మెయిన్ ఫీచర్

సాహితీ కల్పవల్లి.. దేవులపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు చెక్కలుగా ఉన్న తెలుగునాడు ఏకీకరణకు ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. రామాయణంలో పిడకల వేట లాగ కేంద్ర ప్రభుత్వం దృష్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంపై పడింది. ఆ విద్యాలయంలో బోధన భాష ఉరుదూ కావడం, అక్కడి పారిభాషిక పద రచనాశాఖ అద్వితీయంగా ఉండటం ఢిల్లీవారి నోట నీరూరేట్టు చేశాయి. ఫారశీ లిపిని దేవనాగర లిపిగా మార్చి, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా పరకాయం చేయడానికి పూనుకున్నారు. తెలుగునాట, ముఖ్యంగా తెలంగాణా ఆందోళన చెలరేగింది. భాషాప్రయుక్త రాష్ట్రాలతో మాతృభాషకు ఏమో ఒరుగుతుందని ఆశిస్తే, ఉన్న సంస్థే చేయిజారిపోతున్నదేమని, ప్రముఖ పౌరులతో ప్రతిఘటన సంఘం (సిటిజన్స్ కమిటీ) ఏర్పడింది. దాని సమావేశకర్తను అంతకుముందు చూడనివారు, తొలిసారిగా చూచినవారూ ముక్కుమీద వేలు పెట్టుకున్నారు; ఎవరు ఈ వామనుడు, ఏమిటి ఈ పైజమా- షేర్వాణీ వేషం ఆకాశం చూస్తూ ఐమూలగా అంగలువేసే ఈ నడకేమిటి-అని. కాని ఆయన ఆకారంలో వామనుడైనా తెలివితేటలలో, వ్యవస్థాపక పాటవంలో త్రివిక్రముడని తెలిసినవారు మాత్రం ఉద్యమం సఫలంకాక తప్పదని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం నిజమయింది.
ఔను మరి అంతకుముందు ఆరేళ్ళుగా హైదరాబాదు సారస్వత పరిషత్తు కార్యభారం వహించి, తెలంగాణలోను ఇతరత్రాను ఉన్న మారుమూల పల్లెలకూ కాళ్ళు అరిగేలాగ తిరిగి, సారస్వతోద్యమం వ్యాపింపజేసి, రాజధాని నగరం నట్టనడుమన దానికొక సువిశాలమైన స్థలం సంపాదించి, తలయెత్తి చూడదగిన, సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మింపజేసి, తెలుగువారు తలయెత్తుకొనేట్టు చేసిన నిర్మాణ దక్షుడు ఆయన. ఆంధ్ర రాజధానిలో ఆయనను చూడనివారు, చూచి గుర్తించనివారు ఉండరు. ఆయన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు.
శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు ఓరుగల్లు పట్టణంలో 1917 ఆగస్టు 24న జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకు హనుమకొండలో చదివారు. తరువాత హైదరాబాదులోని నిజాం కాలేజీలో 1939లో పట్ట్భద్రులయ్యారు. సంపన్న కుటుంబం. జీవితంలో కష్టాలేవీ ఎదుర్కోవలసిన అవసరం కలుగలేదు. డొక్కకోసం రెక్కలు ఆడించవలసిన దుర్గతి అసలే లేదు. కనుక బిఏ పట్టా పుచ్చుకున్న తరువాత రెండేళ్ళపాటు గ్రంథాలయోద్యమంలోను మరి రెండేళ్ళపాటు యువజన కాంగ్రెసులోను పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజాసేవకులందరికీ కలిగినట్లే వీరికి న్యాయవాది కావాలనే కోరిక కలిగింది. నాగపూర్ వెళ్ళి ఎల్.ఎల్.బి. తరగతిలో చేరి ఉత్తీర్ణులయారు. తిరిగివచ్చి వకాలతీ ప్రారంభించారు.
అప్పుడు హైదరాబాదు రాష్ట్ర రాజకీయ వాతావరణం భయానకంగా ఉంది. ఆజాద్ హైదరాబాదు నినాదాలు విజృంభించాయి. వాటికితోడు రజాకార్ల హాహా రవాలు, దేవులపల్లివారి తెలుగుతనం పరవళ్ళు తొక్కింది. ఈ అభివృద్ధి నిరోధకులను ప్రతిఘటించడానికి గొంతు విప్పాలి. దానికి తాము నడుపుతున్న ‘‘శోభ’’ సారస్వత మాసపత్రిక చాలదు అనుకున్నారు. ‘‘నాకు న్యాయవాద వృత్తే చాల ఇష్టం. గొప్ప న్యాయవాది కావాలనే మొదటినుంచి ఆశ. కాని వెర్రితలలు వేసిన ఉద్యమాలను ఎదుర్కొనడం విద్యుక్త్ధర్మం. నా భావాల ప్రకటనకు దారి చూస్తుండగా గోలకొండ పత్రిక దినపత్రిక అయింది. దాని సంపాదకుడుగా నా వ్రాతలకు ‘కూతల’కు ధారాళంగా అవకాశం దొరికింది. ఈ కారణంగానే నేను ఒక ఉద్యమంనుంచి మరొక ఉద్యమానికి శాఖా చంక్రమణం చేయడం సంభవించింది. నా జీవితం ఈ విధంగానే గడచిపోతోంది అన్నారు దేవులపల్లివారు.
గోలకొండ పత్రిక సంపాదకత్వం 1947నుంచి నాలుగేండ్ల వరకే సాగింది. 1948 డిసెంబరునుంచి సారస్వత పరిషత్తుతో సంబంధం కలిగింది. 1952-53లో దానికి అధ్యక్షులుగాను ఇప్పటివరకు ఉపాధ్యక్షులుగాను ఉన్నారు. తర్వాత, తర్వాత ఆ సంస్థ భవనాలు లేచాయి. ‘‘నాతో ఎవరికి విరోధం లేదు. నా పనులు ఎంతో సవ్యంగా సాగిపోయాయి. నరోత్తమరెడ్డి, పునిజాల హనుమంతరావు; గడియారం రామకృష్ణశర్మ నా పనులకు ఎంతో తోడ్పడ్డారు. మేము నలుగురము కలసే పనిచేసాను’’ అన్నారు వారు.
ఏ పని ఫలమైనా కర్త, కారయిత మొదలయిన ఆరుగురికి చెందుతుందని అభియుక్తోక్తి, కాని కర్త కంటే కారయితకే ప్రాధాన్యత హెచ్చుగా ఇవ్వాలని నా అభిప్రాయం. ఏ పనైనా చేయడంకన్న చేయించడం కష్టం. తను ఏదో తనకు నచ్చింది చేయడం సులువు. తన ఇష్టానిష్టాలు తగ్గించుకుని, పదుగురితో పనిచేయడం కష్టం. పదుగురితో పనిచేయించడం మరీ కష్టం. ఆ విధంగా ఇతరులతో పనిచేయించినవారే మొదటినుంచి గొప్పవారయ్యారు. గొప్ప పనులు సాధించారు. కొందరు తమ మేధతోను సౌజన్యంతోను పదుగురునీ ఆకట్టుకోగా కొందరు అధికారంతోను, ఈవితీను ఆకట్టుకుంటారు. మేధ సౌజన్యం లేకపోతే విద్యారణ్యులవారు వేదభాష్యమనే మహాద్వారాన్ని ముగించేవారేకాదు.
ఏతావతా:
వ్యవస్థాపన శక్తికి కలసికట్టుతనం కన్నతల్లి. దానికి దేవులపల్లివారు పుట్టినిల్లు. ఆ శక్తి మరొక శక్తితో కలసి ఉండకపోతే రాణించదు. దానికి వారి రచనాశక్తి తోడయి వనె్నతెచ్చింది. దానికి సహకారిణి వారి ప్రసంగచాతురి. ఎవరినీ నొప్పించక గంటల తరబడి విషయైక దృష్టితో మాట్లాడగలరు. వాటన్నిటి ఫలితాలే నవ్యకవితా నీరాజనము, సారస్వత నవనీతము, నవనీతము, వ్యాస మంజూష వంటి సాహిత్య విమర్శ గ్రంథాలు; మన దేశము, ఆదిమవాసులు, తెనుగుదేశము, జవహర్‌లాల్ నెహ్రూ; గౌతమబుద్ధుడు వంటి బాలసారస్వతము, పచ్చతోరణము వంటి పద్య కావ్యాలు; తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనము వంటి సాంస్కృతిక గ్రంథాలూను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన వెంటనే ‘‘తెలంగాణము లేని ఆంధ్ర రాష్టమ్రు అసమగ్రము. ఆంధ్రజ్యోతి సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర నాయకులు- ఏ ప్రాంతమువారైనను బద్ధకంకణులై కృషిచేసి ఆంధ్ర రాష్టమ్రును సమగ్రముగావించ విశాలాంధ్ర సాధనకు దీక్ష వహించవలసి యున్నది అని ఘోషించిన తొలి బంతి వారిలో వారొకరు. దానికోసమే వారు అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన పెద్దలతో కలసి విశాలాంధ్ర నిర్మాణోద్యమము నడిపారు. ‘హైదరాబాదు స్వాతంత్య్రోద్యమము, విశాలాంధ్ర రాష్టమ్రు’ అన్న గ్రంథాలు రాశారు. కార్యసిద్ధి తరువాత ‘విశాలాంధ్ర’ వచ్చింది అనే పుస్తకం వ్రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం బదిలీ ప్రతిఘటనోద్యమం ఫలితం మొదటే తెలిపారు. వారితో సంబంధం లేని సారస్వత సంఘమంటూ విద్యాసంస్థ అంటూ రాష్ట్రంలో లేదు. కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనెట్‌లోను, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసలహా సంఘంలోను, కేంద్ర పాఠ్యపుస్తక సంఘంలోను, ఆల్ ఇండియా రేడియో సలహా సంఘంలోను సభ్యులు, టాగూరు శత వార్షిక జయంతి సంపుటి కార్యదర్శులు, గురజాడ శత వార్షిక జయంతి సంపుటి సంపాదకులు. అయినప్పుడు, వారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఏర్పడినప్పటినుండి కార్యదర్శి పదవి అలంకరించడం కేంద్ర సాహిత్య అకాడెమీ కౌన్సిలు సభ్యులుకావడం, సాహిత్య ప్రతినిధులుగా రాజ్యసభలో ఆసీనులు కావడం ఆశ్చర్యం కాదు.
ఏ ఉద్యమానికన్నా సహకారమే మూలమయినప్పుడు, వారు సహకారోద్యమంలో పాల్గొనడం సహజాతి సహజం. వారు కో-ఆపరేటివ్ జనరల్ ఇన్ష్యూరెన్స్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు సభ్యులు కూడా.
‘‘నాకు ప్రాచీన సాహిత్యంలో భారతం, భాగవతం ఇష్టమైనవి. నవీనులలో, గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ, అబ్బూరి, దువ్వూరి, జాషువ, దాశరథి చాల ఇష్టమైనవారు. తెలుగు సాహిత్యంలోని వెలుగులను హిందుస్తానీ వారికి తెలుపడానికి ఉరుదూలో తెలుగు సాహిత్య చరిత్ర ప్రచురించాను. హాలీ, గాలిబ్, వచనకారుడు వౌలానా షిబ్లీ నాకు చాల సన్నిహితులు. జాతీయోద్యమానికి సంబంధించినంత వరకు హాలీ రచనలను తెలుగులో ప్రచురించాను’’; అని వారు అంటూ రంజకంగా ఎంతసేపైనా సంభాషిస్తారు.
‘‘ప్రాచీన సంస్కృతిలోని ఉదాత్తతను కాలానుగుణంగా మలచుకోవాలని ఆ నిగ్గును రక్షించుకోవాలని కోరేవారిలో నేనొకడ్ని. ప్రాచీనతతో సంబంధం ఉండాలనేవాణ్ని. భారతీయ సంస్కృతిలో విశ్వజనీనత ఉంది. దానినే మనం రక్షించుకోవాలి. ఆ విశ్వజనీనతే మన సంస్కృతిని శాశ్వతం చేస్తున్నది’’ అని వారి విశ్వాసం. వారు తెల్లవారుజామున నాలుగున్నరకే లేచి, స్నానాదులు ముగించుకుని, ఆరున్నరనుంచి ఎనిమిదిన్నర వరకు ముఖ్యమైన వ్రాతపనులు చూచుకుంటారు. తర్వాత సారస్వత పరిషత్తు కార్యాలయానికి వచ్చి, పరిషత్తు, సాహిత్య అకాడెమీల పనులు చేస్తారు. పనె్నండు గంటలకు ఇంటికి వెళ్ళి భోజనం ముగించి, గంటన్నర విశ్రమిస్తారు. సాయంకాలం నాలుగున్నర నుంచి పరిషత్తు కార్యాలయంలో మరల కార్యక్రమం ప్రారంభం. సాయంకాలం ఆరుగంటలకు వాహ్యాళికి బయలుదేరుతారు. వారికి బ్రిడ్జి ఇష్టం. ఇప్పుడు లేదు. షేర్వానీ, పైజామా నచ్చిన దుస్తులు.
వారికి తోట పని చాల ఇష్టం. ‘‘నాకు బాదరబందీ ఏమీలేదు. నా కుమారుడు ఎదిగి వస్తున్నాడు. నాకు ఏ జంజాటమూ ఇక ఉండదు. ఆఖరుకు వరంగల్లులో స్థిరపడి, తోట పని చేసుకుందామని ఉంది’’ అని వారు అంటున్నప్పుడు ఎన్నో ఉద్యమాలకు, సంస్థలకు నారుపోసి, నీరుపోసి, పెంచి పండించుకున్న దేవులపల్లివారు తోటలనూ బాగానే పెంచి పండ్లు అనుభవించగలరనడం నిస్సందేహమని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పక్షాన మంచి తెలుగు నిఘంటువును ఒకటి నిర్మింపజేయాలనీ, సారస్వత పరిషత్తుకొక గొప్ప రిఫరెన్స్ లైబ్రరీ ఏర్పాటుచేయాలనీ వారికి ప్రస్తుతం ఉన్న కోరికలు. ఇన్ని సాధించిన వారికి ఇవి ఏపాటివి? సృజనాత్మకశక్తి, దానిని మించిన నిర్మాణ దక్షతగల శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు ఈ రెండు కోరికలతోనే సంతృప్తిపడక, తెనుగు సాహిత్యం, తెలుగువారి అభిరుచి దేశంలోని ఇతర భాషలవారికి ఒరవడి అయ్యేటట్టు సారస్వత మహధ్వరానికి పూనుకుంటారని ఆశిస్తున్నాను.
- తిరుమల రామచంద్ర
(1975లో తిరుమల రామచంద్ర ‘మరపురాని మనీషి’ శీర్షికతో 29 మంది మహనీయుల పరిచయాత్మక వ్యాసాలు రచించారు. వాటిలోంచి సంగ్రహించినదే ఈ వ్యాసం.)