మెయిన్ ఫీచర్

మత్తు వదిలిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మాదకద్రవ్య నియంత్రణ దినోత్సవం
*
దేశ భవిష్యత్తుకు యువత ఎంతో కీలకం. ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టీకరించింది. మాదకద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకరమైన వ్యసనం. మానవ శరీరానికి మిక్కిలి హానికలిగించే పదార్థాలు తీసుకోవడంవల్ల ఆరోగ్యం, ఆనందం రెంటిని కోల్పోతారు. వీటిని డ్రగ్స్ అని అంటారు. ఈనాడు యువతరాన్ని దారిమళ్ళించి ఇవి చెడుమార్గాల్లో నడిపిస్తున్నాయి. దురలవాట్లలో మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. పంజాబ్ ఇప్పటికే డ్రగ్స్‌కోరలో చిక్కి విలవిల్లాడుతున్నాయి. బాధితుల్లో 15 ఏళ్లలోపువాళ్లు ఉంటున్నారు. మాదకద్రవ్యాల మత్తులో విద్యార్థులు జోగడం విచారకరం. గ్రేటర్ పరిధిలోని విద్యాసంస్థల్లో ఉన్నత చదువులకోసం వచ్చి అక్రమార్కుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కొకైన్, గంజాయి, విదేశీ మద్యం, గంజాయి చాక్లెట్లు, గంజాయి బిస్కట్లు, గంజాయి సిగరెట్లు, లిక్కర్ చాక్లెట్లు తదితరాల విక్రయాల్లో పలువురు కీలకపాత్ర పోషిస్తున్నారు.
కాంబోడియా, వియత్నాం, మెక్సికో, సింగపూర్, థాయ్‌లాండ్ లాంటి దేశాల ప్రభుత్వాలు బాధితుల పునరావాసంకోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. మాదకద్రవ్యాల అమ్మకాలకు సంబంధించి చట్టాలను రాటుతేల్చాలి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని సంపాదించటంకోసం ఎంతటి అకృత్యాలు మరియు నేరాలు చేయడానికి వెనుకాడదు.
మత్తు చిత్తే!
గంజాయి మహమ్మారికి అలవాటుపడితే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. గంజాయికి అలవాటుపడి అది దొరక్కపోతే కాళ్లు, చేతులు వణుకుట, మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి అని అందరికీ తెలుసు. కానీ డ్రగ్స్ తీసుకుంటే నిత్య నూతనంగా ఉండొచ్చని, స్కిన్‌టోన్ (శరీరంలో) మారదని, ముఖంపై ముడతలు రావని, కండలు పెంచవచ్చని ఆశ కల్పించడం మూలంగా డ్రగ్స్‌కు బానిసలైపోతున్నారు. మొదట వాళ్లే ఉచితంగా మత్తు పదార్థాలు ఇస్తారు. అలవాటుపడిన తర్వాత వ్యసనంగా మారుతుంది. సాధారణంగా డిప్రెషన్‌కు గురైనవారు, కుటుంబ కలహాలకు లోనైన వారు, మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్, మెడికల్, కార్పొరేట్ స్కూల్ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌దందా నిర్వహిస్తున్నారు.
ఆల్కహాలు, సిగరెట్లవల్ల వచ్చే కిక్కుకంటే మాదకద్రవ్యాల మందులవల్ల మత్తు వస్తుండటంతో దానికొరకు అందరూ అడ్డదారులు తొక్కుతున్నా గంజాయి విక్రేతలు తమ బ్రోకర్లద్వారా మొదటగా వలవేస్తున్నది విద్యార్థులకే. ఆల్కహాల్ తీసుకుంటే బ్రీత్ ఎనలైజర్‌లో పోలీసులకు దొరికిపోతాం కాబట్టి గంజాయి తీసుకుంటే అటువంటి భయం ఉండకపోవడంతో ఈ మత్తుకు బానిసలవుతున్నట్లు తెలుస్తుంది. ఆల్కహాల్‌కు ఖర్చుకూడా ఎక్కువే, అలాగాకుండా వంద రూపాయలిస్తే చాలు పది సిగరెట్‌లలో కూర్చుకునేటంత లభించడంలో గంజాయిపట్ల యువత ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. నగరంలో కొన్ని విద్యాసంస్థల ఆవరణలు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిషేధిత పదార్థాలు అమ్మే దుకాణాలు విద్యాలయాలకు 500 మీటర్లకు లోపు ఉండటం విశేషం. మాదకద్రవ్యాలను గుట్టుగా అమ్ముతూ నిర్వాహకులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. విద్యాసంస్థల ఆవరణలో ఉన్న దుకాణాలపై కనీస తనిఖీలు ఉంచట్లేదు.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్థం
సామాజిక న్యాయమంత్రిత్వశాఖ, మత్తు పదార్థాల బానిసల జాతీయ చికిత్స కేంద్రం, ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థలు కలిసి మొట్టమొదటిసారిగా నిర్వహించిన సమగ్ర అధ్యయనాన్ని ఈ సంవత్సరం విడుదలచేసిన తాజా నివేదికలో పదేళ్లనుంచి 17 ఏళ్లలోపు పిల్లలు మద్యం తాగుతున్నట్లు తేలిందట, మద్యం వినియోగం అంతకంతకు పెరుగుతుండగా కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. తెలంగాణలోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. రంగు, రుచి, వాసన లేని కీటమైన్‌ను సాధారణంగా సర్జరీలుచేసే సమయంలో మత్తుమందు కింద వాడతారట. కానీ కొందరు దీన్ని మత్తుపదార్థాలుగా తయారుచేస్తున్నారు. మత్తుకోసం ఈ డ్రగ్ తీసుకోవడం ప్రమాదమేకాక.. మరిన్ని అక్రమ కార్యకలాపాలకు కారణమవుతుందని పలువురు ఆందోళన చేస్తున్నప్పటికి యధేచ్ఛగా సర్జరీ జరుగుతున్నది. నగర శివార్లలో ఫ్యాక్టరీలో తయారుచేస్తుండగా నార్కోటిక్ అధికారులు దాడులుచేసి పట్టుకున్నప్పటికీ ఫలితం శూన్యం. కొంతకాలంగా మహిళా ఉద్యోగులు కూడా గంజాయికి బానిసలుకావడం దురదృష్టకరం. మద్యం తాగేవారిలో పురుషులు అధికం. దాదాపు 26.8 శాతం గొడవలకు ఇది కారణం. ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు గింజలు, ఓపియం, హెరాయిన్, కొకైన్ వినియోగం పెరుగుతోంది. పంజాబ్, హరియాణా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో అత్యధికంగా బానిసలు ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 64వేల మంది సొంతంగా డ్రగ్స్‌ను ఇంజెక్షన్‌ల రూపంలో తీసుకుంటున్నారు. వీరికి చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనావుంది. మత్తుకు అలవాటుపడిన వారిలో కేవలం 25శాతం మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు. మత్తు నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికతవైపు మళ్ళడం ఉత్తమం.
మత్తులో విద్యార్థులు
మాదకద్రవ్యాల ఉచ్చులోకి విద్యార్థులు వెళ్లకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో తప్పనిసరిగా అవగాహన సదస్సులు పెట్టాలి. చట్టాలను మరింత కఠినంగా మార్చాలి. వసతి గృహాల్లో వుండి చదివే విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండకపోవడంతో వసతి గృహాల్లోని విద్యార్థులే అక్రమార్కుల ఉచ్చులో ఎక్కువగా పడుతున్నారు. రాష్ట్రాల్లో పరిస్థితులమేరకు డ్రగ్స్ బాధితుల సంఖ్యకు అనుగుణంగా చికిత్సకేంద్రాల వంటివి విస్తరించాలి. విద్యార్థులపై 75 శాతం పర్యవేక్షణ బాధ్యత వారి తల్లిదండ్రులకే ఉండాలి. గోవావంటి ప్రాంతాలకు విద్యార్థులను స్నేహితులతో పంపించకూడదు. ఎక్కువమంది యువత అక్కడ చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఒకవేళ వెళ్లాలనుకుంటే కుటుంబ సమేతంగా పర్యటించాలని ఆబ్కారీ అధికారులు సూచిస్తున్నారు.
మాదకద్రవ్య నియంత్రణ దినోత్సవం నేపథ్యంలో యువత చెడుతోవ పట్టడంపై యువ సమాజం ఆలోచించాలి. ఒకవైపు దేశానికి వెనె్నముక లాంటి యువత మాదకద్రవ్యాల సేవనంతో పతనమవుతుంటే, పాఠశాల స్థాయినుండే పిల్లలకు ధ్యానం, యోగా కుటుంబ విలువలు, శారీరక, మానసిక ఆరోగ్య ప్రాధాన్యత వివరిస్తే అద్భుత ఫలితాలనిస్తుంది. మాదకద్రవ్యాలు తీసుకుని తాత్కాలిక ఆనందంకోసం వెంపర్లాడితే, ఆనందం, ఆరోగ్యం రెండూ దూరమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు మంచి అలవాట్లను అవలంబించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మత్తును కాదు జీవితాన్ని ప్రేమించండి అనే నినాదం అందరికీ ఉపయోగపడేలా ప్రదర్శించాలి. అలౌకిక ఆనందాలకోసం మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపుతూ యువత బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
కౌన్సిలింగ్ అవసరం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా. మాదకద్రవ్యాలు శారీరక, మానసిక రుగ్మతలను కలిగించటమేగాక, నైతిక విలువలను దిగజారుస్తుండటంవల్ల ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 15 ఏళ్లనుండి 70 ఏళ్ల వయసుగల వారిలో 30కోట్ల మంది ఒక్కసారైనా మాదకద్రవ్యాలను ఉపయోగించారని అంచనా. ప్రతి ఏటా 200 నుండి 300కోట్ల రూపాయల మాదకద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ డబ్బు ఉపయోగపడుతున్నట్లు అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ వెల్లడించింది. గతంలో 15 కోట్ల మంది మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేవారు కొందరు, నోటితో తీసుకునేవారు కొందరు, ఇంజక్షన్ రూపంలో తీసుకునేవారు కొందరు, పొగ పీల్చేవారు కొందరున్నారు. అందుకే మన భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్ - డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టానె్సస్ చట్టాన్ని తెచ్చింది. అయినప్పటికీ కొకైన్ లాంటి మాదకద్రవ్యాలు దక్షిణ అమెరికానుంచి భారత్‌కు విమాన మార్గం ద్వారా తరలివస్తున్నాయి. మాదకద్రవ్యాలు తీసుకోవడంలో ఇంజనీరింగ్ విద్యార్థులే అధికంగా ఉంటున్నట్లు వైద్యులు తెలియచేస్తున్నారు. విద్యాసంస్థల్లో వీటి అనర్థాలను ప్రయోగాత్మకంగా తెలియచెప్పడం మినహా మరోమార్గంలేదు. ఈ దురలవాట్లను అరికట్టడంలో తల్లిదండ్రులది కీలకపాత్ర అని, యుక్తవయస్సు వచ్చే సమయానికి వారికదలికలపై నిఘా ఉంచాలని చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలకు పాకెట్‌మనీకోసం అధికంగా డబ్బులు ఇవ్వరాదని అధికారులు సలహాలు ఇస్తున్నారు.
నగరంలో డ్రగ్స్ సరఫరాలో భాగంగా గంజాయి ప్రోసెసింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. గంజాయిని ద్రవరూపంలోకిమార్చి విక్రయిస్తున్న రాకెట్‌ను ఎక్సైజ్ అధికారులు ఇటీవల బట్టబయలుచేశారు. అనాథ పిల్లలూ, రిక్షాపుల్లర్లు, పాన్‌షాపులు, కమీషన్ ఏజెంట్లు, పెడ్లర్లుగామారి మాదకద్రవ్యాలు సరఫరాచేస్తున్నారు. అంతేగాక పబ్‌లలో పరిచయాలు చేసుకుని మత్తువైపు నడిపిస్తున్నారు ఈ మాఫియాకార్లు. పాశ్చాత్య సంస్కృతి, అర్థరాత్రి పార్టీలు, వివిధ వ్యాపకాలతో తీరిక లేని తల్లిదండ్రులు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నంవల్ల యువత ఇటువంటి చెడు సంస్కృతికి బానిసలవుతున్నారు. మద్యం ముదిరి మాదకద్రవ్యం అయినట్లుగా ఉన్న పరిస్థితులను మార్చాలంటే మద్యం అమ్మకాలకు క్రమేణా కళ్లెం బిగించాలి.
దేశంలో గంజాయి వాడేవారు 3.1 కోట్ల మంది, పదేళ్లలో ఓపీయం వినియోగదారుల పెరుగుదల 567 శాతం. గంజాయి, భంగ్, చెరస్ దేశంలో 3.1 కోట్ల మంది ఉన్నారట. ఈ విధంగా బాల్యం మద్యం చుక్కల్లో చిక్కకుండా చూసుకోవాలి. తగువిధంగా కౌనె్సలింగ్ ఇవ్వాలి. ఈ సంవత్సరానికి హెల్త్ ఫర్ జస్టిస్, జస్టిస్ ఫర్ హెల్త్2 అనే అంశంతో ముందుకు తీసుకెళ్తుంది ఐక్యరాజ్యసమితి. ఎందుకంటే ఆరోగ్యానికి న్యాయం ఇది నిజమే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దీనికి న్యాయంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం చేయకపోతే అనారోగ్యంబారిన పడుతాము అనే హెచ్చరిక ఇందులో ఇమిడి ఉంది. అందుకే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాం. ఆరోగ్యంగా ఉందాం.

- కె. రామ్మోహన్‌రావు 9441435912