మెయిన్ ఫీచర్

వీణలేని వినాయకుడు (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మంచి ఎడిటర్ తను జీవిస్తున్న కాలంలో, అందరితోపాటు జీవిస్తూ- ఒక అడుగు ముందుకువేస్తాడు. ఆ ఒక్క అడుగు పత్రికా రంగానికి అందులో భాగమైన సాహిత్యానికి బిగ్ లీప్. పీరియాడికల్ జర్నలిజంలో ఒక అడుగు ముందుకువేసిన తెలుగు స్వతంత్రకు దీటు రాగల పత్రికలు ఈనాటి వరకూ లేవంటే, ఆనాటి ఆ పత్రికా సంపాదకుల కృషి ఎంత విలువైనదో మనం గ్రహించాలి. వ్యాపార విలువలు ఇతర సామాజిక విలువలను అంతగా మింగివేయని ఆ కాలంలో, సాహసంతో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత ‘తెలుగు స్వతంత్ర’ను నడిపిన శ్రీ గోరాశాస్ర్తీగారికి దక్కుతుంది. పాతవారి చేత మళ్ళీ వ్రాయించడమే కాక- కొత్తవారి నెంతమందినో ప్రోత్సహించి రంగంలోకి దింపారు. ఈనాడు వారే మళ్ళీ అటువంటి పత్రికను నిర్వహించాలనుకున్నా అదిప్పుడు సాధ్యమయ్యేది కాదు. ఆ పరిస్థితులూ, ఆ వయసూ, ఆ ఉత్సాహమూ అవన్నీ వేరు: ఆరోజుల్లో ‘ఆయనంతవాడు ఆయనే’ అన్నట్లుగా వుండేవారు శాస్ర్తీగారు.
కబుర్ల పోగు
గోరాశాస్ర్తీగారు కబుర్లపోగు, సంభాషణా చతురుడు. వాగ్యుద్ధాలలో ఎదుటివారిని అవలీలగా చిత్తుచేయగల సరస్వతీ కటాక్షము కలవారు. ఎడిటర్‌గా కూడా ఆయన ఆషామాషీ వ్యక్తికాదు. తన అభిప్రాయాలను తెగేసి చెప్పగల గుండె నిబ్బరం కలవాడు. మాటవరసకి సంపాదకీయంకోసం ఎవరూ ఏ పత్రికా చదవరు. నిజంగా గోరాశాస్ర్తీగారి సంపాదకీయాలకోసం ‘ఆంధ్రభూమి’ దినపత్రిక చదువుతారని విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. అన్ని విషయాలూ అంతో-ఇంతో తెలిసి, కొన్ని విషయాలలో అఖండ ప్రజ్ఞాపాటవాలు కలిగి నిర్భయంగా, నిస్సంకోచంగా పత్రికను నిర్వహించగల ఉత్తమ సంపాదకుల శ్రేణికి చెందినవారు గోరాశాస్ర్తీ. సంపాదకులకు వినయ విధేయతలు తప్ప డొక్కశుద్ధి అవసరంలేదనే ప్రాతిపదికపై నేడు జర్నలిజం పెడదారులు పడుతున్నప్పుడు, గోరాశాస్ర్తీగారి వంటి పెద్దల శకంతోనే ఆ మర్యాదలూ, ఆదర్శాలూ అంతరించనున్నాయని మనం గుర్తించవలసి వుంటుంది.
చలంగారి పట్ల ఆయనకు గల ప్రగాఢాభిమానానికి, చలం పోయినప్పుడు ‘ఆంధ్రభూమి’లో గోరాశాస్ర్తీగారు వ్రాసిన సంపాదకీయం మచ్చుముక్కగా నిలుస్తుంది. చలంగారి వలెనే గోరాశాస్ర్తీగారు కూడా తెలుగువారి అరసికతను, భావదారిద్య్రాన్ని లోపాల్నీ సహించి ఊరుకోరు. చలంగారు రాతలోనే తీవ్రం, శాస్ర్తీగారు మాటలోనూ తీవ్రమే. స్ర్తి స్వేచ్ఛాయజ్ఞంలో భాగంగా స్ర్తి, పురుష సమానత్వంపట్ల యిప్పుడున్న స్ర్తిపురుష సంబంధాలలో రావలసిన మార్పులపట్ల ఆయనకు చలంగారికి ఉన్నంత సానుభూతి వుంది.
మురికి పేరుకుపోయి నిలవనీటి మడుగులా నిశ్చలంగా వున్న తెలుగు జీవితంపై ప్రభంజనంలా విరుచుకుపడి తెలుగువారిని గంగవెర్రులెత్తించి, చావగొట్టి చెవులు మూసిన చలంగారికి అంత అత్యద్భుతమైన నివాళి గోరాశాస్ర్తీ తన సంపాదకీయంలో యిచ్చినట్లు మరెవ్వరూ యివ్వలేదు. అభిప్రాయ భేదాలెటువంటివైనా, దురదృష్టకరమైన తేడాలెన్ని వచ్చినా, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు సందర్భం వచ్చినప్పుడు, ఉన్నది ఉన్నట్లు మాటలు మింగకుండా చెప్పగలిగినవారు నేటికీ తెలుగులో గోరాశాస్ర్తీగారు ఒక్కరే, కన్యాశుల్కంలో కరటకశాస్ర్తీ లాంటివారు. ఛార్లెస్ డికెన్స్ మళ్ళీ పుట్టి పిక్‌విక్ పేపర్స్ లాంటి పుస్తకం తెలుగులో రాస్తే తప్పకుండా శాస్ర్తీగారి పాత్రను ఆయనొక్కడే అద్భుతంగా పునఃసృష్టి చేయగలడని నాకనిపిస్తుంది. తెలుగువారి హాస్యప్రియత్వం, వెక్కిరింత, వేళాకోళం అన్నీ ఆయనలో ఉన్నాయి. ఒకసారి ఫతేమైదాన్ క్లబ్‌లో కాశీ, నేనూ, శంకరమంచి సత్యం, ధర్మారావు, విశ్వనాథశాస్ర్తీ, లక్ష్మణరావు వుండగా శాస్ర్తీగారో కథ చెప్పారు. (ఈ కథ శ్రీశ్రీగారు ఆయనకు చెప్పారని చెప్పినట్లు గుర్తు)-
ఓ గేదె కథ
ఓ ఊళ్ళో, ఓ రాజుగారి గేదె తప్పిపోయింది. మరి రాజుగారి గేదెకదా- అందరూ బయల్దేరారు వెతకడానికి. ఎక్కడా దొరకలేదు. అప్పుడంతా ఏం చెయ్యాలో తెలియక విచారంగా వున్నారు. అన్ని ఊళ్ళల్లోనూ ఒక విలేజ్ ఫూల్ వున్నట్లే ఆ వూళ్లోకూడా ఆ ఆస్థాన ఫూల్ వున్నాడు. వాడు నేను వెళ్ళి గేదెని వెతికి తీసుకొస్తాను అని చెప్పి సరిగ్గా వెళ్ళి గేదె ఎక్కడున్నదో వెంటనే వెతికిపట్టుకుని చక్కా తీసికొచ్చేసాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తామెవ్వరూ చేయలేని పని ఒక బుద్ధిహీనుడు ఎలా చేయగలిగాడా అని మీమాంస పడ్డారు. అప్పుడు వారిలో ఒకరు-మేమెవ్వరం పట్టుకోలేకపోయాం, మరి నువ్వు ఎలా తేలిగ్గా వెతికి పట్టుకున్నావో? చెప్పమన్నారు. అప్పుడు ఆ మూర్ఖుడు దానికిలా జవాబిచ్చాడు ‘‘ఏముంది అది చాలా సులభం. నేనే గేదెనైతే ఎక్కడకు వెళతాను అని ఒక్క క్షణం అనుకున్నాను. అక్కడకు వెళ్ళాను. అక్కడ గేదే వుంది- అంతే’’ అన్నాడు. ఇలా నవ్వించడం, కవ్వించడం శాస్ర్తీగారికి వెన్నతోపెట్టిన విద్య.
గోరాశాస్ర్తీయా..
ఏ విషయాన్నైనా గోరా శాస్ర్తియమైన పద్ధతిలోనే చెప్పగలరు. మచ్చుకి, యువభారతి వారు వెలువర్చిన ‘మహతి’ సంపుటిలో ‘నేటి జాతక కథలూ- కాశీ మజిలీలూ’ అనే చమత్కారమైన భావస్ఫోరకమైన వ్యాసాన్ని వ్రాశారు. అందులో ఒకచోట-
‘‘రుచి లేని సాహిత్య దినుసుల్ని, అభిరుచి పరిజ్ఞానం లేనివాళ్ళు ఉత్సాహంగా ఆరగించి, ఆ బాగున్నాయి, బాగున్నాయి’’ అంటున్నారు. సరుకుల ప్యాకింగు ఆకర్షణీయంగా ఉంటోంది. సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి ధర్మమా అని, ప్యాకింగు పద్ధతులు పసందుగా ఉన్నాయి.
మారుతున్న సమాజాన్నీ, జీవన విధానాన్నీ దగ్గరగా చూస్తూ అందులోనే వుంటూ, ఆటుపోటులకు గురియవుతూ, తలాతోకా బోధపడక, ఉక్కిరిబిక్కిరై, కలం చేతబట్టి, కల్పనా సాహిత్యాన్ని బనాయిస్తున్నవారు కాశీ మజిలీలనే అనుసరిస్తున్నారు’’. శాస్ర్తీగారి పరిశీలనలో యిప్పుడు వస్తున్న నవలలూ, కథలూ అన్నీ వస్తుగుణంలో కాళీ మజిలీలే, పేదరాసి పెద్దమ్మ ఉపాఖ్యానాలే. కల్పనా సాహిత్య పేజీల సదస్సులో ఎంత దూరం వెళ్ళినా, చీలమండ దాటి లోతు వుండదు. గడచిన పది పదిహేను సంవత్సరాలలో కుప్పతెప్పలుగా వస్తున్న కల్పనాసాహిత్యం రెండు తరాల తెలుగువారి సాహిత్యాభి రుచిని దయనీయంగా దిగజార్చివేసింది అని అన్నారు. ఇదీ వారి పరిశీలనలోని వేదన. అంతేగాని వెక్కిరింత కాదు. శాస్ర్తీగారు నిరాశావాది అని పొరబడే ప్రమాదం ఉంది. ‘‘ఆశ ఖరీదు అణా’ అనే మంచి నాటికను వ్రాసిన శాస్ర్తీగారు ఎప్పటికీ ఆశావాదే! స్వాతంత్య్రానంతరం సాహిత్య కళారంగాలు ఒకటోరకం మేధావుల్ని ఆకర్షించలేక పోయాయి. ప్రేరణలోనే మార్పువచ్చి, ప్రతిభావంతులైన యువకులు సుఖజీవనంవైపు మళ్ళారు. సాహిత్య సృష్టి ‘బెస్ట్ బ్రైన్స్’ని ఆకర్షించలేకపోయింది. పాతయుగం చచ్చింది. కొత్త యుగం బోధపడదు అని శాస్ర్తీగారు ఆవేదనాపూరిత కంఠస్వరంతో ఒక విశే్లషణను మనముందు ఉంచారు.
ఆశా సందేశం
శాస్ర్తీగారి కథలేమీ ఇపుడు అందుబాటులో లేవు. వారి కొన్ని రేడియో నాటికలు మాత్రం ఇంకా లభిస్తున్నాయి. రేడియో నాటికను అర్థవంతంగా, శ్రవణయోగ్యంగా, ప్రతిభావంతంగా తీర్చిదిద్దిన ఆద్యులలో గోరాశాస్ర్తీగారు ప్రముఖులు. వారి ‘ఆశ ఖరీదు అణా’ నాటిక నిరాశామయలోకంలో కదన శంఖంలాంటిది. జీవితం యొక్క ఉపభోగ్యతను చాటిచెప్పే రచన. ఈ నాటిక నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న కొందరు మనుష్యులకు. అణాకాణీతో ఆశ కల్పించిన ఉత్ప్రేరకము. ఏ గొప్ప సాహిత్యమైనా జీవితం పట్ల ఆశను రేకెత్తించగలిగితే ఆమేరకు అది ఫలించినట్లే. ఫలశృతి ఆశాస్ఫోరకంగా ఉండటం మంగళదాయకమే. ఈ అణా సందేశానే్న ‘ఆమె నవ్వింది’అనే నాటికలో కూడా కాంతా సమ్మతంగా చెప్పారు రచయిత. రైలు క్రిందపడి చనిపోవాలనుకుంటున్న ఒక నిరుద్యోగి, పిరికివాడు, భీరువు అయిన యువకునికి ఒక యువతి జీవితాశను, జీవనానందాన్ని కల్పిస్తుంది. ఆమె నవ్వు, ఆమె ఇచ్చిన చేయూత అతడికి ఫలప్రదమైన జీవితం గడపడానికి ఆస్కారం కలిపిస్తుంది. ఆ నాటికలో వైదేహి.
‘‘సమస్త పాపాల్లోకీ భయంకరమైన పాపం భయపడ్డం. ఆ తరవాత, హృదయంలో దయా, ప్రేమా, ఇవి ఉన్నందుకు సిగ్గుపడకండి. కానీ- ఏ ఘట్టంలో అయినా అల్పహృదయం ఎదురై వేధిస్తే- ధైర్యంగా ఆ అల్ప హృదయాన్ని నలిపి అవతల పారేయండి. బతకవలసినన్నాళ్ళూ నిబ్బరంగా, విశ్వాసంతో బతకండి. మీ మూలాన ప్రపంచానికి ఇంకొంచెం దుఃఖం, ఇంకొంచెం వేదన యివ్వకుండా, చుట్టుపక్కల కొంచెం ఆనందం వెదజల్లండి... అంతే చీకటిని తిట్టుకుంటూ కూర్చునేకంటే ఈ చీకటిలో ఒక్క చిన్న దీపకళిక వెలిగించండి.’’ అంటుంది.
ప్రసిద్ధ హిందీ నవలా రచయిత రామానంద్‌సాగర్ సాహిత్య ప్రయోజనం గురించి చెపుతూ చెప్పిన ఒక చిన్న కథ ‘ఆశ ఖరీదు అణా’కి ప్రేరణ వంటిది అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. కొంచెం ఇంచుమించుగా రావిశాస్ర్తీగారి ‘వర్షం’ కథ కూడా ఈ కోవకు చెందినదే. జీవితం మీద విరక్తిచెంది, మరణమే మేలు అనుకునే దశలో ఏ మూలనుంచో ఒక ఆశావేశ కిరణం ప్రసరిస్తే జీవితం వెలుగుకి మలుపు తిరుగుతుంది. వరుసనేది సోకినట్లు బంగారం అవుతుంది.
కృష్ణశాస్ర్తీగారి ‘‘కన్నీటి కెరటాల వనె్నలేలా’’ గీతంలో కూడా వినగలిగిన వారికి ఆశా సందేశమే కదా వినిపించేది. అలాగే శాస్ర్తీగారి ‘‘ఆనంద నిలయమ్’’ హాస్య నాటకం కూడా మానవ జన్మ సర్వోత్కృష్టమైనదనీ ఆశాసందేశాన్ని చివరలో వినిపిస్తుంది. అది హాస్య నాటకమన్నారు గాని, నిజంగా మధ్యతరగతి కుటుంబాల అంతఃకల్లోలాలూ, చేజేతులా జీవితాల్ని పాడుచేసుకుంటూ ఒకరికొకరు ఆగర్భ శత్రువుల్లా తిట్టుకుంటూ పరస్పరం పీడించుకుంటూ బ్రతికే మనుష్యుల జీవితాలలోని బీభత్సాన్ని, కళ్ళక్కట్టినట్టు ప్రదర్శించే గంభీర విషాదాంత కావ్యం ఆనంద నిలయమ్. ఈ నాటకం వింటున్నప్పుడు కలిగే నవ్వులో చార్లీచాప్లిన్ తాలుకు హ్యూమర్ లాంటిది పలుకుతుంది. శాస్ర్తీగారు కుటుంబాల్లోని అవకతవకలు, అసందర్భాలు, మూర్ఖత్వాలు, మొండి పట్టుదలల విషాదాన్నుంచి అమృతాన్ని పిండి మనకు ఆనందించమని అందించారు. ఈ నాటకంలోని పాత్ర చిత్రణ, సంభాషణలు సన్నివేశకల్పన మృచ్ఛకటికం స్థాయిని అందుకుంటుందని చెప్పడం శాస్ర్తీగార్ని మితిమీరి పొగిడినట్లు అవుతుందని అనుకోరాదు.
మనసే పెళ్లిపందిరి
మంచి రచయితలందూ జీవితాన్ని అంటిపెట్టుకునే రాస్తారు. శాస్ర్తీగారి ప్రతి నాటకం ఒక రసవత్తరమైన బొమ్మల కొలువులా, హడావిడిగా కళకళలాడుతూ వుంటుంది. ఆయన మనసే ఒక పెళ్ళిపందిరిలా, నానావర్ణ శోభితమై, సుగంధ పరిమళ భరితమై అలరారుతూ వుంటుంది. కోనసీమ కొబ్బరి తోటల్లోని చల్లదనం, మామిడి తోటలలోని హాయి, పంట కాలవల్లోని తుళ్ళింతలూ అన్నీ ఆయన మసులోంచి రచనల్లోకి పరుగులు పెడుతూ వస్తాయి. ఒరిజినల్‌గా అంతా గ్రామాలనుంచి వచ్చినవారే అయినా, పట్టణ వాసంలోనూ, నగరాలలోనూ స్థిరపడి, కుహనా నాగరికతకు దాసులై, పల్లెటూళ్ళను, పల్లెటూరి జీవితాన్ని అసహ్యించుకునే బడాయి బాబులకు గట్టిగా చురకలువేసే హాస్య నాటకం ‘సెలవుల్లో...’ ఈ నాటకంలో శాస్ర్తీగారు చిత్రించిన కుటుంబంలోని వ్యక్తులు మనకు అడుగూడిపోయిన తపేళాల్లా, వేళ్ళులేని మొక్కల్లా కనిపిస్తారు. పట్నవాసపు పద్ధతులు, అలవాట్లు, పల్లెటూళ్ళలో ప్రదర్శిస్తే వారు ఎంత అభాసుపాలు అవుతారో మనకు ఈ నాటకం ఒక గుణపాఠంలా చెపుతుంది. ఎక్కడికక్కడ సర్దుకుపోకుండా, మనుష్యులనర్థం చేసుకొనకుండా, విపరీతంగా ప్రవర్తించేవారు ఏ ఆధిక్యతను చూసుకుని సాటి మనుష్యులను నొప్పిస్తున్నారో బోధపడదు. కుహనా జీవితము, కృత్రిమ విలువలు, అసహజమైన అలవాట్లతో పెరిగినవారు ఎంత మూర్ఖంగా, ఎంత గుడ్డిగా ఉంటారో ఈ నాటిక చాలా శక్తివంతంగా చెబుతుంది. ఈ విషయం గురించి ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా కలగని ఫలితం ఈ సాహిత్య ప్రక్రియ ద్వారా ప్రజల్లో కలుగుతుంది. మనుష్యులని మంచికి మళ్ళించటం, సత్య నిరూపణ ప్రయత్నంకంటే సాహిత్యానికి వేరే పరమావధి ఏం వుంటుంది?
తెలుగు శాస్ర్తీ
గోరాశాస్ర్తీగారు కూడా రైల్వేలో పనిచేసి అక్కడనుంచి పత్రికారంగానికి వచ్చారు. నేనుకూడా అలాటివాడ్నే శాస్ర్తీగారి లాగానే వున్నమాట ముఖంమీదే అనేసి నేనుకూడా చాలా అనవసరంగా రోడ్డునపడ్డాను. ఒక్కొక్కప్పుడు శాస్ర్తీగారి చేత కవ్వించి తిట్టించుకోవడం కూడా సరదాగానే ఉంటుంది. అంతగా ఆరోగ్యం అనుకూలించకపోయినా, మిత్ర బృంద పరివేష్ఠీతుడ్నై, గడియారం వారిని విస్మరించి, ఎంత రాత్రివరకైనా మనతో కాలక్షేపం చేసే శాస్ర్తీగారి ఔదార్యాన్ని మర్చిపోలేము. ఆయన అచ్చంగా తెలుగువాడు. తెలుగువాడి కోపతాపాలు, ఔదార్యం, అపారమైన ప్రేమాభిమానాలు అన్నీ ఆయనకున్నాయి, ఆయన మూర్తిని వర్ణించడం కంటే ఈ షష్టిపూర్తి ఉత్సవ సమయంలో ఓ నమస్కారం చేసి ఆయనను ‘వీణలేని వినాయకుడు’గా గుర్తువుంచుకోవడమే నాకు చాలా సరదా!

- పురాణం సుబ్రహ్మణ్యశర్మ