మెయిన్ ఫీచర్

దిగంబరోజ్వలిత ధిక్కారకవి మహాస్వప్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ఆధునిక కవిత్వంలో దిగంబర కవిత్వం చూపిన ప్రభావం, ఇచ్చిన ప్రేరణ, కలిగించిన సంచలనం మరిచిపోలేనిది. దిగంబర కవిత్వం ఆరుగురితో ఉద్యమ కవిత్వంలా విస్తరించి తన ఉనికిని చాటుకొంది. దిగంబర కవితోద్యమంలో తీవ్ర సంచలనం రేపిన ప్రముఖ దిగంబర కవి మహాస్వప్న జన్మస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం. ఈయన అసలు పేరు కమ్మిశెట్టి వెంటేశ్వరరావు.
1958లో నార్ల చిరంజీవి సహకారంతో ‘‘చందమామ’’ పేరుతో బాల కవితా సంకలనం వెలువరించారు. అప్పటికి ఆయన వయస్సు పద్దెనిమిదేండ్లు. 1964లో ‘‘అగ్నిశిఖలు- మంచు జడులు’’, ‘‘స్వర్ణ్ధూళి’’, కవితా సంకలనాలతో తన స్థానాన్ని కవితా ప్రపంచంలో సుస్థిరం చేసుకున్న కమ్మిశెట్టి 1965లో అనూహ్య పరిస్థితుల్లో మహాస్వప్నగా విజృంభించి విశృంఖలంగా రచనలు సాగించారు. ఆయన కవితలు ఆరని అగ్నికణాలు.
‘‘మానసిక దిగంబరత్వంకోసం నిత్య సచేతన ఆత్మస్ఫూర్తితో జీవించడమే మా ఆశయం. శ్వాసించే ప్రతి వ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణకోసం, అంతరంగంలో అణగిపడివున్న ఆరాటాన్ని, ఆ సంతోషాన్ని, విసుగును, అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాలని మా తత్పరత.’’ - అంటూ నగ్నముని (మానేపల్లి హృషికేశవరావు, నిఖిలేశ్వర్ (యాదవరెడ్డి), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి), జ్వాలాముఖి (వీరవెల్లి రాఘవాచార్యులు), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), భైరవయ్య (మన్‌మోహన్ సహాయ్)లు తాము దిగంబర కవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్నామని ధైర్యంగా, స్థయిర్యంగా ప్రకటించారు.
దిగంబర కవుల రాకకు ముందు ఒక దశాబ్ద కాలంలోని పరిస్థితులను శ్రీశ్రీ ‘‘ఆంధ్ర అభ్యుదయ రచయితల ఐదవ మహాసభ’’లో వివరిస్తూ ‘‘ఎటు తిరిగినా ఏదో నిస్త్రాణ, ఏదో నిస్పృహ, ఫౌల్ చేసి గోల్‌చేసి గెలిచిన ప్రతీపశక్తులు పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్నాయి. అయిదారేళ్ళకు పూర్వం అభ్యుదయ రచయితల సభల్లో పువ్వుల దండల్ని వేయించుకొని పెళ్ళికొడుకుల్ని చేయించుకొని జయజయధ్వానాల మధ్యన ఊరేగిన మిత్రులు కొందరీనాడు క్షుద్ర ప్రయోజనాల మరు మరీచికల వెంటపడి ఉద్యమ విచ్ఛిత్తికి దారితీస్తున్నారు. సరియైన నేతృత్వం లోపించడంవల్ల యువతరంలో కూడా ప్రమాద భరితమైన ఒకానొక నిరుత్సాహ నిరాశాధోరణి తలయెత్తుతున్న సూచనలు కనబడుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
నిర్లిప్తత ఆవరించిన పరిస్థితులు, సామాజిక, రాజకీయ స్థితిగతులు నానాటికీ దిగజారిపోతూ పతనావస్థకు చేరుకున్న దశలో దిగంబరులు గొంతువిప్పారు. సమాజంలో కులతత్వం, మత ప్రాబల్యం అధికమవుతూ అవినీతి, బంధుప్రీతి, మనిషి స్వప్రయోజనం తప్ప సమిష్టి ప్రయోజనాలవైపు దృష్టిసారించే చైతన్యం కోల్పోయి ఉన్న స్థితిలో దిగంబరులు ముందుకొచ్చారు. వీటికితోడు యువతరాన్ని భ్రష్టుపట్టించే సాహిత్యం, మానసికంగా ఎదగనీయని సినిమాలు, పత్రికలు, రాజకీయాలు, సాహిత్య సంస్థలు, విశ్వవిద్యాలయాలు అన్నీ వేటికవే కలుషితమయ్యాయి. సమాజమంతా గమ్యరహితంగా నడవసాగిన సమయంలో దీనినుండి బయటపడే మార్గంకోసం కవుల వెతుకులాట సాగింది. తత్ఫలితమే దిగంబర కవిత్వం. సమాజ, సాహిత్య రంగాలలో పేరుకుపోయిన నైచ్యాన్ని తొలగించే ప్రయత్నం దిగంబరులు చేశారు. దీనిని గుర్తించిన శ్రీశ్రీ మాట్లాడుతూ ‘‘అభ్యుదయ కవిత్వం ఆంధ్ర దేశంలో తన పాత్ర నిర్వహించి తెరవెనక్కి తప్పుకుంది. ఇప్పుడు కొత్త శక్తులు పెరుగుతున్నాయి. కొత్త మంటలు రగులుతున్నాయి. అభ్యుదయ కవిత్వం ఒక వెస్టెడ్ ఇంటరెస్ట్ కాకూడదు. ఇవాళ రాస్తున్నవాళ్ళు దిగంబర కవులు, తిరుగుబాటు కవులు, సంఘర్షణ కవులు చేతనైతే వాళ్ళకి చేయూతనివ్వండి. లేకపోతే నోరుముయ్యుండి’’ అని గట్టిగా మందలించి దిగంబర కవిత్వాన్ని సమర్థించాడు.
దిగంబర కవిత్వ కలాపమంతా ఎన్నో అంశాలను స్పృశించిందీ, తీవ్రంగా నిలదీసి ప్రశ్నించిందీ, అన్నిరకాల సాంస్కృతిక ఆరాధనలను, భక్తితత్పరులను ఆక్షేపించింది. ఎవరిని తాము సంబోధిస్తున్నారో వారిని తట్టి, తిట్టి లేపడంతో దిగంబరుల సాహసం ఉంది. తాము బానిసలై ఉన్న హీన సంస్కృతినుంచి వైదొలగటం, దాన్నుంచి మేలుకోవటం, ఇందుకోసం వాడవలసిన పరుష పదాలను వాడారు. గాయపడాల్సినంత తీవ్రంగానే వ్యవహరించారు. ఇందుకోసం రెచ్చగొట్టారు. విషయాన్ని రట్టుచేశారు. వ్యక్తులు అనాలోచిత విషయాలనుండి బయటపడేలా ప్రయత్నించారు. దిగంబర కవులు తమ తొలి సంపుటిని 1965 మేలో, రెండవ సంపుటిని 1966 డిసెంబర్లో, మూడవ సంపుటిని 1968 జూన్‌లో వెలువరించారు. మొదటి సంపుటి దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ ఋతువుల్లో ఆవిష్కృతమైంది. కాబట్టి సంకల్ప, ఉత్సాహాలే తప్ప దిగంబరుల తత్వంలో నిరాశ, నిస్పృహలు లేవని అర్థంచేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే దుస్సాహబాధ ఉంది. అది పెను ఆక్రోశంగా వ్యక్తరూపం పొందుతూ ఉంటుంది. దిగంబర శకం కాలమానం ప్రకారం సంవత్సరాలు, ఋతువులు వారు ఆరుగా పేర్కొన్నారు. ఆశ, మదిర, విషాద ఋతువులలో మూడు సంపుటాలు ఆవిష్కరించారు. మొదటి సంపుటి ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకొని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్న, ధైర్య, స్థయిర్యం కేకలుగా పేర్కొనగా, రెండో సంపుటిలో ఇంకా భయం, భయంగా బానిసత్వంగా దుర్భరంగా హేయంగా ఛండాలంగా ఉన్న ఆంధ్ర దేశమనే మురిగ్గుంటలోంచి పలికిన దిగంబర కవితగా చెప్పగా, మూడవ సంపుటిలో ప్రజల అవిద్యని, అజ్ఞానాన్ని, ఆశక్తతని ఆసరాగా తీసుకొని దేశాన్ని దోచుకుతినడం మరిగిన పాలకులు, సంఘంలోని వివిధ వర్గాల వాళ్ళు నేడు ప్రజలపై రుద్దుతున్న కుష్ఠు వ్యవస్థను ఎదుర్కొంటూ దిగంబర కవులు పలికిన దిక్కులను, వినిపించడంగా పేర్కొన్నారు.
దిగంబరులు రంగం మీదకు రాకముందు వెలువడిన ‘రాత్రి’ కవితా సంకలనం యువతరంలో ఉన్న అలజడిని ప్రతిబింబించింది. వ్యక్తిపై కప్పబడిన ముసుగుల్ని తొలగించడం ద్వారా మానవాత్మను ఉద్ధరించవచ్చనే వ్యక్తివాద ప్రభావఛాయలు దిగంబరుల తొలి సంపుటంలో ప్రబలంగానే కనిపిస్తాయి. ఒకరిద్దరు కవులలో తప్ప తొలి రెండు సంపుటాలలో మార్క్సిజం పట్ల సందేహం, సంశయం స్పష్టం. వ్యక్తినుంచే వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నదనేది దిగంబరుల నిష్కర్ష. ‘‘ప్రతిమనిషిలోను అతని అసలు స్వరూపం దీపంలా వెలుగుతూ ఉంటుంది. తన స్వరూపాన్ని మరచిపోయి వికృతంగా రుూనాడు మనిషి పెరుగుతున్నాడు. కృత్రిమ ఆచ్ఛాదనల క్రింద దొంగలాగా బతుకుతున్నాడు’’ అనేది దిగంబరుల నిర్ధారణ. గర్వించదగ్గ గతమూ లేక, చెప్పుకోదగిన వర్తమానమూ కనిపించక, ఆశించదగిన భవిష్యత్తూకానరాని స్థితిలో ‘పిచ్చెత్తి ప్రవచించిన కవిత’గా తమ కవిత్వం గురించి దిగంబరుల అభివర్ణన. ఆశలు అడుగంటిపోయిన మనిషికి కొత్త ఆశ కలిగించే తత్పరతగలవారిగా తమని తాము భావించుకోవటం ఉంది. మానసిక దిగంబరత్వం, సత్యచేతన, ఆత్మస్ఫూర్తి, ఆశయంగా ప్రకటిస్తూ ఇతర మానవులలో సారూప్యం చెందటం, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ లాంటి మాటలు అస్తిత్వవాదం పట్ల దిగంబరులకుగల మొగ్గును తెలియజేస్తాయి.
ఒకప్పుడు దిగంబర కవులందరిలో మహాస్వప్న ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నవాడు. నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ విప్లవ సాహిత్యంలోకి కూడా అడుగుపెట్టగా, భైరవయ్య సన్యాసి రూపంలోకి ట్రాన్స్‌ఫామ్ అయితే మహాస్వప్న ఆనాటినుండి దిగంబర కవిగానే తన ఉనికిని కాపాడుకుంటున్నాడు. కానీ ఏం లాభం? మహా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు. ఒక విధ్వంసక సామూహికత నుంచి అంతేలేని ఆధ్యాత్మిక ఏకాంతంలోకి మహాస్వప్న ప్రయాణం చేస్తున్నాడు. ఈవేళ ఒకే ఒక్క దిగంబర కవి మహాస్వప్న, ‘‘మిగతావాళ్ళని బైటకి వెళ్ళగొట్టాను’’ అంటున్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు తనను తాను బందీగా కాళ్ళకి సంకెళ్ళుబడ్డ ఖైదీగా వర్ణించుకున్నాడు. ఇప్పటికీ ఇంట్లోనూ, వూళ్ళోనూ ఒక కవిగా తన ఉనికిని ఆయన కోల్పోలేదు. ఆ చుట్టుప్రక్కల పరిసరాల్లో ఆయన్ని మహాస్వప్నగా గుర్తించి గౌరవించడం ఎంతో సంతోషాన్నిచ్చే అంశం.
తెలంగాణా ఉద్యమం చెలరేగిన 1969లో వీరు ‘పోరాటం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్నారు. ‘‘సముద్రంలో తప్పిపోయిన మనిషి’’ కమలేశ్వర్ హిందీ నవల అనువాదం. విశాలాంధ్ర దినపత్రికలో జయశంకర్ ప్రసాద్ ‘‘ఇరావతి’’ కృష్ణాపత్రికలో సీరియల్‌గా వెలువడ్డాయి. ‘‘లేడీస్ ఛటర్లీస్ లవర్’’ పోరాటం పత్రికలో సీరియల్‌గా వెలువడుతున్నప్పుడు అర్ధంతరంగా పత్రిక ఆగిపోయింది. మహాస్వప్న మారుపేర్లతో రాసినవి ఎన్నో ఆయనకే తెలియదు. సాహిత్య రంగంలోనే పరిణామాలను ప్రభంజనాలను మహాస్వప్న స్థూలంగా, నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. స్ర్తివాదం, దళిత వాదం, మైనారిటీ వాదం అన్నీ ఆయనకు సుపరిచితాలే. ఆయన సుదీర్ఘ వౌనానికి కాలమే సమాధానం కావాలి. అతను ఏమిచేస్తాడోనని ఎదురుచూపులు మినహా ఇప్పటి కవులకి మరేం తెలియదు.
మహాస్వప్న అధునాతన అభివ్యక్తితో బరువైన భావనాబలంతో కవిత్వం వినిపించిన మానవతా కవి. సామాజిక సాహిత్యరంగాల్లో ఏర్పడ్డ స్తబ్దతను బద్దలుకొట్టి కవిత్వం రాసి దిగంబర కవితోద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన అక్షరశిల్పి ఆయన మహాస్వప్న నిజాలను మరువని, ఏ భేషజాలకు లొంగని నిజాయితీ మనస్తత్వం, నిర్మల వ్యక్తిత్వం, నిఖార్సైన కవిత్వం, దిగంబర కవితోద్యమంలోనుండి మిగిలినవాళ్ళు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడే
‘కిటకీకి రెక్కల్లేవు కళ్ళకు రెప్పలు లేవు
గిటార్ మీద దిక్కుల్ని మీటే దిగంబరుడి
చేతికి వేళ్ళులేవు...’ అంటూ నిర్భయంగా ఎత్తిపొడిచాడు. రాత్రి కవితా సంకలనంతో తన కవితాప్రస్థానం ప్రారంభించారు. ఇదే దిగంబర కవితోద్యమానికి దిక్సూచీ అయింది. ఆయన మహాత్మాగాంధీ మీద రాసిన ‘‘మేం మనుషులం కాదు-ఇంకేదో పేరుంది’’ అనే కవిత అప్పట్లో సంచలనం సృష్టించింది. మూడు దిగంబర సంకలనాల్లో మొత్తం 93 కవితలుంటే అందులో మహాస్వప్నవి కేవలం ఆరు కవితలు మాత్రమే ఉన్నాయి. రాశిలో తక్కువే అయినా వాసిలో ఆయన కవిత్వం ఎంతో గొప్పది అనటంలో ఎట్టి సందేహం లేదు. దిగంబర కవిత్వంలో అశ్లీల పదాల వాడకం ఎంతవరకు సమర్థనీయం అనే చర్చ సాహితీ లోకంలో వచ్చింది. అవి సమాజంలో జడత్వం రూపుమాపటానికి సహజంగా ప్రకోపించిన పదాలేకాని, సమాజాన్ని అవమానించడానికి కాదన్న మహాస్వప్న, ప్రచార పటాటోపాలకు దూరంగా వున్న వ్యక్తి.
ఏ సామాజిక సాహిత్య ఉద్యమమైనా ప్రజాబాహుళ్యాన్ని కదలించడానికి మూడు పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకటి భావాలను సరళీకరించడం, రెండు సత్యాన్ని ఆవిష్కరించడం, మూడవది ఈ రెండింటి కలయికలో నిబద్ధతతో కూడిన ఆచరణను ఆశించటం. దిగంబర కవులు ఆశించింది, ఆకాంక్షించింది ఇదే. గాడ్సేల ఘాతుక హస్తాల నడుమ నలువైపుల హోరుమని విరుచుకుపడుతున్న చీకటి సముద్రాల నడుమ నిశ్చలంగా వెలిగే నీ చిరునవ్వు... ‘‘బాపూ, మోసపోలేదు కదా నువ్వు’’ అని మనం నిశ్శబ్దంగా ప్రేలిన అబద్ధాలు, అణుబాంబులు, దగాలు, వంచనలు, కుహనా సత్యాలలోబడి మోసపోయామేమోనని సందేహిస్తాడు. మురిగిన సూర్యుణ్ణి నంజుకుంటూ మృత్యువుని కాస్తకాస్త కొరుక్కుతిన్నాను. ‘‘ఆపండి ఆర్కెస్ట్రాని, ఆర్పండి కాగడాల్ని’’ అంటూ మానవ నైజాన్ని ఆవిష్కరిస్తాడు. అందుకే మహాస్వప్న ఏ ఇజాలకు చెందడు.. అందడు.

- డా. నూనె అంకమ్మరావు, 9397907776