మెయిన్ ఫీచర్

సద్బుద్ధి ప్రదాత శ్రీరామ దూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగితాం
అజాడ్యం వాక్బుటుత్వంచ హనుమాన్ స్మరణాభవేత్’’
హైద్రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వున్న ఆలయాలు ఎన్నో లెక్కపెట్టలేనివి. ఇక చుట్టుప్రక్కల ఎన్నో మందిరాలు, గ్రామదేవతలు, ఆలయాలు, చారిత్రక నేపథ్యం కలిగినవి చాలా ఉన్నాయి.
అటువంటి దేవాలయాల్లో ఎన్నికగన్నది కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం. కర్మన్‌ఘాట్‌కు నిర్వచనం- కరోమన్‌ఘట్- కరో అంటే చేయుము. మన్ (మసన్సును) ఘట్ (దృఢంగా) అన్నమాట. అదే కర్‌మన్‌ఘాట్, వ్యావహారిక భాషలో కర్మన్‌ఘాట్‌గా ప్రసిద్ధి చెందింది.
ఈ పదాలలో ఒక వింతగొలుపు చారిత్రక నేపథ్యం వుంది. 17వ శతాబ్దంలో గోల్కొండ దుర్గాన్ని వశపరచుకోవలెననే దురుద్దేశంతో ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపాడు. కాని ఆంజనేయస్వామి దయవల్ల ఆయన సైన్యం గుడి సరిహద్దులకు కూడా రాలేకపోయింది. ఔరంగజేబు పిచ్చి ఊహలతో తానే స్వయంగా ఆలయ ధ్వంసానికి రాగా, ఆలయ సింహద్వారానికి సమీపంలో చెవులు చిల్లులు పడేంత శబ్దం వినిపించింది. గర్భగుడిలో నుండి ‘‘హే రాజన్ మందిర్‌థోడ్ నాహై తో పహలే తుమ్ కరోమన్‌ఘట్’’ అన్న గంభీర వాక్కులు వినిపించాయి. దీనికి అర్ధం.
‘‘ఓ రాజా! నా ఆలయాన్ని ధ్వంసం చేసే ముందు నీ మనస్సు దృఢపరచుకో’’ అన్న పలుకులు.
దానికి మొగల్ చక్రవర్తి స్పందించి ‘‘హేభగవాన్! తుమ్‌సబ్ హైతో తుమారా సచ్చాయిబతావ్’’ (్భగవంతుడా! నీలో సత్యం, వుందే నీ సత్యాన్ని నాకు చూపించు) అన్నాడు. అప్పుడు స్వామి వెంటనే తాటి చెట్టు ప్రమాణంతో తన దివ్య స్వరూపం చూపించాడు. చక్రవర్తి నిరుత్తరుడై తిరిగిపోయాడు.
ఇదిగాక ఇంకా కొన్ని చరిత్రలు వున్నాయి. అది కాకతీయ రాజు చరిత్ర. క్రీ.శ.1143 సం.లో గోల్కొండ దుర్గాన్ని నిర్మించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఒకరోజున వేటకై బయలుదేరి అప్పటి ‘‘చల్చిం’’ (ఇప్పటి హైదరాబాద్) ప్రాంతానికి వచ్చాడు. వేటలో అలసిపోయాడు. ఇంతలో సమీపంలోనుండి (లక్ష్మీగూడ గ్రామ సమీపంలో) పులిగాండ్రింపు వినవచ్చింది. వెంటనే లేచి ఆ స్థలానికి వచ్చాడు. పులి లేదు. తర్వాత చెట్ల గుబుర్లనుండి శ్రీరామ శ్రీరామ అనే మాటలు వినిపించాయి. అక్కడనున్న ఆకులు గుబుర్లు తొలగించి చూస్తే పద్మాసనం వేసికొని ధ్యానముద్రలోనుండి దివ్యతేజస్సుతో వెలుగొందే శ్రీరామభక్తుడు శ్రీ ధ్యానాంజనేయస్వామి వారి శిలాప్రతిమ చూశాడు. రాజు ఆ విగ్రహాన్ని పూజించి తన కోటకు వెళ్ళాడు. ఆ రోజు రాత్రి స్వప్నంలో ఆంజనేయస్వామి కనిపించి తనకొక ఆశ్రమాన్ని నిర్మించమని ఆదేశించాడు. నిద్ర మేల్కొని మర్నాడు ప్రతాపరుద్రుడు అచట నిత్యం స్వామివారి పూజలు జరిగేటట్లు ఏర్పాటుచేశాడు. ఆయన తర్వాత ఎందరో రాజులు ఆలయం నిర్మించి అచటనే గణపతి, శ్రీరామ, శివ, వేణుగోపాల, జగన్నాథ మరియు అమ్మవారి ఆలయాలను నిర్మించి, పూజలు యధావిధిగా నిర్వహించే నిమిత్తం దగ్గరలోని భూములను స్వామికి అర్పించారు. అదే కర్మన్‌ఘాట్‌గా ప్రసిద్ధిచెందింది.
హనుమాన్ దేవస్థాన ప్రాంగణంలో పుష్కరిణి నిర్మించారు. తిరుమలలోని పుష్కరిణీ తీర్థంలో ఈ పుష్కరిణిలో ముక్కోటి దేవతలు కొలువుతీరి వుంటారని ప్రతీతి. స్వామివారికి నిత్యం ధూప, దీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తమ అభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు.
ఎంతోమంది ఆర్తులైన భక్తులు స్వామిని సేవించుకుంటూ సంతాన భాగ్యం లేనివారు ఒక మండలం కాలం (40రోజులు) నియమ నిష్టలతో పూజలు చేసిన వారికి సంతాన భాగ్యం కలుగుతోంది. అలాగే వైద్యానికి లొంగని తీవ్ర జబ్బులతో సంవత్సరాలు తరబడి బాధపడే రోగగ్రస్తులు 40రోజుల మండల పూజ చేసి రోగవిముక్తులు అవుతున్నారు. భూరి విరాళాలు, కానుకలు స్వామికి అర్పిస్తున్నారు. స్వామి మహిమలు అనంతం.
స్వామివారికి ఉత్సవాలు పర్వదినాల్లో శ్రీరామనవమి, శ్రీ హనుమజ్జయంతి, నాగపంచమి, కార్తీక పౌర్ణమి, వినాయక చవితి, మహాశివరాత్రి వంటి పండుగ రోజుల్లో విశేష పూజలు, అర్చనలు, సింధూర అభిషేకం, రుద్రాభిషేకం, నవగ్రహ పూజలు జరుపుతున్నారు.
స్వామి గర్భగుడిలో ఆకుపూజ, సింధూర అభిషేకం, అర్చన, వెండి తమలపాకుల పూజ, టెంకాయ ముడుపు, సువర్ణపుష్పార్చన, మండల పూజలు, మహాఘనంగా జరుగుతాయి. కార్తీక మాసంలో ఆకాశదీపం ఆరాధన, పలకీసేవ, ఊరేగింపు జరుగుతుంది.
అర్చకులు చెప్పిన అపూర్వ పూర్వగాథ ఒకటి ముచ్చటగొలుపుతుంది. శ్రీరామ పట్ట్భాషేకానంతరం జానకీమాత ఆంజనేయుని సేవలకు సంతసించి ముత్యాలహారం ఇస్తుంది. ‘ఆంజనేయుడు అది పరికించి దీంట్లో శ్రీరాముడు కనిపించుట లేదు’ అన్నాడు. ఆ మహాసభలోని భక్తులు అదే నిజమైతే నీలో రాముని చూపించుమన్నారు. అప్పుడు ఆయన తన విశాలమైన వక్షస్థలాన్ని రెండుగా చీల్చగా సీతారాములు అచట దేదీప్యమానంగా దర్శనం ఇచ్చారు.
స్వామిభక్తులు ఆంజనేయ అసమాన భక్తికి పులకరించి జయజయ ధ్వానాలు చేసారు. ‘‘యత్రయత్ర రఘునాథ కీర్తనం’’లో స్వామి ధ్యానముద్రలో, శ్రీరామ శబ్దానికి మేను పులకరించి కళ్ళనీళ్ళు భక్తితో కారుస్తాడు. ‘‘జై శ్రీ ధ్యానాంజనేయస్వామి’’ అంటూ భక్తులు తనివితీరా దర్శించి, తరించి, ఇష్టకామ్యాలను ఆ స్వామి ప్రసాదిస్తాడనే ప్రబల విశ్వాసంతో ఈ ఆలయ దర్శనం చేసుకుంటున్నారు. ‘‘జై కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామికి జై’’అంటూ వేనోళ్ళు భక్తకోటి ప్రార్థనలు చేస్తున్నారు. అదే ఈ పురాతన ఆలయ ప్రశస్తి.’’

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి