మెయన్ ఫీచర్

ఇరకాటంలో ఇమ్రాన్ ఖాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌వైపు చూస్తు న్నాయి. విశ్వవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గుజ రాత్‌లోని సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు చెప్పారు. గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో పలు దేశాల నుండి వ్యక్తమైన సానుకూల ధోరణులతో ఆయన ఈ మాట అన్నట్లు స్పష్టం అవుతోంది. వివిధ దేశాలు భారత్‌ను ఏవిధంగా గౌరవిస్తున్నాయో అన్న విషయాన్నీ అలా ఉంచితే, ప్రధాని మోదీ ప్రసంగించిన కొద్ది సేపటికే ఐక్య రాజ్యసమితా సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పెరిగిన భారత్ ప్రతిష్టను వెల్లడి చేస్తుంది. కేవలం 15 నిముషాలు మాత్రమే మాట్లాడవలసి ఉండగా, సుమారు 50 నిముషాలసేపు మాట్లాడి, భారత్ పై ఆయన నిప్పులవర్షం కురిపించిన తీరు చూస్తే ఒక విధంగా సానుభూతి కలుగుతుంది. ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారని, దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారని భావించవలసి ఉంటుంది.
ఒక అంతర్జాతీయ వేదికపై బహిరంగంగా అణు యుద్దానికి సై అంటూ ఇమ్రాన్ చేసిన ప్రసంగం దౌత్య వర్గాలను సైతం విస్మయం కలిగించింది. ఆయన మతి చలించి ఆ విధంగా మాట్లాడుతున్నారా? అనే అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. సైన్యం కబంధ హస్తాల లో కీలుబొమ్మగా చిక్కుకొని పాలన సాగిస్తున్న ఇమ్రాన్ ఖాన్ స్వతంత్రించి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పాక్‌లో మూడోవంతు సంపద సైన్యకాధికారుల చేతులలోనే ఉంటుంది. సరిహద్దులలో ఉగ్రవాదాన్ని ప్రో త్సహించడం ద్వారా గంజాయి అమ్మకాలు, ఆయుధాల వ్యాపారాలలో భారీ ముడుపులు పొందటం వారికి వ్యాపకంగా మారింది. అందుకనే మరే ప్రజాస్వామ్య దేశాలలో లేని విధంగా అక్కడి సైనికాధికారులు దేశ, విదేశాలలో ఆస్తులు సమకూర్చుకొని, విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. వారికి రాజకీయ నాయకత్వం అణిగిమణిగి ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన జూనియర్ అధికారిణి విదిష ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న దేశంగా పాక్ వికార స్వరూపాన్ని ప్రపంచం ముందుంచారు. ఐక్యరాజ్య సమితి నిషేధించిన 130 మంది ఉగ్రవాదులు, 25 ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించిన దేశంగా పాక్ నగ్న స్వరూపాన్ని ఆమె బహిర్గతం చేశారు. ఆమె చేసిన ఆరోపణలను ఖండించే సాహసం కూడా పాక్ చేయక పోవడం గమనార్హం.
ఎందుకు ఇమ్రాన్ ఖాన్ ఇంతగా అసహననానికి గురయ్యారు? ప్రపంచంలో తన పట్ల ఎవరూ సానుభూతి చూపే ప్రయత్నం చేయకపోవడంతో దిక్కుతోచడం లేదు. భారత్‌పై చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ పట్టిం చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా అంతర్జాతీయ సమాజం చూస్తున్నది. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో తనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఎదురు చూస్తిన పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశ ఎదురైనది. అది భారత్ ఆంతరంగిక అంశమని దాదాపు అన్ని దేశాలు స్పష్టం చేశాయి. చివరకు మిత్రదేశమైన చైనా, సౌద్ అరేబియా, ఇతర అరబ్ దేశాలు సహితం పాక్‌ను ఆదుకొనే ప్రయత్నం చేయడం లేదు.
అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకి చేయడం భారత్ సాధించిన అసామాన్యమైన దౌత్య విజయంగా పేర్కొ నవచ్చు. పాకిస్థాన్‌ను ఆ విధంగా చక్రబంధం చేసిన ఖ్యాతి మాజీ విదేశాంగమంత్రి జస్వంత్ సింగ్‌కు దక్కు తుంది. స్వతంత్ర భారత దేశంలో అత్యంత విజయ వంతంగా, సామర్ధ్యంతో పనిచేసిన విదేశాంగమంత్రిగా ఆయనను పేర్కొనవచ్చు. ఆయన సామర్ధ్యం కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌ను ఏకాకి చేసినప్పుడే బైట పడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ వెంటనే కార్గిల్ నుండి వెనుతిరిగి వెళ్లిపొమ్మని నవాజ్ షరీఫ్‌ను హెచ్చరించవలసి వచ్చింది. ఆ యుద్ధంలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ మళ్లీ భారత్ పై యుద్దానికి కాలుదువ్వే ధైర్యం చేయలేదు. జస్వంత్ సింగ్ చౌకబారు రాజకీయ ప్రచారం కోసం వెంపర్లాడకుండా భారత్ జాతీయ, రక్షణ పరమైన ప్రయో జనాలను కాపాడేందుకు ఎంతో కృషిచేశారు. అప్పటి వరకూ పాకిస్థాన్ అమెరికాకు ఇష్టమైన దేశం. ఈ దేశానికి అమెరికా అన్ని విధాలా ఆయుధాలు, ఆర్థికంగా, దౌత్య పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నది. తొలి నుం డి భారత్ రష్యాకు సన్నిహితంగా ఉండడంతో అమెరికా దూరంగా జరుగుతూ వచ్చింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో నిక్సన్ భారత్‌తో స్నేహం పట్ల ఆసక్తి ప్రదర్శించినా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. అటువంటి సమయంలో వాజపేయి ప్రభుత్వం రాగానే పోక్రాన్ అణు పరీక్షలు జరపడంతో అమెరికా, ఇతర ఐరోపా దేశాలు భారత్ పై ఎన్నో ఆంక్షలు విధించాయి.
ఇటువంటి క్లిష్ట సమయంలో అమెరికాతో స్నేహం పెంపొందించుకోవడంతో పాటు, పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టిన ఘనత జస్వంత్ సింగ్‌కే దక్కుతుంది. ఆయన చేసిన ప్రయత్నాల కారణంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం చేసుకోగలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోగలుగుతున్నది. నేడు కేవలం పాకిస్థాన్‌నే కాకుండా, ఆ దేశానికి మద్దతుగా వస్తున్న వారిని కూడా భారత్ నిలదీయగలుగుతున్నది. ఆర్టికల్ 370 ప్రభావాన్ని జమ్మూ కశ్మీర్ పై తొలగించిన తర్వాత తమ తదుపరి లక్ష్యం ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమేనని హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగంగా చెప్పగలిగారు. గతంలో వాజపేయి హయాంలో మూడు సార్లు అందుకు ప్రయత్నాలు జరిగినా వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదు. అంతకుముందు పీవీ నరసింహారావు ప్రభుత్వం సహితం అందుకు ప్రయత్నం చేయకపోలేదు. కానీ ఇప్పటివలె బహిరంగంగా ఆ మాట భారత్ గతంలో అనలేక పోయింది.
మొదటిసారిగా చైనాను భారత్ ప్రశ్నించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) గురించి సమాధానం చెప్పిన తర్వాత కశ్మీర్ విషయం గురించి మాట్లాడితే బా గుంటుందని భారత్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- ‘ఎప్పుడూ మీ దేశంలోని ముస్లింల గురించే మా ట్లాడతావు, ఇతరుల ప్రస్తావన తీసుకు రావేం?’ అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను నిలదీశారు. 1947లో పాక్‌లో 34 శాతం మేరకు ఉన్న మైనారిటీలు ఇప్పుడు 3 శాతానికి తగ్గి పోవడాన్ని ప్రపంచం గమనిస్తున్నది. మరోవంక కశ్మీర్ లోని ముస్లింల హక్కుల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్న పాకిస్థాన్ తన మిత్రదేశం చైనాలో భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్న ముస్లింల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని అమెరికా దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల శాఖ తాత్కాలిక సహాయ మంత్రి అలిస్ వేల్స్ ప్రశ్నించారు. చైనాలోని జిన్‌జియాంగ్ రాష్ట్రంలో పది లక్షల మంది ఉయ్‌గుర్ ముస్లింలను నిర్బంధంలో ఉంచినా ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పందించకపోవడంపై నిలదీశారు.
వాస్తవానికి ఇప్పుడు పాకిస్థాన్‌తో అమెరికాకు చాలా అవసరం ఉంది. 18 ఏళ్ళ తర్వాత ఆఫ్ఘానిస్తాన్ నుండి వైదొలగడానికి తాలిబన్‌లతో సయోధ్య కోసం వారికి పాకిస్థాన్ అవసరం ఉంది. మరోవంక ఇరాన్ తో నెలకొన్న సమస్యలలో పాకిస్థాన్ అవసరం ఉండగలదు. అయినా కూడా కశ్మీర్, ఉగ్రవాదం విషయాలలో బహిరంగంగా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వలేని పరిస్థితులలోకి అమెరికాను భారత్ నెట్టివేయ గలిగింది. అమెరికాలోని హూస్టన్‌లో ‘హౌడీ మోడీ.’ కార్యక్రమానికి లభించిన అనూహ్య స్పందన అందుకు నిదర్శనం. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. అమెరికాలో భారత సంతతి వారు ఆ దేశ జనాభాలో 1 శాతానికి మించి లేరు. అయినా వారు డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్తవ్రేత్తలు, వ్యాపారులు కావడంతో సమాజంలో విశేషమైన ప్రతిష్ట, పలుకుబడి గలవారు. దానితో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వారి మద్దతు కీలకం కానున్నది. సాధారణంగా 70 నుండి 80 శాతం వరకూ డెమొక్రాట్ అభ్యర్థులకే భారత సంతతి వారు ఓట్లు వేస్తున్నా, ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రెండు డజన్ల మంది భారత సంతతి వారిని కీలక పదవులలో నియమించడం ద్వారా వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘హౌడీ మోడీ.’కి ట్రంప హాజరయ్యారు.
గతంలో సౌదీ చమురు కంపెనీలు మనదేశంలో విడుదల చేసే ఉద్యోగ ప్రకటనలపై ‘ముస్లింలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి’ అంటూ పేర్కొనేవి. కానీ వాజపేయి ప్రభుత్వ హయాం నుండి ఆ విధంగా పేర్కొనే సాహసం చేయడం లేదు. తమ వాణిజ్య, రక్షణ అవసరాల కోసం భారత్‌కు వ్యతిరేకంగా ఉండలేమని ప్రపంచంలోని ముస్లిం దేశాలు నేడు గ్రహించాయి. ఈ పరిణామాలన్నీ నేడు పాకిస్థాన్‌ను ఏకాకిగా చేస్తున్నాయి.
ఒక వంక పాక్ ఆర్ధిక పరిస్థితి దిగజారుతున్నది. బిం కానికి పోయి భారత్ పై వాణిజ్య ఆంక్షలు విధించడంతో ఎక్కువగా నష్టపోతున్నది ఆ దేశమే. మరోవంక ఆ దేశంలో పలు ప్రాంతాలలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మరెంతోకాలం తమను అణచివేసి ఉం చలేరని వివిధ వర్గాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం చేస్తున్న సమ యంలోనే పాకిస్థాన్ కు చెందిన పలువురు అక్కడ నిరసన ప్రదర్శనలు జరిపారు. పాక్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెటుతున్నాయి. భారత ప్రధాని వాజపేయి శాంతి సందేశంతో లాహోర్‌కు వెళ్లి, ఆ దేశ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ తో సంయుక్త ప్రకటన చేస్తున్న సమయంలోనే కార్గిల్‌లో యుద్ధ సన్నాహాలు చేస్తున్న అక్కడి సైన్యం పట్ల ప్రపంచంలో విశ్వాసం సన్నగిల్లింది. నేడు మొత్తం ప్రపంచానికి ఉగ్రవాదం పెను ప్రమాదంగా పరిణమించింది. దాంతో ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్ కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితులలో ప్రపంచ దేశాలు ఉన్నాయని పాకిస్థాన్ గ్రహించాలి. ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకొని పొరుగు దేశాలపై ఆధిపత్యం వహించే ప్రయత్నంలో తమ దేశాన్ని కూడా అదే ఉగ్రవాదం కాటు వస్తుందని పలు సంఘటనల తర్వాత కూడా పాకిస్థాన్ గుర్తించినట్లు కనబడటం లేదు. పాక్ సైన్యం, ఐఎస్‌ఐ నేతృత్వంలోనే అక్కడ ఉగ్రవాదానికి అండదండలు లభిస్తున్నాయని ఇప్పుడు మొత్తం ప్రపంచం గుర్తించింది. ఆ విధంగా గుర్తించేటట్లు చేయడంలో భారత్ దౌత్య నీతితో విజయం సాధించింది. సైన్యాన్ని ఎదిరించి ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేని నిస్సహాయ పరిస్థితులలో ఇమ్రాన్ ఖాన్ దిక్కుతోచక భారత్ పై విషం జల్లే ప్రయత్నం చేసిన్నట్లు ఆయన తీరు స్పష్టం చేస్తున్నది. గతంలో డోనాల్డ్ ట్రంప్ ను కలవడానికి వెళ్లిన సమయంలో తన వెంట పాక్ సైన్యాధిపతి జనరల్ ఖమార్ బజ్వాను కూడా ఇమ్రాన్ ఖాన్ తీసుకు వెళ్లడం గమనార్హం.

-చలసాని నరేంద్ర 98495 69050