మెయన్ ఫీచర్

భద్రత ధ్యాసలేని వాణిజ్య లోభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం పెట్టిన తరువాత దిగనేయడమన్నది ప్రగతి జరిగిన తరువాత సంభవించే వికృతికి చిహ్నం! ఒకదాని తరువాత మరొకటి..! ఇప్పుడు మన దేశంలో ఈ ‘ప్రగతి’ ఈ ‘వికృతి’ సమాంతరంగా ఒకేసారి జరిగిపోతున్నాయి. ఒకదానితో మరొకటి పొసగని వైరుధ్యాలు ఒకేకాలంలో నడిచిపోతుండడం వినూతన విచిత్ర ఆవిష్కృతి.. జాతీయతా భావ రూపాలయిన సైనిక దళాలు ప్రాణాలనొడ్డి మాతృభూమి సరిహద్దులను సంరక్షిస్తున్నారు, పటిష్టం చేస్తున్నారు. సమగ్రతకు శాపాలయిన వాణిజ్యపు దళారీలు మాతృభూమి సరిహద్దులను చెరిపివేయడానికి వీలుగా నడుములను బిగించి నాట్యం చేస్తున్నారు. సరిహద్దుల పరిరక్షణ భారత జాతీయతా దీప్తి, సరిహద్దులను చెఱిపివేయడం ‘ప్రపంచీకరణ’ స్ఫూర్తి.. జాతీయ సార్వభౌమ అధికార వటవృక్షం వేళ్లను నరుకుతున్న గొడ్డలి వాణిజ్య ప్రపంచీకరణ.. చైనా ప్రభుత్వం బలూచిస్తాన్ నుండి సింకియాంగ్ వరకూ పాకిస్తాన్ పొడవునా బృహత్ పారిశ్రామిక వాటికను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ పారిశ్రామిక వాటిక- ఎకనామిక్ కారిడార్‌లో- చైనా దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులను పెట్టిందట! ఈ పారిశ్రామిక వాటిక పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకాశ్మీర్ పొడవునా విస్తరిస్తోంది. ఈ ‘వాటిక’ నిర్మాణాన్ని ఆపివేయాలని మన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చైనాకు వెళ్లి చెప్పివచ్చారు. చైనా ఈ అమిత్ర వైఖరిని విడనాడడం లేదు. అది చైనా స్వభావం. కానీ మన దేశంలో చైనా వారి వాణిజ్య సామ్రాజ్యాలను ఏర్పాటుచేయించడానికి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉవ్విళ్లూరుతుండడం సమాంతర వైపరీత్యం. ఇలా ఉవ్విళ్లూరుతున్న వారిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ నిర్వాహకులు అగ్రగాములై ఉన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా వాణిజ్య మైత్రీ ప్రవాహంలో ఓలలాడుతున్నాడు!
జిహాదీ బీభత్సపు తోడేళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోకి ఉసిగొల్పుతుండడం దశాబ్దులుగా సాగిపోతున్న వ్యూహం! ఇది ప్రత్యక్ష బీభత్సకాండ.. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చైనా ఉసిగొల్పడం సమాంతరంగా నడచిన పరోక్ష బీభత్సకాండ, ఇపుడు చైనా ప్రభుత్వం ముసుగును తొలగించింది. ప్రచ్ఛన్న బీభత్సకాండ ప్రత్యక్షరూపం ధరిస్తోంది, చైనా ప్రభుత్వం నిర్లజ్జగా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తానీ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోంది, మన దేశానికి వ్యతిరేకంగా విద్వేష విషాన్ని వెళ్లగక్కుతోంది! ‘జాయిష్ ఏ మహమ్మద్’ జిహాదీ ముఠాకు చెందిన మొదటి హంతకుడు మసూద్ అఝార్ అనే వాడిని ‘ఐక్యరాజ్యసమితి’ అభిశంసించకుండా చైనా ప్రభుత్వం ఏళ్ల తరబడి తెరచాటునుంచి నిరోధించింది. ఇప్పుడు ‘తెర’ను తొలగించింది. మసూద్ అఝార్‌ను ‘సమితి’వారు శిక్షించదలచిన బీభత్సకారుల జాబితాలో చేర్చడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ‘జనవరి’ నుండి ఇప్పటివరకు చైనా ఐదుసార్లు అడ్డుకుంది. కేవలం ఈ అక్టోబర్ నెలలోనే ఐక్యరాజ్యసమితిలో మసూద్‌ను చైనా బహిరంగంగా కాపాడింది. ఒకటవ తేదీన, ఎనిమిదవ తేదీన ‘మసూద్ అఝార్’ను టెర్రరిస్టుల జాబితాలో చేర్చడానికి ‘సమితి’లో జరిగిన ప్రయత్నాలను చైనా వమ్ము చేయగలిగింది. చైనా ఇలా మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండ సాగించిన జిహాదీ ముష్కరుని కొమ్ములను కోరలను కాపాడిన సమయంలోనే కొత్త ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చైనాతో తమ బంధాన్ని మరింతగా గట్టిగా బిగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్- ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి- ఎపిఇడిబి- వారు మూడు చైనీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చైనా పారిశ్రామిక సంస్థలు నవ్యాంధ్రప్రదేశ్‌లో పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టనున్నాయట! మసూద్ అఝార్ అనేవాడు క్రీస్తుశకం 2001లో మన పార్లమెంటు భవనంపై దాడి చేయించినవాడు, గత సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్‌లోని ఊరీలో పంతొమ్మిదిమంది మన సైనికులను దొంగచాటుగా చంపించినవాడు. ఈ రెండు ఘటనలకు మధ్య అనేక ఉగ్ర జిహాదీ మృగాలను మన దేశంలోకి ఉసిగొల్పినవాడు! ఇలాంటి చైనాతో ఒప్పందాలను కుదుర్చుకునే పత్రాలమీద సంతకాలు చేస్తున్న చేతులను నిర్దేశించిన, నిర్దేశిస్తున్న బుద్ధి ఎలాంటిది?? ఈ బుద్ధికి భారత జాతీయ నిష్ఠ ఉందా? ఈ బుద్ధిని చైనా భూతం ఆవహించి ఉందా?? ‘ఉరీ’లో మన సైనికులను చంపించిన పాకిస్తాన్‌ను ఉసిగొల్పింది చైనా ప్రభుత్వమే! సిగ్గు ఎవరికి లేదు..?? గతజూన్ 28న అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైనాలో బుల్లెట్ రైలెక్కి భలే బాగుందని మురిసిపోయాడు. అదే సమయంలో చైనా ప్రభుత్వం ప్రచురిస్తున్న పత్రికలలో మన దేశాన్ని, మన ప్రభుత్వ నిర్వాహకులను, మన మాధ్యమాలవారిని మన మేధావులను నీచంగా నిందిస్తూ కథనాలు వెలువడినాయట! ఈ పత్రికలను బహుశా ఈ మన ముఖ్యమంత్రి చదవలేదేమో?? ‘‘్భరత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సామ్రాజ్యవాద దేశాల తొత్తు, అతగాడు ఆ దేశాల వీపు ఎక్కి కూచుని ఉన్నాడు..’’ అని క్రీస్తుశకం 1949లో చైనా కమ్యూనిస్టు మావోయిస్టు ప్రభుత్వం నిందించినా నెహ్రూకు కోపం రాలేదు. తనను గురించి చైనాకున్న దురభిప్రాయాన్ని తొలగించుకోవడానికి ఆయన ఆ తరువాత 1962 వరకు కృషి చేశాడంతే! 1962లో చైనా వెన్నుపోటు పొడిచింది! ఇదే కథ 1989 నుంచి మళ్లీ మొదలైంది. ఈ ‘కథ’కు అప్పటి ‘ప్రధాని’ రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టాడు! చైనాలో సరిహద్దు వివాదాన్ని పక్కకు పెట్టి, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలన్నది ఈ కొత్త విధానం. సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యేవరకు, దురాక్రమించిన మన భూభాగాలనుండి చైనా వైదొలగేవరకు ఆ దేశంతో ఇతర సంబంధాలను పెంపొందించుకోరాదన్నది క్రీస్తుశకం 1965 నుంచి మన విధానం! అందువల్ల రాజీవ్ గాంధీ హయాంలో రూపొందించిన ‘నీతి’ పథ భగ్న- పాత్ బ్రేకింగ్- విధానంగా పేరుమోసింది!
మన దేశం నిండా కుప్పలు తెప్పలుగా చైనా వారి నాసిరకం వస్తువులు అమ్ముడుపోతుండడానికి ఏకైక కారణం ఈ ‘పాత్ బ్రేకింగ్’ విధానం. వాణిజ్యం ప్రధానం, సరిహద్దుల భద్రత ప్రధానం కాదు. చైనా ముద్రాంకితమైన తిండిని ‘చైనీస్ ఫుడ్’ పేరుతో గల్లీ గల్లీలో పల్లె పల్లెలో మెక్కడం, బొక్కడం వినూత్న జీవనరీతిగా మారింది. జపాన్‌లో ‘చైనీస్‌ఫుడ్’ను ఇలా మింగడంలేదు, జపాన్ వస్తువులను చైనాలో కొనడంలేదు! ఎందుకంటే ఈ రెండు దేశాలమధ్య ‘శంకాకూ’ అన్న ద్వీపసమూహం గురించి వివాదం నడుస్తోంది! అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడం లేదు.. ఎందుకంటే ఇజ్రాయిల్‌ను బద్దలు కొట్టడం అరబ్ దేశాలకు 1948 నుంచి లక్ష్యమైంది! ఈ విధానానికి ఈజిప్ట్ మాత్రమే అపవాదం! ఈజిప్ట్ ప్రభుత్వం ఇజ్రాయిల్‌ను బద్దలుకొట్టాలన్న లక్ష్యాన్ని 1978లో విడనాడింది! మన దేశాన్ని బద్దలుకొట్టే లక్ష్యం ఇప్పటికీ చైనా విడనాడలేదు! కానీ ‘పాత్ బ్రేకింగ్’ విధానం కారణంగా చైనా మనకు అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఫలితంగా చైనా నుండి దిగుమతులు భయంకరంగా పెరిగాయి! చైనాకు మన ఎగుమతులు పెరగడంలేదు. అందువల్ల దాదాపు ఐదేళ్లుగా చైనాలో వాణిజ్యం వల్ల మనకు ప్రతి సంవత్సరం సగటున రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా లోటు ఏర్పడుతోంది! మన వాళ్లు ఆర్భాటంగా చైనాకు ప్రయాణాలు చేసి, పెట్టుబడుల కోసం దేబిరించి వస్తున్నారు. అయినప్పటికీ మన దేశానికి చైనా నుండి లభిస్తున్న పెట్టుబడులకంటే వాణిజ్యం లోటు- ట్రేడ్ డెఫిసిట్- రూపంలో చైనాకు తరలిపోతున్న మన నిధుల విలువ చాలా ఎక్కువ! ఈ ధ్యాస మన దేశంలోని ‘చైనా మిత్రుల’కు కలగడం లేదు! చైనాలో మనం వాణిజ్య సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్లకు మించిన నిధులు ఆదా అవుతాయి. చైనాకు తరలిపోవు.. అలా జరిగినట్టయితే ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు మన దేశంలోనే పెట్టుబడులు కాగలవు! పదివేల కోట్ల రూపాయల కోసం పాతిక వేల కోట్ల రూపాయల కోసం మన రాష్ట్రాల ప్రభుత్వాలు చైనాను బిచ్చమడగనక్కరలేదు! మన సరిహద్దులను గాయపరిచిన, మళ్లీ గాయపరచడానికి యత్నిస్తున్న చైనాతో ‘వాణిజ్య బంధం’ మతిమాలినతనం, మన ఇంటికి కన్నం వేస్తున్నవారికి మనమే గునపాలను, గడ్డపారలను అందించడంతో సమానం. చైనా సైనిక వ్యయం అధికారికంగా మన కంటే మూడున్నర రెట్లు అధికం! ‘పారదర్శకత’లేని చైనా నియంతృత్వ ప్రభుత్వం నిజానికి మనకంటే ఆరు రెట్లు సైనిక వ్యయం చేస్తోందట! ఈ రహస్యాన్ని అమెరికావారు ఐరోపావారు ప్రచారం చేశారు!
మన దేశం స్వభావం అనాదిగా శత్రువును సైతం క్షమించడం! కానీ ‘క్షమ’ను మన దేశంపై దాడి చేసి ఓడి పారిపోయేవారిపట్ల ప్రదర్శించాలన్నది మన జాతీయ జీవన స్వభావం! ‘‘పరువెత్తు విరోధిని పట్టి కౌగిటన్ గుచ్చిన జాతిరా ఇది..’’ అని అన్నాడు మహాకవి కరుణశ్రీ. కానీ క్షతగాత్రులమైన మనం క్షతికారులను కౌగిలించుకుంటున్నాము! చైనా మన సరిహద్దులను గాయపరచింది, గాయపడిన మనం గాయాలను మాన్పుకొనటానికి ప్రయత్నించాలి! మన ‘లడక్’ను మళ్లీ మనం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి! మన సైనిక దళాలు మయన్మార్‌లోకి చొచ్చుకొనిపోయి చైనా ప్రేరిత బీభత్సకారుల బట్టీలను బద్దలుకొట్టడం హర్షణీయ పరిణామం! కానీ చైనాకు ‘పెట్టుబడుల’ పేరుతో మన వాణిజ్య పారిశ్రామిక రంగాలను అప్పగిస్తుండడం ఆగిపోవాలి కదా!!
చైనా వారి ‘దారం’తో మన దేశంలో గాలిపటాలను ఎగురవేశాము. ఆ విషపు దారం వాతావరణాన్ని కాలుష్యంతో నింపింది. పక్షుల గొంతులను కోసింది. మనుషులను సైతం గాయపరిచింది. తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా మేలుకొని ఈ దారాన్ని ‘వాడడం’ నిషేధించింది. కానీ ‘దారం’ దిగుమతి కాకుండా నిషేధించడం లేదు! చైనా ‘రాజకీయపు దారం’, దురాక్రమణ సూత్రం మన దేశం చుట్టూ ఉచ్చులను బిగిస్తూనే ఉంది! బ్రహ్మపుత్ర నీరు చైనా పాలు..
స్వగృహ ప్రాంగణమందున
సభ తీరిన మమకారం
చొరబడిపోయిన వారికి
మోకరిల్లుతున్న క్షణం..
మన ఇంటిని కాల్చుతున్న
మంటలు ఇవి ఎక్కడివి?
మన గోడల కూల్చుతున్న
గునపాలెవరిచ్చినవి??

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352