మెయన్ ఫీచర్

సత్వర న్యాయం పగటికలేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ మ ధ్య ఒక కేసు విచారణలో భాగంగా ఒక యువకుణ్ణి నిర్దోషిగా ప్రకటించింది. పూర్వపరాలు చూస్తే పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆ యువకుడు బాలుడు మాత్రమే. జువెనైల్ హోంలో చాలా కాలం ఉండి, కేసు పరిష్కృతం కాకపోవడంతో జైలుకు తరలించారు. చాలాకాలం తర్వాత సుప్రీం కోర్టు తీర్పు పుణ్యమాని నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ యువకుడి బాల్యాన్ని తిరిగి ఎవరు వెనక్కు ఇవ్వగలరు? ఇలాంటి గాధలు చాలా వున్నాయి.
సుప్రీం కోర్టులో 30 ఏళ్లకు పైబడి కొలిక్కిరాని కేసులు 44,409 ఉన్నాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేక్షణ (ఎకనమిక్ సర్వే) స్పష్టం చేస్తోంది. ఈ నెల ఒకటవ తేదీ నాటికి హైకోర్టుల్లో 43,63,260 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 18,79,399 సివిల్ కేసులు, 12,18,499 క్రిమినల్ కేసులు, 12,65,362 రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దిగువ కోర్టుల్లో 2.84 కోట్లు కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.
దేశంలో వ్యాజ్యాలు కొండల్లా పేరుకుపోవడానికి కారణం 46 శాతం వరకూ సర్కారీ వ్యాజ్యాలే. 50 లక్షల కన్నా తక్కువ ఆర్థిక ప్రభావం ఉండే కేసుల్లో హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. ఏడాదికి 10 నుండి 15 రోజులు సెలవులను తగ్గించుకుని ఉన్నత న్యాయస్థానాలు తమ వంతుగా కొంత త్యాగానికి సిద్ధపడాలని లా కమిషన్ చేసిన సిఫార్సులు 15 ఏళ్లుగా అమలు కాలేదు. మిగతా దేశాల్లో లేని ఈ తాత్సారం భారత్‌లోనే ఎందుకు సాగుతోంది? దీనికి అన్ని వ్యవస్థల్లో చిత్తశుద్ధి కొరవడటమేనన్నది నగ్నసత్యం. శీఘ్ర న్యాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు నిరాశే ఎదురవుతోంది. దశాబ్దాల తరబడి కొనసాగే కేసుల వల్ల ఇటు కక్షిదారులపైనే కాదు, అటు ప్రభుత్వంపైనా ఎడతెగని కాలవ్యయం సహా తీవ్ర ఆర్థిక భారం పడుతోంది, సకాలంలో అందని న్యాయంతో చాలామందికి అన్యా యం జరుగుతోంది.
పెండింగ్ కేసులపై ఇటీవల సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. రిటైరైన న్యాయమూర్తులను ఆర్టికల్ 128, ఆర్టికల్ 224ఏ కింద తిరిగి కొంత కాలం కొనసాగించాలని సూచించారు. సుప్రీంలో పెండింగ్ కేసుల సంఖ్య 58,669. ఈ సంఖ్య అనునిత్యం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఏరోజుకారోజు కొత్త కేసులు నమోదు కావడంతో వీటి పరిష్కారం పెనుభారంగా మారింది. న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయాలని, పెండింగ్ కేసులను తగ్గించేందుకు సహకరించాలని న్యాయస్థానాలు పాలనా వ్యవస్థకు మొరపెట్టుకోవడం ఇదే ప్రథమం కాదు. స్వతంత్య్ర భారతంలో తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌జే కనియా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను సుప్రీం కోర్టును పటిష్టం చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఏర్పాటయ్యాక తొలి ఏడాది 8 మంది న్యాయమూర్తులు కేవలం 525 కేసులను పరిష్కరించగలిగారు. మరో 690 కేసులు పెండింగ్‌లో పడ్డాయి. 1970 నాటికి పెండింగ్ కేసులు కొట్టొచ్చినట్టు పెరిగిపోయాయి. అప్పటికి సగటున ఏటా 6538 కేసులను సుప్రీం పరిష్కరిస్తున్నా, మరో 10వేలు పెండింగ్‌లో ఉన్నాయి. 1988లో సుప్రీం న్యాయమూర్తుల సంఖ్యను 18 నుండి 26కు పెంచారు. 2009లో ఈ సంఖ్యను 31కి పెంచారు. నేడు ఈ సంఖ్యను 50 నుండి 80కు పెంచాల్సిన అవసరం ఉందనేది న్యాయమూర్తుల భావన. సుప్రీంలో అనేక ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి ‘కోరం’ ఏర్పడింది. 31 మంది న్యాయమూర్తులు ప్రస్తుతం ఉన్నా, ఇద్దరు న్యాయమూర్తులు త్వరలో రిటైర్ కాబోతున్నారు. అంటే వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుంది.
1991 నాటికి సుప్రీంలో పెండింగ్ కేసులు లక్ష దాటాయి. దాంతో కేసుల వర్గీకరణ చేపట్టి, ఒకే అంశానికి సంబంధించిన వాటిని క్లబ్ చేసి పరిష్కరించడంతో కేసుల సంఖ్య తగ్గినా ఆ తర్వాత మళ్లీ పెండింగ్ సమస్య ఎక్కువైంది. 1970 డిసెంబర్‌లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జేసీ షా అప్పటి రాష్టప్రతి వీవీ గిరిని కలిసి న్యాయస్థానాల పరిస్థితిని వివరించారు. ఆయన చర్యలు తీసుకునేలోగానే షా పదవీకాలం ముగిసింది. అనంతరం ప్రధాన న్యాయమూర్తులైన ఎస్‌ఎం సిఖ్రి, ఎఎన్ రాయ్, ఎంహెచ్ బేగ్‌ల కాలంలో పెద్దగా సంస్కరణలకు తావు లేకపోయింది. నీలం సంజీవరెడ్డి రాష్టప్రతిగా ఉన్న సమయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ తన ఏడేళ్ల పదవీకాలంలో అనేక సంస్కరణలకు పూనుకున్నారు. 1985లో ప్రధాన న్యాయమూర్తి అయిన పీఎన్ భగవతి ఏడాదిన్నర కాలంలో న్యాయస్థానాల్లో ఐసీటీ వినియోగానికి చర్యలు చేపట్టారు. అంతవరకూ క్లరికల్‌గానే కొనసాగుతున్న కేసుల వ్యవహారాలు కంప్యూటరీకరణ దిశగా పయనించడంతో కేసుల పరిష్కారానికి మార్గం దొరికింది. ఎంఎన్ వెంకటాచలం, ఎఎం అహ్మదీ, ఆదర్శ సేన్ ఆనంద్, కేజీ బాలకృష్ణన్‌లు ప్రధాన న్యాయమూర్తి హోదాలోనే కేసుల పరిష్కారానికి అనేక చర్యలు తీసుకున్నారు. జేఎస్ కేహార్, దీపక్ మిశ్రాలు సందర్భం దొరికిన ప్రతిసారీ న్యాయమూర్తుల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో 399 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా ఆర్థిక సర్వేక్షణ ప్రకారం 37 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓ న్యాయమూర్తి పరిపూర్ణ న్యాయమూర్తిగా మారడానికి దశాబ్దాల కాలం పడుతుంది. తీరా పూర్తి సామర్థ్యాలు ఇనుమడించే సమయానికి వారు రిటైరైపోతున్నారని ఇటీవల ప్రధానికి రాసిన లేఖలో జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. సుప్రీంలో న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించిన కొద్ది కాలానికే వారు రిటైర్ కావడంతో సంస్కరణలకు, స్వీయ ఆలోచనలను అమలు చేసేందుకు సమయం ఉండటం లేదు.
ఇక దిగువ స్థాయి కోర్టుల విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంజూరైన జిల్లా న్యాయాధికారి పోస్టులు 22,750 కాగా పనిచేస్తున్నది 17,891 మంది మాత్రమే. దేశవ్యాప్తంగా సుమారు 8152 జిల్లా స్థాయి న్యాయాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో 13 శాతం కేసులు మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. మరో 87 శాతం కేసులు మరుసటి ఏడాదికి పేరుకుపోతున్నాయి. జిల్లా న్యాయాధికారి ఒక ఏడాదిలో సగటున 764 కేసులు పరిష్కరిస్తుంటే హైకోర్టుల్లో 2348 కేసులు, సుప్రీంలో 1415 కేసులను పరిష్కరిస్తున్నారు. ఈ లెక్కన దేశంలో ఉన్న కేసులు పరిష్కారానికి మరో వందేళ్లు సమయం పట్టే అవకాశం లేకపోలేదు.
ఈ పరిస్థితుల్లో తక్షణమే న్యాయవ్యవస్థ తేరుకోవల్సి ఉంది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడమే కాదు, వౌలిక సదుపాయాలను కల్పించడం, సహాయ సిబ్బందిని నియమించడం, కేసుల పూర్వపరాలను అధ్యయనం చేసి కేసులకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసే ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలి. వందలాది, వేలాది పేజీలు ఉండే కేసును ఒక న్యాయమూర్తి అధ్యయనం చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించవచ్చు. కోర్టు భవనాలు, కోర్టు హాళ్లు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంతో పాటు సమస్త రికార్డులను కంప్యూటరీకరించాలి. అన్ని న్యాయస్థానాలూ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా టెక్నాలజీ గ్రిడ్ ఏర్పాటు చేయడంతో పాటు రియల్ టైమ్‌లో కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్థలో అంతర్గత పర్యవేక్షణ అనివార్యం. లేకుంటే 2040 నాటికి పెండింగ్ వ్యాజ్యాలు 15 కోట్లు దాటడం ఆశ్చర్యమేమీ కాదు.
నిజానికి దేశ జనాభాలో ప్రతి పదిలక్షల మంది పౌరులకు 19 మందే న్యాయమూర్తులున్నారు. వాస్తవానికి 10 లక్షల జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలి. 1987లోనే ఆనాటి లా కమిషన్ ఈ మేరకు సిఫార్సు చేసింది. తక్షణం 40వేల మంది న్యాయమూర్తులను నియమించాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం జస్టిస్ టీఎస్ ఠాకూర్ లెక్కల ప్రకారం దేశంలో 70వేల మంది న్యాయమూర్తులు ఉండాలని లెక్కలు చెప్పారు. ఫ్రాన్స్‌లో ప్రతి పది లక్షల జనాభాకు 124 మంది, అమెరికాలో 10 లక్షల జనాభాకు 108 మంది, ఆస్ట్రేలియాలో 40 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ లెక్కన మన దేశంలోనూ నియామకాలు జరగాల్సి ఉంది. చట్టం అమలు జరిగే తీరు, శాంతిభద్రతల సౌభ్రాతృత్వం ఆయా ప్రభుత్వాల సత్తాకు నిదర్శనం అని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే కౌటిల్యుడు నిర్వచించాడు. చట్టం అమలు కాని రాజ్యం అరాజకానికి కేంద్రంగా మారిపోతుంది. ఎవరి ఇష్టారాజ్యంగా వారు ప్రవర్తించే ఆటవిక రాజ్యానికి దారితీస్తుంది. న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, శాసనవ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేసినపుడే ఆయా సమాజాలు మానవీయంగా ప్రవర్తిస్తాయి. సత్వర న్యాయ స్వప్నం సాకారమైతేనే న్యాయస్థానాలపై ప్రజల్లో విశ్వసనీయత ఇనుమడిస్తుంది.

-బీవీ ప్రసాద్ 98499 98090