మెయిన్ ఫీచర్

బడిబాటలో బామ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గులాబీ రంగు చీరలు కట్టుకుని..
స్కూలు బ్యాగు పట్టుకుని..
బడి గంట కొట్టగానే..
వడివడిగా అడుగులేస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముందుకెళుతున్నారు ఈ ముసలవ్వలు. పాఠశాల గేటు వద్దకు రాగానే అంతా ‘క్యూ’లో లోపలికి వెళతారు. పలక, బలపం పట్టుకుని మరాఠీ వర్ణమాలను దిద్దుతారు. వారిలో చాలామంది మొదటిసారిగా స్కూలు ముఖం చూసినవారే.. 27 మంది ఉన్న ఈ బడిలో అంతా అరవై నుండి తొంభై సంవత్సరాల వయసున్నవారే. వారిలో తొంభై సంవత్సరాలున్న సీతాబాయి దేశ్‌ముఖ్ ఆ స్కూల్లో అత్యంత పెద్ద వయస్కురాలు. ఈమె మనవరాలు కూడా అప్పుడప్పుడూ ఆమెతో స్కూలుకు వస్తుంది. ఇంటి దగ్గర ఇద్దరూ కలిసే హోం వర్కు చేస్తారట. అలా చేయడం వీరిద్దరికీ సరదాగా ఉంటుందట.
ఒకప్పుడు వారికి అక్షరం ముక్క తెలియదు. బ్యాంకు, ఇంటి వంటి ధ్రువ పత్రాలపై వేలిముద్రలు వేసిన చేతులవి.. బడికి దూరంగా పెరిగిన బాల్యం ఆ బామ్మలది. కానీ నేడు వారంతా ఎంతో పట్టుదలగా అక్షరాలు దిద్దుతూ మనుమలు, మనువరాళ్లతో పోటీగా హోం వర్కులు చేసేస్తున్నారు. అరవై సంవత్సరాలు దాటినా.. చదువుకోవాలనే ఆ తపనకు వయసు అడ్డుకాదని చెప్పేందుకు ఈ బామ్మలకు ప్రత్యేకంగా ఓ బడి ఉంది. దాని పేరు ‘ఆజీబైచీశాల’. ఇక్కడ బామ్మలందరూ పలకా బలపం చేతబట్టి ఓనమాలు దిద్దుతూ, చదువులమ్మ ఒడిలో అక్షరాలను అవగతం చేసుకోవడానికి అవస్థలు పడుతున్న ఈ బోసినవ్వుల ముసలవ్వల బడి.. ముంబైలోని 'ఫంగానే’ అనే ఊళ్లో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదువు నేర్చుకోవడానికి వస్తుంటారు బామ్మలు. ఇక్కడ పాఠాలు నేర్చుకునే ఒక్కో బామ్మకు ఒక్కో లక్ష్యం ఉంది. చిన్నప్పుడు ఆర్థిక కారణాల వల్ల బడికి వెళ్లలేని వారు.., ఆడపిల్ల అనే కారణంగా బడికి వెళ్లలేని వారు, చదువు విలువ తెలిసి కూడా మూఢ నమ్మకాలతో చదువుకు దూరమైనవారు ఇలా ఎంతోమంది వివిధ కారణాలతో బడికి దూరమైనవారే.. వీరందరూ ఇప్పుడు చదువుకుని పుస్తకాలు చదువుకోవాలనే ఆలోచన కొందరిదైతే.., నేనూ చదువుకున్నాను, అక్షరం ముక్కలు నేర్చుకున్నాను.. అని గర్వంగా చెప్పుకోవాలనే ఆలోచన మరికొందరిది. ఇంకొందరైతే అసలు ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు? అనే లోకజ్ఞానం పెంచుకోవాలనుకునేవారు కొందరు.. బ్యాంకులకు వెళ్లినప్పుడు సొంతంగా ఫామ్ పూర్తిచేయాలనే తపన కలవారు మరికొందరు.. ఇలా చదువుకుంటున్నందుకు ప్రతి ఒక్కరి కళ్లలో అంతులేని వెలుగు కనిపిస్తుంది. క్లాసు రూములో కూర్చుని టీచరు చెప్పేది విని.. అక్షరాలు దిద్దే అవకాశం దొరికినందుకు ఎంతో మురిసిపోతున్నారు ఆ బామ్మలు. అసలు బామ్మలకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ స్కూలును ఎవరు స్థాపించారో తెలుసుకుందాం..
ముంబైలోని థానే జిల్లాకు చెందిన 'ఫంగానే’ ఊళ్లోని జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూలులో 2013లో హెడ్‌మాస్టర్‌గా అడుగుపెట్టిన యోగేంద్ర బంగర్‌కు ఆ ఊరి సమస్యలు ఆహ్వానం పలికాయి. మొదట్లో ఊరి మొత్తానికి ఒకటే టాయిలెట్ ఉండేది. గ్రామ పంచాయితీ నిధులు అభివృద్ధి పనులకు కాకుండా దారి మళ్లేవి. మంచినీరు కోసం అక్కడి మహిళలు బిందెలు పట్టుకుని మూడు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లేవారు. వాటిని చూసిన యోగేంద్ర చలించిపోయాడు. ఆ మహిళల కష్టం తీర్చమని స్థానిక ట్రస్ట్‌ను కోరుకున్నాడు. వారి సహకారంతో వాననీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతలు తవ్వించాడు. మంచినీటి పైపులను ఏర్పాటుచేశాడు. దాంతో గ్రామస్థులు సమస్య తీరిందనుకున్నారు. కానీ అక్కడి మహిళల్లో చదువుకోవాలనే ఆకాంక్ష చాలా సంవత్సరాలుగా అలానే ఉండిపోయిందనే విషయాన్ని 2016లో శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రహించాడు యోగేంద్ర. వారికోసం ప్రత్యేకంగా వారానికి ఒకరోజు బడిని నిర్వహించాలనుకున్నాడు. అదే సంవత్సరం మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా తడికెలతో రెండు గదులను ఏర్పాటుచేసి వారికి పాఠశాలను మొదలుపెట్టాడు. మరాఠీ వర్ణమాల ‘ఆరుూ’ పదంతో మొదలవుతుంది. ఆ పదాన్ని ‘ఆజీ’గా మార్చేసి, స్కూలుకు ‘ఆజీబైచిశాల’ అని పేరుపెట్టాడాయన. అచ్చం బడి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బామ్మలకు యూనిఫామ్‌ను కూడా నిర్ణయించాడు. బామ్మలందరూ గులాబీ రంగు చీర కట్టుకుని ప్రతిరోజూ ఉదయం కొత్త ఉత్సాహంతో బడిలోకి అడుగుపెడతారు. అలా వచ్చిన బామ్మలకు పాఠాలు చెప్పేందుకు పదోతరగతి వరకూ చదివిన, ఆ ఊరి కోడలైన శీతల్ మోర్ అనే ముప్ఫయేళ్ల మహిళను నియమించాడు. వృద్ధ మహిళల కోసం నడుపుతున్న ఈ స్కూలుపై మరాఠీలో ఒక సినిమా కూడా వచ్చింది. ఈ స్కూలు గురించి తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల బామ్మలు కూడా ఈ బడిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ బడి బాగోగుల కోసం కొంతమంది ఆర్థికసాయం చేసేందుకు ముందుకు కూడా వచ్చారు. కానీ యోగేంద్ర చాలా సున్నితంగా తిరస్కరించి.. ‘ఈ బడి నిర్వహణకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ బడి నా కూతురితో సమానం. ఇది సక్రమంగా నడిచేలా చూసే బాధ్యతను నేను ఎవ్వరికీ అప్పగించను’ అని నిర్మొహమాటంగా చెప్పాడు. ఏది ఏమైనా ఈ వయస్సులో బామ్మలు రెట్టించిన ఉత్సాహంతో ప్రతిరోజూ ఉదయం నవ్వుకుంటూ బడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఆ బామ్మలందరికీ జోహార్లు.. ఇంతకన్నా ఏం చెప్పగలం?

-మహి