మెయన్ ఫీచర్

రాజధాని సరే... సంఘ సంస్కరణలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి అంశంపైన ఏకాభిప్రాయం ఉండాలనే నిబంధనేమీ లేదు. అవతలి వ్యక్తి చెప్పే ప్రతి అభిప్రాయానికి తానా అంటే తందానా చప్పట్లు కొట్టాల్సిన పనిలేదు. కానీ ప్రతి అంశంపై చర్చ ఉండాలి. ఈ చర్చ మర్యాదపూర్వకంగా కొనసాగాలి. ఈ చర్చలో అందరి అభిప్రాయాలను వినే ఓపిక ఉండాలి. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య అర్థవంతమైన చర్చలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఒక సదస్సులో ప్రజలను కోరారు. ఏ అంశంపైన అయినా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో చర్చ ముఖ్యం. బహిరంగంగా ప్రతి అంశంపై ప్రజాస్వామ్యంలో చర్చ ఉండాలి. ఈ చర్చలు పార్లమెంటులో జరుగుతాయి. సాధారణ పౌరులు, నిపుణులు, మీడియా, చర్చా వేదికల ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వంతో అలరారే భారత్‌లో ఏ అంశంపైన అయినా ఏకాభిప్రాయం సాధ్యం కాదు. కానీ దేశ సమగ్రత విషయంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 130 కోట్ల మంది ప్రజలు 370వ అధికరణ రద్దుపై ఒకే వాణిని వినిపించి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని వెనుదన్నుగా నిలిచారు. ఈ విషయంలో ప్రజలు చూపించిన చొరవ, సాహసం, భావోద్వేగాలు భారతావని ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటాయి.
కానీ దురదృష్టవశాత్తు గత నెల రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న మూడు సంఘటనలను విశే్లషిస్తే భారత సమాజం ఆలోచన రీతిల్లో పరిణతి కనపడలేదని చెప్పవచ్చును. ప్రతి సమాజం ఏదో ఒక లోపంతో సతమతమవుతుంటుంది. ఇతర దేశాల్లో మాదిరిగా మతిచాంచల్యంతో తుపాకి పట్టుకుని ఇష్టం వచ్చినట్లు జనంమీద పడి కాల్పులు జరిపే సంఘటనలు మన దేశంలో జరగకపోవచ్చు. కానీ సామాజిక వెలి, అంటరానితనం, కుల కట్టుబాట్లు అనే దుష్టసంప్రదాయాలు ఇంకా మనలను వెంటాడుతున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రవచించిన బోధనల గురించి ప్రతి రోజూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ప్రస్తావిస్తారు. కానీ ఏమి లాభం. గుంటూరు జిల్లా అమరావతి రాజధాని ప్రాంతంలో సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవికి అవమానం జరిగినట్లుగా వచ్చిన అభియోగాలు చూస్తే, మన సమాజం మానసిక స్థితి చాలా అధ్వాన్నంగా, దుర్మార్గంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇక్కడ రాజకీయ కోణంలో ఈ సంఘటనను చూడరాదు.
సింగపూర్ లాంటి రాజధానులు, అందమైన రాజధానులపై అధికార, విపక్ష పార్టీల మధ్య చర్చోపచర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణం కంటే ముందు సంఘ సంస్కరణలు ప్రారంభం కావాలి. ఈ దిశగా రాజకీయ పార్టీలు తమ పార్టీలో అంతర్గతంగా చర్చలు చేయాలి. ఎమ్మెల్యేకు జరిగిన అవమానంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు న్యాయస్థానం పరిధికి చేరింది.
అమరావతి రాజధాని ప్రాంతం చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన అంతరిక్ష పరిశోధన కేంద్రం కేవలం 360 కి.మీ దూరంలో ఉంది. 21వ శతాబ్థంలో కూడా ఇంకా చట్టసభలకు చెందిన ప్రజాప్రతినిధి ఒక మతసంబంధ కార్యక్రమంలో వివక్షత ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేదు. ముందుగా ప్రభుత్వం రాజధాని ప్రాంతం నుంచే సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. ప్రజల మైండ్ సెట్‌లో మార్పులు తేవాలి. ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ సంస్థల భాగస్వామ్యంతో సమాజంలో అప్పుడప్పుడు నేనున్నానంటూ తలెత్తే కులతత్వ భూతాన్ని తరిమిగొట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశం మొత్తం మీద ఎక్కువ చైతన్యవంతులు ఉండే జిల్లా గుంటూరు. ఈ గడ్డపై బౌద్ధం వెల్లివిరిసింది. బ్రిటీష్ కాలంలో క్రైస్తవమతం వ్యాప్తి చెందింది. మతం అనేది సున్నితమైన అంశం. కులం, మతం ఇంటి గుమ్మాలకు పరిమితం కావాల్సిన అంశం. ఇది పూర్తిగా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం. పవిత్రమైన పర్వదినం రోజు కొంత మంది వ్యక్తులు అజ్ఞానంతో, పెత్తందారీతనంతో చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. గుంటూరు వెనకబడిన జిల్లా కాదు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా గుంటూరు జిల్లా వాసులుంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా చర్చ జరగాలి. ఈ ఘటనపై చర్చించేందుకు అధికార, విపక్ష పార్టీలు పెద్దగా చర్చించేందుకు ఇష్టపడవు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందనే ధోరణితో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయి. కుల దురహంకార శక్తులు అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఏదో ఒక పార్టీకి ముద్రవేయడం వేసి ప్రచారం చేసుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొనాలి. ఎందుకో అనేక కారణాల వల్ల జాతీయ మీడియా కూడా ఈ సంఘటనపై దృష్టి సారించలేకపోయిందని చెప్పవచ్చు. అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న గ్రామంలోనే ఈ ఘటన జరిగింది. హృదయాల్లో పరివర్తన లేని, విశాలదృక్పథం లేని ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే అద్భుతమైన రాజధానులు కావాలని, ఈ నిర్మాణాలు నిలిచిపోయాయని గోల పెట్టేవారు ఒక దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగినట్లుగా చెబుతున్న ఘటనపై ఏమని సమాధానం చెబుతారు. సంస్కరణాభిలాషులు, అభ్యుదయవాదులు కూడా ఆశించిన రీతిలో పెద్దగా స్పందించలేదని చెప్పవచ్చును.
దక్షిణభారతదేశంలో అతి పెద్దనగరం చెన్నైకు సమీపంలో వెల్లూరు వద్ద మరో ఘటన ఆగస్టు 22వ తేదీన జరిగింది. ఇది కూడా సభ్యసమాజం సిగ్గుచేటుతో తలవంచుకోవాల్సిన ఘటన. అగ్రకులాల ప్రజలు తమ పొలాల మధ్య ఉన్న మార్గం ద్వారా ఒక నిమ్మకులానికి చెందిన ఒక వ్యక్తి భౌతిక దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేసేందుకు వీలులేదని అడ్డుపడ్డారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వణైయాంబడి తాలూకాలో ఈ ఘటన జరిగింది. దళితులకు శ్మశాన వాటిక కూడా లేదు. చివరకు దళితులు సమీపంలో నదిపై ఉన్న వంతెనపైకి ఎక్కి అక్కడి నుంచి నదిలోకి శవాన్ని జారవిడిచారు. జారుతున్న శవంపై పూలు జల్లారు. ఈ తరహా సంఘటనలు ఈ ప్రాంతంలో జరగడం కొత్తకాదు. చాలా సార్లు ఈ ఘటనలు జరిగాయని దళితవర్గాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళనాడులో గత రెండు వందల సంవత్సరాల్లో వచ్చిన అభ్యుదయ సంస్కరణలు, కుల నిర్మూలన పోరాటాలు దేశంలో మరెక్కడా జరగలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతం కూడా చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన శ్రీహరికోటకు కేవలం 230 కి.మీ దూరంలో ఉంది. ఈవీఆర్ పెరియార్ రామస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంస్కరణల ఉద్యమం తమిళనాడులో జరిగింది. అన్నాదొరై, కరుణానిధి లాంటి మహనీయుల ఈ ఉద్యమం నుంచే పుట్టి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవులను అలంకరించారు. కుల వ్యవస్థల పట్ల, దైవం పట్ల నమ్మకం లేకపోవడం ప్రాతిపదికగా పుట్టిన ద్రవిడ పార్టీలు సంస్కరణల సాధనకు దశాబ్దాలుగా మహోజ్వల పోరాటాన్ని నడిపాయి. తమిళనాడులో కుల వ్యవస్థ మాత్రం పోలేదు. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో తమ క్రూరత్వాన్ని ఆధిపత్య కులాలు చాటుతుంటాయి.
ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ జిల్లాలో ఆగస్టు 29వ తేదీన ఒక వ్యక్తి చిన్నారి అయిన తన మేనకోడలిని నడిపించుకుని ఆసుపత్రికి చికిత్స చేయించేందుకు వెళుతున్నాడు. కాని ఆ బాలికను ఆ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నాడనే అనుమానం గ్రామ ప్రజలకు వచ్చింది. దీంతో వారు ఆగ్రహం చెంది ఆ వ్యక్తి మీద పడి హత్య చేశారు. మూక హింసకు ఆ వ్యక్తి బలయ్యాడు. అంతకు ముందు బిహార్‌లోని వైశాలి నగరంలో కూడా మతిస్థిమితం తప్పిన ఒక మహిళను అనుమానించి ప్రజలు ఆగ్రహంతో చంపేశారు. అస్సాంలోని జోర్హాట్‌లో 73 సంవత్సరాల డాక్టర్ ఆసుపత్రిలో అందుబాటులో లేడనే ఆగ్రహంతో గ్రామస్థులు ఆగ్రహంతో చంపేశారు.
దేశంలో ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని అనుమానం వచ్చిన వారిని కిడ్నాపర్లుగా, రేపిస్టులుగా, చేతబడి చేసేవారిగా, పిల్లలను ఎత్తుకుని పోయేవారుగా ఇలా అనుమానాలతో గుంపులుగా చేరి హతమారుస్తున్నారు. శాంతి భద్రతలు రాష్టప్రరిధిలోని అంశం. మూక హింస నిరోధానికి పోలీసులే బాధ్యత వహించాలి అనే మాటలు చెప్పడానికి బాగుంటాయి. ప్రజలు పుకార్లు, చెప్పుడుమాటలు నమ్మి అప్పటికప్పుడు ఆవేశాలకు లోనై గుంపులుగా చేరి ముందు, వెనక ఆలోచించకుండా తాము అనుమానించిన వారిని హతమార్చడం కిరాతకమైన చర్య. ఇంతకంటే కిరాతకమైన, హేయమైన ఘటనలు ఉండవు. ఈ తరహా ఘటనలు తరచుగా ఉత్తరభారతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కూడా మనం ఈ ఘటనలకు, రాజకీయ పార్టీలకు అనుసంధానం చేసే ధోరణిని సరికాదు. ప్రజల ఆలోచనా దృక్పథంతో మార్పు రానంత వరకు ప్రగతిశీల సమాజాన్ని సాధించలేం. ప్రగతిశీల సమాజమంటే మతసంప్రదాయాలను వదులుకుని విచ్చలవిడిగా తిరగడం కాదు. సాటి మనిషి ప్రాథమిక హక్కులను గౌరవిస్తే చాలు. మూక హింస కింద హత్య ఐపీసీ 302, హత్యా ప్రయత్నం 307, గాయపరచడం ఐపీసీ 323, దొమీ ఐపీసీ 147, దొమీతో పాటు మారణాయుధాలతో దాడి ఐపీసీ 148, అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా గుమిగూడడం 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇంతవరకు మూక హింస నిరోధంపై స్పష్టమైన ఐపీసీ సెక్షన్లు లేవు. బెంగాల్, రాజస్థాన్, మణిపూర్‌లో మూకహింస నిరోధానికి చట్టాలు చేశారు. చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. ముందుగా ప్రజల దృక్పథం మారాలి. అప్పుడే మూక హింస సంఘటనలను నిరోధించగలం. ఈ సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు మూకహింసకు దిగిన ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. దీని వల్ల కేసులు కోర్టుల్లో నిలబడవు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం లేదా తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఘటనలు, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో, బిహార్‌లోని వైశాలి నగరం, అస్సాంలోని జోర్సాట్ సంఘటనలపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటనలను రాజకీయాలకు వాడుకుని స్థానిక గ్రూపుల చుట్టూ రాజకీయ శక్తులు చేరే దుష్ట సంప్రదాయానికి చెక్ పెట్టాలి. రాజకీయ ప్రయోజనాల కోణంలో ఈ సంఘటనలను వాడుకునే ప్రయత్నం వల్ల సంస్కరణాభిలాషులు తటస్థంగా ఉండిపోతారు. నిజానిజాలు ఎలా ఉన్నా, గోరంతలు కొండంతలుగా ప్రచారం చేసే శక్తులకు ఊతం లభించినట్లవుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లు చర్చకు అవకాశం లేకపోతే అభిప్రాయాలు బయటకు రావు. దీని వల్ల మన గొంతులు బలహీనపడుతాయి. మన అభిప్రాయాలను వ్యతిరేకించేవారిని అనుమానించే ధోరణి మానుకోవాలి. మనకు నచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తే దూషించడం, దుర్భాషలాడడం తగదు. తన గొంతు మాత్రమే వినపడాలి. అవతలి గొంతును నొక్కేయాలనే పాశవిక ధోరణి అన్ని పార్టీల నేతల్లో పెరుగుతోంది. టీవీ చానళ్లలో అరుపులు, గావుకేకలు, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు రాతలు దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. ఇటీవల ఈ తరహా అసందర్భపు వాగ్వాదాలు కుటుంబ సభ్యుల భేటీల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. మన హృదయాలను ఆవిష్కరించే స్వేచ్ఛా వాతావరణం, సహనం, రాజ్యాంగ విలువలను గౌరవించేతత్వం ఉన్న పౌర సమాజం రావాలంటే చర్చ జరగాలి. ప్రశ్నించే గొంతులను అనుమతించాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097