మెయిన్ ఫీచర్

‘నవరత్నాల’ ధగధగలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడారంగంలో అద్భుతాలను నమోదు చేస్తున్న భారతీయ మహిళలు అంతర్జాతీయ వేదికలపైనా మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. విభిన్న క్రీడల్లో వారు సాధిస్తున్న పతకాలే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమైన బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్, పర్వతారోహణం వంటి సాహస క్రీడల్లోనూ యువతులు నేడు సత్తా చాటుకుంటున్నారు. దృఢ సంకల్పం, నిరంతర సాధనతో ‘లక్ష్యం’ వైపు గురి పెడుతున్న మహిళలు అన్ని రకాల ఆటల్లోనూ మేటి అనిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ క్రీడాచరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ తొలిసారిగా తొమ్మిది మంది క్రీడాకారిణుల పేర్లను ‘పద్మ’ అవార్డులకు ప్రతిపాదించింది. ‘పద్మ’ పురస్కారాలకు కేవలం క్రీడాకారిణుల పేర్లను మాత్రమే ఇలా సిఫారసు చేయడం ఓ అరుదైన రికార్డు.
మేరీ ఉంటే
పతకాల పంట..
మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’కు ప్రఖ్యాత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ పేరును ప్రతిపాదించారు. 2006లో ‘పద్మశ్రీ’, 2013లో ‘పద్మభూషణ్’ పురస్కారాలను అందుకొన్న మేరీ కోమ్ ఆసియన్ గేమ్స్ (2014), కామన్‌వెల్త్ గేమ్స్ (2018)లో బంగారు పతకాలను అందుకొన్న తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ క్రీడలో ఎంతోమంది యువతులు రాణించేలా మేరీ కోమ్ సహాయ సహకారాలను అందజేస్తోంది.
బాడ్మింటన్ స్టార్ సింధు
2015లో ‘పద్మశ్రీ’ బిరుదు అందుకొన్న బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పేరును ఈసారి ‘పద్మ భూషణ్’ పురస్కారానికి సిఫారసు చేశారు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న ఈ తెలుగింటి క్రీడాకారిణి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పలు పతకాలను సాధించి, ఇపుడు ప్రపంచంలోనే మేటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది.

‘కుస్తీ’మే సవాల్!
హర్యానాకు చెందిన ప్రఖ్యాత కుస్తీ క్రీడాకారిణి వినేశ్ పొగొట్ కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని, ఆసియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకాన్ని, జకార్తా ఆసియన్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకొంది. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న వినేశ్ పొగొట్ పేరును కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది.
క్రికెట్‌లో మేటి.. కౌర్
2017లో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 171 పరుగులతో అరుదైన రికార్డు సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేశారు. క్రికెట్‌లో రాణించాలని చిన్నప్పటి నుంచి పట్టుదలతో సాధన చేస్తున్న కౌర్ ఇరవై ఏళ్ల ప్రాయంలో పాకిస్తాన్ జట్టుపై ఆడి సత్తా చాటింది. విదేశీ క్రీడాకారులు సైతం పాల్గొనే ‘ట్వంటీ 20’ క్రికెట్ జట్టుకు 2016లో ఎంపికైన ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది.
హాకీలో రాణి..
హర్యానాకు చెందిన రాణీ రాంపాల్ ఆరేళ్ల వయసులోనే హాకీ జట్టులో స్థానం సంపాదించింది. భారతీయ సీనియర్ మహిళల హాకీ జట్టుకు 14 ఏళ్ల ప్రాయంలో ఎంపికై అందరినీ ఆశ్చర్యపరచింది. మహిళల హాకీ జట్టులో పిన్న వయస్కురాలైన ఆమె ఎన్నో పోటీల్లో నైపుణ్యం చాటుకొంది. 2016 ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ జట్టు గెలుపు సాధించడంలో కీలకపాత్ర వహించింది. హాకీ ఆడేందుకు యువతులు ఏ మాత్రం సంకోచించాల్సిన పనిలేదని చెబుతున్న రాణీ రాంపాల్ పేరును ‘పద్మశ్రీ’ అవార్డుకు ప్రతిపాదించారు.

మనికా బాత్రా
టేబుల్ టెన్నిస్‌కు సంబంధించి మన దేశంలో అగ్రస్థానంలోను, ప్రపంచ స్థాయిలో 47వ స్థానంలోను నిలిచిన మనికా బాత్రా కామన్‌వెల్త్ క్రీడల్లో అనూహ్యంగా బంగారు పతకాన్ని సాధించింది. ఇరవై నాలుగేళ్ల ఈ సంచలన క్రీడాకారిణి ‘అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య’ నుంచి ప్రతిష్టాత్మక అవార్డును సాధించిన ఏకైక భారతీయ యువతిగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ప్రదానం చేసే ‘పద్మశ్రీ’ అవార్డులకు మనికా పేరును ప్రతిపాదించారు.
‘లక్ష్యం’పైనే గురి!
తిరుగులేని ‘షూటర్’గా పేరు తెచ్చుకొన్న సుమ షిరూర్ పేరును ‘పద్మశ్రీ’ అవార్డుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. 1990 మాంచెస్టర్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని, 2002 ఆసియన్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించిన సుమ క్రీడారంగానికి ఇదివరకే స్వస్తి చెప్పినప్పటికీ ఆమె ప్రతిభను ఇప్పుడైనా గుర్తించాలని ‘పద్మ’ పురస్కారానికి నామినేట్ చేశారు.
కవలల సంచలనం..
సెలవు రోజుల్లో సరదాగా కాలక్షేపం చేసేందుకు పర్వతారోహణపై మక్కువ చూపిన కవలలైన అక్కచెల్లెళ్లు తషి మాలిక్, నింగ్షి మాలిక్‌లు ప్రస్తుతం ‘పద్మ’ అవార్డుల రేసులో నిలిచారు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన తొలి కవలలుగా ఈ ఇద్దరూ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ‘ఏడు శిఖరాగ్రాల’ను ఎక్కిన అక్కచెల్లెళ్లుగాను వీరు ప్రఖ్యాతి పొందారు. ప్రపంచంలో ‘గ్రాండ్ స్లామ్’ ఘనతను సాధించిన తొలి కవలలుగా, పిన్న వయస్కులైన యువతులుగాను నిలిచారు.
కాగా, ‘పద్మ’ పురస్కారాల చరిత్రలో తొలిసారిగా తొమ్మిది మంది మహిళల పేర్ల (‘నవరత్నాల’)ను మాత్రమే కేంద్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ సిఫారసు చేయడంతో- వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు రాష్టప్రతి చేతుల మీదుగా వీరిలో ఎంతమందికి బిరుదులు దక్కుతాయన్నది వేచి చూడాల్సిందే.

-శ్రీ