మెయిన్ ఫీచర్

అచల కందార్థాలకు ఆద్యుడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రియతని శిషువుండీ
భువి బరుశరామ వంశోద్భవు సీతారాములతని భక్తుడ సుమీ
తద్బోధ ప్రయుక్తడ సుమీ స్తవనీయులగు మీరుత్సాహముతో
నీ కథ వినుడు నే గందార్థములచే వినిపింతు భక్తుడ సుమీ’’
అంటూ తమ గురు పరంపరను, తాను తెలుగు సాహిత్యంలో కందార్థాలు అనే పేరుతో ఓ ప్రక్రియ సృష్టించి ఆధ్యాత్మిక భావజాలాన్ని కొత్తపంథాలో నడిపిన మహనీయుడు భాగవతుల కృష్ణప్రభువు. ఇతడు క్రీ.శ.1823లో జానకమ్మ, నారాయణ దాసు అనే పుణ్య దంపతులకు నేటి యాదాద్రి క్షేత్రం ప్రక్కనున్న కొలనుపాకలో జన్మించారు. కొలనుపాక శైవ, జైన, కుల పురాణ విషయాలకు ప్రసిద్ధి. వీరిది హరికథల కుటుంబం కావడంవల్ల నారాయణదాసు సహజంగానే పండితుడు. ఈ దాసుగారి ప్రథమ సంతానం కృష్ణదాసు. ఆ కాలంలో లక్ష్మి అనే యువతినిచ్చి బాల్యంలోనే కృష్ణదాసుకు వివాహం చేసారు. ఆమె గతించగా లక్ష్మి సోదరినే వివాహం చేసుకుంటే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు కలిగారు. ఇదీ వారి గురించి లోకానికి తెలిసిన వ్యక్తిగత సమాచారం.
కృష్ణదాసు మొదట భద్రాచల రామభక్తుడు. ఓసారి కొందరు సాధువులు వారింటికి సంచార వంశంగా వచ్చినారు. వారిని కృష్ణదాసు విచారిస్తే ‘‘నీకు తారకమంత్రం ఉపదేశించేందుకు మేం భద్రాచలం నుండి వచ్చాం’’ అన్నారు. ‘తారకమంత్రం కోరిన దొరకును’ అన్నట్లుగా వారి దృష్టి వైరాగ్యంవైపు వెళ్లింది. వెంటనే వారు ఆశువుగా వారికి ఓ ‘రామాయణ కీర్తన’ వినిపించారు. దాంతో వాళ్లు సంతోషపడి ‘‘దాసూ! ఇదిగో రామతారకమంత్రం అంటూ చెప్పి, నీవు వచ్చి భద్రాచల రాముడికి నీ కీర్తనలు వినిపించు’ అని ఆదేశించారు. వెంటనే దాసు సకుటుంబంగా వెళ్లి భద్రాచలంలో సంగీత కచేరి నిర్వహించి ఇంటికి చేరారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వరుసగా కాలధర్మం చెందగా వైరాగ్యం పొంది ఏకుతార, చిటికెలు చేత బట్టి పాదయాత్రగా భద్రాచలం వెళ్లాడు. అక్కడ బుచ్చి వెంకమ్మ అనే గొప్ప భక్తురాలు ఆయనకు తారసపడి ‘నాయనా! కాలవశంగా జరిగినదానికి చింతించడం నిజమైన వేదాంతి లక్షణం కాదు. పల్నాడులోని ఎర్రగొండపాలెంలో శివరామదీక్షితుల శిష్యుడు కంబలూరి అప్పబ్రహ్మం, వారి శిష్యుడు పరుశరాముల సీతారామస్వామిన్నారు. వారిని దర్శిస్తే నీకు కావలసిన ఆధ్యాత్మిక బోధన సంపూర్ణమవుందని చెప్పింది.
శ్రీ శివరామ దీక్షితులు (క్రీ.శ. 16909-1791) తెలుగునాట ‘అచల సిద్ధాంతాని’కి జీవం పోసిన గొప్ప గురువరేణ్యుడు. ఆయన నల్లగొండ జిల్లాలోని సంస్థాన నారాయణపురంలో జన్మించాడు. ‘‘శ్రీమద్బృహద్వాశిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షితీయం’ అనే గ్రంథం రచించి ఆధ్యాత్మిక లోకంలో గొప్ప సంచలనం కలిగించాడు. సంస్కరణాదృష్టితో నిజమైన ఆధ్యాత్మిక వాదాన్ని ‘అచల సిద్ధాంతం’ పేర లోకంలోకి తెచ్చినవాడు. ఆయన చేసిన ఈ పెనుమార్పు ఎర్రగొండపాలెం వరకు ప్రాకింది. అక్కడి కంబలూరి అప్పమంత్రి, పరుశరాముల సీతారాములను ప్రభావితం చేసింది, స్ర్తి, పురుష, కులభేదం లేని ఆధ్యాత్మిక మార్గం అచలం. అలాంటి అచల సిద్ధాంతం పరశురాముల సీతారాముల నుండి స్వీకరించిన కృష్ణప్రభువు హైదరాబాద్‌కు వచ్చి ఫీల్ఖానా కేంద్రంగా తన ఆధ్యాత్మిక ప్రసారం మొదలుపెట్టాడు. కృష్ణప్రభువు ఆనాడు హైదరాబాద్‌లోని ఎందరో అధికారులను, గొప్ప వ్యక్తులను తన వైపు ఆకర్షించాడు. కృష్ణదాసు ఆధ్యాత్మిక కీర్తనలు, శక్తిద్వయ నిరాసక్త శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు, జాలమాంబ ఉపదేశించిన ద్వాదశ బోధలు, భగవద్గీత సారాంశ జ్ఞానము, వేదాంత వార్తికము, హంస సంచార క్రమ వివరము అనే ఆరుకృతులు రచించాడు. అందులో ‘శుద్ధ నిర్గుణ కందార్థాలు’ ఓ క్రొత్త సాహిత్య ప్రక్రియ. కృష్ణదాసు తర్వాత ఎందరో వీటిని అనుసరించారు. పెద్ద కంద పద్యంలా ఉండే ఈ కందార్థం భజనలు, యక్షగానాలు, బయలాటలు, అన్ని కశారం గాల్లోకి ప్రవేశించింది. అయితే ఇది ఆధ్యాత్మిక విషయ పరిపుష్టికి బాగా ఉపయోగపడింది. కృష్ణదాసును కృష్ణప్రభువు అని పిలుస్తారు.
‘‘మనసిచ్చి వినుడి యికనొక / మనవిది నాపాలి గురుని మదిలోపల/ నేనచుకొని పెద్దలాజ్ఞను / పనిబూనుక చేసితిట్టి పద్యములు విన్న / దప్పొప్పులేర్పడ దిద్దుడన్న’’ అంటూ వినయంగా పలికాడు. కృష్ణదాసు 302 కందార్థాలు రాసి 110కి వ్యాఖ్యానం కూడా చేయడం విశేషం.
‘‘పుట్టుట గిట్టట లేకను పుట్టే గిట్టేటి యెరుకపోడి యెరుగన్
చట్టువలె కదలకుండును బట్టబయల్ యిట్టిదెరిగి భావింపదగునూ
యెరుక లేక సేవింపదగునూ
వట్టి ఆశల చాత పట్టుబడకను రుూ గుట్టూ దేశికునోట గట్టిగా
దెలుసూక భావింపదగునూ యెరుక లేక సేవింపదగునూ’’
శిష్యా! జనన మరణములు లేనిది బయలు. జన మరణములు గలది ఎఱుక. బయలు ఎరుకను ఎరుగక (చట్టు) పర్వతములాగా కదలక మెదలక ఉన్నది. ఈ కదిలే, మెదిలే ఎఱుకవల్ల పరిపూర్ణం ఎరిగి సేవించాలి. వృధా ఆశలను పొందకుండా ఈ రహస్యం దేశికుని ద్వారా పొందాలి. ఇది అచలం యొక్క మూల సిద్ధాంతంగా కృష్ణప్రభువు తేటతెలుగులో చెప్పిన వేదాంతం. సంస్కృత శ్లోకాలకు మాత్రమే పరిమితమైన మన దర్శనాన్ని సామాన్యులైన పామరులకు దరిచేర్చే భాషకు కృష్ణప్రభువు బాటలు వేశాడు. ఎరుక, బయలు, పూర్ణం.. అనే మాటలను రోజువారిగా మనం చూసే ఉపమానాలకు జోడించి వేదాంత రహస్యాలను కందార్థాల నిండా నింపాడు. శుద్ధ నిర్గుణ కందార్థాలు 4-12-1843 నాటికే పూర్తి అయినట్లు తెలుస్తున్నది.
‘‘ఎరుకయుదయమెట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగి
న్ యెరుకెట్లు పోవునన్నను కరిమ్రింగిన వెలగపండు కరణిగనెరుగు
తిరిగిరాని కరణియనెరుగు పరిపూర్ణమన్నది యెరుక తానెరిగితి
యెరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణిగనెరుగు
శిష్యా! ఎరుక పుట్టిన విధం వినుము. టెంకాయలో నీళ్లు ఎలా చేరుతాయో అలాగే పరిపూర్ణంలో ఎఱుక తనంతకు తానే పుడుతుంది. మరియు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుజ్జు ఎలా మాయమవుతుందో అట్లే ఎరుక పరిపూర్ణాన్ని విడిచి తనకు తానే వెళ్లిపోతుంది. పరిపూర్ణం నిజస్థితి తెలిసాక ఆ ఎరుక భస్మాసురునిలాగా తనకు తానే భస్మం అవుతుంది. ఇలా చక్కని చిక్కని వేదాంతాన్ని అందించిన మహానుభావుడు కృష్ణప్రభువు.
తల్లావఝల జాలమాంబ వంటి స్ర్తిమూర్తిని శిష్యురాలిగా చేసుకొన్నాడు. అంతేగాక ఆమెను తత్వాలు, మంగళారతులు రచించే విధంగా తీర్చిదిద్దాడు. ‘గురునకు మంగళమనరమ్మా’ అన్న మంగళారతిపాట జాలమాంబదే. అలాగే ఆనాడు నిజాం ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో వున్న ఫీర్ఖానా లక్ష్మణ దేశికులు, ఫీల్ఖాన శంకర ప్రభువులకు ఉపదేశమిచ్చి వారిని గొప్ప గురువులుగా తీర్చిదిద్దాడు. అచల సిద్ధాంతాన్ని కృష్ణప్రభువు మార్గంలో ఎందరో తెలుగునాట ముందుకు తీసుకెళ్లారు. సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత, భారలింగ ప్రభువు, శేషమాంబ వంటి గురువులెందరో అచల మార్గంలో తమ యోగదానం చేశారు. నిరక్షరాస్యులైన వారిలో వేదాంతజ్ఞానం కలిగించిన అచల గురువులకు, తత్వకవులకు భాగవతుల కృష్ణప్రభువు దిక్సూచిగా అయ్యాడు. శివరామదీక్షితుల సిద్ధాంతాలను అందించడంలో కృష్ణప్రభువు అతని శిష్యపరంపర సఫలీకృతం అయింది. ఈ రోజు తెలుగు నాట వేలాది ఆశ్రమాలు, లక్షలాది మంది అచల భక్తులున్న సమాజంగా తీర్చిదిద్దబడింది. తెలుగు ప్రాంతంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత స్థానం కృష్ణప్రభువు రచించిన కందార్థాలదే. అచల మతబోధకుల్లో ఈ కందార్థాల పాదు ఎంత గట్టిగా నిలబడిందంటే అచల గురించి ఏది చెప్పాలన్నా ఆ కందార్థంలోనే చెప్పాలన్నంతగా రూఢైపోయింది. అలాంటి కందార్థ సాహిత్యానికి బీజావాపనం చేసిన ఆధ్యాత్మికవేత్త కృష్ణదాసు అచ్చతెలుగు భాషకు, తెలంగాణ పలుకుబడులకు పట్టంగట్టాడు. ఇంత గొప్పగా ఆధ్యాత్మిక, తాత్విక పరిజ్ఞానం అందించిన భాగవతుల కృష్ణప్రభువు క్రీ.శ.1876లో దేహత్యాగం చేశాడు.
(నేడు భాగవతుల కృష్ణప్రభువు 143వ జయంతి బ్రహ్మోత్సవం సందర్భంగా..)

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com