మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌లో మళ్లీ ‘కామరాజ్ పథకం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మే 25న రాహుల్ గాంధీ రాజీనామా చేస్తున్నట్లు చెప్ప గానే ముందుగా అందరూ ఒక ‘నాటకం’ అనుకున్నారు. నాలుగు రోజులు బతిమలాడించుకొని రాహుల్ తిరిగి సర్దుకుంటారులే అని భావించారు. అయితే రాజీనామాను వెనుకకు తీసుకోనని పట్టుబట్టడం, పైగా గాంధీ కుటుంబం నుండి కాకుండా మరొకరిని తన వారసుడిగా ఎన్నుకోవాలని రాహుల్ పట్టుబడుతూ ఉండడంతో నిజాయతీగానే ఆయన రాజీనామా చేశారని చాలామంది మెచ్చుకున్నారు. అయితే, రెండు నెలలు అవుతున్నా పార్టీకి మరొకరిని అధ్యక్షుడిగా నియమించే ప్రక్రియ చేపట్టక పోవడం, కనీసం తాత్కాలిక ఏర్పాటు కూడా చేయక పోవడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీపై తమ పట్టును వదులుకోవడానికి గాంధీ కుటుంబం సిద్ధంగా లేదని, ఇప్పుడు కాంగ్రెస్ అస్తిత్వానికి అదే ప్రశ్నార్థకంగా మారుతున్నదని భావించవలసి వస్తున్నది. రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినా, దైనందిన పార్టీ వ్యవ హారాలకు దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నా పార్టీలో అంతర్గతంగా రాహుల్‌కు సంబంధం లేకుండా కీలకమైన ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తున్నది.
నిజంగా రాహుల్ రాజీనామాకు కట్టుబడి ఉంటే, మరొకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని భావిస్తూ ఉంటే తక్షణం పార్టీ కార్యవర్గ సమావేశం జరిపి అందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగేటట్లు చేసి ఉండేవారు. అటువంటి ప్రయత్నం జరగడం లేదంటే మరొకరు పార్టీ అధ్యక్ష పదవిలో ఉండేందుకు గాంధీ కుటుంబం ఇష్ట పడటం లేదని స్పష్టం అవుతోంది. ఒక నిగూఢమైన రాజకీయ వ్యూహంతోనే రాహుల్ రాజీనామా అస్త్రం ప్రయోగించారని సంకేతాలు వెలువడుతున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ నేతృత్వం వహిం చబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నప్పటి నుండే, గత కొనే్నళ్లుగా కాంగ్రెస్‌లో పాతతరం, నూతన తరాల మధ్య కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీ సంస్థాగత వ్యవహారాలలో ఏమాత్రం పట్టు లేకున్నా, సోనియా గాంధీ ఆధిపత్యం కొనసాగితేనే తమ పెత్తనం కొనసాగుతుందని పాతతరం భావిస్తున్నది. క్రియా శీలకంగా ఉండే రాహుల్ రంగంలోకి వస్తే తాము తెరమరుగు కావలసి వస్తుందని, యువతరం పార్టీలో వివిధ స్థాయిలలో నాయకత్వం చేబడుతుందని వీరు ఆందోళనకరంగా ఉన్నారు. ఈ అంతర్గత సంఘర్షణల కారణంగానే పార్టీ అధ్యక్షపదవిని చేబట్టడానికి సుమారు రెండేళ్ల పాటు రాహుల్ వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఆయన పార్టీ నాయకత్వం చేపట్టగానే వివిధ స్థాయిలలో బాధ్యతలు అప్పచెప్పడానికి యువనేతల జాబితాను సహితం సిద్ధం చేస్తూ వచ్చారు. అయితే పాతతరాన్ని పక్కకు నెట్టి, అనుభవం లేని యువతకు పట్టం గడితే సీనియర్లు 2019 ఎన్నికలలో రాహుల్‌కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉండవచ్చని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ భయపడ్డారు. అందుకనే రాహుల్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినా పాతతరం నేతలు కీలక పదవులలో కొనసాగుతూ వచ్చారు. చివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికలో రోజుల తర బడి జరిగిన నాటకీయ పరిణామాలను చూసాము. సోనియా, ప్రియాంక పట్టుబట్టి యువనేతలను ఎంపిక చేయకుండా జాగ్రత్త పడ్డారు. అందుకనే లోక్‌సభ ఎన్నికలలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్న సందర్భంగా పార్టీలోని పాతతరం నేతలపై రాహుల్ తన అక్కసునంతా ప్రదర్శించారు. వారంతా తమ పదవులు, కొడుకుల పదవుల కోసం పార్టీ ప్రయో జనాలను బలిపెట్టారన్నట్లు కుండబద్దలు కొట్టారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పాతతరం తప్పుకొని రాహుల్‌కు అండగా నిలవాలని యువనేతలు భావిస్తున్నారు. అయితే వారెవ్వరికీ అనుభవం లేదని, రాజకీయ ఎత్తుగడలు వేయలేరని, అటువంటి వారితో పార్టీ మరింత ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుందని పాతతరం హెచ్చరికలు చేస్తున్నది. ఈ పేరుతో పార్టీపై తమ పట్టును వదులుకోవడానికి వృద్ధనేతలు ఇష్టపడటం లేదు. రాహుల్ స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి తెరపైకి వచ్చిన పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ముందుగా 90 ఏళ్ళ వయసులో ఉన్న మోతీలాల్ ఓరాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, అశోక్ గెహ్లాట్‌ల పేర్లను తెరపైకి తీసుకు వచ్చారు. వీరిలో ప్రతి ఒక్కరూ పార్టీ పగ్గాలు చేపట్టాలి అనుకొంటే తమ పదవులను వదులు కుంటారని, గాంధీ కుటుంబం పట్ల అమిత విశ్వాసం కలిగి ఉంటారని భావిస్తున్నారు. అంటే పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా గాంధీ కుటుంబమే కీలకమైన అధికార కేంద్రంగా కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి యువనేతలకు పార్టీ పగ్గాలు అప్పజెబితే వారు పార్టీపై పట్టుపెంచుకొని, గాంధీ కుటుంబానే్న పక్కకు నెట్టే ప్రమాదం ఉన్నదనే భయం కూడా ఉంది.
కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం లేకుండా మరే నాయకుడు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా లేరని గమనించాలి. పీవీ నరసింహారావు సైతం సోనియా గాంధీకి విధేయుడు అనే నమ్మకంతోనే పార్టీ నాయకత్వం చేపట్టగలిగారు. అయితే, ప్రధాన మంత్రిగా ఆయన పట్టు సాధిస్తూ ఉండడంతో పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు సోనియా చుట్టూ చేరి, ఆమెకు- పీవీకి మధ్య దూరం పెంచగలిగారు. ఆ సందర్భంగా అర్జున్ సింగ్, ఎన్‌డీ తివారీ వంటి వారు పీవీపై తిరుగుబాటు చేసి మరో కాంగ్రెస్ (తివారీ)ను ఏర్పాటు చేయడం సోనియా గాంధీ అండతోనేనని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సీతారాం కేసరిని మరుగుదొడ్డిలో బంధించి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి, సోనియా గాంధీకి పార్టీ నాయ కత్వం అప్పచెప్పిన విధానం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వ్యక్తిగత ఆస్తి అన్నట్టుగా మారినట్లు స్పష్టం అవుతుంది. సోనియా ఏకంగా 19 ఏళళు గతంలో మరెవ్వరూ లేని విధంగా పార్టీ నాయకత్వంలో కొన సాగారు. పార్టీపై ఆ విధంగా తిరుగులేని ఆధిపత్యం సంపా దించడం కోసం, తనకు వ్యక్తిగత విధేయులైన వారితో పార్టీని నింపడం కోసం రాహుల్ ఇప్పుడు- రాజీనామా అస్త్రం ప్రయోగించినట్లు భావించవలసి వస్తున్నది. గతంలో ఇందిరా గాంధీకి ప్రభుత్వంపై పట్టు కలిగించడం కోసం ‘కామరాజ్ పథకం’ పేరుతో సీనియర్లను కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించిన రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళనం చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని తమ సొంత ఆస్తిగా గాంధీ కుటుంబం భావించడమే కాదు, మరొకరు పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తే తామెక్కడ కనుమరుగు కావాల్సి వస్తుందే అనే భయంతో ఇతర నాయకులు కూడా గాంధీ కుటుంబం లేని కాంగ్రెస్‌ను ఊహించలేక వాపోతున్నారు. ప్రతి రాష్ట్రంలో రెండు, మూడు వర్గాలను పార్టీలో ప్రోత్స హించి, ఏ వర్గం కూడా పార్టీపై పూర్తి పట్టు సాధించలేని విధంగా చూడటం ద్వారా తమ ఆధిపత్యం కొనసాగేటట్లు చేయడం గాంధీ కుటుంబం రాజకీయ వ్యూహంగా ఇంతకాలం కొనసాగింది. 2019 ఎన్నికలలో వరుసగా రెండోసారి పార్టీ ఘోర పరాజయం పొందడంతో నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడు ఏర్పడిన నాయకత్వ సంక్షోభం ఒక విధంగా పిడుగుపాటు వంటిదే. ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ తీవ్రమైన ముఠా కలహాలను ఎదుర్కొంటున్నది. వాటిని సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వం చేయలేక పోతున్నది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైనా, గోవాలో 10 మంది పార్టీ శాసనసభ్యులు భాజపాలో మూకుమ్మడిగా చేరినా మారు మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ నేడు చిక్కుకున్నది. ఏది ఏమైనా ప్రస్తుత అస్తిత్వ ముప్పు నుండి కాంగ్రెస్ తేరుకోవాలంటే తక్షణం పార్టీలోని అన్ని స్థాయిలలో నాయకత్వ ప్రక్షాళన అవసరం. ఢిల్లీలో గాంధీ కుటుంబం చుట్టూ తిరిగేవారిని కాకుండా, ప్రజల మధ్య తిరిగే వారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పవలసి ఉంది. అప్పుడే బలమైన ప్రతిపక్షంగా ఆ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుంది.

-చలసాని నరేంద్ర 98495 69050