మెయిన్ ఫీచర్

సాహిత్యము.. సామాజిక స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక స్పృహ’’ ఎఱ్ఱ చొక్కా సోదరుల నోటి చొంగ. ఈ ‘‘ఎత్తుబడి చేత’’ వారి జన్మ హక్కు పత్రము. కనుక దానిని గురించి పాఠమును వారే వల్లెవేయవలెను. ఇతరులనరాదు. ఒకవేళ వేరువారట్లన్నచో వారు అభ్యుదయ నిరోధకులు. ఈ ‘‘అభ్యుదయ నిరోధక’’మన్న మాటయే చిత్రము. ‘‘అఱ చేతిని అడ్డంపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’’ అనే నినాదాన్ని వీధి గోడలకతికించిన మేధావులే ‘‘అభ్యుదయ నిరోధక’’మన్న మాటను విస్తృతపరచినారు. ‘‘అభ్యుదయమునకు- సూర్యోదయము’’ నకు గల భేదమేమిటో ఇప్పటికీ నాకు తెలియదు. వ్యవహరించు వారి చిత్తవృత్తిననుసరించి అర్థము మారుటనొకటి యున్నది కదా. అది కావచ్చును. అక్షర ప్రాపకమునకు ముందే అభ్యుదయగాములుండవచ్చును. కానీ ఆ పండితోద్దండమండితులకు విధి విధానమున ‘‘రాత’’ కావలసి వచ్చినది. అందువలననేమో వీరందరూ ‘‘రాత’’ పాలపడినారు. అస్తు.
‘‘సామాజిక స్పృహ’’ మంజిష్ఠ మహోదరుల మాట చొల్లు. ఈ కట్టుబడి కూత వారి పుట్టు పిట్టపిడుగు. కనుక దానిని గురించిన పాటను వారే పాడవలయును. ఇతరులు పాడరాదు. ఒకవేళ వేరువారు పాడినచో వారు ‘‘బూర్జువా’’లగుదురు. ‘‘బూర్జువా’’ అన్నది భారతీయ భాషా పదమని నేననుకోను. కనుక అర్థముకొఱకు వెదుకరాదు. ప్రస్తుతమా మాట వినిపించుట లేదు. కారణము తెలియదు. వస్తుతత్త్వము మారియుండును. వృత్తి-ప్రవృత్తి మారుచున్న సంధ్యానింగనానిష్ఠురమున నలిగి చచ్చియుండును. దీనికితోడు పడిన అశుద్ధ పదార్థం రాజకీయం. ఇది వంటపట్టించుకున్న వైఖరి సాహిత్యం. దీని క్షోభయంతయూ సామాజిక స్పృహ. ఎదుటి మనిషి స్పృహ కోల్పోయేదాకా ఊదే ‘బాకా’ పేరే సామాజిక స్పృహ. ఇదే వీరి పాండిత్యదండం. ప్రాగల్భ్య శంఖం.
‘‘సామాజిక స్పృహ’’ తొగరుపూతల వారి వాయితీట. ఈ పడికట్టు పదము వారి కుతిక నిచ్చెన. ఇది వారికి ‘‘పిల్లిపట్టిన దొబ్బ’’. కనుక ఈ ముల్లెవారికే చెల్లును. తక్కినవారు పగతురు. మునుపు చెప్పిన చొప్పు ‘‘సామాజిక స్పృహ’’ గలవారు (నినాదమున) అభ్యుదయ పథగాములు. మిగిలినవారు తన్నిరోధకులు. అభ్యుదయ గాములు- తన్నిరోధకులు. ఈ శబ్దముల గూర్చి కొంత చర్చ (విచారణ) జరుగవలసి యున్నది. నేటి తెలుగు పత్రికా లోకములో. తెలుగు మాటాడువారిలో. కవిత్వము పేరున వ్రాయు వ్రాతలలో వారి యర్థమును గూర్చిన విచారణ లేకుండా వాడబడుచున్నవి. ఇప్పుడీ శబ్దములున్నూ అటువంటివే. అభ్యుదయ వాదులకు సమాజవాదము మూల సిద్ధాంతమైయున్న దనుకొనవలె. వీరికి సమాజమన్న మందబలము చాటు మనుష్యులు. అధికారము అనుభవము. ఇంతియే. వీరి సామాజిక స్పృహ వీని చుట్టునే తిరుగుచున్నది. దీనిని దాటిపోవుట లేదు. మనుజుని దాటి యున్న అనంత సృష్టి వీరి దృష్టికందదు.
ఏ ఇంధన సంక్రాంత భావము తనలో లీనమైయున్నదో అదే చైతన్యము. ఈ చైతన్యాగ్ని జ్వాలల్లో నిత్యం దగ్ధమవుతూన్న కవికి సామాజిక స్పృహ. వస్తువు అనేవి సమస్యలే కావు. సమస్యల్లా ఆ కవికి సాహిత్య స్పృహ లేకపోవటమే. నిజానికి కవిత్వంలో సాహిత్య స్పృహతోపాటు అన్ని స్పృహలు సహజంగానే మిళితమైపోయి వుంటాయి. వస్తువుకి శిల్పానికి ద్యైతభావం వుండదు. కనుక కవితా స్పృహ లేదా సాహిత్య స్పృహ ఒక విరాట్స్వరూపం. ఇప్పుడు కుహనా నినాదాల పంజాలో చిక్కుకున్న పేద పాఠకుల ముఖాన్ని సాహిత్య స్పృహతో వెలిగిపోయేలా చేయాలి. మీరు తెలుసుకోవలసింది ఒకటే. సాహిత్య చైతన్యమే (స్పృహ) కవికి నిజమైన గీటురాయి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే సాహిత్య రాజకీయాల్లో కూలికి ఏడుస్తున్న కొందరు అల్పులు కొన్ని నినాదాన్ని ఏరుకుంటూ వుంటారు. వారికి తోచినప్పుడు జనంలోకి విసురుతూ వుంటారు. అందులో ఒకటి ఏమిటంటే శిల్పము వస్తువు ఒకటేననే బుకాయింపు. రాయి వస్తువు. శిల్పము దాని లోతును రహస్యమును వెతికి తెచ్చిన సౌందర్య విశే్లషణ. కవిత్వమగును. ఏవంవిధా రాయి కవిత్వము కాదు. కేవల వస్తువు. కానీ కొందరు ఎలా చెప్పాలి అన్నది కాదు - ఏది చెప్పాలి అన్నదే ప్రధానంగా గిలుకుతున్నారు. ఈ వర్తమానాంధ్ర నిరక్షరాస్య పన్న సిద్ధాంతం చేత ఈనాడు కేవలం కథన మాత్ర వచన రచన తయారౌతోంది. కవిత్వం ముసుగులో అక్షర క్రీడ జరుగుతోంది. ఇందులో సాహిత్య స్పృహ లవలేశం కూడా వుండదు. కనుక ఉన్నదున్నట్లు చెప్పాలనే రోగం నుండి నేటి తెలుగు కవిత కాపాడబడాలి. ఉష్ణంలేని అగ్నిని ఊహించండి. నిజమైన కవి శబ్దాల మార్దవము పౌరుషము ప్రవృత్తి ఇత్యాది కర్ణేద్రియ మాయాజాలంలోని సూక్ష్మాంశలను గ్రహిస్తారు. గ్రహించి అవి కవికి రచనా పరికరాలు మాత్రమే అని తెలుసుకుని కావ్య మర్మజ్ఞుడౌతాడు. ఉలి మహిమ ఉలిలోనే వుందనుకునే మూఢ దశనధిగమించి ఆ మహిమ ప్రయోగించే చేతుల్లోనే ఉందని గ్రహిస్తాడు. శిల్పం పూర్తి అయ్యాక తృప్తిగా నిట్టూర్పు విడుస్తాడు. ఆ నిట్టూర్పు విశే్లషణ యావత్తూ ఒక మహాశిల్పం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే కవిత్వాన్ని యిచ్చే ఇంద్రియవాదం జీవితంలో మునిగితే కానీ సిద్ధించదు. ఇది మహాక్లేశంతో కూడిన వ్యవహారం. అరుపులు, అట్టహాసాలతో రాదుసుమా! ఇంద్రియ వాదంలో మనిషి యావత్తూ అంటే ఇంద్రియాలతోబాటు అతని అంతర చేతన, సుప్తచేతన, వాసనలు సంస్కారాలు ఇత్యాది ప్రాకృతిక రహస్య శక్తులన్నిటిని కలిపిన సమాహారపు ముద్ద అయిన సంపూర్ణ మనిషి జీవితంలో మునిగిపోతాడు. కలిసినపోయిన శక్తులన్నీ కవి చేసే అనుభూతి దండయాత్రలో వాడితో కలిసే జీవితాన్ని వశం చేసుకుంటాయి. కవిత్వమంటే ఇంత చెమట పట్టాలి. తెల్లకాగితాన్ని దేనితోనైనా మకిలపరచవచ్చు- అక్షరాలే అక్కరలేదు.
ఇది గ్రహించే ఈ క్షోభంతా ‘‘ఎందుకులే’’ అనుకున్నాడేమో వర్తమాన ఆంధ్రకవి, ఆ చెమట పట్టించుకోవటం మాని ‘‘ఇస్ర్తి’’ మడత నలగకుండా క్రొత్తదనాన్ని సృజించాననుకొని ఆ భ్రమా పరిమళాన్ని లోకం మీదికి వదిలాడు. దాని పేరే ‘‘సామాజిక స్పృహ’’. అది ఎట్టిదనిన- ఇదిగో యిట్టిది. (మమ్మట భట్టు నన్నుమన్నించుగాక)
‘‘లీలా తామరసాహతోన్య వనితా నిశ్శంక దష్ట్ధారః
కశ్చిత్కేసర దూసితేక్షణ ఇవ వ్యామీల్య నేత్రే స్థితః
ముగ్ధాకుట్మలితాననేన దదతీ ‘‘వాయుం’’ స్థితాతస్యసా
భ్రాంత్యాధూర్త తయాధవానతిమృతే తేనానిశం చుంబితా’’
(అత్రవాయు శబ్దేన అపానవాయుం స్మారయతి నతు తదర్థ తయా వాక్యం ఉపపద్యేత) అభ్యుదయ పథగాములందరూ ఈ పరిమళాస్వాదకులై తనియుచున్నారు. వీరందరును ఉద్యమకారులు (ఉద్యమమేమిటో మాత్రమెరుగరు) ప్రతి వానికిని ఒక రాజకీయ నాయకుడు కావలెనని ఉన్నట్లే కలము పట్టిన ప్రతివానికి తానొక మహాకవిని కావలయుననియే యుండును. తనదొక ప్రత్యేక మార్గమని, తనదొక విశిష్టమైన శైలియని, దానికి తానే ప్రతినిధియని మిగిలినవారు తన మార్గమునకు రావలయునని యుండును. పది మందితో కలసియుండి- లక్ష్యలక్షణముల నెరిగి యుండి విషయమును అవగాహన చేసికొని యుండుటన్న వీరికి పరమ రోత. ఎంతసేపటికి తాను తన కావ్యము, అందు తన నాయకత్వము ఇది తప్ప కావ్య వస్తువు, దాని నిర్మాణ విధానమును గురించిన వివేచన పట్టదు. దేశి అని చెప్పుకుంటున్న ఈ నినాదపరులు నిజంగా వాళ్ళ కవిత్వ క్షమాన్ని దేశి శబ్దంతో ఆచ్ఛాదించుకుంటున్నారు. వాళ్ళు తమ కవిత్వం కాని కవిత్వ నామక రచనతో ఆధునిక కాలానికి ఆముదం తాగిస్తున్నారు. వీరికటి సంప్రదాయబుద్ధి- ఇటు ఆధునిక నిర్మాణ దక్షత లేక రెంటికి చెడిన రేవడులు. చదువుమీద విశ్వాసం లేదు. శాస్తమ్రందభ్యాసము లేదు. చదువులేనివాడు గొప్పగొప్ప పదవులలోనుండుట చేసి. తానా సులభపద్ధతిని వాంఛించును. కనుక ఏదో వ్రాయవలయును. ఏదో వ్రాయుటకైనను భాష కావలయును గదా! అదియున్నూ శూన్యమే. భౌతిక జగత్తులోని వస్తువు ఆత్మ జగత్తులో భాసించి ఇంద్రియ ప్రవాహమున మునిగి తేలి కవితాశిల్పము కావలె. అట్లగుటకెంత కావలె? ఎంత కావాలంటే సచేతనాత్మక అంతర్ముఖత్వమంత కావాలి. ఇది మనిషి మీద అనుశీలకమేర్పరిచే మహాప్రభావం. చదువుతోనే వస్తుంది. ఎవడైతే బాహ్యాభ్యంతర ప్రయాణ విద్యాభ్యాసతంత్రంలో మమత్వాన్ని వీడి తామరాకు మీద నీటిబొట్టై భారతీయ తత్త్వకళిక అయిపోతాడు. వాడే కవియై మెరిసిపోతాడు. నిలిచిపోతాడు. భూమిలోపడ్డ చినుకులా ఆత్మశిక్ష(ణ)లో రాటుదేలి రూపాంతరంగా (కవిత్వమై) బాహిరిల్లుతాడు. ఇలాంటి అపూర్వ సృష్టివల్లనే నవత లభిస్తుంది (జనిస్తుంది). ఈ నవత, వైచిత్రి అలానే ఉండిపోతాయి. ఇదే కారణం- వాల్మీకి, కాళిదాసు ఇత్యాదులు మనం ఈనాటికీ తలచుకునే (చదువుకొనే) మహానుభావులు. వాళ్ళు కాలగతి చేత కళంకితులు దివంగతులు కారు. కవి అయినవాడు నవతను భంగపరచడు. నవనవోనే్మషమైన అక్షరంగానే ఉంటాడు. అక్షరం కూడా అంతే. మన కళ్ళకు తెచ్చే దృశ్యంలో సారభూతమైన ఆత్మప్రవహించే అందమే కవిత్వం. సౌందర్య లహరి. ఆ సృష్టిలోనే ఎడ తెగకుండా ప్రవహించే జీవనది. దృశ్యానికీ జీవం యిచ్చే చేతన యేదైతే వుందో దాన్ని పట్టి యిచ్చే గ్రథన కౌశలంతో బంధింపబడిన నాలుగు మాటలే కవిత్వమన్న మాట.
మళ్లీ మొదటికే వచ్చాననుకోకపోతే ఒక మాట. రచయితలకి. కవులకి శబ్దశక్తి, నిర్మాణ నైపుణ్యం, అనుశీలనం, అభ్యాసం అవసరమనుకునే సత్యసూత్రానికేమాత్రం విఘాతం లేదు. కానీ ఈనాడు గుణగణాలు అవసరమని అనుకునేవారు ముఖ్యంగా కవుల్లో అరుదు. వేరేమో కూడా. ప్రతిభ కలిగివుండి నైపుణ్యాన్ని సముపార్జించుకొని, దాన్ని అభ్యాసంతో మెరుగుపెట్టుకోగలిగిననాడు రచయిత/ కవి తన రచనకు సార్వజనీనమైన శాశ్వతత్వాన్ని ఒనగూర్చగలడు. భాష మీద సరియైన అధికారం లేనివాడు భావనా పటిమ శూన్యమైనవాడు చేసే రచనల వల్ల అర్థంకంటే అనర్థమే హెచ్చు. సామాజిక స్పృహ లేని సాహిత్యం ఉండదు. మూడు నిమిషాల్లో చదివి పారేసే ప్రేమలేఖ కూడా సామాజికాంశమే. కవిత్వం దేవాలయం లాంటిది. పద్యం ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ పరాదేవత. ఆలయ ప్రవేశానికి. అందునా గర్భాలయ ప్రవేశానికి ఎంత శుచికావాలి? దిక్కుమాలిన వారంతా పద్యాన్ని స్పృశిస్తే గర్భశోకం కదూ?

- సాంధ్యశ్రీ, 8106897404