మెయన్ ఫీచర్

తమ వర్గానే్న మట్టుబెడుతున్న మావోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారం తిరగకముందే మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల పేర మరో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. గత వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ సభ్యుడిని పోలీసు ఇన్‌ఫార్మర్ అంటూ కాల్చి చంపగా, ఈ వారం విశాఖ మన్యంలో పోలీసు ఇన్‌ఫార్మర్లంటూ ఇద్దరు గిరిజనులను చిత్రహింసల పాలు చేసి చంపారు. ఇలాంటి ఘటనలతో- తమ వర్గం వారినే హతమార్చేందుకు మావోయిస్టులు తీర్మానించుకున్నట్లు తోస్తోంది.
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం-వీరవరం గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు, గెమ్మెలి భాస్కరరావు అనే గిరిజనులను వారి కుటుంబ సభ్యుల ముందే తుపాకులు, కర్రలతో చితకబాదారు. కుటుంబ సభ్యులు చంపవద్దని ఎంతగా ప్రాధేయపడినా పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టారు. ఈ ఇద్దరూ ‘చనిపోయారా? లేదా?’ అని నిర్ధారించుకున్నాక సాయుధ మావోలు అక్కడినుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పోతూపోతూ గ్రామంలోని ఇళ్ల గోడలకు- ‘పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారిన వారికి ఇదేగతి పడుతుంద’ని హెచ్చరికలు చేసే పోస్టర్లు అతికించిపోయారు.
ప్రస్తుత 21వ శతాబ్దంలో ఇదీ ‘విప్లవ కార్యక్రమం.’ ఇది ఎంతవరకూ ప్రజాహితమైన చర్యనో ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచించాలి.
అర్ధ శతాబ్దం క్రితం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ఇప్పుడు ఎలా రూపాంతరం చెందిందో అటు విశాఖ మన్యం, ఇటు భద్రాద్రి మన్యంలో మన కళ్ళకు కడుతోంది. ఆనాటి షావుకార్లు, బుగతలు, ప్రజాకంటకులకు పట్టిన గతి ఇప్పుడు సాధారణ గిరిజనులకు పడుతోంది. ఇది ఎంతటి ‘గుణాత్మక’ పరిణామమో తేటతెల్లమవుతోంది.
వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం లాంటి ఎందరో నాయకులు ఆనాడు గిరిజనుల జీవితాలను మెరుగుపరిచేందుకు తమ ఉపాధ్యాయ వృత్తులను సైతం వదులుకుని గిరిజన గూడెలను తమ గుండెల్లో పెట్టుకుని వారిని పీడిస్తున్న, దోచుకుంటున్న షావుకార్ల, బుగతల గుండెల్లో నిద్రపోతే, ఆ నక్సలైట్ నాయకుల వారసులమని చెప్పుకునే మావోయిస్టులు ఇప్పుడు గిరిజనుల గుండెల్లో బాకులు దింపుతున్నారు, తుపాకీ గుళ్లు నింపుతున్నారు.. ఇది న్యాయమా?.. ధర్మమా?.. వెంపటాపు సత్యం కలగన్నది ఈ పరిస్థితినా? ఆదిభట్ల కైలాసం ఆశించింది ఈ విధానాన్నా?
శ్రీకాకుళంలో గాని, ఏ మన్యంలో గాని ఇప్పుడు ఆనాటి షావుకార్లు లేరు, బుగతలు లేరు. ఆ దోపిడీ అంతకన్నా లేదు. సాధికారత ఎంతో కొంత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన విధానంలో గణనీయమైన ‘మార్పు’ వచ్చింది. గిరిజనుల్లోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం నాటి పరిస్థితులు ఎక్కడా కనిపించవు. మన్యం- మైదాన ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తొంగి చూస్తోంది. తమ తమ ‘జ్ఞానం’ మేరకు వనరులను సమకూర్చుకుని, మరిన్ని వనరులను పెంచుకుని తమ పిల్లాజెల్లను పెంచి పెద్దచేసుకుంటున్న ‘దృశ్యం’ కనిపిస్తోంది. గిరిజనుల కొత్త తరాలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలోకి చొచ్చుకుపోతున్నాయి. గతంలో అక్షరం తెలియని కుటుంబాలలో ఇప్పుడు విద్యావంతులు కనిపిస్తున్నారు. వృత్తివిద్యలో నిపుణులైన వారున్నారు. మైదాన ప్రాంత ప్రజలతో ‘పోటీ’పడుతూ తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. తమ హక్కులను గుర్తెరిగి వాటిని సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రిజర్వేషన్లను అందుకుని నిచ్చెన మెట్లు ఎక్కుతున్నారు. ఈ ప్రక్రియ స్పష్టంగా.. బహిరంగంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఇష్టపడక, బతుకులో నిచ్చెన మెట్లుకాదు రాజ్యాధికారం కోసం సాయుధ పోరాటం చేయాలి, దళాలు నిర్మించి, దండుకట్టి ఢిల్లీ కోటను స్వాధీనం చేసుకోవాలని మావోలు చెబుతున్నారు. ‘్ఢల్లీ కోట, రాజ్యాధికారం..’ అన్న మాటలు గిరిజనుల గుండెల్లో ఇపుడు లేనేలేవు. ఆ అవసరం తమకు లేదని వారు భావిస్తున్నారు. మెరుగైన జీవితం తమ పిల్లలకు అందిస్తే అదే పదివేలు అనుకుంటున్నారు. పదిమందిలా ‘పచ్చ’గా బతకాలని భావిస్తున్నారు. అందుకోసం కష్టపడుతున్నారు. ఈ ప్రక్రియ ఇటు భద్రాద్రి మన్యంలో, అటు విశాఖ, శ్రీకాకుళ మన్యంలోనూ కనిపిస్తోంది. కాని ఈ వైఖరి మావోయిస్టులకు మింగుడుపడటం లేదు. రోజులో 24 గంటలూ ‘రాజ్యాధికారం’ చేజిక్కించుకునే ‘‘యా వ’’తో మావోలు గడుపుతున్నారు. ఆ రాజ్యాధికారం కోసం అవసరమైతే ఆదివాసీలను, గిరిజనులను హతమార్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అదే విశాఖ మన్యంలో ఇటీవల జరిగింది. ఇది ఎంతవరకు ఆహ్వానించదగ్గ అంశం?
కమ్యూనిస్టులైనా, మావోయిస్టులైనా, సోషలిస్టు లైనా ప్రజల జీవితాలను ఉన్నతీకరించేందుకు తమ జీవితాలను త్యాగం చేయాలే తప్ప, ప్రజల ప్రాణాలనే పరిహరిస్తే, అదెలా ప్రజానుకూలమవుతుంది? మీ ఆకాంక్షల కోసం, ఆలోచనల కోసం, ఊహాలోకం కోసం ఇలా వందల, వేల మంది ఆదివాసీలను, గిరిజనులను, అమాయక గ్రామీణ ప్రజలను మట్టుబెడితే, కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా కనికరించకుండా కిరాతకంగా చంపితే ఆ ‘రాజకీయం’ ఎవరి కోసం?.. ఎందుకోసం?.. ప్రజలుంటేనే రాజకీయం, వారి సంక్షేమం కోసమే రాజకీయం, వారి అభ్యున్నతి కోసమే రాజకీయం.. అంతేగాని కాలం చెల్లిన మార్క్స్, మావోల ఆలోచనల కోసం, సిద్ధాంతాల కోసం రాజకీయం కాదు...కారాదు.
మార్క్స్, మావోల ఆలోచనలు, అభిప్రాయాలు, సూత్రీకరణలు ఏమాత్రం అన్వయం కాని ‘సందర్భం’లో మనం ఉన్నామన్న మాట మరిచి మావోయిస్టులు ఇలా వారానికి కొంతమంది సాధారణ ప్రజలను ఇన్‌ఫార్మర్ల పేర ‘ఖతం’చేస్తే వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పాణిగ్రాహి లాంటి నాయకుల ఆత్మలు శాంతిస్తాయా? ఆనాడు వారు చెప్పిన ‘ఖతం’ కార్యక్రమం ఎలా తిరగబడిందో చూసి వారి ఆత్మ తప్పక క్షోభిస్తుంది. బుగతలు, షావుకార్లపై ప్రయోగించాల్సిన ఆయుధాన్ని వారి పీడనకు గురైన పీడితులపై ఎక్కుపెడితే ఇక వారికి దిక్కెవరు? మీ ఉద్యమం, రాజ్యాధికారం, ఆశయం కన్నా అత్యున్నతమైనది గిరిజనుల ప్రాణాలు, వారి సంక్షేమం. దీన్ని తుంగలోతొక్కి వారిపైకే తుపాకులు ఎక్కుపెట్టి కదం తొక్కితే అది ప్రజాసంక్షేమ కార్యక్రమమవుతుందా?
నగరం, పట్టణం, గ్రామం, గూడెం, మన్యం అన్న తేడాలేకుండా సాంకేతిక పరిజ్ఞానం అంతటా కమ్ముకుంటోంది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఉపకరణాలు అంతటా అందుబాటులోకి వస్తున్నాయి. ‘స్మార్ట్ఫోన్’ ఇప్పుడు మన్యంలోనూ అందుబాటులో ఉంది. ఆ ఫోన్ ద్వారా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఆధునిక ప్రపంచ పోకడలు తెలుస్తూ ఉన్నాయి. ఆ ప్రపంచ పోకడలకు భిన్నంగా ‘నియంతృత్వం’ నెలకొల్పుతాం... మాకు సహకరించండి, సహకరించకపోతే ఇన్‌ఫార్మర్ల నెపంతో కాల్చిపారేస్తాం అని మావోయిస్టులు తెగబడితే అదెలా అర్థవంతమనిపించుకుంటుంది?...
మావో ఏలిన చైనా ఉత్పత్తి చేస్తున్న స్మార్ట్ఫోన్లను నేడు ‘మన్యం’ ప్రజలు సైతం వాడుతున్నారు. ‘చైనాబజార్’లో అనేక సరకులు కొంటున్నారు. ఈ వాస్తవిక స్థితిని పట్టించుకోకుండా అప్పుడెప్పుడో మావో చేసిన ‘లాంగ్ మార్చ్’ను విశాఖ మన్యంలో తామూ చేస్తామని 21వ శతాబ్దంలో, స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న గిరిజనుల ముందు ప్రస్తావిస్తే దానికి ప్రాసంగికత ఉన్నట్టవుతుందా? ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా అలాంటి కార్యక్రమానికి పూనుకుంటారా?... విచిత్రమేమిటంటే ఎవరేమనుకుంటే మాకేంటని మావోయిస్టులు మాత్రం ఆ ‘దారి’లోనే నడుస్తూ గిరిజనులను నరికి చంపుతున్నారు. ఇది న్యాయమేనా?

-వుప్పల నరసింహం 99857 81799