మెయిన్ ఫీచర్

శక్తి స్వరూపిణి వీణాపాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది దినాలలో తొమ్మిది రూపాలలో శక్తి/దేవి ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. ఆశ్వయుజ పాడ్యిమి నుండి దశమి వరకు మొదటి మూడు రోజులు చెడును దూరం చీసే దుర్గామాతగా, తర్వాత మూడు రోజులు సంపదనిచ్చే లక్ష్మీదేవిగా, చివరి మూడు దినాలు చదువుల తల్లి సరస్వతిని పూజించడం పరంపరానుగతంగా అనుసరిస్తున్న సంప్రదాయం. కేరళ, తమిళనాడులలో నవరాత్రి చివరి మూడు రోజులలో, మహారాష్ట్ర, గోవా, కర్నాటక ప్రాంతాలలో మహా సప్తమి సరస్వతీదేవి ఆవాహనం, అష్టమి ప్రధాన పూజ, నవమి ఉత్తర పూజ, విజయ దశమి నాడు విసర్జన చేస్తారు. ప్రధానంగా దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు పుస్తక రూపిణియైన సరస్వతిని విద్యా సంస్థలలో, స్వగృహాలలో పూజించడం నేటికీ కొనసాగుతున్నది. పరాశక్తి ధరించిన ఐదు రూపాలలో సరస్వతి ఒకటి. ఆమె కేవలం చదువులకే కాకుండా, సర్వశక్తి సామర్థ్యాల ప్రసాదినిగా పూజలందుకుంటుంది. రుగ్వేదంలో, దేవీ భావతంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, పద్మపురాణంలో సరస్వతి గురించిన గాధలున్నాయి. వాక్కు, వివేకం, బుద్ధి, విద్య, కళలు, విజ్ఞానం అన్నింటికి అధిదేవతగా భావించ బడుతుంది. హంస వాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రించ బడుతుందీ దేవి. వేదాలు, కొన్ని పురాణాలలో సరస్వతి నది కూడా ప్రస్తావించ బడింది. హిందుమత ప్రభావితమైన బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహి సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి వంటి నామాలతో ఆరాథన జరిగింది. జైనులు శృత దేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా, ఆరాధించగా, భోజ మహారాజు ‘‘శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ’’ అని వాగ్ధేవిని ప్రతిష్ఠించారని ప్రసిద్ధి. క్రీ.పూ.2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం ఉత్తర ప్రదేశ్‌లోని మధుర సమీపంలో ఖజ్జాలీటీలో లభించింది. సముద్ర గప్తుడు తన సువర్ణ నాణాలపై ఒకవైపు సరస్వతి, మరోవైపు వీణను ముద్రింప చేశాడు. క్రీ.శ.10వ శతాబ్దంలో ఒడిషాలో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది. పాలవంశపు రాజుల నాటివని చెప్పబడే సరస్వతి విగ్రహాలు పాట్నా, కలకత్తా మ్యూజియంలలో భద్ర పరచబడి ఉన్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాథాలయంలో, ఖందరీయ మహా దేవాలయంలో వాగ్ధేవి విగ్రహాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ.2వ శతాబ్దికి చెందినదైన సరస్వతి విగ్రహం లభ్యమైంది. చాళుక్యుల నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. నిర్మల్ జిల్లా బాసరలో వేద వ్యాసునిచే ప్రతిష్ఠితయై, నిత్య భక్తజన సందడితో అలరారుతున్న జ్ఞాన సరస్వతి దేవాలయం గోదావరి తీరాన ఉంది. ఒకనాటి కాశ్మీర్, ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్ భూభాగంలో ఉన్న శారదా మందిరం అత్యంత ప్రాచీనమైనది. శాండిల్య మహామునికి సరస్వతి సాక్షాత్కారం ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో జరిగినట్లు కథనం. ఆదిశంకరులు, రామానుజులు ఇక్కడి దేవతను దర్శనం చేసుకున్నరని చెపుతారు. శృంగేరీలోని ఆది శంకర ప్రతిష్ఠిత సరస్వతీ మూర్తి ఆలయం, తమిళనాడులోని కూతనూర్ వద్ద మందిరం, రాజస్థాన్‌లోని పిలానీలో బిర్లా కుటుంబీకుల నిర్మిత, తంజావూర్, శ్రీరంగం తదితర ప్రాంతాలలో సరస్వతీ దేవి పూజలందుకుంటున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494