మెయిన్ ఫీచర్

కన్నపేగుకు కన్నీరు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకు మొదలుపెట్టగానే బాధ్యతలు మరిచిన పుత్రరత్నాల నిర్వాకానికి నిదర్శనాలు వృద్ధాశ్రమాలు.. అవసాన దశలో ప్రేమానురాగాలు, ఆప్యాయతలే ఔషధాలుగా బతుకుతూ రోజులు లెక్కపెట్టుకునే పండుటాకుల పాలిట అవి బందిఖానాలు.. ‘చిట్టితల్లి నిద్ర లే.. స్కూలుకు టైమవుతోంది..’ అంటూ నిదుర లేపిన అమ్మానాన్నలు.. ఇప్పుడు వృద్ధాశ్రమంలో లేవలేని స్థితిలో ప్రేమగా మాట్లాడే నాలుగు మాటలకోసం తపించిపోతున్నారు. జీవిత చరమాంకంలో నాలుగడుగులు వేసేందుకు ఆసరాగా కొడుకు చేతికి బదులుగా చేతికర్రను వెతుక్కుంటున్నారు. ఆప్యాయత లేదు.. అనురాగం లేదు.. ప్రేమ లేదు.. ఆఖరిదశలో మనుమలు, మనుమరాండ్లతో ముచ్చట్లాడట్లేదే.. అని ఆ కన్నపేగులు కన్నీరు పెడుతున్నాయి.. వివరాల్లోకి వెళితే..
అందరూ ఉన్నా అనాథలుగా నిలుస్తున్న కొందరు పండుటాకులకు వృద్ధాశ్రమాలు చిరునామాగా మారుతుండగా, మరికొందరు ఆమాత్రం సౌకర్యానికి కూడా నోచుకోకుండా రోడ్ల పాలవుతున్నారు. కనిపెంచిన కొడుకునే కనికరించక కాఠిన్యంతో వ్యవహరిస్తుంటే కన్నీళ్ల పర్యంతమై కాసింత ఆసరా కోసం భోరున విలపిస్తున్న ఘటనలు నేడు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి పుత్రరత్నాల ఆగడాలకు చెక్ పెట్టాడు బీహార్ సి.ఎం. నితీష్ కుమార్. తల్లిదండ్రులను చూడకున్నా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించినా వారిని జైలుకు పంపిస్తానని చెప్పాడు నితీష్ కుమార్. వెంటనే దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల అయ్యింది.
చదివించాలంటే తల్లిదండ్రులు కావాలి.. పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు కావాలి.. పుట్టిన పిల్లలను చూసేందుకూ తల్లిదండ్రులే కావాలి.. వారికి కాస్త వయసు మళ్లి ఓపిక తగ్గగానే ఆశ్రమాలకు వెళ్లిపోవాలి. ఇదీ నేటి పరిస్థితి.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చాలామంది పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలి పెడుతున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతూ.. ఇందులో ఏసీ గదులున్నాయి. వైఫై సదుపాయం, డాక్టర్ల సదుపాయం, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్స్.. ఇలా ఒకటేమిటి అన్ని అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇక మీకు ఎటువంటి అసౌకర్యం ఉండదు అంటూ.. తన భార్యాపిల్లలను వినోదానికో, విహారయాత్రకో వెళ్లి సంతోషంగా గడుపుతున్న ఫొటోలను వైఫై ఉంది కదా చూసి సంతోషించండి అంటూ వారికి పంపుతున్నారు సదరు పుత్రులు. అవి ఆధునిక సదుపాయాల మాటున కట్టిపడేసే చెరసాలలని ఆ పుత్రరత్నాలకు ఇప్పుడు తెలియదు. రేపు వారు కూడా వృద్ధులుగా మారి, వారికీ వృద్ధాశ్రమాలవైపు దారి చూపెడితే తెలుస్తుంది.
నిబంధనలు
నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు దాటిన వారందరినీ వృద్ధులుగా పరిగణిస్తారు. 60 సంవత్సరాలకు పైబడిన వాళ్లు వారి పోషణ బాధ్యతను డిమాండ్ చేయవచ్చు. ఆస్తులు రాయించుకుని తల్లిదండ్రులను గాలికొదిలేస్తే సెక్షన్ 23 ప్రకారం ఆ ఆస్తిని తిరిగి పొందే వీలుంటుంది. వారికి రాయించిన రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసుకోవచ్చు.
* వయో వృద్ధుల కోసం 2007లో ప్రభుత్వం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని అమలు పరిచారు. 2011లో ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంక్షేమ నియమావళిని ప్రవేశ పెట్టింది. ఈ చట్టంలో వృద్ధుల సంక్షేమం కోసం పలు నిబంధనలను పొందుపరిచారు.
* నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వృద్ధులు ఈ చట్టం ద్వారా పోషణ, సాధారణ జీవనం, సంరక్షణ పొందే హక్కును కలిగి ఉన్నారు.
* పిల్లలు, బంధువుల నిరాదరణకు గురైనవారు ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం న్యాయస్థానానికి సాధారణ జీవనం, పోషణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఏదైనా సందర్భంలో పిల్లలు, బంధువులు వృద్ధులను, వారి సాధారణ జీవనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు నెలసరి భృతి పొందేందుకు చట్టంలో సెక్షన్ 8 ప్రకారం అర్హులు.
* కేసు విచారణలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, వృద్ధులు చట్టప్రకారం రిజిస్టరైన స్వచ్ఛంద సంస్థ లేదా వృద్ధాశ్రమంలో గడిపేందుకు సెక్షన్ 4 ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి పెట్టిన వారికి కూడా శిక్షలున్నాయి. మూడు నెలల జైలుశిక్ష లేదా ఐదువేల రూపాయల అపరాధ రుసుము చెల్లించాలి. కొన్నిసమయాల్లో రెండింటినీ విధిస్తారు.
రివర్స్ మార్టిగేజ్
వృద్ధుల పోషణ విషయంలో కుటుంబీకులు నిరాసక్తత వ్యక్తం చేసిన పక్షంలో లేదా శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురైనప్పుడు, ఆస్తి వివాదాల కారణంగా ఆదరణకు నోచుకోని సందర్భాల్లో ట్రైబ్యునల్ అధికారి విచక్షణతో ఇచ్చే ఆదేశాలే ప్రధానం. ఇందులో చివరగా వచ్చేదే రివర్స్ మార్టిగేజ్. ఇది అత్యంత ప్రభావవంతమైనది. ఆస్తులను తమ పేరిట మార్పిడి చేసుకున్న వారసులు, ఆ తరువాత తల్లిదండ్రులను పట్టించుకునేందుకు ముఖం చాటేస్తే.. రివర్స్ మార్టిగేజ్ అండగా ఉంటుంది. ఆస్తులను బ్యాంకు సాయంతో రివర్స్ మార్టిగేజ్ చేసే అవకాశం ఉంది. తనఖా పెట్టుకుని, వారసులతో ఎలాంటి సంబంధం లేకుండా వారికి పోషణ, నిర్వహణ నిమిత్తం నెలనెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి బ్యాంకులు. తల్లికానీ, తండ్రికానీ వయోవృద్ధుల్లో నిరాదరణకు గురైనవారు ఎవరైనా ఫారం- ఎ ద్వారా ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఖర్చులు, దళారులు, మధ్యవర్తులు లేకుండా బ్యాంకు నుండి నేరుగా సహాయం పొందవచ్చు. ఇందుకోసం రూపొందించిన దరఖాస్తులో పేరు, తండ్రిపేరు, వయస్సు, చిరునామా, చరవాణి నెంబరు, మెయిల్ చిరునామా, వారి తరఫున అధీకృతులైన వ్యక్తులు లేదా సంస్థ, చిరునామా, సమస్య, ప్రతివాదుల వివరాలు, ఆశించే ఉపశమనం తదితరాలను సంక్షిప్తంగా దరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఫిర్యాదులోని అంశాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, వాటి సంఖ్య, జాబితా వివరాలను సైతం దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. ఇది కూడా పిల్లల నుండి కాకుండా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను వారే స్వయంగా బ్యాంకులో తనఖా పెట్టి వారి అవసరాలను తీర్చుకోవచ్చు. ఆ ఆస్తులు పిల్లలు కావాలనుకుంటే తల్లిదండ్రుల తదనంతరం బ్యాంకు తనఖా నుండి ఆ ఆస్తులను విడిపించుకోవాల్సి ఉంటుంది.

- సన్నిధి