మెయన్ ఫీచర్

తెలుగు రాష్ట్రాలపై భాజపా గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రా, తెలంగాణ,కేరళ రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ పాగా వేస్తుందా? ఈ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశే్లషిస్తే భాజపా అధికారంలోకి రావడం కల్ల అని ఎవరైనా చెబుతారు. కాని రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారతాన్ని జయించి జోరుమీదున్న భాజపా తాజాగా తెలంగాణ దృష్టి సారించింది. ఆంధ్రా, కేరళలో బలపడాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక భాజపా అధ్యక్షుడు,కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చినపుడు కీలక ప్రకటన చేశారు. కేరళ, ఆంధ్రా, తెలంగాణల్లో ఇపుడు భాజపాకు బలం లేనందున అమిత్ షా ప్రకటనను హాస్యాస్పదంగా తీసుకుంటే తప్పిదమే అవుతుంది.
125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడడం, సంప్రదాయ లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకోవడం,ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత, నవతరం ఓటర్ల సంఖ్య పెరగడం, మెజారిటీ ప్రజల్లో హిందుత్వ, జాతీయ భావనలు వ్యాపించడం వంటి కారణాల రీత్యా భాజపా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇతర ప్రాంతాలకు, దక్షిణ భారతానికి మధ్య చాలా తేడా ఉంది. సామాజిక నేపథ్యం, ప్రజల ఆలోచనా విధానాలు, బలమైన కుల వ్యవస్థ, హిందుత్వ సిద్ధాంతాల పట్ల ఆకర్షణ లేకపోవడం, లౌకిక వాద ధోరణులు ఉండడం, సరిహద్దు రాష్ట్రాల మాదిరి విదేశీ దురాక్రమణ బెడద లేకపోవడం, విలాసవంతమైన జీవన విధానం, సిద్ధాంత నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో నిలదొక్కుకునేందుకు భాజపా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కాగా, దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో- ‘్భజపాకు ఒకసారి అధికారం ఇస్తే ఎలా ఉంటుంద’నే ఆలోచనలు మొదలయ్యాయి. ఈ ఆలోచనలు ఇంకా మొగ్గ దశలో ఉన్నాయి. దక్షిణాదిన ఇప్పటికే కర్నాటకలో బీజేపీ బలపడింది. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీనే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ధాటికి కాంగ్రెస్, జేడీఎస్ కోటలు కూలిపోయాయి. కర్నాటకలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పట్ల జనంలో ఎలాంటి ఆసక్తి లేదు. కర్నాటకలో గతంలో భాజపా ఒకసారి అధికార పగ్గాలు చేపట్టింది. దీనికి కారణం అక్కడి సామాజిక వ్యవస్థనే. లింగాయత వర్గం బీజేపీని సొంతం చేసుకుంది. కోస్తా ప్రాంతం, కావేరీ డెల్టా, ఉత్తర కర్నాటకలో భాజపా సత్తా చాటింది. ఆరెస్సెస్ భావజాలం ఉన్న బీజేపీ వేళ్లూనుకునేందుకు తగిన పరిస్థితులు కర్నాటకలో ఉండడంతో ఆ పార్టీ బలమైన శక్తిగా అవతరించింది.
కర్నాటక మాదిరి పూర్తిగా సానుకూల వాతావరణం లేకపోయినా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపా అవతరించే అవకాశాలున్నాయి. 1948కి ముందు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో బీజేపీ జెండా ఎగురవేసింది. సరిగ్గా అదే మైండ్‌సెట్ కలిగిన ప్రజలు తెలంగాణలోనూ ఉన్నారు. తెలంగాణలో దళితులు, బీసీలు 75 శాతానికిపైగా ఉంటారు. మైనారిటీలు గణనీయ సంఖ్యలో 10 నుంచి 20 శాతం వరకు ఉన్నారు. హైదరాబాద్‌లో మైనారిటీలు 30 శాతం ఉన్నారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాం తాల్లో ఆర్యసమాజ్ పోరాడింది. సాయుధ పోరాటం నడిపించిన కమ్యూనిస్టులు 1948 నుంచి 1998 వరకు బలంగా ఉన్నా, ఆ తర్వాత క్రమంగా తమ ఉనికిని కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడుతోంది. తెలంగాణ సాధన పోరాటాన్ని నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా అవతరించి, 2014,2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది.
రాజకీయాలు స్థిరంగా ఉండవు. కాలం విచిత్రమైంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ నాలుగు నెలల తేడాతో లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లను గెలుచుకొంది. స్థానిక కారణాల వల్ల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సీట్లను కోల్పోయామని టీఆర్‌ఎస్ నేతలు తమను తాము సముదాయించుకున్నా, ప్రజల్లో వచ్చిన మార్పును గుర్తించలేకపోతున్నారు. ఓటమికి కారణాలను ఆ పార్టీ నాయకత్వమే విశే్లషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ బలహీనపడడంతో తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు అమిత్ షా సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ప్రకటించారు. తమ లక్ష్యం తెలంగాణ, ఆంధ్ర, కేరళలను కైవసం చేసుకోవడమేనని ఆయన అంటున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని వ్యూహాలను ఖరారు చేశారు. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను, క్రియాశీల కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణలో రానున్న నాలుగేళ్లలో రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో కొంతవరకూ ఊహించవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో సహజంగా ఎటూ అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా, బీజేపీని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా రానున్న రోజుల్లో లేచి కూర్చుంటుందా? ఆ పార్టీకి ఎటువంటి నాయకత్వం రాబోతోంది ? అనే ప్రశ్నలకు కాలమే బదులిస్తుంది. అంతవరకూ కేసీఆర్‌ను వ్యతిరేకించే శక్తులు ఊరికే ఉండవు. బీజేపీలోకి ఇక వలసలు మరింతగా పెరుగుతాయి. టీడీపీ నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా వలసలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ పద్ధతుల్లో తెలంగాణలో బీజేపీ ఇంతకాలంగా నడుస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా దూసుకెళుతున్న బీజేపీ రైలులోకి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను కలుపుకుని పోయి సర్దుకుని పోయే శక్తి- మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు ఉండాలని అమిత్ షా హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే ప్రాతిపదికగా తమ సైన్యాన్ని పటిష్టం చేసుకుని పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు.
ఆంధ్రాలోనూ బీజేపీని విస్తరిస్తామని అమిత్ షా చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రాలో తమ పార్టీకి ఉన్న కాస్త బలాన్ని తమకు తామే తగ్గించుకుని బీజేపీ నేతలు నిర్వీర్యం చేసుకున్నారు. టీడీపీ కబంధ హస్తాల్లో చిక్కుకుని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని భాజ పా నేతలు తుంగలో తొక్కారు. నరేంద్ర మోదీ 2014లో తిరుపతిలో ఇచ్చిన హోదా హామీని ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు ఆంధ్రా ప్రజలు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు హిందుత్వ అస్త్రాలను ప్రయోగించాలనుకుంటే దానికి తగిన వాతావరణం ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో హిందుత్వ ప్రాతిపదికగా ఉద్యమాలు వచ్చిన దాఖలాలు లేవు. ఆర్యసమాజ్ లాంటి సంస్థలంటే అక్కడి ప్రజలకు తెలియదు. ఆరెస్సెస్ గురించి పట్టణప్రాంతాల్లో కొన్ని వర్గాలకు మాత్రమే తెలుసు. బీజేపీ అంటే బంగారం, టోకు వర్తక మార్కెట్లకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే భావన ఇంకా ఉంది. కొన్ని అగ్రకులాల్లో బీజేపీకి విశేష ఆదరణ ఉంది. కాని ‘వోటు బ్యాంకు’లైన బడుగు వర్గాల్లో ఆ పార్టీకి ఇసుమంత కూడా స్థానం లేదు. గతంలో బీజేపీ పవనాలు వీచినప్పుడు విశాఖ, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతిలో ఆ పార్టీ గెలిచింది. అప్పుడు బీజేపీ అంటే క్రేజ్ ఉండేది. 2014 ఎన్నికల్లో మోదీ ఆకర్షణ మంత్రం వల్ల ఆ పార్టీకి కొన్ని సీట్లు వచ్చాయి. కాని ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అనాదిగా రాజకీయాధికారాన్ని రెండు సామాజిక వర్గాలు పంచుకుంటున్నాయి. 1956 నుంచి 1983 వరకు ఒక సామాజిక వర్గం పెత్తనం కొనసాగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1983 నుంచి మరో సామాజిక వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. పేరుకు మాత్రమే టీడీపీ, కాంగ్రెస్ అనే పార్టీలు. రెండు సామాజిక వర్గాల మధ్యనే అధికార మార్పిడి జరిగేది. తాజా ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు అమిత్‌షా రాజకీయ చతురతతో వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలు టీడీపీకి సహజంగానే ఆనందాన్ని ఇస్తాయి. జగన్‌ను బలహీనపరిచేందుకు టీడీపీతో చేతులు కలిపితే బీజేపీకి వచ్చే ప్రయోజనం శూన్యం. ముందుగా ఆంధ్ర ప్రజలను సంతోషపరిచేందుకు, వారికి చేరువయ్యేందుకు- గతంలో ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోవలసి ఉంది. అంతవరకూ ఆ పార్టీకీ ఆంధ్రాలో నిలువ నీడ ఉండదు. బీజేపీ వల్ల తమ రాష్ట్రానికి ఏమీ జరగలేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఈ అసంతృప్తిని తొలగించేందుకు కేంద్రం ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి.
గతంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంచిపేరు వస్తుందనే అనుమానం అక్కర్లేదు. ఆంధ్రాలో ఉనికిని చాటుకోవాలంటే, విశ్వసనీయతను పెంచుకోవాలంటే తప్పనిసరిగా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అప్పుడే బీజేపీ వైపుఅన్ని సామాజిక వర్గాల నుంచి ఊహించని మద్దతు వస్తుంది. టీడీపీ నుంచి ఎంత మంది వచ్చి చేరినా బీజేపీకి ఉపయోగం ఏమీ ఉండదు. బీజేపీలో చేరిన నేతలకు ప్రజాదరణ లభిస్తుందనుకోవడం కేవలం భ్రమే. తెలంగాణలో ఉన్న పరిస్థితులకు, ఆంధ్రాలోని సామాజిక వాతావరణానికి మధ్య వైరుధ్యాలు చాలా ఉన్నాయి. కేరళలో ఉనికిని చాటేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకూ ఫలించలేదు. 2014 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ‘కమలనాథుల’కు దేశమంతా పాదాక్రాంతమైనా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాషాయ జెండాను ఎగురవేయాలనుకోవడం అంత సులువు కాదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097