’ అన్న శ్రీనాథుని మాటను గుర్తుకుతెస్తూ 1988 ఆగస్టు 13న తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి అనంతలోకాలలో కలిసిపోయారు.
*
(జూన్ 10న
పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా)

- పిల్లా తిరుపతిరావు, 7095184846