మెయన్ ఫీచర్

‘గాంధీ’ముక్త కాంగ్రెస్ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఓడలు బండ్లవుతాయి.., బండ్లు ఓడలవుతాయి. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇక ఆ పార్టీ కథ ముగిసిందని అనుకోవడం పొరపాటే అవుతుంది. గతంలో అనేకమార్లు ఇదే నిజమని రుజువైంది. ఒకప్పుడు రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు 300లకు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఒకప్పుడు 400 మార్క్ దాటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండంకెల సంఖ్య (52) దగ్గరే ఆగిపోయింది.
అవును.. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండవసారి ఘోర పరాజయం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ‘భవిష్యత్’ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఘన చరిత్ర గురించి ఇప్పుడు వేరే చెప్పనక్కరలేదు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమికను పోషించడంతో పాటుగా, స్వతంత్ర భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ గొప్ప చరిత్రను సృష్టించింది. అంతటి పార్టీ ఇప్పుడు దయనీయస్థితిలో ఉంది. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి దిక్కులు చూస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం కాడి తనే్నశారు. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడం తనతో కాదని, పార్టీని బతికించడం తన వల్ల అయ్యే పని కాదని నిర్ణయానికి వచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అయన తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సహజంగానే, వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ రాహుల్ ప్రతిపాదనను తిరస్కరించారు. అయినా రాహుల్ గాంధీ మనసు మార్చుకోలేదు సరికదా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుని ఎన్నికలోనూ తన ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. పార్టీని గెలిపించలేకపోవడమే కాదు, స్వయంగా సొంత కుటుంబ నియోజక వర్గం, అమేథీలో ఆయన ఓడిపోయినా సరే, కాంగ్రెస్ నాయకులు మాత్రం చిత్రంగా ఆయన మీదనే ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై రాహుల్ గాంధీని మరోమారు వేడుకుని, అప్పటికీ కాదంటే అప్పుడు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిద్దామని పార్టీ నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. నిజానికి ఓటమికంటే, అంతటి ఘన చరిత్ర ఉన్న పార్టీ ఇలా దిక్కూ మొక్కూ లేని దీనావస్థకు చేరుకోవడం మరింత విచారకరమని పార్టీ వర్గాలే విచారం వ్యక్తం చేస్తున్నాయి.
నిజానికి.. ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీని చాలా నిరాశకు గురిచేశాయి. అయన నమ్ముకున్న వ్యక్తులు, శక్తులు, వ్యూహకర్తలు, చుట్టూ చేరిన రాజకీయ బేహారులు ఆయనలో అనేక ఆశలు రేకెత్తించారు, భ్రమల్లో ముంచెత్తారు. వాస్తవ పరిస్థితులకు గాలిలో తేలిపోయేలా చేశారు. అదంతా మనం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చూశాం. ఎన్నికల్లో ఓడినా ఆ ఓటమి ఎంతో కొంత గౌరవప్రదంగా, ప్రధాని మోదీకి తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే స్థాయిలో ఉంటుందని రాహుల్, అయన బృందం ఆశించారు. అయితే, అలాంటి అద్భుతం ఏదీ జరగకపోగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని దుస్థితిలో పడిపోయింది. ఫలితంగా ఆయన పార్టీ ఓటమిని వ్యక్తిగత పరాభవంగా భావించి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల పరాజయం అనంతరం రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో కొంత కాలం విదేశాలకు వెళ్లి వచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో సైతం ఆయన ఉండీ లేనట్లే వ్యవహరిస్తున్నారు. రాష్టప్రతి ప్రసంగం సమయంలోనూ ఆయన ‘సెల్‌ఫోన్’ చూసుకుంటూ పక్కనే కూర్చున్న తల్లి సోనియా గాంధీతో ముచ్చట్లాడుతూ కనిపించారు. స్మశాన వైరాగ్యం లాంటి ఎన్నికల వైరాగ్యం ఏదో ఆయన్ని ఆవహించింది అన్నట్లు అయన ప్రవర్తన సాగింది. రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారా? అన్న అనుమానాలను కలిగించింది.
నిజానికి రాహుల్ గాంధీకి ఆది నుంచి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. సోనియా గాంధీ ప్రోద్బలం, వత్తిడి కారణంగానే ఆయన రాజకీయాలలో కొనసాగుతున్నారన్న అనుమానాలు లేకపోలేదు. ఏదో సామెత చెప్పినట్లుగా, గుర్రాన్ని రేవు వరకు తీసుకుపోవచ్చునేమో గానీ, నీరు తాగించడం కుదరదు. రాహుల్ గాంధీకి కూడా ఈ నానుడి వర్తిస్తుంది. అందుకే, పార్టీ కీలక నేతగా లేదా పార్లమెంటేరియన్‌గా ఆయన గత 15 ఏళ్లలో క్రియాశీలంగా వ్యవహరించిన సందర్భాలు (గత ఎన్నికల సందర్భాన్ని మినహాయస్తే) అంతగా లేవనే చెప్పవచ్చును. అంతేకాదు, కౌగిలింతలు, కన్నుగీటటాలు వంటి పిల్ల చేష్టలు, చెప్పాపెట్టకుండా నెలల తరబడి అదృశ్యమవడం వంటి చేష్టలతో రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నాయకుడిగా నిలబడలేకపోయారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళ సమయంలో కూడా ఆయన అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని రాజకీయంగా ఎదిగే ప్రయత్నం పెద్దగా చేయలేదనే చెప్పవచ్చును.
సరే అదలా ఉంచి మళ్ళీ విషయంలోకి వస్తే, రాహుల్ గాంధీ ఏ ఉద్దేశంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారో ఏమో గానీ, కాంగ్రెస్ నాయకులు అయన నిర్ణయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే, సరైన రీతిన స్వీకరిస్తే, అది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక వరంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కురు వృద్ధ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజీనామా మంత్రం ప్రాణం పోసే సంజీవని అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. నెహ్రూ-గాంధీ కుటుంబ నాయకత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని, కష్టమైనా నష్టమైనా ఆ కుటుంబ నాయకత్వం పార్టీ మనుగడకు అవసరమని కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాజకీయ మేథావి వర్గాల్లోనూ ఒక అభిప్రాయం నాటుకు పోయింది. అయితే, ఇది నిజమా అంటే కాదు. నిజానికి అదొక కల్పిత భ్రమ. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటున్న పరాన్నభుక్కులు, భట్రాజులు, భజన బృందాలు సృష్టించిన అభూత కల్పన. నిజానికి, కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ఇమేజ్‌ని నెహ్రూ- గాంధీ కుటుంబం తమకు అనుకూలంగా మలచుకుంది. అంతేగాని, నెహ్రు గాంధీ కుటుంబం చేసిన త్యాగాల కారణంగానో, లేక ఆ కుటుంబం దేశానికీ చేసిన సేవల కారణంగానో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలిగింది అనుకోవడం అసత్యం, కాదంటే అర్ధ సత్యం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్‌తో నెహ్రు-గాంధీ కుటుంబం ప్రయోజనం పొందినంతగా, నెహ్రు గాంధీ ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందలేదు. మరీ మాట్లాడితే నెహ్రు కుటుంబం దేశానికి గానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ చేసిన సేవలకంటే సృష్టించిన ఉభయతారక అనర్థాలే అధికం. ఇక్కడ 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించడంతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని గుర్తుచేసుకోవడం అవసరం.
అలాగే, పరిపాలనా పరంగా చూసినా భారత తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానులు అందరిలోకి సమర్థవంతమైన పాలన ఇచ్చింది ‘కుటుంబ ప్రధానులు’ కాదు. ఆ క్రెడిట్ ఐదేళ్లు మాత్రమే పాలించిన పీవీ నరసింహారావుకే దక్కుతుంది. ముగ్గురు కుటుంబ ప్రధానులు (నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ) మొత్తం మీద ఓ 40 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. అలాగే, మరో పదేళ్ళకు పైగానే కుటుంబం కనుసన్నల్లో పరిపాలన సాగింది. అయినా, స్వాతంత్య్రానంతర తొలి తరం ఆశలు, ఆకాంక్షలు సైతం పూర్తిగా నెరవేరలేదు సరి కదా, కుటుంబ పాలన, కుటుంబ ఆధిపత్యం కారణంగా స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి, జాతీయవిలువలు, జాతీయ స్ఫూర్తి తెరమరుగయ్యాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే అన్ని జాతీయ విలువలను ఒకే ఒక్క కుటుంబం హక్క్భుక్తం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో, ఆ ప్రస్థానంలో ప్రజాస్వామ్య విలువలు నశించి, అవినీతి హద్దులు దాటి అంతటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సారథ్యంలో ఇదిగో ఈ దుస్థితికి చేరుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దయనీయ, దౌర్భాగ్య స్థితికి రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం ప్రత్యక్ష కారణం అయినప్పటికీ, పార్టీని వెంటాడుతున్న సుందర ముదనష్ట అష్టావక్ర గతం పాత్రను, గతం పాపాలను విస్మరించడం కుదరదు.
సరే, అదంతా గతం గతః అని అనుకున్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయంతో కొత్త రూపంలో కాంగ్రెస్ పునః నిర్మాణానానికి ఒక అవకాశం ఆవిష్కృతం అయిందా అని కొందరు రాజకీయ పండితులు విశే్లషిస్తున్నారు. ‘గాంధీ ముక్త కాంగ్రెస్’ గా కాంగ్రెస్ పార్టీ కొత్త అవతారంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం జరిగితే, అది స్వాగతించదగిన పరిణామమే అవుతుంది. నిజానికి, ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. చట్టసభల లోపల, వెలుపలా కూడా సమర్థవంతమైన ప్రతిపక్షం లేని వెలితి ఉంది. వామపక్షాలు చరిత్రలో కలిసిపోయాయి. మిగిలిన జాతీయ పార్టీల్లో చాలా వరకు పార్టీలు పేరుకు జాతీయ పార్టీలు అయినా వాస్తవంలో ప్రాంతీయ పార్టీలే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో ఎంత చెడ్డా, ఎంతగా దిగజారి దౌర్భాగ్య స్థితికి చేరుకున్నా ప్రతిపక్ష పాత్రను పోషించగల జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ఒక్కటే. బీజేపీ జాతీయస్థాయిలో ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ మరో వంక ప్రాంతీయ పార్టీలను కబళించే ప్రయత్నం చేస్తోంది. ఒక విధంగా విజయం సాధిస్తోంది. బీజేపీకి, మోడీ - షా జోడీకి ఎదురు నిలిచే ప్రయత్నం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ గానీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఅర్’ లాంటి ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చేష్టలుడిగి ‘కింకర్తవ్యం’ అన్న మీమాంసలో పడిపోయారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ - నెహ్రు కుటుంబ భారాన్ని దించుకుని, ప్రత్యామ్నాయ నాయకత్వంతో పాటుగా, కొత్త విధానాలతో అడుగులు వేస్తే, కాంగ్రెస్ పార్టీ సరికొత్త రాజకీయ శక్తిగా నిలిచే అవకాశం ఉంటుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.
అయితే, జరుగుతున్న పరిణామలు గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ గాంధీ - నెహ్రు కుటుంబ దాస్యం నుంచి బయటపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ రాజకీయ వైరాగ్యంలో కూరుకుపోయినా, సోనియా గాంధీ పార్టీ పగ్గాలు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, పార్లమెంటరీ పార్టీ నాయకునిగా బాధ్యతలు తీసుకునేందుకు నో అన్న నేపథ్యంలో సోనియా గాంధీ పార్టీ పగ్గాలు కుటుంబం చేతుల్లోంచి జారిపోకుండా ఉండేందుకు వయసు, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని చేపట్టారు. అంతేకాదు, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా, కుటుంబ బంటు, పశ్చిమ బెంగాల్ నేత అధీర్ రంజన్‌ను నియమించారు. ఆయనేమో ఇందిరాగాంధీని గంగతో, ప్రధాని మోదీని మురికి కాల్వతో పోల్చి స్వామి భక్తిని ప్రదర్శించుకున్నారు. అలాగే, రాహుల్ గాంధీ స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్‌ను నియమించాలని, ‘కుటుంబ త్రయం’ (సోనియా, రాహుల్. ప్రియాంక) నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అస్లాం షేర్ ఖాన్ కూడా అధ్యక్ష పదవి కోసం ఎదురు చూసిన సంగతి తెలిసిందే. తర్వాత కర్ణాటక సీనియర్ నేత వీరప్ప మొయిలీ అధ్యక్ష పదవిపై కనే్నశారు. అయితే, ఎవరు అధ్యక్షుడు అయినా గాంధీ - నెహ్రు కుటుంబ నీడలోనే పనిచేయవలసి ఉంటుందని ఇప్పటికే మణిశంకర్ అయ్యర్ లాంటి కొందరు నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అదే జరిగితే, ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం మాట దేవుడెరుగు కనీస మనుగడ ఉండదని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రక్షించగలిగేది ‘గాంధీ ముక్త కాంగ్రెస్’. అది సాధ్యం అవుతుందా? అదీ ఇప్పుడు దేశ రాజకీయ యవనిక పై నిలిచిన ప్రశ్న.

- రాజనాల బాలకృష్ణ 99852 29722