మెయన్ ఫీచర్

ప్రాభవం కోల్పోతున్న పాఠశాల విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యా వ్యవస్థకు పునాది అయిన పాఠశాల వి ద్యావిధానం- ‘ఏ విధంగా ఉన్నది? ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానం బంగారు తెలంగాణ నిర్మాణానికి ఏమేరకు దోహదపడుతుంది..?’-అనే విషయంతోపాటు ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఓసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో తాజా గణాంకాల ప్రకారం అక్షరాస్యత 74.04 శాతం ఉంటే, తెలంగాణలో అది 66.5 శాతంగా ఉంది. అక్షరాస్యతా క్రమంలో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 36తో పోల్చితే తెలంగాణది 35వ స్థానం. కేరళ 93.91 శాతం అక్షరాస్యతతో మొదటి స్థానంలో ఉండగా, బిహార్ 63.82 శాతంతో చిట్టచివరి అంటే 36వ స్థానంలో ఉంది. ఇక మానవ వనరుల అభివృద్ధి సూచీలో దేశంలోని 29 రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణకు 23వ స్థానం దక్కింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 57.25 శాతం అక్షరాస్యత ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 81.09 శాతంగా ఉంది. షెడ్యూల్డ్ కులాల్లో 58.90 శాతం, షెడ్యూల్డ్ తెగలలో 49.5 శాతం మాత్రమే ఉంది. అక్షరాస్యతలో ఇంతటి భారీ వ్యత్యాసాలుండటం గ్రామీణ, పట్టణ ప్రాం తాల మధ్య, షెడ్యూల్డ్‌కులాలు, తెగల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉంది.
తెలంగాణలో నేడు 29,959 ప్రభుత్వ పాఠశాలలు, 2,596 సంక్షేమ పాఠశాలలు, 742 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో 31 శాతం మాత్రమే ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో 51.60 శాతం విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 69 శాతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 48.40 శాతం మంది ఉన్నారని తేలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప గత రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 4.04 శాతం పెరిగినట్లు ప్రభుత్వాధికారులు చెబుతుండగా, అధికారిక గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2013-14 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 29,50,739 కాగా, 2015-16 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 27,92,514కు పడిపోయింది. అదే విద్యాసంవత్సరంలో ప్రయివేట్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 30,64,088 నుండి 32,70,799కి పెరిగింది. రాష్ట్రంలో పాఠశాల విద్య శీఘ్రంగా ప్రభుత్వరంగం నుంచి ప్రయివేట్ రంగం వైపు పరుగులిడుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తిని తగ్గించుకుంటూ, ఎంతో వ్యయభరితమైన ప్రయివేటు పాఠశాలల వైపు అనివార్యంగా ఎందుకు పరుగిడుతున్నారో దానికిగల కారణాలేమిటో విశే్లషించాల్సిన తరుణం ఇది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 29,959 పాఠశాలల్లో 17,832 పాఠశాలల్లో తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల వసతి లేదు. 12,435 పాఠశాలలకు ప్రహరీగోడలు లేవు. దాదాపు 3,500 పాఠశాలలకు ఇప్పటికీ పక్కా భవనాలు లేవు. ఆటస్థలాలు లేని పాఠశాలలు 11,937, విద్యుత్ సరఫరా లేని పాఠశాలలు 3181. విద్యుత్ సౌకర్యం లేనందున విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానానికి దూరమవుతున్నారు. 50 శాతం పైగా పాఠశాలల్లో ఇప్పటికీ తరగతి గదుల కొరత ఉంది. దాదాపు 70 శాతం పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి సరిపడ ఫర్నిచర్ లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాల విద్యకు వౌలిక వసతులు కల్పించడంలో పాలకులు అనాదిగా ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే నిదర్శనాలు.
మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతున్నట్లు భారీ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ, విద్యాపర్యవేక్షకులు ఖాళీలను బట్టి తెలుస్తుంది. విద్యాశాఖ అధికారులు చెపుతున్న గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగాఉన్న ఉపాధ్యాయ పోస్టులు 16,193. ప్రధాన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేని బడులు 64 శాతం ఉన్నాయి. 75 శాతం పాఠశాలల్లో అవసరమైన ప్రయోగశాలలు లేవు. 36 శాతం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. విద్యార్థులను, ఉపాధ్యాయులను పర్యవేక్షించాల్సిన ఉప విద్యాధికారులు 67 మంది ఉండాలి. కానీ, రాష్ట్రం మొత్తమీద ఉన్నది 8 మంది మాత్రమే. 59 పోస్టులు చాలాకాలంగా ఖాళీగానే ఉన్నాయి. మండల విద్యాధికారులు (ఎంఇఓ)లు 462 మంది ఉండాలి. అందులో 420 ఖాళీలే ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమైన రోజునాటికి 1,606 పాఠశాలలకు ఉపాధ్యాయులే లేరు. ఈ విద్యా సంవత్సరం మొదలైన నాటికి 2,510 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 405. నలుబది మంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలు 10,515. ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక వసతులు లేకపోవడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, విద్యా పర్యవేక్షకులు లేకపోవడం, విద్యా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారులు తగినంతగా లేకపోవడం వంటి సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇలా నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో అనివార్యమైన పరిస్థితులలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత పాలకుల నిర్లక్ష్యపూరిత వైఖరితో తెలంగాణలో పాఠశాల విద్యావ్యవస్థ నిరాశాజనకంగా ఉందనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ, రాష్ట్రాన్ని సాధించుకున్న పిదప కూడా గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం పాఠశాల విద్యను ఎందుకు బలోపేతం చేయడం లేదన్న ప్రశ్నలు విద్యారంగ నిపుణులను కలవరపెడుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు అడుగులు వేయటం లేదన్నది ఆందోళన కలిగించక మానదు. ప్రభుత్వ బడులనుప్రైవేట్ బడులకు ఆదర్శంగా నిలబెట్టడానికి, వాటిని బలోపేతం చేయడానికి కావాల్సినన్ని వనరులు, అవకాశాలు ప్రభుత్వానికి పుష్కలంగా ఉంటాయి. తగినన్ని వనరులు ఉన్నా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడం వల్లనే నేడు పాఠశాల విద్య సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ దుస్థితికంతటికీ బడ్జెట్ కేటాయింపులలో పాఠశాల విద్యకు ప్రభుత్వం కేటాయిస్తున్న అరకొర నిధులే ప్రధాన కారణం. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే 2016-17లో పాఠశాల విద్యకు కేటాయింపులు రూ. 480 కోట్లు తగ్గాయి. 2015-16 బడ్జెట్‌లో 9.69 శాతం కేటాయింపులు జరిగితే, 2016-17 బడ్జెట్‌లో 8.23 శాతం మాత్రమే జరిగాయి. విద్యపై జాతీయ సగటు కేటాయింపులు 16.4 శాతం ఉండగా, అస్సాం లాంటి రాష్ట్రం 20 శాతం కేటాయింపులు చేస్తుండగా, మిగులు రాష్ట్రంగా గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణలో కేటాయింపులు 8.23 శాతం ఉండటం విచారకరం. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కూడా వ్యవహరించడం లేదని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల మధ్య ఇంతటి అంతరానికి కారణం ఆంగ్ల మాధ్యమమేనని భావించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా కొన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభించింది. అయితే ఆంగ్ల మాధ్యమంలో అన్ని సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులను సిద్ధం చేసే పక్కా ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు ఆచరణలో కనిపించడం లేదు. ఇష్టనుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. అధిక ఫీజుల రూపంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం ఆరు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు అనధికార అంచనా. ఈ మొత్తం ప్రభుత్వం పాఠశాల విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్‌కు సమానమంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ఇంతగా ఫీజులు వసూలుచేస్తున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లోనూ వౌలిక వసతుల కొరత తీవ్రంగానే ఉన్నది. నిజానికి ఫీజుల విషయంలో గానీ, వసతులపై గానీ, బోధన, బోధనేతర సిబ్బందిపై గాని ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడంతోపాటు ప్రపంచీకరణ ప్రభావంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
విద్యావ్యవస్థలో పాఠశాల విద్యే అత్యంత కీలకమైంది. ఉన్నత విద్యకు పునాది పాఠశాల విద్యే. నాణ్యతాపరంగా పాఠశాల విద్య పటిష్టంగా ఉన్నప్పుడే ఉన్నత విద్య బాగుపడేది. ‘కేజి టు పిజి ఉచిత విద్య’ అందిస్తామని పదే పదే చెప్పే ప్రభుత్వవర్గాలు, ఆ విద్యావిధానం ఏవిధంగా ఉంటుందో ఇప్పటికీ వివరించక పోవడం విచారకరం. కీలకమైన పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురికావడంతో రాబోయే రోజుల్లో రాష్ట్భ్రావృద్ధికి మూలమైన మానవ వనరుల కొరత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి వుంది. అక్షరాస్యతాక్రమంలో 35వ స్థానంలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రంలో పాఠశాల విద్యకు బడ్జెట్ కేటాయింపులు జాతీయ సగటును మించి ఉండాలి. విద్యార్థులుంటే ఉపాధ్యాయులు లేక, టీచర్లుంటే విద్యార్థులు లేక, వారు-వీరూ ఉంటే వౌలిక వసతులు లేక పాఠశాల విద్య కుంటుతూ నడుస్తున్నది. పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇకనైనా తక్షణచర్యలు చేపట్టాలి. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జిల్లాల వారీగా ఉపాధ్యాయ, విద్యాపర్యవేక్షకుల పోస్టులను భర్తీచేయాలి.
దినదినం విస్తరిస్తున్న ప్రయివేటు విద్యావ్యవస్థపై నియంత్రణ చర్యలు చేపట్టి, ప్రభుత్వ నిర్వహణలో మాత్రమే పాఠశాల విద్య కొనసాగేలా చర్యలు చేపట్టాలి. అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించబడుతున్న జపాన్‌లో వంద శాతం, స్వీడన్‌లో 90 శాతం, అమెరికాలో 87 శాతం పాఠశాల విద్య ప్రభుత్వ నిర్వహణలోనే ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను ఇకనైనా సంస్కరించాలి.

- ప్రొ.జి.లక్ష్మణ్