మెయిన్ ఫీచర్

చిరునవ్వు చాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నువ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురుస్తూ ఉండాలి నా నువ్వు..’’ అన్నాడు ఆత్రేయ.
ప్రేమను తెలియజేయడంతో పాటు ‘నవ్వు’ స్వచ్ఛతను ఎంతో హృద్యంగా చెప్పాడు. నిజంగా నవ్వు ఎంత స్వచ్ఛమైనదంటే దానికి కులం లేదు, మతం లేదు, ఆడా మగా తేడాల్లేవు. పేద, గొప్ప తారతమ్యాలు లేవు. సమస్త లోకాన్ని లోబరచుకోగలిగిన సమ్మోహన శక్తి దాని సొంతం.
నవ్వు జీవితానికి పూసిన పువ్వు. నవ్వులు పువ్వులు లేకుండా బతకలేం. అందుకే అన్నాడో కవి-
‘‘నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళూ
నీలా ఉండిపోతే చాలమ్మా!’’ అని.
చెట్టుకు పువ్వు ఎంత అందమో, మనిషికి నవ్వులంత అందం. సమస్త జీవరాశిలో నవ్వగలిగిన ఏకైక జీవి మనిషి. ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడు జంధ్యాల. నవ్వకపోతే జీవితమే భారమవుతుంది. గుండె చెరువవుతుంది. చిన్నపాటి నవ్వు ఎంతో విలువైనది.
‘‘చిరునవ్వు వెల ఎంత?
మరుమల్లె పువ్వంత
మరుమల్లె వెల ఎంత?
సిరులేవీ కొనలేనంత..’’ అన్న కవి మాటలు అక్షరాల నిజం.
‘నవ్వు’ అనేది అందానికి, ఆరోగ్యానికి ఓ చిరునామా! ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉంటే అందులో ఉన్న మజానే వేరు. అసలు నవ్వేవారిని, నవ్వించేవారిని ఇష్టపడని వారుండరు. వారంటే అందరికీ ఎంతో గౌరవం! అభిమానం! నవ్వులో ప్రేమ, ఆప్యాయత గొప్పతనం కనిపిస్తుంటుంది. ఇంట్లో పెద్దవారు, పిల్లలూ అందరూ నవ్వుతూ తిరుగుతుంటే.. ఇల్లంతా ఎంతో కళకళలాడుతూ వుంటుంది.
నవ్వు కేవలం నవ్వులాటకే కాదు.. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు, ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. మనసుకు.. దేహానికి హాయినిచ్చే శక్తి ఒక్క నవ్వుకు మాత్రమే ఉంది. ఎవరైనా ఎదురైతే ఓ చిరునవ్వు విసరండి చాలు. అవతలి వ్యక్తికి మీపట్ల ఓ రకమైన అభిమానం తప్పనిసరిగా కలుగుతుంది. అవతలి వ్యక్తి భావాలను పక్కనబెట్టి ఆలోచించినా నవ్వడంవల్ల మీ మనసులోని బాధలనుంచి కొంచెంలో కొంచెమైనా మీకు ఊరట, ఉపశమనం కలుగుతుంది. ఆందోళన తగ్గుతుంది.
దురదృష్టవశాత్తు మనం నవ్వు విలువను తెలుసుకోలేకపోతున్నాం. అందంగా, హాయిగా నవ్వే చిన్న పిల్లల పాటి విచక్షణను కూడా మరచిపోయి మూతి ముడుచుకుని కూర్చుంటాం.
మీకిది తెలుసో తెలియదో కానీ నవ్వడంకంటే మూతి ముడుచుకుని కూర్చోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. నవ్వడానికి ముఖంలో 17 కండరాలు పనిచేస్తే, మూతి బిగించి కూర్చోవడానికి కనీసం 43 కండరాలు పనిచేస్తాయట. దీన్ని గమనించైనా హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ గడపండి. పిల్లలకూ అదే నేర్పండి! సిరుల తల్లికి చిరునామా చిరునవ్వుల ఇల్లేనని చాటి చెప్పండి. పిల్లలు దోగాడే ముందునుంచే మనుషులను గుర్తుపట్టే క్షణం నుంచే నవ్వడం ఆరంభిస్తారు. ఆ నవ్వులను.. బోసి నవ్వులను చూసి ఆనందపడిపోతాం. పసిపిల్లలు రోజుకు కనీసం మూడొందల సార్లయినా నవ్వుతారని చెపితే ఆశ్చర్యపోతాం. పెద్దలైతే సగటున రోజుకు 17సార్లు మాత్రమే నవ్వుతారట. దీన్ని బట్టి పసికందుల కన్నా మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఇట్టే అర్థమవుతుంది.
కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలతో కూడిన మనసుతో మనం నవ్వితే, అవేవి తెలియని పసిపిల్లలు ఆనందంగా నవ్వులు విరజిమ్ముతారు. వయసుతో సంబంధం లేకుండా విదేశీయులైతే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అపరిచితులు ఎదురైనాసరే వారు హాయ్! హౌ డూ యూ డూ? అంటూ చిరునవ్వుతో పలకరిస్తారు. లేదా నవ్వుతూ తల పంకిస్తారు. డిస్కవరీ హెల్త్ రిపోర్టు ప్రకారం రోగ నిరోధక శక్తికి అవసరమైన ప్రొటీన్, రోగాలతో పోరాడే టీ సెల్స్, బి సెల్స్ అనే కణాలు నవ్వడంవల్ల మాత్రమే ఉత్పత్తి అవుతాయని వైద్యనిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, అధిక రక్తపోటును తగ్గించే శక్తి నవ్వుకు వుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. మనసు, శరీరం రెండూ తేలిక పడుతాయి. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ముఖంలోనూ, వీపులోనూ ఉండే కండరాలన్నీ కదులుతాయి. నవ్వడం కూడా ఒక వ్యాయామం అవుతుంది.
సైక్లింగ్, రోయింగ్ మిషన్ మీద వ్యాయామం చేయడంవల్ల ఎన్ని కేలరీలు ఖర్చవుతాయో అన్ని కేలరీలు పెద్దగా నవ్వితే కరిగిపోతాయి. శారీరక, మానసిక ఒత్తిడులు తప్పనిసరిగా దూరమవుతాయి. మీరు నవ్వినపుడు మీ ముఖం ఎంత ఎర్రబడుతుందో ఒకసారి చూడండి. రక్తప్రసరణ పెరగడమే అందుకు కారణం.
అలాగే నవ్వులవల్ల టియర్ గ్లాండ్స్, ఒత్తిడికి గురై కళ్ళు చెమ్మగిల్లుతాయి. వాటివల్ల దృష్టి మరింత మెరుగుపడుతుంది. తలనొప్పులు మటుమాయమవుతాయి. రక్తప్రసరణ వృద్ధి చెందుతుంది. ఇన్ని మంచి లక్షణాలున్నాయి ఆ నవ్వులో..
కనుక ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఉండక నవ్వుతూ, నవ్విస్తూ గడపండి. నవ్వడంవల్ల ఆనందం, ఆహ్లాదమే కాదు అనారోగ్యాలు దూరమవుతాయి. నవ్వులవల్ల గుండె జబ్బులు రావంటున్నారు. ఈ జబ్బులు స్ర్తిలకన్నా పురుషులకే ఎక్కువ వస్తాయట. ఎందుకంటే పురుషులకంటే 128 శాతం ఎక్కువగా స్ర్తిలు నవ్వుతారట. అందుకే వీరికి గుండె జబ్బులు రావడం తక్కువని ఓ సర్వేలో తేలింది.
మన సెల్యూలార్ మెమొరీలో పాజిటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఎమోషన్స్ నిరంతరం ప్రవహిస్తూ మన మెదడును ప్రభావితం చేస్తుంటాయి. ఆ ప్రభావం నవ్వులో కూడా ప్రతిఫలిస్తుంటుంది.
నవ్వులకు ప్రాధాన్యత పెరిగి నగరాలు, పట్టణాలనుంచి ఇపుడు గ్రామాలవరకు చాలామంది లాఫింగ్ క్లబ్బులు ఏర్పాటుచేసుకోవడం విశేషం. సోషల్ మీడియా, ఫేస్‌బుక్, వాట్సప్‌లలోనూ ఈ నవ్వుల కోసం గ్రూపులు ఏర్పడ్డాయి. ఇక ప్రతి ఇంట్లోనూ నవ్వుల కార్ఖానాను ఏర్పాటుచేసుకోవడం అవసరం.
ఆహ్లాదకరంగా హృదయాన్ని ఊయలలూగించే నవ్వుల గురించి అందరూ పంచుకోండి. నవ్వుతో అమృతం కురిపించవచ్చు. మాధుర్యాన్ని కురిపించేది నిజమైన నవ్వు. రాగద్వేషాలను అధిగమించగలిగిన వారికెవరికైనా ఈ నిజమైన నవ్వు సొంతమవుతుంది. అది హృదయంలో పూలవానలను సృష్టిస్తుంది. మనిషిని పరిమళభరితం చేస్తుంది. అయితే, నవ్వులతో పువ్వులు రువ్వడమే కాదు కత్తులుకూడా దూయవచ్చు. నవ్వుల రేడు చార్లీ చాప్లిన్ చేసిందేమిటి? ఆద్యంతం నవ్విస్తూనే వ్యవస్థపై పిడిబాకులు విసిరాడు. హిట్లర్ అంతటి వాడిని నవ్వులతో తూట్లు పొడిచాడు. నవ్వు భావప్రకటనకు రసజ్ఞత చేకూరుస్తుంది. కనుకనే నవరసాలలో మేటిగా నవ్వు వాసికెక్కింది. కల్మషమెరుగని హృదయాలు నవ్వులు పూయిస్తాయి. కారణం నవ్వు స్వచ్ఛతకు ప్రతిరూపం. సహజత్వానికి, సానుకూల దృక్పథానికి సంకేతం. ప్రేమకూ, ఆత్మీయతకూ ప్రతీక. ఒక చిన్న చిరునవ్వు యుద్ధాలను సైతం ఆపగలదు. ఒక చిరుదరహాసం అగాధాలను పూడ్చి బంధాలను కలుపగలదు. నవ్వు మంచి నేస్తాలనిస్తుంది. ఆత్మీయులనిస్తుంది. అంతేకాదు చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే.. నవ్వాలి.. నవ్వించాలి. అందుకు అవకాశం వున్న ఏ సందర్భాన్నీ వదులుకోవద్దు. అవసరమైన సందర్భాలను కూడా సృష్టించుకోండి. నవ్వడం, నవ్వించడం ప్రధానం. జీవనయానంలో దారిపొడవునా తీయని పూలను పూయిస్తుంది నవ్వు. నవ్వింది క్షణకాలమే కానీ ఆ అనుభూతి శాశ్వతం. నవ్వు మనిషికి చెలిమినిస్తుంది, బలిమినిస్తుంది, కాంతినిస్తుంది, శాంతినిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. కన్నీటిని జయిస్తుంది. బతుకు దీపాలను వెలిగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇంటా బయటా అంతా నవ్వుల ప్రపంచంలో ఆనందంగా గడిపేయండి!

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660