మెయన్ ఫీచర్

నిన్న సంఘీభావం.. నేడు రాజకీయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనవాళ్లుఠ్ఠి వెధవాయిలోయ్’ అని ‘కన్యాశుల్కం’ లో గిరీశం కామెంట్ చేస్తే- ఏమిటో అనుకున్నాం గానీ, ఇప్పుడు గిరీశం ఉంటే అంతకుమించిన పదప్రయోగమే చేసేవాడేమో? అవును మరి.. ‘మొగుడు ఏదో అంటే ముష్టికి వచ్చిన వాడు అదే అన్నట్లు’ మన నేతాశ్రీల నోటి నుంచి అలాంటి మాటలు వస్తుంటే గిరీశం గుర్తుకురావడం తప్పడం లేదు మరి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పీఠం వేసిన ఉగ్రవాదులపై మెరుపుదాడి చేసి దెబ్బకు దెబ్బతీసిన భారత్ ప్రతీకారాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటే, మన నేతలు మాత్రం అందులో కూడా రంధ్రానే్వషణ చేస్తుండటం, దేశంలో పుట్టిన వారికెవరికైనా ఒళ్లు కంపరం పుట్టించే వ్యవహారమే.
ఓ వైపు తమ దేశంపై భారత్ దండెత్తిందని పాక్ ఉన్నతాధికారి చెప్పారు. పాక్ పాలకులు కూడా అష్టవంకరల వ్యాఖ్యానాలు చేసి, చివరాఖరుకు ‘అవును.. భారత్ దాడి చేసింది, మేం కూడా దెబ్బకుదెబ్బకు తీస్తామ’ని ప్రకటిస్తే.. మన రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, కేజ్రీవాల్, సంజయ్ నిరుపమ్ వంటి నేతాశ్రీలు మాత్రం నిజంగా యుద్ధం చేసి ఉంటే ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేశారు. ఇంకో ‘ఆర్థిక ఆణిముత్యం’ చిదంబరం ‘మేం కూడా ఇలాంటి దాడిని మా హయాంలో చేశాం. కాకపోతే మేం ప్రచారం చేసుకోలేద’ని సెలవిచ్చారు. యుపిఏ హయాంలో ఇలాంటి దాడి ఎప్పుడూ చేయలేదని అప్పట్లో మిలటరీకి సారథ్యం వహించిన ఒక అధికారి చెప్పి చిదంబరం గాలి తీశారు. దీన్నిబట్టి గిరీశం చెప్పినట్లు మనలో ఇంకా వెధవాయత్వం పోలేదని అర్థమవడం లేదూ..?
పాక్‌పై పరిమిత యుద్ధానికి జెండా ఊపిన మోదీని- సైనికుల రక్తంతో రాజకీయం చేస్తున్నారన్న రాహుల్ మానసిక పరిపక్వతపై ఎవరికైనా సందేహాలు రావడంలో వింతేమీ లేదు. ముందు మోదీని పొగిడి, తర్వాత దాడికి ఆధారాలు చూపాలని సైనికుల త్యాగాన్ని చులకనగా మాట్లాడిన కేజ్రీవాల్, ఆనక తప్పు తెలుసుకుని దిద్దుబాటుకు దిగారు. కేజ్రీకి అన్నయ్య లాంటి సినీనటుడు ఓంపురి కూడా ముందు నోరుపారేసుకుని, తర్వాత తనను క్షమించడం కాదు, శిక్షించమని వేడుకునే వరకూ వెళ్లడం మంచిదే. ఓంపురి ఆత్మావలోకనం మన నేతాశ్రీలకు ఆదర్శం కావాలి. కుక్కతోక నేరుగా ఉండాలని కోరుకోవడం ఎంత పిచ్చితనమో ఈ కోరిక కూడా అంతేనేమో?! ఎప్పుడూ వక్ర ఆలోచనలు, విచిత్ర వ్యాఖ్యలతో జీవితం సాగించే రామ్‌గోపాల్‌వర్మ లాంటి వ్యక్తులు కూడా సర్జికల్ దాడులపై సక్రమంగా ఆలోచిస్తే, ఆ పాటి ఆలోచన మన నేతలకు లేకపోవడమే బాధాకరం.
ఇంతకూ వీరి బాధేమిటి? పాక్‌పై దాడి చేస్తే వీరికొచ్చిన నష్టమేమిటి? పాక్‌పై మన సైనికులు దాడి చేసినందుకా? కానే కాదు. వారికి మనసులో ఆనందమే. దాన్ని అంగీకరించేందుకు మనసొప్పదు. ఎందుకంటే దాడికి పురమాయించినవాడు ఎగస్పార్టీ ప్రధాని మోదీ కాబట్టి! మోదీ ఏం చేసినా పబ్లిసిటీ యాంగిలే ఉంటుంది కాబట్టి, సైనిక చర్య కూడా అదే బాపతన్నది వారి అసలు అనుమానం. అందుకే ముందు అందరితోపాటు గళం కలిపి భళీ అన్నారు. లేకపోతే దేశం వెలివేస్తుంది కాబట్టి! ఆ తర్వాత వేడి తగ్గాక అసలు రంగు బయటపెట్టుకోవడం మొదలెట్టారు. నిజంగా దాడి జరిగితే దాని ఆధారాలు చూపించాలని, లేకపోతే అది బిజెపి యుపి ఎన్నికల డ్రామాగానే అనుమానించాల్సి వస్తుందని చివరకు జెసి దివాకర్‌రెడ్డి లాంటి రాజకీయ మేధావులూ సెలవిచ్చారు. ఓవైపు తమ దేశంపై భారత్ దాడి చేసిందని అక్కడి సైన్యాధికారి చెప్పిన మాటలు ‘స్టింగ్ ఆపరేషన్’ ద్వారా దేశమంతా చూస్తే, వీళ్లకు మాత్రం వీడియో క్లిప్పింగులు కావాలట! రావణాసురుడికి అరాచకాలు తగదని చెప్పి, రాముడిని మెచ్చుకున్న విభీషణుడి చరిత్ర చదివాం. జయచంద్రుడనే రాజు విదేశీ శక్తులకు సాయం చేసిన చరిత్రనూ చదువుకున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. అంతే తేడా!!
ఇంతకూ వీరి అనుమానం ఏమిటంటే- సైనిక దాడిని రానున్న యుపి ఎన్నికల్లో ప్రచారాంశం చేసుకుని, బిజెపి ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనని! అందుకే మాయావతి, రాహుల్, కేజ్రీవాల్, సంజయ్ నిరుపమ్, దిగ్విజయ్ సింగ్ కట్టకట్టుకుని యాగీ చేస్తున్నట్లు వారి గోస స్పష్టం చేస్తోంది. అందులో సైనికుల ఘనతే తప్ప, మోదీ గొప్పతనమేమీ లేదని ఆ క్రెడిట్‌ను బిజెపి ఖాతాలో కలవకుండా నానా తి ప్పలు పడుతున్నారు. నిజానికి బిజెపి ప్రత్యేకించి ఇపుడు ప్రచారం చేసుకోవలసిన పనిలేదు. దేశంలో ఆబాలగోపాలం పాక్ మీద దాడి చేయగలిగే దమ్ము, ధైర్యం ఒక్క మోదీకే ఉందన్న నగ్నసత్యాన్ని నమ్మింది. మోదీ ఉత్తరకుమారుడు కాదని తెలుసుకుంది. అందుకు యుపి ప్రజలు కూడా మినహాయింపు కాదు.
***
దేశవ్యాప్తంగా సంచలనం ‘సృష్టించబడిన’ హచ్‌సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంపై వేసిన కమిషన్ నివేదిక కుహనా లౌకికవాదులకు చెంపపెట్టు. బీసీ వర్గానికి చెందిన రోహిత్‌ను దళితుడిగా మార్చి, వర్శిటీ కేంద్రంగా కుల రాజకీయం చేసిన రాజకీయ మేధావుల నోళ్లు ఇప్పుడు మూతపడక తప్పదు. ఈ దేశ ప్రజలు కడుతున్న పన్నులతో స్కాలర్‌షిప్పులు పొం దుతూ, ఈ నేల గాలి పీ లుస్తూ.. దేశాన్ని కబళించాలనుకున్న శక్తులకు జోహారులర్పించి, అలాంటి అమరుల ఆశయాలు నెరవేరుస్తామం టూ ప్రతిన బూని, వారికి నివాళులర్పించిన దేశభక్త యువకుల్లో ఇప్పటికయినా మార్పు వస్తే మంచిదే. అలాకాకుండా నివేదికపైనా రంధ్వ్రానేషణ చేసి, మళ్లీ దానినో సమస్యగా మారిస్తే అంతకుమించిన అమాయకత్వం మరొకటుండదు.
అసలు రూపన్వాల్ ఏక సభ్య కమిషన్ ఇచ్చిన 41 పేజీల్లో ఏముందో ఓసారి చూద్దాం. ‘రోహిత్ తల్లి రాధిక రిజర్వేషన్ల లబ్థికోసమే తనని తాను దళిత్‌గా ప్రకటించుకున్నారు. రాధిక కన్నతలిదండ్రులెవరో తెలియకుండా ఆమెను పెంచిన తల్లి.. రాధిక ఎస్సీ అని చెప్పడం సరికాదు. ఆమె దళితురాలు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆమె వాంగ్మూలం ఆధారంగా రోహిత్‌కు కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. రోహిత్ మరణానికి వ్యక్తిగత అంశాలే కారణం. నిరాశానిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప వివక్ష అతని ఆత్మహత్యకు కారణం కాదు. కేవలం స్వయంకృతమే. ఆత్మహత్యకు వర్శిటీలో తన చుట్టూ జరిగిన విషయాలేవీ కారణం కాదని అతని లేఖ స్పష్టం చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ రోహిత్ ఆత్మహత్యకు కారణమయితే అదే విషయాన్ని అతను తన లేఖలో ప్రస్తావించి ఉండేవాడు. తన ఆత్మహత్యకు కారణం ఫలానా అని అతను ఎక్కడా పేర్కొనకపోగా, తాను బాల్యం నుంచే ఒంటరితనాన్ని అనుభవించానని, మెచ్చుకోలుకి కూడా నోచుకోలేదని స్వయంగా రాసుకున్నాడని రిపోర్టు తెలియచేసింది. దీన్నిబట్టి అతను కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అర్థమవుతోంది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ వారి బాధ్యతలు నిర్వర్తించారు తప్ప వర్శిటీ అధికారులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు’ ఇదీ అలహాబాద్ మాజీ న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక సారాంశం.
దీనికి రాహుల్‌బాబా, ఆయనను వర్శిటీకి తీసుకువచ్చిన మేధావులు ఏమంటారో చూడాలి. బంగారు భవిష్యత్తు ఉన్న రోహిత్ ఆత్మహత్య బాధాకరం. దానిని మానవత్వం ఉన్న వారెవరూ సమర్థించరు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై స్వదస్తూరితో రాసుకున్న లేఖ పరిశీలిస్తే రోహిత్ సున్నితమనస్కుడని అర్థమవుతూనే ఉంది. సహజంగా ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తులు తన పరిస్థితికి ఫలానా వారు కారణమని పేర్కొంటారు. సమైక్యాంధ్ర-తెలంగాణ ఉద్యమాలు ఉధృతంగా నడిచిన సమయంలో కొందరు తన చావుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, సోనియాగాంధీ కారణమని, మరికొందరు కేసీఆర్ కారణమని లేఖలు రాసి చనిపోయారు. మరి రోహిత్ తన లేఖలో ఆ విధంగా ఏ ఒక్కరి పేర్లనూ ఉటంకించకపోతే ఎవరిని బాధ్యులను చేయాలన్నది కొమ్ములు తిరిగిన ఏ న్యాయ నిపుణుడూ చెప్పలేరు. అంత ఊహాశక్తి ఇంకా మన న్యాయవాదుల్లో అబ్బలేదు. ఎవరి ప్రోద్బలం లేకుండా, తన చావుకు ఎవరూ కారణం కాదని మృతుడు స్పష్టంగా రాసుకుంటే.. దానికి కులం, మతం, వివక్ష వంటి పదాలు అద్ది శవరాజకీయాలు చేయటం వల్ల రోహిత్ ఆత్మ శాంతిస్తుందా? ఇలాంటి పరిస్థితి మరొక విద్యార్థికి రాకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించి ఒక చావుతో మరికొందరి బతుకులు వెలిగించుకోవడం అనైతికం కాదా? పోయినోళ్లంతా మంచోళ్లు. ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపిగురుతులు! ఆ భావనను అలాగే కొనసాగిస్తే మంచిది!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144