మెయన్ ఫీచర్

హనుమదే అసలు సిసలు సర్జికల్ దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సర్జికల్ దాడి’... ఇపుడు ఏ నోట విన్నా ఇదే మాట. నేడు దేశంలో దీనర్థం అందరికీ తెలిసిపోయింది. చాలామందికి తెలియందల్లా ఏమంటే- అలనాడు వాల్మీకి మహర్షి తన రచనా చాతుర్యంతో ఈ దాడి మూలాలను ‘సుందరకాండ’లో వర్ణించిన వైనం. రామాయణ కాలం నాటి ఆ ‘సర్జికల్ దాడి’లో ఆర్మీ జనరల్, సైనికుడు, వ్యూహకర్త అంతా.. ఒకే ఒక్కడు. రావణ శత్రుసైన్యంలో మూడొంతుల మందిని ఆ ఒక్కడే తుదముట్టించాడు. శత్రురాజు బలగాల సంపద తెలుసుకోవాలని తనంత తానుగా ఆ వ్యక్తి లంక వెళ్లి పట్టుపడ్డాడు. ఉపాయంగా బయటపడి శత్రుబలాల రహస్యాన్ని తన నాయకుడైన శ్రీరాముడికి తెలియజేసి భవిష్యత్ యుద్ధానికి అంతా సమాయత్తం చేశాడు. అతడే సుందరకాండ కథానాయకుడు హనుమంతుడు. వివరాల్లోకి వెడితే..
రామాయణంలో అందమైన కాండ ‘సుందరకాండ’. నిజానికది ‘హనుమత్కాండ’. ఆద్యంతాలు హనుమంతుడు ఆచార్యుడుగా, వ్యూహకర్తగా, కార్యాచరణ కర్తగా దర్శనమిచ్చే అద్భుత కాండ సుందరకాండ. ఇందులో హనుమంతుడు మహాయోగి, మహా జ్ఞాని, విశిష్ఠ వశిష్ఠుడు, మహాచార్యుడు. ఇక, ప్రధానంగా కథ విషయానికొస్తే హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకకు చేరడం, సీతాదేవి కోసం వెతకడం, ఆమెను చూడడం, రామలక్ష్మణుల సమాచారం ఆమెకు చెప్పడం, లంకా ధ్వంసం, దహనం, మరలిపోవడం, రాముడికి సీతమ్మ సందేశాన్ని ఇవ్వడం. ఇంతే. దీనికొక పెద్ద పుస్తకం అక్కరలేదు. ఐనా అక్కరకొచ్చింది. అందులో భాగమే హనుమ ‘సర్జికల్’ దాడులు. స్థూలంగా చెప్పాలంటే సీతాదేవితో మాట్లాడిన తర్వాత ఆమె దగ్గర సెలవు తీసుకుని శత్రువుల బలాబలాలు తెలుసుకోవాలనుకున్న హనుమంతుడు వెంటనే తిరిగి పోకుండా ‘మెరుపుదాడి’ చేస్తూ ముందు అశోకవనాన్ని పాడుచేస్తాడు. రామలక్ష్మణులు లేని సమయం చూసి (పాకిస్తాన్ యూరీ తరహా చర్య) సీతాపహరణం చేసిన రావణుడి చర్యకు ఇది తొలి ప్రతీకార చర్యగా భావించాలి. సహజంగానే రావణుడికి కోపం వచ్చే విధంగా హనుమంతుడు కయ్యానికి కాలుదువ్వాడు. ఆయనకు కోపం వచ్చి పంపిన కింకరులను మట్టుపెట్టాడు. చైత్య పాలకులను చంపాడు. జంబుమాలి వధ, మంత్రి పుత్రుల చావు, సేనానాయకుల మృతి, అక్షకుమారుడి వధ, కావాలనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం, రావణుడి దగ్గరకు తీసుకునిపోగా అతడికి బుద్ధి చెప్పడం, దండనకు గురికావడం, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లంకాదహనం చేయడం, అక్కడి నుంచి మరలిపోవడం క్లుప్తంగా సుందర కాండలో కథ.
మరింత లోతుగా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక అంశాలు అవగతమవుతాయి. సీతాదేవి దగ్గర సెలవు తీసుకున్న తరువాత ‘కార్యశేషం’ గురించి ఆలోచించాడు హనుమంతుడు. కేవలం సీతాదేవి ఉనికి గురించి రాముడికి వివరించడంతో తన పని పూర్తి కాదని భావించాడు. చేయాల్సిన పని మరి కొంచెం ఉందనిపించిందాయనకు. సీతను వెతకమని, లంకను చూడమని హనుమకు సుగ్రీవుడు రెండు పనులు అప్పగించాడు. ఒకటైపోయింది. మరోటి మిగిలింది. లంకను చూడడమంటే మిద్దెలు, మేడలు చూడడం కాదు. రాక్షసుల బలాబలాలు బేరీజు వేయడం. రావణుడి అభిప్రాయం అతడి మాటల్లోనే తెలుసుకోవడం కూడా మిగిలిపోయింది. ఇవన్నీ జరగాలంటే సామ దాన భేదోపాయాలు (పాకిస్తాన్ విషయంలోలాగ) పనికిరావు. దండోపాయమొక్కటే సరైన మార్గమని నిర్ణయించాడు. తమోగుణం ఎక్కువున్న రాక్షసులు (పాకిస్తానీయుల లాగ) మంచిమాటలకు, ధర్మవాక్యాలకు లోబడేవారు కాదు. దైవబలం, దేహబలం,్ధర్మబలం వున్న తనకు యుద్ధమే శరణ్యమనుకున్నాడు హనుమంతుడు. దానివల్ల వాళ్లెంత బలవంతులో తెలిసిపోతుందనుకున్నాడు. మరో మేలుకూడా జరుగుతుందని భావించాడు. రామలక్ష్మణులు నిస్సహాయులు, ఏమీ చేయలేని వారు ( భారత్‌ను పాకిస్తాన్ భావించినట్టే) అనే దురభిప్రాయంతో వున్న రాక్షసుల అపోహ తొలగిపోవాలంటే యుద్ధం చేసి కొందరినైనా చంపాలనుకుంటాడు. ఇలా జరిగితే మిగిలినవారు ద్వేషం వదిలి మెత్తబడడమో, వారిలో వారికి విభేదాలు రావడమో జరుగుతుందని భావించాడు.
ఎంత చిన్న పని అయినా చక్కగా చేయడానికి పూనుకుంటే అది నెరవేరడానికి ఎన్ని ఉపాయాలు అవసరమో అన్నీ వెతకాలి. బలంలో తనకు, రాక్షసులకు వున్న తేడాను తెలుసుకుని రాముడి దగ్గరకు పోతే భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి అది పునాది అవుతుందనుకుంటాడు. రాక్షసరాజు రావణుడు తనంత బలవంతుడు లేడన్న మదంతో ఉన్నాడు. ఆ మదమణిగితేనేకాని వాడు లొంగడు అని అనుకుంటాడు. కొందరు రాక్షసులను యుద్ధానికి ఈడ్చి సులభంగా చావగొడ్తే రావణుడే యుద్ధానికి రాక తప్పదు. కాబట్టి ఏదో విధంగా రావణుడిని, అతని మంత్రులను, సైన్యాన్ని, యుద్ధానికి వచ్చేలా మార్గం ఆలోచించాడు. కన్నుల పండువగా, మనసుకు ఇంపుగా, ఇంద్రుడి నందనవనంలా వున్న అశోక ఉద్యానవనాన్ని ‘టార్గెట్’ చేద్దామనుకున్నాడు. రావణుడికిష్టమైన దీన్ని ధ్వంసం చేస్తే అతడికి కోపం తప్పక వస్తుందనుకున్నాడు. ఆ కోపంతో సైన్యాన్ని తనమీదకు పంపుతాడని వాళ్లను సంహరించి కిష్కింధకు మరిలిపోదామని నిర్ణయించుకుంటాడు.
హనుమంతుడు అశోకవనాన్ని పాడుచేసిన వైనాన్ని, ఆ తరువాత రావణుడి అనుచరులైన యోధానుయోధులను సంహరించిన వైనాన్ని వాల్మీకి సంస్కృత సుందరకాండలో, ఆంధ్ర వాల్మీకి వాసుదాసు తెలుగు సుందరకాండ మందరంలో అద్భుతంగా వర్ణించారిలా.. ‘విజృంభించిన హనుమంతుడు మహా వాయువులాంటి తన తొడల వేగంతో, అశోకవనంలోని చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పీకి నేలమీద పడేయడం ఆరంభించాడు. నానా రకాల చెట్ల తీగలతో, మదించిన పక్షుల ధ్వనులతో నిండిన ప్రమదావనాన్ని పాడుచేసాడు. క్రీడా పర్వతాలను నేలమట్టం చేసాడు.క్రీడా సరస్సులను విరగకొట్టాడు. తెగిన తీగలతో, విరిగిన చెట్లతో, పాడైన సరస్సులతో, ఆ వనం కార్చిచ్చు తగిలి కాలిపోయినట్లుంది. తీగలు అల్లుకునేందుకు ఆధారంగా వుండి, భూమిలో దాకా పాతుకుపోయి తల్లి వేళ్లున్న చెట్లు కూడా పడిపోవడంతో, వాటి కొనలందున్న తీగలు దిక్కులేనివారిలా భయంతో వణుకుతు కనిపించాయి. చెట్లు పడడంతో వాటి సందుల్లో వున్న పాములు కూడా నలిగి చచ్చాయి. చెట్టు తొర్రలు నేలకూలాయి. పొదరిండ్లు పాడైపోయాయి. రాతి ఇళ్లు నేలపై తూలిపడ్డాయి. ఇదంతా చూడడానికి ఘోరంగా కనిపించింది. రావణుడి భార్యలకు ప్రమదావనమైన ఈ ఉద్యానవనాన్ని మూలమట్టంగా నాశనం చేసి సంతోషంతో కయ్యానికి కాలుదువ్వి, యుద్ధానికి ఎదురు చూస్తూ ఆ వనం తలవాకిటి మీదెక్కి కూర్చున్నాడు హనుమంతుడు.
హనుమంతుడి ‘టార్గెట్’ కేవలం అశోకవనమే తప్ప దాని పరిసర ప్రాంతాలు కాదప్పటికి. ఈ విషయానే్న రావణుడికి తెలియజేసారు రాక్షస స్ర్తిలు. రౌద్రాకారంతో విజృంభించిన ఒక కోతి ప్రమదావనాన్నంతా నిర్మూలించిందని, సీతాదేవి ఉన్న ప్రదేశాన్ని మాత్రం తాకలేదని ఫిర్యాదు చేశారు వాళ్లు. సీతాదేవికి రక్షణగా వుండాలనే ఉద్దేశంతోనే చెట్లన్నీ తుంచినా, ఆమె ఉన్న అశోక వృక్షాన్ని మాత్రం ఏమీ చేయలేదనీ, సీతా సౌఖ్యం కొరకే దాన్ని పాడుచేయలేదని చెప్పారు వాళ్లు. కోపంతో ఊగిపోయాడు రావణుడు. గిరగిరా తిరిగే గుడ్లున్న ఆయన కళ్లనుండి బొటబొటా రాలిన నీళ్లు, దీపం నుండి మండుతూ మీదపడే చమురు బొట్లలా కనిపించాయి. మహాగర్వంతో కన్ను మిన్ను కానని- తనతో సమానమైన కింకరులనే వాళ్లను వెంటనే వెళ్లి ఆ కోతిని పట్టుకురమ్మని పంపుతాడు రావణుడు. రకరకాల ఆయుధాలు ధరించిన ఎనభై వేలమంది కింకరులు ఒక్క మూకగా హనుమంతుడి మీదకు యుద్ధానికి వచ్చారు. దేహాన్ని పెంచిన హనుమంతుడు లంకంతా ప్రతిధ్వనించే విధంగా సింహనాదం చేసి వారి మీదకు దాడికి దిగాడు. వారందరినీ చంపాడు. వారి చావు వార్త విన్న రావణుడు అజేయ బలమున్న ప్రహస్తుడి కొడుకు జంబుమాలిని హనుమంతుడి మీదకి యుద్ధానికి పంపాడు.
ఈలోపు విజయగర్వంతో ఉన్న హనుమంతుడు సమీపంలోనే వున్న లంకాధిదేవత గుడి శిఖరాన్ని ఎక్కి దానిని ధ్వంసం చేసే పనిలో ఉండిపోతాడు. ఆయన సింహనాదాన్ని విన్న గుడి కాపలాదారులు (చైత్యపాలకులు) హనుమంతుడి మీదకి దూకారు. గుడి ధ్వజస్థంభాన్ని పీకి దాంతో గుడిని ధ్వంసం చేసి రాక్షసులందరినీ చంపాడు. అక్కడే ఒక హెచ్చరిక చేస్తాడు. అదీ యుద్ధ తంత్రంలో భాగమే! ‘ఓ లంకా వాసురాలా! వినండి.. నాలాంటి (అంత బలం కల) వేల, లక్షల కోట్ల వానరులు మీ మీదికి యుద్ధానికి రాబోతున్నారు. వీళ్లందరికీ అమేయ బలుడు సుగ్రీవుడు సైన్యాధిపతిగా వుంటాడు. సీతను రావణుడు ఎత్తుకువచ్చి ఇక్కడ బంధించి నిష్కారణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నాడు. వాడితోపాటు మీరందరు విరోధం తెచ్చుకున్నారు. రావణుడికి, లంకకూ ఇక రుణానుబంధం తీరినట్లే!’ అని అందరూ వినేట్టు చెప్తాడు. దీంతో అంతవరకూ సీతను లంకలో ఉంచిన వార్త- అంతఃపురానికి వచ్చేవారికి తప్ప తెలియని ఇతరులకు కూడా తెలిసి- ఆ రహస్యం బయటపడింది.
ఆ తరువాత వెంట వెంట రావణుడు పంపిన జంబుమాలిని, మంత్రి (ఏడుగురు) పుత్రులందరినీ, విరూపాక్షుడు, దుర్ధరుడు, యూపాక్షుడు, బాసకర్ణుడు, ప్రఘసుడు అనే ఐదుగురు సేనా నాయకులను, రావణుడి కొడుకు అక్షకుమారుడినీ యుద్ధంలో చంపుతాడు. హతాశుడైన రావణుడు తన మరో కొడుకు ఇంత్రజిత్తును హనుమంతుడిపైకి యుద్ధానికి పొమ్మంటాడు. న్యాయమార్గంలో అస్త్రాలతో హనుమంతుడిని చంపడం సాధ్యపడకపోతే మాయ చేసైనా సరే చంపమని అతడికి చెప్పాడు. యుద్ధానికి పోయిన ఇంద్రజిత్ ఎంతకూ హనుమంతుడిని గెలవకపోవడంతో అరుదుగా వాడాల్సిన ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించి హనుమను బంధించాడు. కించిత్తు దైవ శాపం ఉండడం వల్ల తాత్కాలికంగా బంధించబడిన హనుమ, ఆ అవకాశాన్ని రావణుడి దగ్గరకు పోవడానికి ఉపయోగించుకుంటాడు. కొలువుదీరిన రావణుడికి బుద్ధిచెప్పి అతడి కోపానికి గురవుతాడు. దూతను చంపడం భావ్యం కాదన్న తన తమ్ముడు విభీషణుడి సలహా మేరకు హనుమంతుడి తోకను కాల్చమని ఆజ్ఞాపించాడు రావణుడు. కాలిన తోకతోనే హనుమను రాక్షసులు లంకంతా తిప్పారు. ఆ విధంగా లంకా నగర రహస్యమంతా హనుమకు తెలిసిపోయింది.
ఆ తరువాత తన కట్లన్నీ వూడదీసుకుని ఆంజనేయుడు లంకా దహనం చేస్తాడు. రాక్షస నాయకుల ఇళ్లన్నింటికీ నిప్పు పెడతాడు. అలా అశోక వనాన్ని పాడుచేసి, రాక్షసులను చంపి, మేడలు, మిద్దెలను నేలమట్టం చేసి లంకాదహనం చేసి సీతాదేవిని మరోమారు దర్శించుకుని, సముద్రాన్ని లంఘించి రాముడికి సీతా వృత్తాంతం చెప్తాడు. ఇలా రామాయణంలో హనుమదే అసలు సిసలైన ‘సర్జికల్ దాడి’!

-వనం జ్వాలా నరసింహారావు