మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్కోటకుడికి గురుత్వాన్నీ, ప్రప్రథమ స్థానాన్నీ కల్పించి, ‘‘నాగుడు’’అని స్తుతిస్తున్నాడు. అంతేగాక, ‘కర్కోటకస్య నాగస్య- దమయంత్యా నలస్య చ’’అనే శ్లోకంలో దమయంతికి నలుడికన్నా మొదటి పీట వేస్తున్నాడు. ఋతుపర్ణుడిది కేవల సహాయక పాత్ర కనుక, అతడికి చివరి పీట ఇస్తున్నాడు.
నలుడికి అక్షహృదయాన్ని అందింప జేయటంతో కర్కోటకుడి పని పూర్తయిపోయిందా? కాలేదు.
ఎందుకంటే,
విద్యాద్వయసంయోగంవల్ల, కర్కోటక సన్నిధివల్ల, నలుడిలోగల రాగద్వేషాగ్ని అనే ‘‘అనలం’’ చల్లారింది.
అనలానికి వ్యతిరేక పదం ‘‘నలం’’. ఇది వ్యాకరణ సిద్ధం కాకపోయినా, ఇదిగూడా నలశబ్దానికి ఒక రకమైన వ్యుత్పత్తే. కల్యావిష్టుడై ‘‘అనలుడు’’గా వున్న జీవి, ఇప్పుడు ‘‘నలుడు’’ (చల్లనివాడు) అయ్యాడు గానీ, జ్ఞాని కాలేదు, పరిపూర్ణుడు గూడా కాలేదు. శిష్యుడు పరిపూర్ణుడయ్యే దాకా గురువుగారి పని పరిపూర్ణం కాదు.
దాంపత్య తత్త్వం:
దమయంతీ సంయోగం లేనిదే నలుడికి గానీ, నల సంయోగం లేనిదే దమయంతికి గానీ, పరిపూర్ణత్వం అందనే అందదు.
దమయంతి అంటే, ఇంద్రియ నిగ్రహశక్తి అని పూర్వమే చెప్పుకొన్నాం. ఆత్మవిద్యా సాధనలో ఇంద్రియ జయం ఒక్కటే చాలదు. దానికి వివేక జ్ఞానం జతకావాలి.
ఆ వివేక జ్ఞానానికి సంకేతమే కర్కోటకుడిచేత సంస్కరింపబడిన నలుడు. అలాగే వివేకజ్ఞానం ఒక్కటే క్రియాకారి కాజాలదు. దానికి ఇంద్రియ నిగ్రహశక్తి జతకావాలి.
ఆ జత శాశ్వతంగా స్థిరపడ్డప్పుడే, అంటే, నలదమయంతుల పునస్సమాగమనం సుస్థిరంగా నిలబడినప్పుడే, ఇటు నలుడికిగానీ, అటు దమయంతికి గానీ, పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. పరిపూర్ణత్వమే బ్రహ్మత్వం. ‘‘పూర్ణమదః పుర్ణమిదం’’ (బ్రహ్మత్వస్థితిలో అదీ, ఇదీ, అన్నీ పరిపూర్ణాలే) అనికదా ఉపనిషద్బోధ! అందుకే వారి పునఃస్సమాగమనందాకా కర్కోటకుడి పాత్ర కొనసాగింది.
దమయంతీదేవి బాహుకుడ్ణి చూడకముందే అతడు నలుడని అనుమానించి, చూసినాక, ‘‘రూపం వేరుగావున్నాసరే, ఇతడు నలుడే’’అని గుర్తించడంలో ఎంత వివేకయుక్తంగా ప్రవర్తించిందో నలచరిత్రలోని ఘట్టాలు మనకు నిరూపిస్తాయి. కనుక, దమయంతికి వివేకలేశం సహజంగానే వుంది. అక్ష విద్యాశ్వవిద్యాద్వయ సంపన్నుడైన నలుడి సాంగత్యంతో అది ఆత్మానాత్మవివేకంగా పరిణమించవలసి వుంది.
ఇలాంటి యోగ్యత ఈ దంపతులకు వుందోలేదో పరిశీలించెందుకోసమే, దేవేంద్రుడు మానవకాంతావ్యామోహ వ్యాజంతో భూమికి దిగివచ్చాడు. యోగ్యత వున్నది కనుకనే వీరిద్దరిమధ్యా దౌత్యం నెరసిన హంసరూపియైన శివుడు, అజపావిద్యారూపిణియైన జగన్మాత, ఇద్దరూ కలిసి, తమ ఇద్దరి సంయోగాత్మకమైన బిల్వవృక్షం యొక్క గుణసంపదతో జన్మించిన కర్కోటకనాగుడ్డి గురువుగా పంపి, ఈ దంపతుల పునస్సమాగమానికీ, తద్ద్వారా వారిద్దరి పరిపూర్ణతాసిద్ధికీ బాటలుపరచారు.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి