మెయిన్ ఫీచర్

బంగారం వద్దు.. ఇనుము ముద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్‌తేరస్ పండుగకు ‘బంగారం’ కొనకుండా.. ‘ఐరన్’ను తీసుకోండి అనే నినాదంతో సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో ‘పండుగరోజు ఎందుకు బంగారం వెంట పరుగులు పెడతారు? మీ ఒంట్లోని ప్రతి నరంలో ఐరన్ పరుగులిడాలి.. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉండి.. బంగారం కంటే ఎక్కువగా కాంతులీనుతుంది.. ఐరన్‌ను తినండి.. ఐరన్ అంటే ఐరన్ కాదు.. ఇనుము ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తినండి.. ఇదే సొంత ఆభరణాలకంటే ఐరన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తినడం ముఖ్యం. ఎందుకంటే భారతదేశంలోని ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఫలితంగా.. శరీరంలో చాలా రకాల సమస్యలు మొదలవుతాయి. కాబట్టి.. బంగారానికి డబ్బులు ఖర్చు పెట్టే బదులు.. ఐరన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తిని ఆరోగ్యంగా ఉండండి..’ అంటూ ధన్‌తేరస్ కానుకగా ఒక చక్కటి వీడియోని తయారుచేశారు. కాబట్టి ఈ దీపావళి నుంచి అయినా ఏ ఖనిజ లోపం లేకుండా ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండి, సంతానాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్ది, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనేదే ఈ వీడియో ముఖ్య లక్ష్యం. వివరాల్లోకి వెళితే..
మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందాలంటే.. ఇనుము.. అదేనండీ.. ఐరన్ అవసరం. ఇనుము చాలా ముఖ్యమైన ఆహార ఖనిజము. ఇది వివిధ శారీరక విధులను నిర్వర్తిస్తుంది. రక్తంలో ఉన్న ఆక్సిజన్‌ను ఈ ఖనిజం కణాలకు చేరుస్తుంది. ఇది సాధారణంగా హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడటానికి ప్రసిద్ధి చెందింది. ఎర్రరక్తకణాలు శరీరం అంతటా ప్రాణవాయువును పంపిణీ చేసే ఒక ప్రొటీన్. శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే కణజాలం, కండరాలు తగినంత ఆక్సిజన్ లభించవు.. ఫలితంగా సమర్థవంతంగా పనిచేయలేవు. ఇది రక్తహీనత లేదా అనీమియా పరిస్థితికి దారితీస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల రోజూ ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు గంటల తరబడి నిర్విరామంగా శ్రమిస్తున్న మహిళలు తమ ఆహారం విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. అందుకే భారతదేశంలో దాదాపు 60 శాతానికి పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇందులో ప్రమాదపుటంచుల్లో ఉన్న మహిళలు దాదాపు 22 శాతమేనని చెబుతున్నారు వైద్య నిపుణులు. 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికల్లో రక్తహీనత అధికంగా ఉంటోంది. వీరిలో దాదాపు 60 శాతం మందికి పైగానే బాధపడుతున్నారు. పెద్దల్లో ఇనుమును తగినంత తీసుకోకపోవడం, దీర్ఘకాలిక రక్త నష్టం, గర్భధారణ సమయంలో శరీరానికి ఇనుము అవసరం పెరుగుతుంది. రుతుస్రావం సమయంలో రక్తం కోల్పోవడమే ప్రధాన కారణం. ఇనుము లోపం జ్ఞాపకశక్తి లేదా ఇతర మానసిక పనితీరు టీనేజర్లలో ప్రభావాన్ని చూపవచ్చు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం 19 నుండి 50 సంవత్సరాల వయస్సు గల స్ర్తిలు.., రోజువారీ ఆహారంలో 18 మిల్లీగ్రాముల ఐరన్‌ను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో రోజుకు 27 మిల్లీగ్రాముల ఇనుమును తీసుకోవాలి.
అనేకమంది మహిళలకు తాము రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు కూడా గుర్తించలేకపోతుంటారు. రక్తహీనత అల్పాదాయ వర్గాల మహిళల్లో ఎక్కువగా ఉంటున్నా.. ఇది వారికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారిలో కూడా గణనీయ సంఖ్యలోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యులు అంటున్నారు. ఆహారపరంగా స్వల్ప మార్పులు చేసుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించే అవకాశం ఉంది. సహజంగా మహిళల్లో 12 నుంచి 15.5 శాతం హిమోగ్లోబిన్ ఉంటే వారికి రక్తహీనత లేనట్లుగా పరిగణిస్తారు. తీసుకునే ఆహారంలో ఇనుము, ప్రొటీన్లు, తగినంత సి విటమిన్ ఉంటే రక్తహీనత ఉండదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి చాలామంది మహిళలు ఆహారం తీసుకోవడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ఇంట్లో అందరూ తిన్న తర్వాత తినడం, ఏవి మిగిలితే అవి మాత్రమే తిని ఊరుకోవడం వంటి కారణాల వల్ల వారిలో ఈ సమస్య తలెత్తుతోంది. హిమోగ్లోబిన్ మరీ తక్కువగా ఉండి ఆరోగ్య పరిస్థితి కలవరపరిచేదిగా ఉన్నవారు సకాలంలో గుర్తించి, తగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
రక్తహీతనతో బాధపడుతున్నవారిలో అత్యధికులు పేదలే.. ఇలాంటివారి కోసం మహిళా శాఖ సంక్షేమ శాఖ నగరంలో దాదాపు 950 వరకు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇక్కడ గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం ఉచితంగా అందిస్తారు. ఈ అవకాశాన్ని అనేకమంది ఉపయోగించుకోవడం లేదు. ఒక పట్టణంలోని ఆరోగ్య కేంద్రాలకు వచ్చి దాదాపు తొంభై వేల మంది పరీక్షలు చేయించుకోగా.. అత్యధికులుగా రక్తహీనత ఉన్నట్లు వెల్లడైంది. కానీ వీరిలో అధికశాతం మంది సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పౌష్టికాహారం తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుతం కేవలం 13 వేల మంది మాత్రమే ఈ కేంద్రాలకు వచ్చి ఆహారం తీసుకుంటున్నారు.
రక్తహీనతతో వచ్చే సమస్యలు
* ప్రాణవాయువు సక్రమంగా అందదు. ఫలితంగా త్వరగా నీరసం వచ్చేస్తుంది.
* గుండెకు తగినంత రక్తప్రసరణ ఉండదు. ఈ కారణంగా బలహీనపడే అవకాశం ఉంది.
* కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
* కండరాలు బలహీనమవుతాయి.
ఐరన్ ఎంత అవసరం?
మహిళలు పుట్టినప్పటి నుంచి ముసలివారు అయ్యేంత వరకు ఎవరికి ఎంత ఐరన్ అవసరమో ఒకసారి తెలుసుకుందాం.
* పుట్టిన పిల్లల నుంచి ఆరు నెలల వయసున్న పిల్లలకు ప్రతిరోజూ 0.27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.
* ఏడు నుంచి 12 నెలల వయసున్న పిల్లలకు రోజులో 11 మిల్లీగ్రాములు ఐరన్ అవసరం.
* ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఏడు మిల్లీగ్రాములు అవసరం.
* నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసున్న వారికి 10 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.
* తొమ్మిది నుంచి 13 సంవత్సరాల వయసు ఉన్నవారికి ఎనిమిది మిల్లీగ్రాములు, 14 నుంచి 18 సంవత్సరాల వయసున్నవారికి 15 మిల్లీగ్రాములు, 19 నుంచి 50 సంవత్సరాల వయసున్న ఉన్నవారికి ప్రతిరోజూ 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. 51 సంవత్సరాలు పై బడిన వారికి 8 మిల్లీగ్రాముల ఐరన్ సరిపోతుంది.
రోజూ తీసుకునే ఆహారంలో.. ముఖ్యం గా కూరగాయలు, మాంసాహారంలో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. పాలకూర, మునగాకు, టమోటాలు, గుమ్మడికాయ విత్తనాలు, నట్స్, కోడిగుడ్డు, సోయా, జీడిపప్పు, మటన్, మటన్ లివర్, రొయ్యల్లో ఎక్కువగా ఇనుము లభిస్తుంది. నిత్యం వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. మరి ధన్‌తేరస్ రోజు బంగారం కొనకుండా జీవితాంతం ఆరోగ్యంగా బతకడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికే ప్రాముఖ్యతనిస్తారు కదూ..