మెయన్ ఫీచర్

దాడి చేసే నేతలను దండించేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నడవడి పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండో ర్‌లో భాజపా శాసనసభ్యుడు ఆకాశ్ వర్గియా మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడం, ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేయడం వంటి పరి ణామాలపై మోదీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పైగా, ఆ శాసనసభ్యుడు భాజపాలో కీలక నాయకుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా తనయుడు కావడంతో ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది. మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా, బలమైన నాయకుడిగా కొనసాగిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను గద్దె దించి, ఆ పదవిని చే పట్టడానికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మద్దతుతో కొంతకాలంగా ఎదురు చూస్తున్న నేత విజయ వర్గియా కావడం గమనార్హం. అది సాధ్యం కాకపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాబోయే భాజపా సీఎం అభ్యర్థిగా విజయ వర్గియా ప్రచారం పొందుతున్నారు. అటువంటి నేత కుమారుడిపై బహిరంగంగా ప్రధాని అసహనం వ్యక్తం చేయడం ఒక విధంగా భాజపా ప్రజా ప్రతినిధుల తీరుతెన్నుల పట్ల ఆయనలో చెలరేగుతున్న అసంతృప్తిని ఈ ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు అర్థం అతుతుంది. పైగా, అరెస్ట్ తర్వాత బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఆకాష్‌కు- ఒక వీరుడిని గౌరవించిన రీతిలో స్థానిక భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు.
తమ పార్టీ శాసనసభ్యుడు చట్టాన్ని చేతిలో తీసుకొని వ్యవహరించడం పట్ల భాజపా నేతలెవరూ ఈ విధమైన ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఒక విధంగా పార్టీని ఆత్మ రక్షణలో పడవేశారు. ఇటువంటి పరిస్థితి కేవలం భాజపాలోనే కాదు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఇలా దూకుడుగా వ్యవ హరిస్తుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా మహారాష్టల్రో మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే కుమారుడు, కాంగ్రెస్ ఎమ్యెల్యే నితీష్ రాణే పోలీసులకు లొంగి పోవలసి రావడం చూశాము.
పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల విధి- చట్టాల అమలు తీరుపై సమీక్ష జరపడం, అవసరమైన కొత్త చట్టాలను రూపొందించడం. కానీ వాస్తవానికి నేడు ప్రజాప్రతినిధులెవరూ చట్టాలను రూపొందించడం, వాటి ని అమలు పరచడం పట్ల ఎటువంటి ఆసక్తి కనబరచడం లేదు. కీలకమైన చట్టాలు ఎటువంటి చర్చలు లేకుండానే చట్టసభల్లో ఆమోదం పొందుతూ ఉండటాన్ని చూ స్తున్నాము. తమ తమ నియోజకవర్గాలలో తామే ప్రభుత్వం అన్నట్లు, తమ ప్రమేయం లేకుండా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదన్నట్లు నేతలు వ్యవహ రిస్తుండటం నిత్యకృత్యమైంది. తమ మాట వినకుండా, చట్టం ప్రకారం నడచుకోవాలని ప్రయత్నం చేసిన అధికారులపై ప్రజా ప్రతినిధులు దౌర్జన్యాలకు పాల్పడడం సర్వసాధారణమైంది. తాజాగా తెలంగాణలో ఒక ఎమ్యె ల్యే సోదరుడు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బహి రంగంగా ఓ మహిళా అటవీ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడి, ఆమెను తీవ్రంగా గాయపరచడం చూశాము. దేశంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజాప్రతినిధులు చట్టాన్ని చేతిలో తీసుకొని అధికారులపై, తమను ప్రశ్నించిన ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఓటమి చెంద డానికి ప్రధాన కారణం - తెదేపా శాసనసభ్యుల విచ్చ లవిడి ప్రవర్తన అని అందరూ భావిస్తున్నారు. ఇసుక రవాణా నుంచి ప్రతి పనిలోనూ ముడుపులు తీసు కోవడం, తమ నియో జకవర్గంలో పనిచేస్తున్న కీలకమైన పోలీస్, రెవిన్యూ అధికారుల నుండి భారీ ముడుపులు వసూలు చేస్తుండటం, ప్రతి ప్రభుత్వ పనిలో తమకు కమీషన్లు రావలసిందే అని చాలామంది ఎమ్మెల్యేలు పట్టుబడుతూ ఉండటం అందరికీ తెలిసిందే. అందుకనే అటువంటి నాయకుల పట్ల ప్రజలు సహజంగానే తీవ్ర అసంతృప్తిని పెంచుకొంటున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చుపెట్టే సమయంలో కూడా పార్లమెంట్ సభ్యులు ముడుపులు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినా తన నియోజకవర్గంలో సాగే రైల్వే పనుల్లో సైతం తనకు కమీషన్లు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వంలో ఒక కీలక నేత పట్టుబట్టడంతో ఆ పని ఆగిపోవడం తెలిసిందే. అయితే ఇటువంటి ప్రవృత్తి కేవలం తెలుగు దేశం పార్టీకే పరిమితం కాలేదు. అన్ని పార్టీలలో కొందరు నిజా యితీపరులు ఉన్నారు. అయితే అత్యధికులు కమీషన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్యెల్యేలు తాము చెప్పినవారే తమ నియోజకవర్గ పరిధిలో పోలీస్, రెవిన్యూ, ఇతర విభాగాలలో అధికారులుగా పని చేయాలని పట్టుబడుతున్నారు. పార్టీలకు అతీతంగా చాలామంది నేతలు యథేచ్ఛగా ముడుపులు స్వీక రిస్తున్నారు. పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నా చాలా మంది కాంట్రాక్టర్లు మాత్రం మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ కాంట్రాక్టర్లపై తీవ్రమైన విమర్శలు చేశారో, అధికారంలోకి వచ్చాక వారినే కొనసాగిస్తుండటం చూస్తున్నాము.
ఉదాహరణకు పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.55,548-87 కోట్లకు పెంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పుడు- అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు కురిపించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని పెంచినట్లు ఆయన ఆరో పించారు. భాజపా నేతలు కూడా అటువంటి ఆరోపణలే చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తగ్గింపులు లేకుకూడా ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం, ఏపీ ప్రభుత్వం మారుమాట్లాడకుండా ఉండ టం చూస్తూనే ఉన్నాం.
స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నికలలో 2019 సార్వత్రిక ఎన్నికలు అత్యంత వ్యయభరితమైనవని చెబు తున్నారు. అంచనాకు అందని మొత్తాలను భారీ స్థాయిలో అభ్యర్థులు ఖర్చు చేశారు. ఎన్నికైన తర్వాత అంతకు పలు రేట్లు వసూలు చేసుకొనే పనిలో వారు పడటం షరామామూలే. తాము చెప్పిందే చట్టం అనే రీతిలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రవర్తన సహజంగానే ప్రజలలో తీవ్ర ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రధాని మోదీ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కట్టడి చేయాలను కొంటున్నారా?
తన పార్టీ ఎమ్మెల్యే ఆకాష్ ఓ అధికారిపై దాడి చేయడాన్ని ప్రధాని ప్రస్తావించి ఉండవచ్చు. ఈ ఉదంతం నేపథ్యంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులందరికీ గట్టి హెచ్చరిక చేయాలని ప్రధాని సంకల్పించినట్లున్నారు. భాజపా మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధ్యతా రహి తంగా ప్రకటనలు ఇవ్వడం, వ్యవహరిస్తుండటం చాలా కాలంగా జరుగుతూ ఉన్నా ప్రధాని ఎన్నడూ ఇంత తీవ్రంగా స్పందించలేదు. ఆయన స్పందన ఒక విధంగా భాజపా నాయకత్వాన్ని సైతం ఆశ్చర్యంలో ముంచె త్తివేసిన్నట్లు కనిపిస్తున్నది. అందుకనే- ఒక ఎమ్యెల్యే పోయినా ఫర్వాలేదంటూ ప్రధాని హెచ్చరిక చేసిన తర్వాత... ఆ శాసనసభ్యుడికి పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టడం గమనార్హం. నేడు తమ ప్రజాప్రతినిధులు ఎంత విచ్చలవిడిగా పనిచేస్తే పార్టీకి వారంతా గొప్ప అండగా భావిస్తూ ఉండడం మరో విపరిణామం.
తన పార్టీ శాసనసభ్యుడు ఓ మహిళా తహశీల్దార్ పై దౌర్జన్యానికి పాల్పడితే, అతనిని మందలించవలసింది పోయి ఆ మహిళను స్వయంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పిలిచి, బెదిరించి, కేసును ఉపసంహరించుకొనేలా ఒత్తిడి చేయడాన్ని మనం చూశా ము. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ప్రజాప్రతినిధులపై కఠినంగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రిని దేశంలో చూశామా? ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులపై కొన్ని సందర్భాలలో చర్యలు తీసుకొన్నా పలు సంద ర్భాలలో అధికార, ప్రతిపక్షాలు కలసి దోషులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఉన్నవారు నేడు అత్యధిక సంఖ్యలో చట్టసభలకు ఎన్నికవుతున్నారు. అటువంటి వారికి సీట్లు ఇవ్వనిదే గెలవడం కష్టం అనే దురభిప్రాయంతో పలు పార్టీల అధినేతలు కనిపిస్తున్నారు.
ప్రతి చట్టసభలో నైతికత కమిటీ ఉంటుంది. అయితే చాలా అరుదుగా మాత్రమే- విచ్చలవిడిగా ప్రవర్తించిన సభ్యులపై తగు చర్యలకు ఈ కమిటీలు సిఫార్సులు చేస్తున్నాయి. ముఖ్యంగా దోషులు అధికార పక్షానికి చెందినవారైతే ఈ కమిటీలు స్పందించనే స్పందించవు. నేడు భారీ ఎత్తున జరుగుతున్న దాదాపు అన్ని అక్రమ వ్యాపారాలలో, అసాంఘిక చర్యలలో అనేకమంది ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వా ములవుతున్నారు. అందుకనే పలు చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.
కాగా, తెలంగాణలో మహిళా అటవీ అధికారి దాడికి గురైన సందర్భంగా- అడవులను కాపాడడానికి తాము ప్రయత్నిస్తుంటే ప్రజాప్రతినిధుల నుండే తమకు బెదిరింపులు వస్తున్నాయని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు అటవీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజాయతీ పరులైన అధికారులను ప్రస్తుత వ్యవస్థలో అసమర్థులుగా చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కరడుకట్టిన అవినీతి ఆరోపణలున్న అధికారులు అంటూ పలువురు సీనియర్ రెవిన్యూ అధికారులను ఉద్యోగాల నుండి తొలగించింది. అయితే వారిలో పలువురు నిజాయితీపరులు ఉన్నారని, అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నవారు కూడా ఉన్నారని, వారి నిజాయతీయే వారిని కాటే స్తున్నదని సుబ్రమణ్యస్వామి వంటి వారు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రజా ప్రతినిధుల విచ్చలవిడితనాన్ని ఎవరు, ఏ విధంగా కళ్లెం వేయాలన్నదే నేడు ప్రధాన సమస్య.

-చలసాని నరేంద్ర 98495 69050