మెయిన్ ఫీచర్

మాటల మహత్తు గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలో మనిషికి మాత్రమే వున్న వరం మాట్లాడటం. మనిషి తన ఎదుగుదలకు మాటలను ఒక ఆయుధంగా వాడుకున్నాడు. మనిషి ప్రకృతి గురించి తెలుసుకుంది మాటల ద్వారానే. తాను చూసిన ప్రతి వింతనూ, కనుగొన్న కొత్త విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నందునే మనిషి అన్ని రకాలుగా ఎదిగాడు.
వైజ్ఞానికంగా ఎదిగి, జీవితాన్ని సుఖమయం చేసుకోవటంలో మాటల పాత్ర మరువలేనిది. మనిషి సామాజికంగా ఎదిగింది, సమాజాన్ని బలపరచుకున్నది ఈ మాటల ద్వారానే. మానసిక ఆనందం పొందింది, రోజువారీ వినోదం సంపాదించుకున్నదీ ఇతరులు మాట్లాడే మాటల్లోనే. మానవ ప్రగతిలో మాటలకున్న విలువ వెలకట్టలేనిది. అయితే సాంకేతిక ప్రగతి మనిషి మాటలను మింగేయటం ఆందోళన కలిగించే అంశం. సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడే మనుషులను మాత్రమే చూస్తున్నవారికి మనుషులతో మాట్లాడటం తగ్గిపోతుందన్న వాస్తవాన్ని అంగీకరించడం కష్టమే. అయితే ఇది నిజం. తాను చెప్పదలచుకున్న విషయం నోటితోకన్నా మెసేజ్‌ల ద్వారానో లేక మెయిల్ ద్వారానో చెప్పటం ఇటీవల ఎక్కువైంది.
యంత్రాలు వచ్చి మనుషుల జీవితాలను సుఖమయం చేస్తాయనుకున్నారు. కానీ అవి మనుషులమధ్య ఎడం పెంచి ఇతర జీవులకన్నా భిన్నమైన తమ గొప్ప శక్తిని చంప్తేస్తాయనుకోలేదు. ఒకప్పుడు బ్యాంక్‌కి వెళ్లిన కస్టమర్‌కి అక్కడి సిబ్బందితో మాట్లాడటం, కొంత స్నేహం ఏర్పడం జరిగేది. కానీ ఇపుడు తమ బ్యాంక్ కస్టర్లు ఎవరో మేనేజర్‌కి తెలియదు. అకౌంట్ తెరిచేరోజు, మూడు నెల్లకో, సంవత్సరానికోసారి పాస్‌బుక్ అప్‌డేట్ చేయించుకునేందుకు మాత్రమే బ్యాంకులకు వెళుతున్నారు. బ్యాంకులనే కాదు అన్ని రకాల ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ఆఫీసుల్లో అవినీతి లావాదేవీలు మాత్రమే మాటల ద్వారా జరుగుతున్నాయి. అవి తప్పించి మిగిలినవన్నీ యాంత్రిక సమాచారాలే. దీంతో ఇల్లు కదలాల్సిన అవసరం తగ్గిపోయింది.
గతంలో మనసులో ఏదైనా ఓ కొత్త ఆలోచన మెదిలితే సాయంత్రంలోపు నలుగురు స్నేహితులను కలిసి వారికి ఆ ఆలోచన చెబితే కాని మానసికంగా తృప్తి కలిగేదికాదు. తన ఆలోచనను అవసరమున్నవారికి, లేనివారికి కూడా పంపించే సోషల్ మీడియాని వాడుతున్నారు. ఒకరోజుంతా పనిచేసి రాత్రి పడుకునేముందు సమీక్షించుకుంటే ఆ రోజు ఎన్ని ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చింది, ఎన్ని మెయిల్స్ ఇచ్చింది, ఏ మేరకు ట్వీట్ చేసింది మాత్రమే గుర్తుకువస్తుంది. ఆత్మీయ స్నేహితులు, బంధువులతో మాట్లాడి చాలాకాలమైందన్న వాస్తవం తెలుస్తుంది.
మాటల విలువ గుర్తించినందునే పలకరించటమనే దానికి ప్రాధాన్యతనిచ్చారు పూర్వీకులు. అందరినీ పలుకరించాలి. ఇబ్బందుల్లో ఉన్నవారిని మరీ తప్పనిసరిగా పలకరించాలి. అలా ఒకరికొకరు తోడుగా నిలిస్తే ఆ బంధం వేరుగా ఉంటుంది. కాబట్టి మాట్లాడటం పెరగాలి. వీలైనంతవరకు ముఖాముఖి మాటలు, వీలు కుదరనప్పుడు ఫోన్‌లోమాటలు అవసరం. వెళ్లిన ఇంటిలో కనీసం గంటసేపైనా హాయిగా కబుర్లు చెప్పుకోండి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది, మానసికంగా మీలో వచ్చిన మార్పు ఏమిటో. మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మనసులోని ఒత్తిడిని తొలగించే శక్తి కబుర్లలోవుంది.
మాట్లాడే కళ అలవడాలంటే ముందుగా మంచి శ్రోత అయివుండాలి. సంభాషణలో భాగం వినటం. మాట్లాడటం నేర్చుకోవాలనుకునేవారు ఇతరులు చెప్పేదానిని వినాలి. అవతలివారు ఏం చెబుతున్నారనేది కాకుండా ఎలా చెబుతున్నారనేది గమనించాలి. వినటమనేది కబుర్లలో కీలకభాగం. ఎంతసేపూ ఒక్కరే మాట్లాడితే, అది ఏకపాత్రాభినయంలా ఎదుటివారు ప్రేక్షకుడిలా మిగిలిపోతారు.
సంభాషణలమధ్యలో అవతలివారు చెప్పేది వినటానికి సమయం ఇవ్వాలి. మాట్లాడేవారు తక్కువమంది, వినేవాళ్ళు ఎక్కువమంది ఉన్నపుడే సంభాషణలు చక్కగా ముందుకెళతాయి. ఒక టాపిక్ నుండి మరో టాపిక్‌కి మారేముందు కొంచెం ఖాళీ మాటలు లేని వౌనం పాటించి ముందుకెళ్ళడం చేస్తే బాగుంటుంది.
మాటలు మొదలుపెట్టడం, గంటల తరబడి కబుర్లు చెప్పటమే కాదు. ఆ సంభాషణలను ఎలా ముగించాలి అన్నది కూడా ముఖ్యమే. మాటలు మొదలుపెట్టడం కొందరికి కష్టమనిపిస్తుంది. సంభాషణలోకి అవతలివారిని లాగడమే కాదు, చివరికి సంభాషణను అర్థవంతంగా ముగించటం కూడా బాగా తెలిసుండాలి.
కబుర్లకు మీరు కేటాయించుకున్న సమయం అయిపోతున్నప్పుడు సంభాషణలని చివరకు తీసుకురావటం, మళ్లీ కలుద్దామనో, మరలా మాట్లాడుకుందామనో చెప్పి సంభాషణను ముగించండి. హఠాత్తుగా ఆపి వెళ్లిపోయారనే అభిప్రాయం కలగకూడదు. మీ ఇబ్బందిని స్పష్టంగా చెప్పి, ఎక్కువ సమయం మాట్లాడలేకపోతున్నందుకు క్షమాపణ కోరి సంభాషణ ముగించటం ఒక మర్యాద.
మాటలకు వున్న శక్తితో ఎంతటివారినైనా లొంగదీసుకోవచ్చు. సరైన రీతిలో మాట్లాడితే కరుగనివారుండరు. ప్రేమికుల మధ్యనైనా, మిత్రులమధ్యనైనా విడదీయరాని బంధం ఏర్పడేది మాటల ద్వారానే. అయితే మాటలలో సహజత్వం ఉండాలి. కృతకంగా, అవసరంకొద్దీ చెప్పే కబుర్లవల్ల ఉపయోగం ఉండదు. ఎలా మాటాలడాలి, ఎలా మెప్పించాలనేవి అర్థం చేసుకుంటే విజయం వరిస్తుంది. అంతటి విలువైన మాటలకు మనిషి దూరం కాకూడదు. కాబట్టి ఫోన్ కబుర్లు దూరంగా ఉన్నవారితో, అందుబాటులో వున్నవారితో ఇకనైనా ప్రత్యక్ష మాటలు మొదలుపెట్టండి.

- పి.ఎం. సుందరరావు 94906 57416