మెయిన్ ఫీచర్

చదువులనిచ్చే సరస్వతీమాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సములలో ప్రాముఖ్యమైనది, మూలా నక్షత్రం రోజున, సప్తమి తిథినాడు జరిపే శ్రీ మహా సరస్వతీపూజ, ఆరాధన, ఉపాసన. ఈ రోజు పూజలందుకొనే జగన్మాత- మహాసరస్వతి. దేవాలయాల్లో జరిగే పూజా మహోత్సవములలో, ఈ రోజు సరస్వతీ మాతను దర్శించుకోవటానికి విశేషంగా, అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఎందుకంటే ఎంత సంపద ఉన్నా, చదువు ఉంటేనేగాని ఆ సంపద అనుభవంలోకి రాదు. కనుక, తొమ్మిది రోజుల పూజలలో ఈ రోజు చేసే సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది.
తొమ్మిది రోజులు, పగలు రాత్రి రెండు పూటలా పూజ చేసేవారుంటారు. పగలు ఉపవాసదీక్షలో ఉండి రాత్రికి పూజ చేసేవారు కొందరు భక్తులుంటారు. తొమ్మిది రోజులూ జగన్మాత పూజలు చేయటం ఏదైనా కారణం వలన కుదరకపోయినా ‘శ్రీదేవీ శరదృతు త్రిరాత్రవ్రత’మని ఆచరిస్తారు. ఈ రోజు సప్తమి, అష్టమి, నవమి- మూడు రోజులు జగజ్జనని పూజలు చేస్తారు. ఈ రోజు సరస్వతి, రేపు దుర్గామాత, ఎల్లుండి మహిషాసురమర్థినిగా దుష్టరాక్షస సంహారం చేసి, బిడ్డలను రక్షిస్తారు తల్లులు. కనుక త్రిరాత్రివ్రతం ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు. సప్తమి సంఖ్య జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది. జాతకభాగంలో, సప్తమస్థానం- భార్యాభర్తల స్థానం. ఆ స్థానం బాగా ఉన్నవారు అదృష్టవంతులు, అసలైన అదృష్టవంతులు. ఈ రోజు సరస్వతీ మాత పూజతో అన్యోన్య అనుకూల దాంపత్యం ఏర్పడుతుంది. మూలానక్షత్రం ఉంటుంది ఈ రోజు. మూలానక్షత్రం- ధనూరాశిలో ఉంటుంది. ధనూరాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి, ధన విద్యా వాక్ కుటుంబ, గృహ, వాహన కారకుడు. తల్లిని ఈ రోజు అనగా సప్తమి తిథి రోజున మూలానక్షత్రం కలిసి వున్న రోజున పూజిస్తే, బృహస్పతి కటాక్షం లభించి, అన్ని సంపదలు, అతి ముఖ్యంగా మంచి చదువుమనకి మన పిల్లలకీ వస్తుంది. జ్ఞాన విజ్ఞానదేవత, చదువులతల్లి- మహాసరస్వతి సంగీత సాహిత్యాది లలిత కళలన్నీ ఆ దేవీ స్వరూపం. మహాసరస్వతి మంచి మాట తీరునిస్తుంది. ఎంత భాగ్యం ఉన్నా, దాన్ని అనుభవంలోకి తెచ్చేది జ్ఞానం. అది లేకపోతే అన్నీ వ్యర్థం. అందుకే సప్తమి తిథి, మూలానక్షత్రం కలిసినరోజు సరస్వతీ పూజ చేస్తే జీవిత లక్ష్యాన్ని పొందిస్తుంది జగన్మాత.
‘‘సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా’’
విద్యారంభమున అందరిచే కొలువబడే దేవత- సరస్వతీమాత. కనుకనే ఆమె చదువుల తల్లిగా ప్రశంసింపబడుతోంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుని భార్య. బ్రహ్మదేవుని ముఖ కమలమున, సరస్వతి విలసిల్లుతుందని శాస్తమ్రులు ఉపదేశిస్తున్నాయి. తల్లిని ఆరాధించేవారి ముఖములు సరస్వతీ నిలయములై విరాజిల్లుతాయి. బాల్యమునుండి ఆరాధింపబడే సరస్వతీమాత, భక్తుల పాలిటి వరద, కామరూపిణి అంటే తల్లి తన భక్తుల కోర్కెలను తీర్చే కల్పవృక్షము, కామధేనువు. అంతేకాదు భక్తుల ఆధివ్యాధులను నశింపజేయు ధన్వంతరి. కనుకనే సరస్వతీమాత విద్యాధిదేవత, జ్ఞానరూపిణి, విజ్ఞానప్రదాత్రి. జ్ఞానంచేత భవసాగరాన్ని దాటిస్తోంది.
‘ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్యాజినీవతీ ధీనామీ విత్య్రవతు’-
వాగ్దేవియైన సరస్వతిని కూడా మేము స్తుతించుచున్నాము. బుద్ధిని వికసింపజేయమని సరస్వతీ మాతను ప్రార్థిస్తున్నారు.
‘సరాంసి జలాని సంతి అస్యాః ఇతి సరస్వతి’
లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక రస స్వరూప సరస్సులో సదా వశించే విద్యాశక్తి, జ్ఞానశక్తి, సరస్వతీదేవి అని పేర్కొన్నది మేదినీకోశం.
‘‘నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం చైవ తతో జయముధీరయేత్’’- అని పేర్కొన్నాడు వ్యాసభగవానుడు, మహాభారత ఇతిహాస ప్రారంభంలోనే. స్వతసిద్ధమైన చైతన్యమే- నారాయణుడు, పరమాత్మ. అటువంటి పరమాత్మకు ముందుగా నమస్కరించాలి. తరువాత నరుడు. నరుడంటే జీవాత్మ. చైతన్య రూపంగా, జీవాత్మ పరమాత్మ యిద్దరూ ఒక్కటే. భేదంలేదు. శరీరాది ఉపాధులే శాశ్వతమనుకొన్న నరుని దేహాభిమానమే, అతణ్ణి నారాయణుని నుంచి వేరుచేస్తున్నాయి. శరీరం అశాశ్వతమని, తను ఆత్మస్వరూపుడినని తెలిసికొని స్వస్వరూప జ్ఞానాన్ని పొందిన నరుడు నరోత్తముడు, అనగా అక్షరుడైన ఈశ్వర చైతన్యమే. అపుడు నరోత్తముడు, నారాయణుడు ఒక్కరే అవుతారు. కనుక ఇద్దరికీ నమస్కరించాలన్నారు వ్యాసమహర్షి వారు. అయితే నరుడు నారాయణుడు అవటానికి, ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అదుగో ఈ ప్రయత్నం శ్రీ మహాసరస్వతీ ఉపాసనతో వస్తుంది. సరస్వతి అంటే విద్యాధిదేవత పరంపర అని రెండు రకములైన విద్యలు లలితా సహస్రనామంలో పేర్కొనబడ్డాయి.
ఆత్మస్వరూపమయినా మోక్షపురుషార్థానికి సంబంధించిన విద్య అపరవిద్య. నరుణ్ణి నరోత్తముడిగా చేసి నారాయణత్వాన్ని ప్రసాదించే విద్యాస్వరూపిణి- శ్రీమహాసరస్వతి. ‘సరః’ పదము సంచరించు ధాతువునుంచి వ్యుత్పన్నమయింది. అది తేజస్సుకు, కాంతికి సంబంధించినదని మరొక అర్థం. వాగ్దేవత మేధాశక్తిని, బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించునదై, సమస్త విద్యాస్వరూపిణియై తనను భక్తితో ఆరాధించేవారికి యుక్తాయుక్త పరిజ్ఞానమును, వివేచనా శక్తిని, జ్ఞాపకశక్తిని, కల్పనా సామర్థ్యాన్ని, కవితా స్ఫూర్తిని గ్రంథ రచనాశక్తిని, ధారణాశక్తిని ప్రసాదించునట్టి జగన్మాత మహాసరస్వతి అని దేవీ భాగవతము చెప్తోంది. విషయాన్ని ఊహించి, దర్శించి, ఇతరులకు అర్థమయ్యేటట్లుగా, ప్రతిభావంతంగా, నవ నవోనే్మషంగా చెప్పేవాడు ప్రజ్ఞానవంతుడు. ప్రజ్ఞ-ప్రజ్ఞానజన్యం. దాని కాంతియే వాక్కు. దాని రమణీయ అభివ్యక్తమే ఉక్తి. వాక్కు, ఉక్తి, సూక్తి అనేవి సత్య, సౌందర్య శివరూపాలు. ఈ మూడింటి స్వరూపమే మహా సరస్వతి.
సృష్టికి పూర్వం అంతా జలమయం అని చెప్పబడింది. సరస్వతి అంటే జలము కలది అని అర్థము. ఇది నదీవాచకము. నదీ ప్రవాహరూపం. జలములకు ‘సరణాత్’ అను పదానికి ‘జీవనమని’ పేరు. అనగా జీవన ప్రవాహమే- సరస్వతీమాత. విశ్వమందలి, సర్వభూతములు, ప్రాణము అన్నము, అమృతము, వేదముల, సర్వదేవతలు ప్రణవము- అన్నీ జల స్వరూపం అంటే మహాసరస్వతీ స్వరూపం. ఇతిహాస పురాణములు, శ్రుతి స్మృతులు, మహాకావ్యాలు పర్ణ సమామ్నాయం, విశ్వభాషా పదజాలం, అంతా మహాసరస్వతీ స్వరూపం. మహారాజులు కూడా కవి రాజుల్ని గౌరవిస్తారు. మహాసరస్వతిని ఉపాసించినవారికి, లౌకిక సంపదలే కాదు, అలౌకిక ఆధ్యాత్మిక మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ప్రసాదించే జగన్మాత- మహాసరస్వతి. ఉపాసనాబలంతో వాక్సుద్ధి కల్గిన మహాకవులు, తాము మృత్యువును జయించటమే కాక, ఇతరులకు కూడా అమరత్వాన్ని ప్రసాదిస్తారు. ఇందుకు ముఖ్య ఉదాహరణగా నిల్చేవాడు మహాకవి కాళిదాసు.
వ్యాసమహాముని గావించిన స్తోత్రములకు సంతుష్టురాలైన మహాసరస్వతి ‘వాసర’ నగరమున సుమనోహరమగు నదీ తీరమున నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజింపమని అనుగ్రహించింది. శబ్ద బ్రహ్మస్వరూపిణి అయిన జ్ఞాన సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు వ్యాసభగవానులు. తల్లిని కొలిచి ఆమె అనుగ్రహమును పొందినవారి పేరు మీదుగా, వాల్మీకితీర్థము, విష్ణుతీర్థము, శ్రీగణేశతీర్థము, పుత్రతీర్థము, శంకర తీర్థము వెలిసినాయి. ఆ మహాస్థలమే నేటి ‘బాసర’ పుణ్యక్షేత్రం. ‘సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి జగతామాది భూతాతత్వం, జగత్త్వం, జగదాకృతిః’ అని సరస్వతీదేవిని స్తోత్రించారు (బ్రహ్మాండపురాణాంతర్గతం).
‘‘అకారాది క్షకారాంత వర్ణాయవ శాలినీ
వీణా పుస్తక హస్తావ్యాత్ ప్రణోదేవీ సరస్వతి
యావర్ణ పద వాక్యార్థ సర్వ పద్య స్వరూపిణీ
వాచినర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతీ’’
‘అ’కారాది ‘క్ష’కారాంత వర్ణములు ఆ వర్ణములచే వచ్చు పదములు తత్ పదసముదాయ వాక్యములు, గద్య పద్య రూప కవిత- ఈ అన్నింటి రూపమున ఏదేని వెలుగొందుచున్నదో, ఆమెయే సరస్వతీదేవి అన్నారు ఆదిశంకరాచార్యులు.
‘సరస్వతీ శ్రుతి మహతీ మహీయతామ్’ శ్రుతులు- సరస్వతీదేవి మహిమను కొనియాడుచున్నదని, సంగీత స్వరమహితమైన సరస్వతి అధిక మనోహరియై పూజలనందుకొంటున్నదని, ఎనె్నన్నో విశేషార్థాల్ని యిమిడ్చి ఒక చిన్న వాక్యంలో చెప్పాడు- వాగ్దేవీ వరప్రసాదుడు కాళిదాస మహాకవి.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేవి లలిత కళలు. చతుష్షష్టికళలని, 64 కళలు. అందులో ముఖ్యమైనవి నాలుగు. అవి- సంగీతము, సాహిత్యము, నాట్యము, శిల్పము (చిత్రలేఖనము)- ఇవన్నీ మహాసరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనేగాని రావు. తల్లి కటాక్షం సంపూర్ణంగా ఉన్నవారికి, ఆయా కళలలో రాణింపు ఉన్నతంగా ఉంటుంది. మానవ జీవితంలో ముఖ్యమనది వాక్కు, అనగా మన మాట. వాక్కు అంటే శబ్దశక్తి. ఎవరినీ నొప్పించకుండా, చెప్పదలచుకున్న విషయాన్ని చక్కటి మాటలతో చెప్పటమే శబ్దశక్తి ఉపాసన. అందరిచేత ఒక వ్యక్తిగా గౌరవింపబడేటట్లు చేసేది వాక్కు. మాట తీరు మనస్సుకి అద్దంపడుతుంది. మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. కనుక మాట ప్రధానం, మహోదాత్తమయింది. బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి తీసికోవచ్చునేమోగాని, పెదవి దాటిన మాటను వెనక్కి మళ్ళించటం, బ్రహ్మదేవుని తరం కూడా కాదు. కనుకనే మాట మాట్లాడేముందు ఎంతో ఆలోచించాలి. ఇంత సృష్టిలో మాట్లాడే శక్తి మానవుడికే వుంది. మానవుడికి జగన్మాత సరస్వతీదేవి ఇచ్చిన వరం- మాట. దానిని మంచికి మాత్రమే ఉపయోగించుకోవడం సన్మార్గం. ‘సంస్కార క్రియ సంపన్నా మద్రుతామని లంబితామ్, ఉచ్చారయతి కల్యాణీం, వాచం హృదయ హారిణీమ్’.
ఆంజనేయుని వాక్కు అమోఘం, సంస్కార సంపన్నం, మంగళకరమైనది, మనోహరమైనది. ఇటువంటి మంచి మాట తీరుగల్గి, నవవ్యాకరణ పండితుడై, సరస్వతీ కటాక్షమును సంపూర్ణముగా పొందినవాడు ఆంజనేయుడు అని చెప్తూ, అటువంటివాడు ఎక్కడవున్నా జయం కలుగుతుందని చెప్పాడు శ్రీరామచంద్రుడు, శ్రీమద్రామాయణంలో, కిష్కింధకాండలో. ఇదీ సరస్వతీమాత అనుగ్రహం. మాట తీరును మధురతరం చేసి, జీవన సరళిని ఆనందమయం చేసి, మనశ్శాంతిని, ఆత్మస్థైర్యాన్నిచ్చే మహాశక్తి వాగ్దేవి, చదువుల తల్లి సరస్వతీదేవి. శుంభ, నిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు - సోదరులు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. ఎంత తపస్సు చేసినా, సాక్షాత్తూ బ్రహ్మదేవుడు దర్శనమిచ్చినా, వారిలోని రాక్షస చిత్తవృత్తి పోలేదు. ఇంద్రాది దేవతలకు అభయమిచ్చి, వాగ్దేవి తన శరీరమునుండి కౌశికి అనే శక్తిని సృజించింది. ఆ కౌశికియే ‘కాళిమాత’. కాళీశక్తితో రాక్షస సంహారం గావించింది- వాగ్దేవి మహాసరస్వతి. కాలతత్త్వానికి సూచన కాళీమాత. కాలగర్భంలో సర్వమూ ఉదయిస్తాయి, సర్వమూ లయమవుతాయి. సర్వవిద్యాధిష్టాత్రి కాళీమాత. అందుకే ‘బాల’ బీజ మంత్రంతో కాళీశక్తిని అనుష్టించి ఉపాసించి, మాత అనుహ్రాన్ని పొంది, వాక్సుద్ధితో మహాకవియై, సాహిత్య వినీలాకాశంలో దృవతారగా వెలుగొందుతూ చిరస్థాయిగా నిలిచినవాడు కాళిదాస మహాకవి. ఇదీ సరస్వతీ మాత అంశ అయిన కాళీమాత అనుగ్రహం. తమోగుణం నలుపు వర్ణాన్ని సూచిస్తుంది. ఇదే కాళీవర్ణం. రూపం అరూపమైతే అది నలుపు. ప్రళయకాలంలో మానవులు పశుపక్ష్యాదులు అన్ని జీవరాశులు నశించిపోయి, సృష్టి విధానంలో లీనమవుతాయని, కాళీమాత చేతిలోని కపాలం సూచిస్తోంది. కాళీమాతను ఉపాసించి, పరమహంస అయినవాడు రామకృష్ణ పరమహంస.
మనం గాలి వదిలేటప్పుడు ‘హం’ అనే శబ్దంతోటి, శ్వాస లోనికి పీల్చేటప్పుడు ‘సా’ అనే శబ్దంతోటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి. ఇదే ‘హంస’ ‘సోహం. హంస బ్రహ్మకు సర్వతీమాతకు వాహనం. హంస సృష్టికి మూలాధారం. ప్రాణవాయువు. అందుకే నమస్తే వాయో త్వమేనం ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పబడింది. ఉచ్ఛ్వాస అంటే బ్రహ్మస్వరూపం- ప్రాణవాయువు. నిశ్వాసమంటే ‘కర్బనం’. ఈ రెంటినీ లయం చేస్తే, అవి ఎక్కడినుంచి వచ్చాయో అక్కడే కరిగిపోతాయి. అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. ఈ జీవ బ్రహ్మైక్య స్థితిని విశదపరచే జ్ఞానాన్ని ప్రసాదించే జగన్మాత, వేదమాత, యోగ విద్యాప్రదాయిని మహాసరస్వతి.
‘‘సరస్వతీ మతి మాకు చాలంగ నిమ్ము, పరమేష్టి రాణి మము పాలించవమ్మా, పల్లకీ మృదుపాణి వరనీలవేణి, పల్లవారుణపాణి పరమ కల్యాణి, జలజ సంభవురాణి సైకితశ్రోణి అలివేణి, శుకపాణి అష్టావధాని, కరుణ కదంబ చక్కని శారదాంబ’’ అని దసరా పద్యములలో (ఏడు దశాబ్దముల క్రిందటి పద్యములు) వాగ్దేవీ స్తుతి, ఈ పద్యం. విద్యారంభకాలములోనే కాక, సర్వదా ఆరాధింపబడుతూ ఎప్పుడూ సద్బుద్ధి నొసగే స్ఫూర్తినిచ్చి, తీర్చిదిద్ది విద్యాధనమే సర్వధన ప్రధానం అన్న సూక్తికి స్ఫూర్తిగా నిల్పి సర్వవిశ్వాన్ని సుసంపన్నం చేస్తున్న చదువులతల్లి సరస్వతీదేవి. లోచనములకు గోచరమే గాని, జ్ఞానజ్యోతి మహాసరస్వతీమాత. సంపూర్ణ శరణాగతితో ఆర్ద్రతతో అర్థిస్తే, ఉపాసిస్తే ఆశీర్వదించి కటాక్షిస్తుంది.
చదువవది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనగ మంచి కూడ నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చుటయ్య భాస్కరా!
ఎంత చదువు చదువుకున్నా రసజ్ఞత ఇంచుక చాలకుంటే, ఆ చదువువల్ల ఏం ప్రయోజనం? కూర ఎంత మంచిదైనా, దాన్ని అనుభవజ్ఞులైన వారు బాగా వండినా ఉప్పులేకుంటే అది రుచిగా ఉంటుందా? అని అడిగారు భాస్కర శతకకర్త. తనలో వున్న జాంతవ ప్రకృతి క్షాళన చేసికొని, రాక్షస ప్రవృత్తిని రూపుమాపుకొని, మానవ ప్రకృతిని మధురంగా పండించుకుని అంకురించే దైవీ తత్త్వాన్ని, దేదీప్యమానంగా ప్రకాశింపచేసికోవాలి. అదే రసజ్ఞత. చదువుతోపాటు రసజ్ఞతను కూడా అనుగ్రహించే తల్లి సరస్వతీదేవి. ‘‘చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్యశాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ’’- తనకు చదువు ఎంత అబ్బినదో పరీక్షించాలనుకున్న తండ్రి హిరణ్యకశపునితో, తనయుడు ప్రహ్లాదుడు అన్నమాటలు, మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి పూజకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. ప్రాప్తించిన జ్ఞానాన్ని, స్వార్థరహితంగా, సమాజ శ్రేయస్సుకుపకరించి విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తుంది చదువులతల్లి సరస్వతీదేవి.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464