మెయన్ ఫీచర్

వెలగపూడి నుంచి వెలుగుదారులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వెలగపూడి వద్ద ఆ రంభం కావటం అందరికీ కొత్త సంకల్పాలు కలగటానికి దారులు వేస్తున్నట్లు కన్పిస్తున్నది. సచివాలయంలో ఉద్యోగులు పనిచేయటం ఈనెల 3న మొదలుకాగా, అంతకు ఒక రోజు ముందు 2వ తేదీన ఆ ప్రదేశాన్ని చూసి, తర్వాత విజయవాడలో కొందరితో మాట్లాడి, సచివాలయం తెరుచుకున్న మరునాడు మాధ్యమాల్లో వినిపించిన మాటలను బట్టి ఈ రచయితకు కలిగిన అభిప్రాయమిది. 2వ తేదీ ఆదివారం అయినందున సచివాలయంలో ఉద్యోగులు లేరు కాని, రకరకాల నిర్మాణ కార్యక్రమాలలో వేలాదిమంది కన్పించారు. అడుగడుగునా బందోబస్తు మధ్య సాగుతున్నాయి పనులు. మొత్తం ఆరు బ్లాకులలో ఒకటి శాసనసభ, శాసనమండలి కోసం ప్రత్యేకించారు. సభా సమావేశాలకు డిసెంబర్ వరకు వ్యవధి ఉన్నందున ఆ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. తక్కిన అయిదింటిలో ముఖ్యమంత్రి బ్లాక్ సహా అన్నీ ఇంకా తుదిదశ పనులు సాగుతూ కన్పించాయి. ఇక్కడ ఉద్యోగులు ఇప్పటికే తమ విధులు ఆరంభించవలసి ఉన్నప్పటికీ, దసరా తర్వాతగాని అన్నీ సిద్ధం కాకపోవచ్చునని తోచింది. వెలగపూడి నుంచి 4-5 తేదీలలో వెలువడిన వార్తలు, అధికారులు అనధికారికంగా చెప్పిన మాటలు కూడా అదే సూచించాయి. అయితే అప్పటివరకు పది రోజుల కాలాన్ని (3 నుంచి 13వ తేదీ వరకు) వృథా అవుతున్నట్లుగా భావించలేము. సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఆలోగా చేసుకోవలసిన సన్నాహాలు కొన్నున్నాయి. భవనాలు పూర్తిగా సిద్ధం కావటం, హైదరాబాద్ నుంచి తరలిస్తున్న ఫైళ్ళు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి ఏర్పాట్లు, ఉద్యోగులకు చుట్టుపక్కల ప్రాంతాలలో బసలు, నివాసాలు, రవాణా సదుపాయాలు వీటన్నింటి మధ్య అందరూ కొత్త చోట ‘పనిమూడ్’లోకి వెళ్లటం వంటి వాటికి ఈ మాత్రం సమయం అవసరమే. సచివాలయ వాతావరణం, పరిసరాలు కూడా వారి ‘మూడ్’కు దోహదం చేయగల విధంగానే ఉన్నాయి. మొత్తం 49 ఎకరాలలో భవనాలు నిర్మించేది 22.5 ఎకరాలు కాగా, తక్కిన 26.5 ఎకరాలు ఖాళీ స్థలమే. ప్రహరీకి బయట కూడా నాలుగు వైపులా ఎక్కడో దూరాన గల గ్రామాల వరకు అంతా ఆరుబయలే. మరో ఏడు మాసాలలో చలికాలం ముగిసి, వేసవి వచ్చేసరికి సచివాలయ ప్రాంగణంలో కొత్త మొక్కలు తగినంత ఎదిగి ఉంటాయి.
తాత్కాలిక సచివాలయమైన వెలగపూడి నుంచి శాశ్వత రాజధాని కానున్న ‘అమరావతి’ ప్రాంతం సుమారు మూడు మైళ్ల దూరన ఉంది. రాజధాని ఏర్పాటుకు అది శంకుస్థాపన జరిగిన స్థలం. ఆ నిర్మాణం పూర్తయ్యే సమయానికి వెలగపూడి అందులో భాగమైపోతుంది. అందుకు తగినంత సమయం తీసుకోనుంది. ప్రస్తుతం అక్కడ శంకస్థాపన గుర్తులు మినహా మరేమీ లేదు. అమరావతికి ఇంకా డిజైన్లు తయారుకావలసి ఉంది. వాటిని ఆమోదించిన తర్వాత కాంట్రాక్టర్ల నియామకం, నిధుల సమీకరణ, కొత్త రాజధాని కోసం సకల భవనాల నిర్మాణం, సదుపాయాలను ఏర్పాట్లు పూర్తయేసరికి ఎంతకాలమయేదీ చెప్పగల పరిస్థితి ఇపుడు లేదు. అది జరిగి అక్కడకు సచివాలయం తరలింపు మొదలయేసరికి ప్రస్తుత సిబ్బందిలో తగినంతమంది ఉద్యోగ విరమణ చేస్తారు. ఈలోగా అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి సందర్శనలు సాగుతుంటాయి.
అమరావతికి వెళ్లే వారికి దారిమధ్యలో ఆసక్తికరమైన చారిత్రక ప్రదేశం ఒకటి ఎదురవుతుంది. వెలగపూడి నుంచి బయలుదేరి, అమరావతి సీడ్ క్యాపిటల్‌కు ‘స్టార్టప్’ ప్రదేశం అంటున్న ఉద్దండరాయునిపాలెంకు వెళ్ళే మధ్యలో మల్కపురం అనే చిన్న పల్లె వస్తుంది. అక్కడ కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, ఆయన కుమార్తె అయిన యువరాణి రుద్రమదేవి క్రీ.శ.1261లో వేయించిన శిలాశాసనం ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఆ సంవత్సరం మార్చి 25న రుద్రమ తన జన్మదినం జరుపుతున్న సందర్భంగా తమ కులగురువైన విశే్వశ్వర శివాచార్యునికి రెండు గ్రామాలు దానం చేశారు. అక్కడే నిర్మించిన శివాలయం, మఠం, ఆస్పత్రి వగైరాల ఖర్చుల కోసం మరో ఆరు గ్రామాలిచ్చారు. ఆ గ్రామాలన్నీ ఇపుడు వెలగపూడి-అమరావతి పరిధిలో భాగం కానున్నాయి. అలనాడు గణపతిదేవుడు, రుద్రమదేవి కలిసి వేయించిన శాసనంతో- ఇప్పుడు వెలగపూడి ఉద్యోగులకు ఓ చారిత్రక ప్రదేశమై.. తాము ఇంతకాలం పనిచేసిన తెలంగాణతో గల అనుబంధాన్ని గుర్తుచేస్తుంటుంది.
తాత్కాలిక సచివాలయం ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత సగకాలం గడిచి (వచ్చే ఎన్నికలలోగా)న వెనుక- ఇప్పటికైనా ఏర్పటవుతుండటమన్నది అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. ఇంత కాలం ఎందుకు తీసుకున్నారు? ఇప్పటికీ తాత్కాలికమేనా? అనే ప్రశ్నలు వినవస్తూనే ఉన్నాయి. కాని తక్కువగా వెలగపూడి పనులు మొదలుకావటానికి ముందుకాలంలో, ముఖ్యంగా 2014 చివరి మాసాల నుంచి, తమ ప్రభుత్వ పాలన ఇంకా హైదరాబాద్‌లోనే కొనసాగటంపై విమర్శలు తీవ్రంగా ఉండేవి. ‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లు గనుక అంతవరకు ఆ నగరాన్ని ఉపయోగించుకోవలసిందే’ అనే వర్గం ఒకటి ఉన్నత తరగతులలో కన్పించేది. వారిలో నాయకులు, ధనికులు, అధికారులు, హైదరాబాద్‌కు అలవాటుపడిన ఉద్యోగులు ఉండేవారు. ఈ ఆలోచనకు మినహాయింపు ఈ వర్గాలలో కొద్దిమందే. ఉద్యోగులను పక్కన ఉంచితే తక్కినవారికి హైదరాబాద్ అవసరం కావటం ఒకటైతే, కొందరికి హైదరాబాద్‌లో అట్లా కొనసాగటం రాష్ట్ర విభజన పట్ల ప్రతీకారం తీర్చుకునే మానసికావసరంగా కొంత ఉండేది.
కాని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాధారణ ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉండేవి. జరిగిందేదో జరిగిపోయింది.. మన పరిపాలన మన రాష్ట్రం నుంచి జరుపుకోవాలిగాని ఇంకా హైదరాబాద్‌లో ఏమిటి? అందువల్ల ఇక్కడి పాలన దెబ్బతినటం లేదా? అక్కడ ఎవరి లాభం కోసమని ఇంకా ఉంటున్నారు.. ఈ తరహా మాటలు వారినుంచి వినిపించేవి. రోజులు గడిచి, సమస్యలు పెరుగుతూ, పనులు జరగటం లేదని ప్రజలకు అనిపించినకొద్దీ విమర్శలు తీవ్రమయాయి. ఉన్నత వర్గాల తీరుకు, ప్రజల ఆలోచనలకు మధ్య అగాథం పెరగటం స్పష్టంగా కనిపించింది. ఇది అర్థమైనందువల్లనో మరెందుకోగాని, శాశ్వత రాజధాని నిర్మాణం మాట అట్లుంచి, ముందుగా తాత్కాలిక సచివాలయమైనా సరే తయారుచేసుకుని పరిపాలనను స్వరాష్ట్రానికి మార్చుకోవాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ పని జరగక అమరావతి కోసమే వేచి ఉండినట్లయితే 2019 ఎన్నికల వరకు ఏమీ జరిగేది కాదు. లేదా పనులు అప్పుడప్పుడే మొదలై ఉండేవి. అందువల్ల పరిపాలన సవ్యంగా ఉండకపోవటం, ప్రజలకు పనులు జరగకపోవటం ఒకటైతే, పాలక పక్షానికి రాజకీయ వ్యతిరేకత కూడా ప్రజల నుంచి ఎదురయేది.
సచివాలయం, ఇతర కార్యాలయాలను ఇపుడు తరలించటంలో బహుశా మరొక ప్రభావం కూడా ఉండవచ్చు. హైదరాబాద్‌లో, తక్కిన తెలంగాణలో గల సీమాంధ్రులకు స్థానికుల నుంచి గాని, తెలంగాణ ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి ఇబ్బందులు ఎదురుకానున్నా, ఉద్యోగుల విషయంలో కొంత భిన్నస్థితి కన్పించింది. అందుకు కారణం ఉద్యోగుల విభజనలో ఆలస్యాలు, పంపిణీలో ఎక్కడివారెటు? అన్న వివాదాలు, వాటితో ముడిబడిన ప్రమోషన్లు, కొత్త ఖాళీలు, స్థానికతల సమస్యలు- ఇవి సహజంగానే ఒక మేరకు వైమనస్యాలకు దారితీసాయి. దానితో, కొంత ఇబ్బంది ఎదురైనాసరే స్వరాష్ట్రానికి వెళ్లిపోవాలనే అభిప్రాయానికి వచ్చారు వారు. ఇది ప్రభుత్వంపైనా ప్రభావాన్ని చూపింది. అసెంబ్లీ స్పీకర్ కె.శివప్రసాదరావు వంటివారైతే, సమావేశాలను గుంటూరు ప్రాంతానికి మార్చే ప్రయత్నం రెండు సెషన్లకు ముందునుంచే చేయటం తెలిసిన విషయమే.
ఈనెల 3న తాత్కాలిక సచివాలయం ఆరంభమైనపుడు స్పీకర్ ‘మన గడ్డ నుంచి మన పాలన’ అనగా, ఆర్థిక మంత్రి యమనల రామకృష్ణుడు పరిపాలన బాగా జరిగేందుకు ప్రజల మధ్యన ఉండాలని ప్రకటించారు. మాటలు వేరైనా ఉద్యోగులు కూడా అవే భావనలను ధ్వనింపచేశారు. మొదట కొంత ఇబ్బంది సహజమని, దానితో సర్దుకుపోతామని, రాష్ట్భ్రావృద్ధికోసం తమ వంతు సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తామని, కష్టపడి పనిచేస్తామని అన్నారు వారు. ఇదంతా ఆరంభ స్ఫూర్తిగా మిగలక అందరూ అదే విధంగా పనిచేసినట్లయితే పరిపాలన దారిన పడేందుకు ఎక్కువ సమయం అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌కు సహజ వనరులు గణనీయంగా ఉన్న మాట నిజమే అయినా, వాటిని ఉపయోగించుకుని అభివృద్ధిని సాధించేందుకు అందరూ భాగస్వాములై చేయవలసిన కృషి తక్కువ కాదు. ఆ కృషి తగినంత కాలం అదేవిధంగా కొనసాగవలసి ఉంటుంది కూడా.
పైన పేర్కొన్నట్లు సాధారణ ప్రజలకు వెలగపూడి ఆవిష్కారం మరీ ఎక్కువగా సంతోషం కలిగిస్తున్న విషయం. ఆలస్యాలపై పాత విమర్శలు పాతబడిపోతూ, ఇక నుంచి పరిపాలన తమ మధ్య, తమకు అందుబాటులోకి రానున్నదనే సంతృప్తి వారిలో కన్పించింది. అనగా వెనుకటి విమర్శలు మరపున పడిపోతాయన్నమాట. అయితే అందుకు ఒక షరతున్నట్లు కూడా కొందరి మాటలను బట్టి తోచింది. పరిపాలన తమ మధ్యకు రావటమే కాదు, అది తాము ఆశిస్తున్న విధంగా తమ కోసం సాగాలన్నది వారి కోరిక. పరిపాలన గత రెండేళ్లుగా నడిచిన తీరుతో సంతృప్తి చెందినవారు పరిమితంగానే ఉన్నట్లు కన్పించింది. ఆ కోణం నుంచి చూసినపుడు, సచివాలయం తరలింపు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూనే మరొక ప్రశ్నను ముందుకు తెస్తున్నదనాలి.

టంకశాల అశోక్ సెల్ : 98481 91767