మెయన్ ఫీచర్

నేస్తం.. సమస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ‘ఫ్రెండ్‌షిప్ డే’
*
ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం- స్నేహం
యవ్వన దశలో కలిగే మానసిక ఒత్తిళ్లకు పరిష్కారం- స్నేహం
నేనున్నానే స్నేహితుడి మాటతో ప్రపంచానే్న జయించవచ్చు
స్నేహంతో మానసిక సమస్యలు మటుమాయం
అల్లరితో ఆనందం పెనవేసుకున్నదే- స్నేహబంధం
కుటుంబ బంధాలనేవి రక్త సంబంధం వల్ల ఏర్పడేవి. కానీ ఏ సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ఓ వ్యక్తికి మరో వ్యక్తి అండగా నిలబడతాడంటే అందుకు కారణం- స్నేహం. ‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం..’- స్నేహానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏది?
గాడాంధకారం అలముకున్నప్పుడు, నిరాశానిస్పృహలు చుట్టుముట్టినపుడు.. నీ కోసం నేనున్నానంటూ తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. స్నేహం నిత్యనూతనం, నిత్య పరిమళం. మనం ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారిచూపుతూనే వున్నాయి. స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ.
అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.
ప్రపంచంలో ఎక్కడైనా లభించేది స్నేహం ఒక్కటే. హైటెక్ యుగంలో మనిషి సమస్యలతో సతమతమవుతూ బాధ పడుతున్నాడు. కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. కళ్ళముందు అంతా అంధకారం అగుపిస్తోంది. అంతలోనే ఓ ఆత్మీయ పిలుపు ‘నేనున్నానంటూ’ మన చెవులకు వినిపిస్తుంది. ఆ చేతి స్పర్శ భుజంపై మెల్లగా తాకినట్లవ్వగానే మనలోపలి బాధ, కన్నీళ్లు కట్టలు తెంచుకుంటూ రావడం, ఆ వెంటనే ఓకే ఒక్క ఆలింగనంతో, ప్రేమతో, ఆప్యాయతతో స్నేహితుడు మాట్లాడే ఆ నాలుగు మాటలతో.. బాధ సగం తగ్గిపోతుంది. స్నేహితుడు అందించిన మనోధైర్యం ముందు సమస్య చాలా చిన్నదిగా అయిపోయింది. ‘నాకు నేనుగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలిగాను.’ అనిపిస్తుంది. అదే అరమరికలు లేని స్నేహం.
చిన్ననాటి తీపి జ్ఞాపకాలు...
పాఠశాలలో చదివే రోజులలో లంచ్ బెల్ మోగగానే ఒక ఆనందం. పరుగెత్తుకుంటూ వెళ్తూ టాప్‌ల దగ్గరకు వెళ్తున్నాం. నాతోపాటు వస్తున్న ఓ మిత్రుడు కింద పడగానే అందరం పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని లేపుతూ అతని మోకాళ్ళకు అంటుకున్న ఇసుకను తీసివేస్తూ అతను ఏడుస్తూ ఉంటే మా అందరికీ దెబ్బ తాకినంతగా బాధపడుతూ, ‘ఏం కాదు.. ఇలాంటి దెబ్బలు మాకు కూడా తగిలాయ’ని అతనికి ఇస్తున్న ఆ మనోధైర్యం, ఓదార్చడానికి వచ్చిన పాఠశాల మిత్రుల ఆదరణ, ఆప్యాయతల ముందు ఆ దెబ్బ నొప్పి మాయమైపోయింది. ఒక మిత్రుడు పరుగెత్తుకుంటూ వచ్చి గాయమైనచోట కట్టుకడుతూ ఉంటే అతను చూపించిన ప్రేమను ఇప్పటికీ మరువలేను. బాల్యంలో ఆనందం కోసం చేసిన అల్లరి, అలా పెనవేసుకున్న అనుబంధం ఇప్పటికీ మరువలేకపోవడం అందరికీ తెలిసిందే.
దిశానిర్దేశం చేసే వాడే ...
కాలచక్రంలో జీవితం ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ‘ఏం చేయాలనుకుంటున్నావురా?’ అని నాన్న రోజూ తిడుతున్నాడు. భవిష్యత్తు, ఆత్మీయులు ‘నెక్స్ట్ ఏం చేస్తావ్?’ అని అడుగుతూ ఉంటారు. ఆ క్షణంలో ఓ చేయి.. ఆ వ్యక్తిని పట్టుకుని..‘ఇదీ దారి... పయనించు, కష్టపడు, ఇష్టపడు.. సాధించు లక్ష్యం వైపుగా పరుగులు తీయమంటూ’ దిశానిర్దేశం చేస్తాడు. అతడే ఆప్తమిత్రుడు.
‘కలసి మెలసి ఉండగలగడం, ఒకరి కోసం ఒకరు పోరాడగలగడం, అవసరమైనపుడు తీరిక లేదనో, అలసిపోయాననో అనకుండా, ఆపదలో ఆదుకోవడం నిజమైన స్నేహం. స్నేహమంటే పాత పరిచయం కాదు. ఎప్పుడూ వీడని అనుబంధం. అన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. స్నేహం మనసుకు సంబధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు. ఈ సృష్టి ఉన్నంత కాలం నిలిచేది ఒక్క స్నేహమే. కుదిరితే కప్పు కాఫీ, లేదంటే కబుర్లు చెప్పుకుని సరదాగా గడుపుతారు. నీ వెంట నేనున్నా అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. నిజమైన మిత్రుడు ఓటమిలో ఓదార్చేవాడు. మన గెలుపును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేవాడు. సమస్యల్లో ఓ కౌనె్సలర్‌గా ఉండేవాడు, ఏం చేయాలో తోచని దీనస్థితిలో అండగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చేవాడు.
ఒత్తిళ్లకు పరిష్కారం...
బాల్యదశ నుంచి యవ్వన దశలో ఎదిగే క్రమంలో కలిగే మానసిక ఒత్తిళ్ల నుంచి బయట పడాలంటే స్నేహం అవసరం. యవ్వన దశలో శారీరకంగా కలిగే మార్పులు, హార్మోన్స్‌లో కలిగే మార్పులతో, మానసికంగా తలెత్తే ఎమోషన్స్‌ను పంచుకోవడానికి మాత్రుల సహకారం చాలా అవసరమై ఉంటుంది. స్నేహితులు ఒకరినుంచి మరొకరు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి దోహదం చేస్తారు. స్నేహం గొప్ప వరం. స్నేహం గొప్ప బాధ్యత. కష్టసుఖాల్లో పరస్పరం తోడుగా ఉండడమే ఈ బంధం పరమార్థం.
వయస్సుతో సంబంధం లేదు. కులంతో పనిలేదు. స్నేహానికి కావాల్సింది రెండు కల్మషం లేని మనసులు. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, బంధువులకు కూడా చెప్పుకోలేని విషయాల్ని ఫ్రెండ్‌తో పంచుకుంటాం. ఏ సమయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా కష్టమైనా సుఖమైనా.. అన్నింటిని పంచుకునేది స్నేహితుడితోనే. మాటామాటా కలిస్తే చాలు ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫ్రెండ్‌షిప్‌లు జీవితాంతం ఉంటాయి. విజయం నీ సొంతమైతే సంతోషంతో గెంతులేసేది ఫ్రెండ్.. బాధ నీదైతే కన్నీళ్లు కార్చేది అతడు.. కష్టాల్లో వెన్ను తట్టేది... కవ్వింపుగా వెక్కిరించేదీ ఆ హితుడే... ఎక్కడో పుట్టి... ఎప్పుడో కలిసినా మట్టిలో కలిసేవరకు నీ వెంట ఉండేదీ ఆ స్నేహితుడే... స్నేహానిది వరసకందని బంధుత్వం... హృదయంతో జతకట్టే అనుబంధం... జీవితమనే పూదోటలో స్నేహమనే పరిమళాల సుమాలు విరబూయాల్సిందే... ఆ సార్థకత చేకూరాలంటే దోస్తులు ఉండాల్సిందే.
కార్యాలయాల్లో ...
మనం పనిచేసే ఆఫీసుల్లో మన పై అధికారులతో, సహోద్యోగులతో స్నేహం పెంచుకోవాలి. మన జీవిత కాలచక్రంలో సగం జీవితం ఆఫీసుల్లోనే గడిపేస్తాం. ఒక్కోసారి ఇంట్లో సమస్యలు తలెత్తినా, కార్యాలయంలో సమస్యలు తలెత్తినా మనకు చటుక్కున ఆదుకొనే వారు మన సహోద్యోగులే. జీవితంలో సంతోషం వెల్లివిరియాలంటే సహోద్యోగి స్నేహితుడు కావడం అత్యవసరం.
నిజమైన స్నేహితుడా...
జీవితంలో మిత్రులనూ, శత్రువులనూ గుర్తించడం నేర్చుకోవాలి. లేదంటే.. సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. కొందరు పైకి గంభీరంగా కనిపించినా అవసరానికి ఆదుకుంటారు. ఇంకొందరు వెన్నంటే ఉంటారు, రాసుకు పూసుకు తిరుగుతారు. కానీ అవసరం వస్తే.. తప్పించుకు తిరుగుతారు మరికొందరు. ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టి, వారిని విడదీయాలని చూస్తుంటారు ఇంకొందరు. అందుకే స్నేహితులు తమ మధ్య అపార్థాలు రాకుండా చూసుకుంటూనే.. శత్రువుల వల్ల అనర్థాలు కలగకుండా జాగ్రత్త పడాలి.
మంచి స్నేహాన్ని వీడొద్దు...
మంచి స్నేహితుని కోసం ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా వదులుకోవద్దు. స్నేహాన్ని పెంచుకోవాలే గాని త్రుంచుకొనే ప్రయత్నం చేయవద్దు. స్నేహితుల ప్రతి అడుగు, ఆచరణ ఇద్దరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఎవరికైనా కొద్దిపాటి మనస్పర్థలు సహజం. చిన్న చిన్న గొడవలను మనసులు గాయపడే స్థాయికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కరెక్ట్ అనిపించింది కొన్ని సందర్భాల్లో మీ స్నేహితునికి తప్పుగా కనిపించొచ్చు. అంతమాత్రాన వాదనలతో దూరం కాకుండా చూసుకోవాలి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321